ఆదివాసీల ఆశాజ్యోతి... హైమండార్ఫ్‌

11 Jan, 2022 11:55 IST|Sakshi

ఎడతెగని చొరబాట్లు, అన్యాక్రాంతమైన అటవీ సాగు భూములు, ఆంక్షలు, దోపిడీ, హేళన – ఇది 19వ శతాబ్దం నుండి మొదలై కొనసాగుతున్న మన దేశపు ఆదివాసుల కష్ట గాథ. అటవీ, ఖనిజ సంపదలను కొల్లగొట్టడా నికి బ్రిటిష్‌ పాలకులు ప్రవేశపెట్టిన నిషేధ విధానాలతో  మొదలైన ఈ  సంక్షోభం మరెన్నో హంగులు దిద్దుకొని నేటికీ కొనసాగుతూ ఉంది.

ఆదివాసీల ప్రాచీన జీవన విధానం, సంస్కృ తుల్లోనే ప్రశాంతత, నెమ్మదితనం ఉన్నాయి. వారు అలాగే జీవించడంలో ఎంతో మక్కువను చూపి స్తారు. అటువంటి ఈ మొండి ప్రజలను ‘ప్రగతి శీల’ జీవన స్రవంతిలోనికి ఎట్లా తేవాలా అనే ఆలోచనలు 20వ శతాబ్ది తొలి భాగం నుండే మొదలైనాయి. బయటివారి రాజకీయ వ్యవస్థలు, పాలనా విధానాలను వారిపై రుద్దకుండా... ఆది వాసీల తత్త్వానికి సరిపడే రీతిలో మనమే ఒదిగి, బయటి వారి అతిక్రమణల ఛాయల నుండి వారిని రక్షిస్తూ... వారి సహజ ఆవరణంలోనే ఉండనిస్తూ ఆధునిక ప్రపంచపు విద్య, అవగాహనలు అందించే గొప్ప ప్రయత్నం హైదరాబాద్‌ సంస్థానంలో 1940ల్లో జరిగింది.

‘‘చదువుకోవటం వల్ల లౌకిక ప్రయోజనాలు న్నాయన్న సంగతి మూలవాసికి తెలిసినా అతని మనస్సులో, ఆత్మలో తనదైన సంస్కృతి పట్ల అసంకల్పితంగా, అతి లోతుగా ఇంకిపోయి ఉన్న అభిమానాన్నీ దాని పట్ల అతనికున్న గర్వభావ ననూ ఉద్ఘాటించటం ద్వారానే అతన్ని ఉత్తేజపరచ గలం,’’ అని హైదరాబాదు సంస్థానంలోని మూల వాసుల జీవనగతులను అప్పటికే పరిశీలిస్తూ నిర్ధారణకు వచ్చిన బ్రిటిష్‌ మానవ శాస్త్రవేత్త క్రిస్టోఫ్‌ వాన్‌ ఫ్యూరర్‌ హైమండార్ఫ్‌ పేర్కొన్నారు. అటు వంటి హైమండార్ఫ్‌ను ఆదిలాబాద్‌ గోండుల కోసం ఒక ప్రాథమిక విద్యా విధానాన్ని రూపొం దించమని కోరింది నైజాం ప్రభుత్వం. తొలి గోండి భాషా వాచకాలను వాళ్ల జీవన వాతావరణం, పురాణాలు, కథలు, నమ్మకాలకు సంబంధించిన అంశాలతోనే ఆయన రూపొందించారు. ఈ ప్రయోగం ఫలించిన తర్వాత ఆదిలాబాద్‌ మూల వాసుల కోసం ఒక సమగ్ర పునరావాస, అభివృద్ధి పథకాన్ని కూడా రూపొందించి అమలు చేయమని, గిరిజన తెగలు, వెనుకబడిన తరగతుల విషయాల సలహాదారుగా అధికార పదవిలో ఆయనను నియమించింది నైజాం ప్రభుత్వం. ఒక మానవ శాస్త్రవేత్తకు ఇటువంటి బాధ్యతను అప్ప గించిన అరుదైన సందర్భం ఇది.

కొమురం భీం తిరుగుబాటు అణచివేత తరువాత నిస్పృహలో కూరుకుపోయి ఉన్న ఆదిలాబాద్‌ మూలవాసుల జీవితంలో మళ్లీ ఉల్లాసాన్ని, నమ్మకాన్ని తీసుకువచ్చిన ఈ గొప్ప ప్రయత్నం గురించి కళ్లకుగట్టినట్టు వివరించే 1944, 1946 సంవత్సరాల్లో హైమండార్ఫ్‌ రాసిన నివేదికలు నేటికీ చదువదగినవి. 80 శాతం మూలవాసీ కుటుంబాలకు 150,000 ఎకరాల భూమిని ప్రభుత్వ పట్టాలతో అందజేసి వారికి అత్యవసరమైన జీవనభద్రతను అప్పుడు కల్పించగలిగారు. అయితే తరువాతి దశకాల్లో వచ్చిన పరిణామాలతో ఈ అభివృద్ధి లాభాలను చాలా వరకు కోల్పోయి, నక్సల్‌ ఉద్యమం, దాని అణచివేత, మళ్లీ ప్రభుత్వం చొరవతో అమలుపరచిన అభివృద్ధి పథకాలు, వాటి లోపాలు – ఇట్లా ఎన్నో ఒడుదొడుకులకు వారు గురవుతూ వస్తూ ఉన్నారు. తమ చివరి రోజుల వరకూ తరచూ భారతదేశం, ఆంధ్రప్రదేశ్, మరీ ముఖ్యంగా ఆదిలాబాద్‌ను సందర్శిస్తూ ఆదివాసీ జీవితాల్లో వస్తూ ఉన్న ఈ  పరిణామాలను తెలుసుకుంటూ, సూచనలు సలహాలు ఇస్తూ తమ అనుబంధాన్ని కొనసాగించారు హైమండార్ఫ్‌ దంపతులు. వారి వలె ఆదివాసుల ఆప్యాయతను, ఆరాధనను  పొందుతున్న మానవ శాస్త్రవేత్తలు అరుదు.

‘‘ఇక్కడ ఈ మూలవాసుల్లో వర్గభేదం లేని, లింగ అసమానతలు లేని, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు లేని, విధవా వివాహాన్ని నిరోధించని ఒక ఆదర్శ సమాజం చక్కగా నిలిచి ఉన్నది... ఇటువంటి స్థితిలో మిగతా భారతీయ గ్రామీణ సమాజంలో ఇంకా కొనసాగుతున్న సామాజిక రుగ్మతలేవీ మూలవాసులకు వ్యాపించకుండా రక్షించటం దేశంలోని ప్రగతివాదుల గురుతరమైన బాధ్యత’’ అని హైమండార్ఫ్‌ ప్రభుత్వాధికారులకు, విధాన నిర్ణేతలకు దిశానిర్దేశం చేశారు.

ఆదివాసులపై ఆయన వెలువరించిన వివిధ పుస్తకాలు, రచనల్లో వారి సంస్కృతుల గురించే కాకుండా వారికి అనువైన విద్య, తప్పనిసరిగా ఉండవలసిన సాగుభూమి భద్రత, వీటితో పాటు వారి జీవన దృష్టి గురించి చేసిన ప్రతిపాదనలు హైదరాబాద్‌ సంస్థానంలో, తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసుల సంక్షేమం గురించి పరి తపించే అధికారులు, సామాజిక కార్యకర్తలు, నాయ కులకు స్ఫూర్తిగా, మార్గదర్శకంగా నిలిచాయి. 

- సుమనస్పతి రెడ్డి 
ఆకాశవాణి విశ్రాంత అధికారి

(మూలవాసుల విద్య, అభివృద్ధుల గురించి 1944, 1946ల్లో హైమండార్ఫ్‌ రాసిన నివేదికల తెలుగు అనువాదం హైమండార్ఫ్‌ దంపతుల స్మృతి దినంగా జరుపుకొనే జనవరి 11న, ఆయన చాలా కాలం నివసించిన మార్లవాయి గ్రామంలో (ఇప్పుడు కుమురం భీం జిల్లా) విడుదల కానుంది)

మరిన్ని వార్తలు