ఎర్రజెండా ఎగిరిపోయింది

18 Oct, 2021 00:29 IST|Sakshi

అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే ఉన్న పళాన వెళ్లిపోయారు. ఆకుపచ్చ అడవిలో ఆయన ఎటు వెళ్లారన్నది అక్కడి చెట్లకు మాత్రమే తెలుసు. దశాబ్దాల పాటు ఆయనకు కోరస్‌గా పాడిన పక్షులకూ తెలుసు. ఆయన ప్రతీ కదలికనూ కనిపెడుతూ వచ్చిన మేఘాలకు తెలుసు. ఆయన అడుగుల వరుసను గమనిస్తోన్న భూమికి తెలుసు. ఆర్కే చనిపోతే.. ఆకాశం బద్దలు కాలేదు. భూమి రెండుగా చీలిపోలేదు. ఉద్యోగాలు చేసుకునేవాళ్లు, వ్యాపారాల్లో మునిగిపోయిన వాళ్లు, రకరకాల వ్యాపకాల్లో జీవితాలు గడిపేసే వాళ్లూ కదిలిపోలేదు. కావాలనుకుంటే.. ఆర్కే కూడా చాలా మందిలా తనకున్న మేధకు ఏదో ఓ మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబంతో హాయిగా గడపగలడు. చక్కగా ఏసీ గదుల్లో విలాసవంతంగా జీవితాన్ని నడపగలడు. లేడని కాదు. కానీ పిచ్చో వెర్రో.. అతనికి ఆ ఆలోచన కూడా వచ్చినట్లు లేదు. నమ్మిన సిద్ధాంతం పీడిత వర్గాల సంక్షేమం కోసం జీవితకాలపు పోరాటం చేయాలని ఎప్పుడో 20 ఏళ్ల వయసులో అనిపించిందంతే. ఇక అప్పట్నుంచీ ఇంకో ఆలోచనే పెట్టుకోలేదు. ఆదివాసీల కోసం, నిమ్న కులాల కోసం తానే ఓ ఆయుధం అయిపోవాలనుకున్నాడు. అయిపోయాడు. ఏ వ్యాపకంలో అయినా.. ఉద్యోగంలో అయినా... వృత్తిలో అయినా ఓ పాతికేళ్లు గడపడం అంటేనే చాలా గొప్ప.

నాలుగు దశాబ్దాల పాటు ఓ సిద్ధాంతానికి కట్టుబడి జీవితాన్ని ఖర్చుచేసేయడం అంటే ఇంకెంత గొప్ప? ఆర్కే అనుకున్న  ఆలోచనలతో కానీ ..ఆయన నమ్మిన సిద్ధాంతంతో కానీ మనం ఎవ్వరూ ఏకీభవించకపోవచ్చు. చాలా మందికి ఏమన్నా పేచీలు ఉండచ్చు. కానీ ఆర్కేలా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చివరి శ్వాస వరకు ముందుకు సాగడం ఈజీ కాదు. కానే కాదు. అట్టడుగు వర్గాలను దోచుకుంటున్నారని అతను అనుకున్నాడు. ఆ వర్గాల తరఫున పోరాటాలు చేయాలని నమ్మాడు. ఆ పోరాటం ముళ్లబాట అని తెలుసు. ఏ క్షణంలోనైనా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తెలుసు. అలా తెలిసినా ఆ పోరాటాన్ని కడదాకా తీసుకెళ్లడం తన బాధ్యత అనుకున్నాడు కాబట్టే కడ ఊపిరి వరకు అలానే ఉన్నాడు. అలా ఉండడంలో నిజాయితీగానే ఉన్నాడని కొందరు అనుకుంటే.. అదో గుడ్డినమ్మకం అని వెక్కిరించే వాళ్లూ ఉన్నారు.

కాకపోతే జీవించినంతకాలం తాను నమ్మిన సిద్ధాంతానికి నిజాయితీగా కట్టుబడి ఉన్నాడన్న  విషయంలో ఆయన్ను సైద్ధాంతికంగా వ్యతిరేకించేవారికి కానీ.. ఆయన ఉద్యమాన్ని నిర్ద్వంద్వంగా ఖండించే పోలీసులకు కానీ మరో ఆలోచన ఉండే అవకాశాలే లేవు. అదీ ఆర్కే నిజాయితీకి గీటురాయి.

ఎక్కువమంది జీవితాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడ్డం, ఎక్కువ మంది కడుపుల్లో ఆకలికేకలు అగ్నిగుండాలు రాజేయడం.. జనాభాలో కొద్దిపాటి శాతం చేతుల్లోనే మెజారిటీ సంపద పోగుబడి ఉండడం కరెక్ట్‌ కాదనుకున్నాడు. ఆ పరిస్థితిని మార్చాలంటే సాయుధ పోరు ఒక్కటే మార్గం అనుకున్నాడు. ఆర్కే ఎంచుకున్న మార్గం ప్రజాస్వామిక వ్యవస్థలో సరియైనది కాదని ఎక్కువ మంది భావించవచ్చు.

నెత్తుటి సిద్ధాంతాన్ని ఒప్పుకోలేమని వాదించవచ్చు. కానీ సమాజంలో మెజారిటీ ప్రజలు పేదరికంలో ఉన్నారు. ఆ పేదలు సుఖంగా ఉండాలన్న ఆర్కే ఆలోచనను ఎవరూ తప్పు బట్టలేరు. ఆర్కే నడిచిన దారి అడుగడుగునా ముళ్లబాటే. అసలు ఆ దారిపట్టడమే తప్పటడుగు వేయడం అనే వాళ్లు ఉండచ్చు. అయితే గుడ్డి నమ్మకమో..పిచ్చి ఆశో.. వెర్రి ఆకాంక్షో పేర్లు ఏవైతేనేం తన జాతి జనుల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడన్నది ఆకుపచ్చ అడవంత నిజం. నలభై ఏళ్ల ఉద్యమకాలంలో చాలా ఎన్‌కౌంటర్ల నుండి తృటిలో తప్పించుకున్నాడు ఆర్కే. ఆర్కే సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాళ్లు కూడా .. ఆ సిద్ధాంతం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టగలగడాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. వ్యవస్థ దృష్టిలో..మనం రచించుకున్న రాజ్యాంగం పరిధిలో ఆర్కే అనుసరించిన దారి ఆమోదయోగ్యమైనది కాకపోవచ్చు.

తప్పులు అందరూ చేస్తారు.. త్యాగాలు మాత్రం కొందరే చేస్తారు అన్నాడు మహారచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి. పదిమంది కోసం జీవితాన్ని కానుకగా ఇచ్చేయడం చాలా తక్కువమంది మాత్రమే చేయగలిగిన త్యాగం. అందుకే కావచ్చు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఆర్కే  పనిచేసిన గామాలపాడు ప్రజలు ఇపుడు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

‘‘నాకోసం ఎదురు చూడు‘ ఉరి తీయబడ్డ పాట నుండి
చెరపడ్డ జలపాతం నుండి‘ గాయపడ్డ కాలిబాట నుండి
ప్రాణవాయువు నుండి‘ వాయులీనం నుండి
తిరిగి వస్తాను‘ తిరిగి లేస్తాను
నా కోసం ఎదురు చూడు‘ నా కోసం వేచి చూడు–’’
అన్న శివసాగర్‌ కవిత ఇప్పుడు ఎక్కువమందికి గుర్తుకొస్తూ ఉండొచ్చు. 

– సి.ఎన్‌.ఎస్‌. యాజులు, మొబైల్‌ : 95055 55384 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు