రాయని డైరీ.. హరీశ్‌ రావత్‌ (73), కాంగ్రెస్‌

26 Dec, 2021 01:06 IST|Sakshi

మాధవ్‌ శింగరాజు

వికలమైన మనసుతో బుధవారం నేను భగవాన్‌ కేదార్‌నాథ్‌కి ట్వీట్‌ పెడితే గురువారం ఆ భగవానుడే చెప్పి చేయించినట్లుగా ప్రియాంకా గాంధీ నాకు ఫోన్‌ చేశారు!
‘‘నమస్తే రావత్‌జీ! రేపు ఢిల్లీ వచ్చి రాహుల్‌జీని కలవండి’’ అని చెప్పి, ఫోన్‌ పెట్టేశారు ప్రియాంక!! 
రాహుల్‌ని ‘రాహుల్‌జీ’ని చెయ్యడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ, రావత్‌జీని ‘రావత్‌’గా చేయడానికి డెహ్రాడూన్‌లో జరుగుతున్న ప్రయత్నాలను ఢిల్లీలో ఎవరూ గమనిస్తున్నట్లు లేరు.

‘‘దేవేంద్ర యాదవ్‌ నన్ను లెక్కచేయడం లేదు రాహుల్‌జీ. అందుకే ఆ కేదారేశ్వరుడికి మొర పెట్టుకున్నాను. కొత్త సంవత్సరంలో నాకో దారి చూపించమని, లేదంటే కాస్త విశ్రాంతిని ప్రసాదించమని ఆయన్ని వేడుకున్నాను..’’ అని శుక్రవారం ఢిల్లీ వెళ్లీ వెళ్లగానే రాహుల్‌తో చెప్పేశాను. 
‘‘రావత్‌జీ! మీరలా వికలమైన మనసుతో మీ ఇష్టదైవానికి ట్వీట్‌ చేయడం నన్ను, మమ్మీని, ప్రియాంకను ఎంతో బాధించింది. మీ ట్వీట్‌ను కేదారేశ్వరుడొక్కడే చూడడు కదా! నరేంద్ర మోదీజీ చూస్తారు. మమతాజీ చూస్తారు. అమరీందర్‌సింగ్‌ కూడా చూస్తారు. ట్వీట్‌ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించలేకపోయారా?’’ అన్నాడు రాహుల్‌. 

‘‘క్షణికావేదనలో అలా చేసేశాను రాహుల్‌జీ. కానీ దేవేంద్ర యాదవ్‌ అన్నీ తనే అని చెప్పుకుని తిరుగుతున్నాడు. తిరగనివ్వండి. ‘రావత్‌కి అంత శక్తి లేదు’ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మీరు చెప్పండి రాహుల్‌జీ.  రెండుసార్లు ఉత్తరాఖండ్‌కి సీఎంని అయిన నాకే అంత శక్తి లేకుంటే.. ఎక్కడి నుంచో ఉత్తరాఖండ్‌ ఇన్‌ఛార్జిగా వచ్చిన దేవేంద్ర యాదవ్‌కి ఉంటుందా?!’’ అని అడిగేశాను. 

‘‘దేవేంద్ర యాదవ్‌ ఎక్కడి నుంచో రాలేదు రావత్‌జీ. ఢిల్లీ నుంచే వచ్చాడు’’ అన్నాడు రాహుల్‌. 
‘‘సంతోషం రాహుల్‌జీ! ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా సంతోషమే. అందుకే కదా.. డెహ్రాడూన్‌కి మొన్న మీరు వచ్చినప్పుడు కూడా నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషంలో.. డయాస్‌ మీద మీతో పాటు ఎవరెవరు ఉండాలో నిర్ణయించవలసింది నేను కదా, దేవేంద్ర యాదవ్‌ నిర్ణయించేశాడేమిటి అనే ఆలోచన కూడా నాకు రాలేదు!’’ అన్నాను. 
రాహుల్‌ అలా వింటూ ఉండిపోయాడు. వినడం వరకేనని నిర్ణయించుకున్నాకే నన్ను ఢిల్లీ పిలిపించినట్లున్నాడు!

‘‘రాహుల్‌జీ, మీరు మా ఇద్దర్నీ కలిసి పని చెయ్యమన్నారు. దేవేంద్ర యాదవ్‌ తనొక్కడే చాలనుకుంటున్నాడు. ‘పేరుకే స్టేట్‌ ఇన్‌ఛార్జ్‌. స్టేట్‌లో ఛార్జ్‌ మొత్తం నాదే’ అని ప్రచారం చేసుకుంటున్నాడు. సీఎం క్యాండిడేట్‌ని ముందే ప్రకటిస్తే తప్ప అతడు, నేను కలిసి పనిచేసే పరిస్థితి లేదు రాహుల్‌జీ’’ అన్నాను. 
‘‘పరిస్థితా? ప్రసక్తా రావత్‌జీ’’ అన్నాడు రాహుల్‌! అంత లోతుగా అతడు ఆలోచించగలడని నేను అనుకోలేదు. 

‘‘రావత్‌జీ! 2017లో అమరీందర్‌ సింగ్‌ని తప్ప, ఆ తర్వాత ఎవర్నీ మనం సీఎం క్యాండిడేట్‌గా ఎన్నికలకు ముందే ప్రకటించలేదు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. ఎన్నికలు అయ్యాకే సీఎంగా ఎంపికయ్యారు. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ పేరు కూడా ఎన్నికలు అయ్యాకే సీఎంగా బయటికొచ్చింది. వాళ్లిద్దరూ ఈరోజుకీ సీఎంలుగా ఉన్నారు. ముందే సీఎంగా ప్రకటించి, సీఎంని చేసిన అమరీందర్‌ సింగ్‌ ఏమయ్యారో మీకు తెలిసిందే కదా’’ అన్నాడు రాహుల్‌!
ఒక నమస్కారం పెట్టి, వచ్చేశాను. 

డెహ్రాడూన్‌లో అడుగుపెట్టగానే.. పంజాబ్‌ నుంచి అమరీందర్‌సింగ్‌ ఫోన్‌! 
‘‘రావత్‌జీ! పంజాబ్‌ స్టేట్‌ ఇన్‌ఛార్జ్‌గా మీరు నాకు తవ్వారు. ఉత్తరాఖండ్‌ స్టేట్‌ ఇన్‌ఛార్జిగా దేవేంద్ర యాదవ్‌ ఇప్పుడు మీకు తవ్వుతున్నాడు. కాంగ్రెస్సే కోరి తవ్వకాలు జరిపించుకుంటున్నప్పుడు మీరెంత, నేనెంత, ఆ కేదారేశ్వరుడెంత చెప్పండి’’ అన్నారాయన!

మరిన్ని వార్తలు