బాల్యవివాహాలు పిల్లల హక్కుల ఉల్లంఘనే!

11 Dec, 2020 01:39 IST|Sakshi

సందర్భం

భారత ప్రభుత్వం చట్టబద్ధ మైన వివాహ వయస్సును పెంచాలని భావిస్తోంది. అయితే వివాహాలకు చట్టబద్ధమైన వయస్సును పెంచడం ఒక్కటే సరిపోదు. ప్రధానంగా బాల్య వివాహం పిల్లల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇది వారి శారీరక వృద్ది, మానసిక, భావోద్వేగాల పెరుగుదల, విద్యావకాశాలపై కూడా వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఉత్తరాంధ్రలో కౌమారదశలోనే పెళ్లయి తల్లులైన వారితో బృంద చర్చలో, చిన్నవయసులోనే పెళ్లి చేయడం వల్ల తమ బాల్యాన్ని, ఆడుకునే, నేర్చుకునే స్వేచ్ఛను పోగొట్టుకున్నామని చెప్పారు. పెళ్లి కాగానే మానసికంగా  సంసిద్ధం కాకుండానే ఆమె కుటుంబ పాత్రలు పోషిం చాల్సి వస్తోంది. భార్యగా, తల్లిగా, కోడలిగా బరువైన బాధ్యతలు స్వీకరించాల్సి రావడం మైనర్‌ బాలికకు కష్టమవుతుంది. దీంతో వారు ఒంటరితనానికి, కుంగుబాటుకు గురికావడానికి దారి తీస్తుంది.

ప్రపంచంలోనే బాలికా వధువులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. మహిళలకు వివాహ వయస్సును 18 ఏళ్లుగా, పురుషులకు 21 ఏళ్లుగా స్థిరపర్చడం, బాల్యవివాహ నిషేధ చట్టాన్ని అమలుపర్చడం ఉనికిలో ఉన్నప్పటికీ దేశంలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే  దేశంలో బాల్య వివాహాలు 2005లో 47 శాతం ఉండగా ఇది 2015 నాటికి 27 శాతానికి పడిపోవడం మంచిదే కానీ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో బాల్యవివాహాలు అధికంగా కొనసాగుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్‌లో 20 నుంచి 24 ఏళ్ల వయసున్న మహిళల్లో 33 శాతం మందికి 18 ఏళ్ల లోపే పెళ్లవుతున్నట్లు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 డేటా 2015–16 నివేదిక తెలిపింది. ఇక పురుషుల విషయానికి వస్తే 25 నుంచి 29 ఏళ్ల వయసున్న యువకుల్లో 21 ఏళ్లకు ముందే పెళ్లాడుతున్న వారు 11.8 శాతంగా ఉన్నారు. అదే తెలంగాణలో 20–24 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల్లో 25.7 శాతం మంది వివాహం చేసుకుంటూండగా, 15–19 ఏళ్ల ప్రాయంలోని బాలికల్లో 14 శాతం మంది తల్లులవుతున్నారు.

అయితే యంగ్‌ లైవ్స్‌ లాంగిట్యూడినల్‌ స్టడీ 2002 నుంచి తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న అధ్యయనం మరింత స్పష్టమైన చిత్రాన్ని ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2013లో 19 ఏళ్లలోపు వయసున్న బాలికల్లో 25 శాతం మంది చట్టబద్ధమైన వయసుకు ముందే పెళ్లాడుతున్నారని, 2020 నాటికి ఇది 14 శాతానికి పడిపోయిందని ఈ నివేదిక తెలిపింది. తెలంగాణలో కూడా 2013 నాటికి 19 ఏళ్ల లోపు వయసున్న బాలికల్లో 28 శాతం మంది చట్టబద్ద వయసుకు ముందే పెళ్లాడుతుండగా వీరి సంఖ్య 2020 నాటికి 17 శాతానికి పడిపోయింది.  జిల్లాల వారీగా చూస్తే కడప, అనంతపురం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 18 ఏళ్లకు ముందే వివాహ మాడుతున్న బాలికల సంఖ్య వరుసగా 20 శాతం, 24 శాతం, 27 శాతంగా నమోదైంది. ఈ జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఇది 36 శాతం మేరకు అధికంగా నమోదైంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 9 జిల్లాల్లోనూ, ఏపీలో 5 జిల్లాల్లో సంప్రదాయాలు, సామాజిక ఆచారాలు, విశ్వాసాలు, దారిద్య్రం వంటివి బాల్య వివాహాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. పెద్దగా చదువుకోకపోవడం, విద్యావకాశాల లేమి కూడా వీటికి తోడవుతున్నాయి. రజస్వల అయితే చాలు పెళ్లీడు వచ్చేసినట్లే అని తల్లిదండ్రులు భావించడం, వారిలో అవిద్య, వలసలు, ఎక్కువమంది అమ్మాయిలు ఉండ టం వంటివి కూడా బాల్యవివాహాలను ప్రేరేపిస్తున్నాయి. చట్టం మాత్రమే ఈ దురాచారాన్ని అడ్డుకోలేదని, మార్పు అనేది కుటుంబం, కమ్యూనిటీ స్థాయి నుంచే ప్రారంభం కావాలని న్యాయనిపుణుల మాట.

సెకండరీ విద్యను బాలికలకు అనుకూలంగా మలుస్తూ వారి రక్షణకోసం పెట్టుబడి పెట్టాలి. పేదలు బాలికలను బడికి పంపేలా చేయడానికి షరతులతో కూడిన నగదు బదిలీ చేయడం, 18 ఏళ్లదాకా నిర్బంధ విద్యను అందించడం మంచి ఫలితాలను తెస్తుంది. ముఖ్యంగా విద్య, బాల్యవివాహాలపై డేటా బ్యాంకును గ్రామీణ సంస్థలు ఏర్పర్చుకుంటే ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుంది.'


వ్యాసకర్త ఆర్థికవేత్త,
సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్
‌పి. పృథ్వీకర్‌ రెడ్డి
మొబైల్‌ : 94408 90508

మరిన్ని వార్తలు