Col Nizamuddin: నేతాజీని కాపాడిన యోధుడు

27 Jun, 2022 12:25 IST|Sakshi
షేక్‌ నిజాముద్దీన్‌

నేతాజీ ఆంతరంగికులలో ఒకరు కల్నల్‌ షేక్‌ నిజాముద్దీన్‌. వీరి అసలు పేరు సైఫుద్దీన్‌. వీరు అప్పటి ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆజంగఢ్‌ జిల్లా ఢక్వా గ్రామంలో 1900లో జన్మించారు. 20 ఏళ్ల ప్రాయంలో బ్రిటిష్‌ సైన్యంలో చేరారు. కొంతకాలం తర్వాత సింగపూర్‌లో క్యాంటిన్‌ నడుపుతున్న తన తండ్రి ఇమాం అలీ వద్దకు 1926లో చేరారు. అనంతరం 1943లో నేతాజీ జాతీయ సైన్యాన్ని పునరుద్ధరించి ‘చలో ఢిల్లీ’ అంటూ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన అందులో చేరారు. అప్పటివరకు ఉన్న సైఫుద్దీన్‌ పేరును నిజాముద్దీన్‌గా మార్చుకున్నారు.

నేతాజీ కారు డ్రైవర్‌గా ఉండి, ఆ తరువాత అంగరక్షకుడిగా, వ్యక్తిగత సహాయకునిగా నిజాముద్దీన్‌ ఎదిగారు. బ్రిటిష్‌ సైన్యానికి వ్యతిరేకంగా 1943లో జరిగిన యుద్ధంలో నేతాజీతో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో అడవిలో నేతాజీతో వెళుతుండగా తుప్పల్లోంచి నేతాజీకి గురిపెట్టిన ఒక తుపాకీ గొట్టాన్ని నిజాముద్దీన్‌ గమనించి ఎదురెళ్ళారు. క్షణాలలో 3 గుండ్లు ఆయన శరీరంలోకి దూసుకుని వెళ్ళి కుప్పకూలారు. కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ వైద్యం చేసి నిజాముద్దీన్‌ శరీరంలోని బుల్లెట్లను తొలగించారు. 

ఆయన త్యాగనిరతికి నేతాజీ చలించిపోయి కల్నల్‌ హోదాను కల్పించడంతో వీరు కల్నల్‌ షేక్‌ నిజాముద్దీన్‌గా ప్రసిద్ది చెందారు. నాటి నుండి 1945 వరకు నేతాజీ వెన్నంటి ఉన్నారు. సింగపూర్‌ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారన్న వార్తను ఆయన ఖండించారు. ఆ ప్రమాదం జరిగిన 3 నెలల తర్వాత తాను స్వయంగా నేతాజీని బర్మా–థాయిలాండ్‌ సరిహద్దుల్లో గల సితంగ్‌పూర్‌ నదీ తీరాన తీసుకెళ్ళి విడిచిపెట్టి వచ్చానని అనేవారు. నిజాముద్దీన్‌ తన 117 ఏట 2017లో స్వగ్రామంలోనే కన్నుమూశారు. 

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని, తెనాలి
(భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) 

మరిన్ని వార్తలు