యూపీ చదరంగంలో కొత్త ఎత్తుగడలు

27 Dec, 2021 00:54 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు బ్రాహ్మణ, ఠాకూర్‌ వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఇది ప్రత్యక్ష రాజకీయ యుద్ధంగా మారి బీజేపీకి తీవ్ర నష్టం జరగక ముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం పావులు కదపటం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌ జనాభాలో 10 శాతంగా ఉన్న బ్రాహ్మణ వర్గం మొదటి నుంచీ బీజేపీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉంది. అటువంటి ఓటుబ్యాంకును.. మరో బలమైన ఠాకూర్‌ సామాజిక వర్గానికి చెందిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చర్యలు దూరం చేస్తున్నాయి. ఆయన ‘ఠాకూర్‌ వాదాన్ని’ ప్రమోట్‌ చేçస్తూ బ్రాహ్మణులను పైకి రాకుండా చేస్తున్నారనే విమర్శ ఉంది. దీంతో కాశీ కారిడార్‌ ప్రారంభ కార్యక్రమాన్ని మోదీ తనంతతానై నడిపించారు. మొత్తం మీద యూపీలో ఈ పరిస్థితులు చిక్కుముడులను తలపిస్తున్నాయి. అక్కడి రాజకీయ చదరంగంలోని చిక్కుముడులు విప్పడం అసాధ్యం అనిపిస్తోంది కూడా!

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కుల చదరంగం వైపు చూపు సారిస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని కీలక దిగ్గజాలు, అప్రధానమైన బంట్లు పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అధిక సంఖ్యలో బీజేపీకి ఎంపీలను అందించిన ఉత్తరప్రదేశ్‌ (యూపీ)లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తలెత్తిన రైతుల ఆగ్రహ జ్వాలలను చల్లార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఏకపక్షంగా ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తన ప్రసంగంలో పార్టీకి కలిగిన నష్టాన్ని పూడ్చుకునే ధోరణి కనిపించింది. వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్‌ రైతులు అధికంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆ ప్రాంతం నుంచి ఎక్కువ సీట్లు రావడం వల్లనే బీజేపీకి భారీ విజయం లభించింది. ముజఫర్‌నగర్‌ అల్లర్లు జరిగిన మరుసటి ఏడాదే  జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ శక్తిని అనేక రెట్లు పెంచిన ప్రాంతం ఇది. 

పశ్చిమ యూపీలోని జాట్ల కోపాన్ని తగ్గించడానికి, సాధ్యమైతే వారిని తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి మోదీ నూతన వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. పశ్చిమ యూపీలో హిందు– ముస్లింల మధ్య నెలకొని ఉన్న కొన్ని అగాథాలను ఈ రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమం కొంతవరకు పూడ్చగలిగింది. ఇప్పుడు రాష్ట్రం లోనూ, కే్రందంలోనూ అధికారంలో ఉన్న బీజేపీకి ఈ మారిన పరిస్థితులు ప్రతికూలమైనవని వేరే చెప్పనవసరం లేదు. అందుకే మోదీ వెంటనే కొత్త వ్యూహాలతో దిద్దుబాటు చర్యలకు తెరలేపారు. 

అక్టోబర్‌ 3వ తేదీన లఖింపూర్‌ ఖేరీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాచేసి ఇళ్లకు మరలిన రైతులను ఓ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొట్టి నలుగురు రైతుల మరణానికి కారణం కావడం, ప్రతీకార దాడిలో ఓ జర్నలిస్ట్‌ మృతి చెందడం తెలిసిందే. రైతులను ఢీకొట్టిన ఒక వాహనం ఆ ప్రాంత బ్రాహ్మణ వర్గానికి చెందిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా తేనీ కుమారునిదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన ఆ ఏరియాలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు. అటువంటి నాయకుని కుమారునిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆ కేసును దర్యాప్తు చేయడానికి ఒక సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ వ్యవహారం కోర్టులకు చేరేటప్పటికి, సుప్రీం కోర్టు ఈ సిట్‌ను మానిటర్‌ చేయడం ప్రారంభించింది. అత్యున్నత న్యాయ స్థానం సిట్‌లో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్లను నియమించి దానిని మరింత శక్తిమంతం చేసింది. 

ఇప్పుడు సిట్‌  ‘ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర’ వల్లనే రైతు హత్యలు జరిగాయని నివేదిక ఇచ్చింది. దీంతో మంత్రి అజయ్‌ మిశ్రాకు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. నిర్లక్ష్య మైన ర్యాష్‌ డ్రైవింగ్‌ వల్ల రైతు మరణాలు సంభవించాయని పోలీ సులు ఎఫ్‌ఐఆర్‌లో మొదట్లో పేర్కొన్నారు. అయితే సిట్‌ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత ఆ ఆరోపణల స్థానంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద హత్య, నేరపూరిత కుట్ర, మరి కొన్ని ఇతర సీరియస్‌ ఆరోపణలను చేర్చారు. త్వరలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో.. బీజేపీలోని ఒక వర్గం నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను చంపడానికి కుట్ర పన్నిందని పేర్కొంటున్న ఈ కేసు బీజేపీ పాలిట పేలబోతున్న టైమ్‌ బాంబ్‌లా తయారైంది.  సిట్‌ రిపోర్టు సంగతి ప్రస్తావించిన ఒక జర్నలిస్ట్‌పై సాక్షాత్తూ  మంత్రి అజయ్‌ మిశ్రానే తీవ్ర పదజాలంతో మండిపడుతూ దాడిచేస్తున్న దృశ్యాలు ఉన్న వీడియో ఒకటి జనంలోకి వెళ్లిపోయింది. నిజానికి అక్టోబర్‌ 3న రైతు మరణాలు సంభవించడా నికి కొన్ని రోజుల ముందే రైతులను ఆయన బహిరంగ వేదిక మీద నుంచి బెదిరించారు. ఈ నేపథ్యంలో ఎలా చూసినా అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాల్సిందే! అప్పుడు రైతులను, ఇప్పుడు జర్నలిస్టులను భయపెట్టిన అజయ్‌ మిశ్రా మంత్రి పదవికి ఏమాత్రం అర్హుడు కాదు.

బలమైన ఓటుబ్యాంకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
ఒక పక్క రైతుల్లోని ఒక వర్గాన్ని శాంతింపచేసే ప్రయత్నం చేస్తూనే.. మరోపక్క ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణత్వానికి ప్రతినిధిగా బీజేపీ కేంద్ర నాయకత్వం చూపుతూ వచ్చిన వ్యక్తి చేసిన నష్టాన్ని పరిహరిం చేందుకు బీజేపీ నడుం బిగించింది. యూపీ జనాభాలో 10 శాతం బ్రాహ్మణులే ఉన్నారు. వీరు సిద్ధాంతపరంగా బీజేపీకి అనుకూలురని పరిగణించడం కద్దు. కానీ యూపీలో మరో బలమైన ఠాకూర్‌ కులానికి చెందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‘ఠాకూర్‌వాదం’ లేదా ఠాకూర్‌ల ఆధిపత్యం పెరగడానికి ఇతోధికంగా మద్దతు ఇస్తున్నా డనే ఆరోపణతో బ్రాహ్మణ వర్గం బీజేపీకి దూరమవుతున్నట్లూ విమ ర్శకులు భావిస్తున్నారు. ఇందువల్ల యూపీలో బీజేపీకి ఉన్న సంప్ర దాయ ఓట్లు దూరమయ్యే అవకాశం ఉండటంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది.

బీజేపీకి యూపీలో 40 శాతం ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీని ఓడించాలంటే మిగతా పార్టీలు అంతకన్నా ఎక్కువ ఓట్లు పొందాలి. అయితే ప్రస్తుతం ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం, ప్రధాన పార్టీలన్నీ దేనికది ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవాలని భావించ డంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితి బీజేపీకి అనుకూలించే అంశమే. యూపీలో మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ), అఖిలేశ్‌ యాదవ్‌ అధినేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) కన్నా వెనుకబడి ఉంది. అఖిలేశ్‌ అనేక చిన్న ఏక కుల పార్టీలతో పొత్తుపెట్టుకొని రేసులో ముందున్నారు. ప్రస్తుతం పోటీ ద్విముఖమే అనిపిస్తోంది. బీజేపీకి 10 శాతం ఓట్లు తగ్గితే అవి ఎస్‌పీ ఖాతాలో పడతాయని భావిస్తున్నారు (2017లో అఖిలేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన ఎన్నికల్లో ఎస్‌పీకి 22 శాతం ఓట్లే పోలవ్వడంతో ఆయన పదవిని కోల్పోయారు). దీంతో అక్కడ పరిస్థితి రసకందాయంలో పడింది.

ప్రియాంక మేలుకొలుపుతో ఎస్‌పీకి లాభం
పార్లమెంట్‌ సమావేశాల సమయంలో వెలువడిన సిట్‌ రిపోర్ట్‌ ప్రతిపక్షాలకు  మంచి ఆయుధం అయింది. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రతిపక్షాల దాడికి నాయకత్వం వహించారు. అదే సమయంలో ఆయన సోదరి ప్రియాంకా గాంధీ ఉత్తరప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించి ఈ విషయంపై బీజేపీని ఎండగట్టారు. ఈ అంశం ద్వారా లబ్ధి పొందాలని ఆమె తీవ్రంగా ప్రయత్నించినా.. ప్రయోజనం మాత్రం ఎస్‌పీకే చేకూరుతుంది.. కాంగ్రెస్‌కు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేదని జనానికి తెలుసు. ఓడిపోయే పార్టీకి ఓటువేసి తమ ఓటును వ్యర్థం చేసుకోకూడదనే నియమాన్ని మన ఓటర్లు ఎటూ తప్పరు కాబట్టి.. గెలిచే పార్టీకే ఓటు వేస్తారు. ఆ విధంగా చూస్తే ప్రియాంక మేలుకొలుపు ఎస్‌పీకి లాభం చేకూర్చ బోతోంది.

బీజేపీ ప్రచారంలో గమనించదగిన మరో విశేషం ఏమిటంటే.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రాధాన్యాన్ని ప్రధాని మోదీ  తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం! ఇటీవల చోటుచేసు కున్న కాశీ కారిడార్‌ ప్రారంభోత్సవం ఒక రకంగా మతపరమైన వ్యవహారమే. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ఆ మతంలో యోగిగా గుర్తింపు పొందినవారు. కానీ ఈ కార్యక్రమంలో యోగి ఆదిత్య నాథ్‌ను పక్కన పెట్టి అంతా తానై కనిపించారు ప్రధాని మోదీ. ్రçపస్తుతం బీజేపీలో బలమైన ‘హిందూ హృదయ సమ్రాట్‌’ ఎవరు అనే పోటీ ఏర్పడితే కచ్చితంగా అది మోదీయే అని చెప్పడానికి వీలుగా కాశీ కారిడార్‌ ప్రారంభ కార్యక్రమం సాగింది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో పరిస్థితులు చిక్కుముడులను తలపిస్తున్నాయి. కొన్ని ముడులు విప్పడం అసాధ్యం అనిపిస్తున్నది కూడా!
– సాబా నఖ్వీ, సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు