ప్రతిపక్ష ఐక్యతకు కాంగ్రెస్‌ గండం

24 Dec, 2021 01:57 IST|Sakshi

దేశ ప్రధాని కావాలని అనుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌గాంధీ ఇప్పటికీ కొన్ని భ్రమల్లోనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల విజయాలను ఆసరాగా చేసుకోవాలని గద్దెనెక్కాలని ఆశిస్తున్న ఆయన ప్రతిపక్షాల ఐక్యత, నిస్పృహలను పూర్తిగా విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తరువాత అంటే 2022 మార్చి తరువాత ఎంతో మెరుగవుతుందన్న అంచనాలో కాంగ్రెస్‌ ఉంది. కానీ కాంగ్రెస్, ప్రతిపక్షాల ఐక్యత అందని మానిపండులాగే మిగిలిపోయింది. అయితే 2018లో కాంగ్రెస్‌ పోరాట స్ఫూర్తి వారికి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో విజయాలను తెచ్చిపెట్టిన విషయాన్ని మరవకూడదు. 

లోక్‌సభ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు పొందిన ప్పటికీ ఆ ఏడాది డిసెంబరులో రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత దేశంలోనే అతి పురాతనమైన పార్టీలో నాయకత్వ సమస్య సమసిపోయినట్లే అనిపించింది. అలాంటిదేమీ జరగలేదు సరికదా.. 75 ఏళ్ల సోనియాగాంధీ ఇప్పటికీ ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతూనే ఉన్నారు.

ఇదే సమయంలో పార్టీలో అసం తృప్తి గళాలు పెరిగిపోయాయి. అసమ్మతి వర్గం జీ–23లో ఒకరైన గులాం నబీ ఆజాద్‌ ఈమధ్య బహిరంగంగానే విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్‌తో సమాంతరంగా రాజకీయ సమావేశాలూ నిర్వహి స్తున్నారు. ఆజాద్‌ 72 ఏళ్ల వయసులో విమర్శకుల నోళ్లు మూయించేందుకు ప్రయత్నిస్తున్నారా లేక శరద్‌ పవార్, మమతా బెనర్జీ, వై.ఎస్‌. జగన్‌ వంటి వారి మాదిరిగా కొత్త దారి వెతుక్కుంటున్నారా వేచి చూడాల్సిన అంశం.

కేరళ, అసోంలలో ఎన్నికలు ముగిశాయి. వచ్చే ఏడాది మొదట్లో జరిగే పంజాబ్, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్‌ మళ్లీ గాడిన పడుతుందని రాహుల్‌ గాంధీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా... అందులో వాస్తవం పిస రంతే. తృణమూల్‌ కాంగ్రెస్‌కు కాంగ్రెస్‌కు పడటం లేదు. తృణమూల్, ఆమ్‌ ఆద్మీ మధ్య సఖ్యత లేదు.

రాష్ట్రీయ జనతాదళ్‌తోనూ కాంగ్రెస్‌ కయ్యాలకు దిగుతోంది. యూపీలో ప్రియాంక గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ మధ్య కూడా ఉప్పూ నిప్పు మాదిరిగానే ఉంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ బీజేపీ, ఎన్‌డీయే లలో భాగం కాని పార్టీలు తమలాగే ఆలోచిస్తున్న ఇతర పార్టీలతో కలిసి ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేక పోయాయి. ఇదే జరిగి ఉంటే వ్యవసాయ చట్టాలపై కేంద్ర వైఖరిని అందరి దృష్టిలో పడేలా చేసే అవకాశం ఉండేది. 

లోక్‌సభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు ఇప్పటి లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూండవచ్చు. ఇంకోలా ఆలోచిస్తే తమ ఆధిపత్యాన్ని నిరూ పించుకునే ప్రయత్నంగానూ చూడవచ్చు. ఇందుకు తాజా తార్కాణం 40 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్న గోవా లాంటి చిన్ని రాష్ట్రంలోనూ తృణమూల్, ఆప్, కాంగ్రెస్‌ ఆధి పత్యం కోసం పోటీ పడుతూండటం. బెంగాల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్రిపుర, గోవా, హరియాణాల్లో పార్టీని విస్తరిస్తున్నారు. 

దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితికి కాంగ్రెస్‌ స్వీయ లోపాలు లేకపోలేదు. సీనియర్‌ నేత, వ్యూహకర్త అహ్మద్‌ పటేల్‌ మరణించి ఏడాది దాటుతోంది. అయిన్పటికీ ఆయన స్థానాన్ని భర్తీ చేసే నేతను గుర్తించలేకపోయారు. అహ్మద్‌ పటేల్‌ లాంటి నాయకులు ఉండి ఉంటే ప్రతిపక్షాలతో రహస్య చర్చలు జరిపేందుకు... ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒక్కతాటిపై గట్టిగా నిలబడేందుకు దోహదం చేసేవారు. బెంగాల్‌ విజయంతో మమత అత్యాశతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ భావిస్తున్న పక్షంలో ఆ పార్టీ ఒక్కసారి వెనుతిరిగి చూసుకోవడం మేలు.

2015, 2020లలో ఢిల్లీలో రెండు సార్లు, 2019లో ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మమత బెనర్జీ కేంద్ర బిందువుగా యూపీఏ రూపుదిద్దుకునేందుకు సోనియా గాంధీ అంగీకరించి ఉంటే.. పార్లమెంటు వ్యవహా రాలు, పార్టీ పరమైన అంశాలను చక్కదిద్దుకునేందుకు రాహుల్‌గాంధీకి మంచి అవకాశం దక్కి ఉండేది. అలాగే సచిన్‌పైలట్, భూపేశ్‌భగేల్‌లతో కలిసి ప్రియాంక గాంధీ పార్టీ ప్రచారకర్తగా వ్యవహరించేవారు. 

ఎన్డీయేతర పార్టీలన్నింటినీ ఒక్క తాటికిందకు తెచ్చి యూపీఏకు కొత్త రూపునిచ్చేందుకు జరగుతున్న ప్రయత్నా లను కాంగ్రెస్‌ 2014 నుంచే విస్మరిస్తోంది. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, శివసేన, శరద్‌ పవార్‌ నేతృ త్వంలోని ఎన్సీపీ... ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అవసరాన్ని పదే పదే ప్రకటించినప్పటికీ కాంగ్రెస్‌ నాయకత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది. 2024లో దేశ అత్యున్నత పదవికి రాహుల్‌ పోటీపడటం లేదు. కానీ ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఎవరు నేతృత్వం వహించాలన్న విషయంలో తన మాట చెల్లుబాటు కావాలని గాంధీ కుటుంబం భావిస్తూండవచ్చు. 2004–2014 మధ్యకాలంలో అచ్చం సోనియాగాంధీ పోషించిన పాత్ర చందంగా అన్నమాట!

– రషీద్‌ కిద్వాయ్, సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు