నిరుద్యోగ యువత ఆకాంక్ష నెరవేరేనా!

20 Jan, 2024 03:47 IST|Sakshi

తెలంగాణ ఉద్యమం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ప్రధాన అంశాలుగా ప్రారంభమైంది. విద్యార్థులు ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సుమారు 1,200 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలను అర్పించారు. 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమీప భవిష్యత్తులో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉండదనీ, నూతన రాష్ట్రంలో తమ కలలు సాకారం అవుతాయనీ భావించిన  నిరుద్యోగులు ఆశించారు. కానీ వారి ఆశలు ఆడియాసలయ్యాయి. మొదటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఉద్యోగ నియామకాల ఊసు లేకపోవడంతో 2015లో నిరుద్యోగ జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒకటీ అరా ఉద్యోగ ప్రకటనలు వచ్చినా అనేక మంది ఉద్యమకారులకు పరీక్షలకు హాజరవ్వడానికి వయసు మీరిపోయింది. అర్హత ఉన్న చాలా మంది సీనియర్లకు నవ యువకులతో పోటీపడే శక్తి లేకుండా పోయింది. అదే సమయంలో ఉద్యోగ నియామకా లపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంతలో కొత్త ప్రభుత్వం మొదటి టెర్మ్‌ ముగిసిపోయింది. 2018లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. అంతకు ముందు అధికారంలో ఉన్న పార్టీయే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈసారన్నా తమకు ఉద్యోగాలొస్తాయని నిరుద్యోగులు భావించారు. ఇంతలో కరోనా విజృంభించింది. దాని కోరల నుంచి బయటపడి గ్రూప్‌ వన్‌ పరీక్షకు ప్రిపేర్‌ అయిన నిరుద్యోగులను పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం కుంగదీసింది. అప్పటినుంచి నిరు ద్యోగులు చదవడం మానేసి తమకు జరిగిన అన్యా యాన్ని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు.

ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసా కల్పించడంలో విఫలమైంది. అదే సమయంలో ఉద్యోగం రాలేదని బాధతో ప్రాణ త్యాగం చేసినటువంటి ఒక విద్యార్థిని కూడా అవహేళన చేసే విధంగా మాట్లాడారు అధికారంలో ఉన్నవారు. అటువంటి అహంకార ధోరణిని నిరుద్యోగులు జీర్ణించుకోలేక పోయారు. అప్పటివరకు రాజకీయ ప్రక్రియలో చురుకుగా పాల్గొనని నిరుద్యోగ యువతీ యువకులు ఒక్కసారిగా రాజకీయాలను మార్పు చేయాలనీ, తమ తలరాతను తామే మార్చుకోవాలనీ భావించి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సాధారణ ఎన్ని కల్లో ప్రభావాన్ని చూపించారు. 

2023 జూన్‌ కంటే ముందు తెలంగాణలో వేరే పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం లేదు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే నాయకులను మనం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అటువంటి పరిస్థితులలో గ్రూప్‌ వన్‌ పేపర్‌ లీకేజీ అంశం ప్రతిపక్ష పార్టీలకు ప్రధానఅస్త్రంగా మారింది. అప్పటినుంచి రాష్ట్రంలో రాజ కీయ  సమీకరణలు మారినాయి. అన్ని పార్టీలు  నిరు ద్యోగ సమస్యని తమ ప్రధాన ఎజెండాగా కార్యా చరణ రూపొందించడం ప్రారంభించాయి. ఈ నిరు ద్యోగ ఉద్యోగ సమస్యలు ఈనాడు కాంగ్రెస్‌ ప్రభు త్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చాయి అనడంలో అతిశయోక్తి కాదు.

2023 అసెంబ్లీ ఎన్నికల సమ యంలో అధికార పార్టీ చాలా అంశాలను ప్రస్తావించింది కాని, నిరుద్యోగులకూ, ఉద్యోగులకూ భరోసా కల్పించే విధంగా ఏ వాగ్దానాలు చేయలేదు. అందు వలన ఎక్కడెక్కడో చదువుకొనే చాలామంది నిరు ద్యోగులూ, చిరుద్యోగులూ తమ తమ గ్రామాలకు వెళ్లి ఆ గ్రామాలలో ఉన్నటువంటి మిగతా వర్గాల వారికీ, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారికీ... తమ వాదాన్నీ, బాధనూ అర్థమయ్యేలా చెప్పు కున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయమని అర్థించారు.

నిరుద్యోగుల సమస్యలను ప్రజానీకానికి తెలి యచేయడానికి శిరీష అలియాస్‌ బర్రెలక్క ఎన్నికల్లో పోటీ చేయడం తెలిసిందే. ఒక సాధారణ వెనుక బడిన తరగతికి చెందిన యువతికి సపోర్ట్‌ చేయడా నికి విదేశాల నుంచి కూడా కొందరు రావడం, మన రాష్ట్రంలోని చాలామంది ప్రముఖులు ఆమెకు మద్దతు ప్రకటించడం మనం గమనించాం. నిరు ద్యోగ సమస్య ఎజెండాగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి హేమాహేమీ నాయకులకు చెమటలు పట్టించిందామె. కాబట్టి పార్టీలు ఈ అంశాన్ని ఒక గుణపాఠంగా  భావించవలసిన అవసరం ఉంది.

కాంగ్రెస్‌ పార్టీ ఒక సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం, జాబ్‌ క్యాలెండర్లు ప్రకటిస్తామని భరోసా కల్పించడంతో నిరుద్యోగులు కాంగ్రెస్‌ పార్టీ పక్షాన నిలబడి కాంగ్రెస్‌ పార్టీని సంపూర్ణ మెజారిటీతో గెలిపించారు. పార్టీలో గెలిచినటువంటి 64 మంది అభ్యర్థుల మెజారిటీని మనం గమనిస్తే ఎక్కువమంది సుమారు 20 వేల నుంచి 65 వేల మధ్య మెజారిటీ సాధించినవారే కనిపిస్తారు. ఇందుకు కారణం నిరుద్యోగ యువతే అని చెప్పవచ్చు. నూతన ప్రభుత్వమైనా విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందని ఆశిద్దాం.

-వ్యాసకర్త రాజనీతి శాస్త్ర ఉపన్యాసకుడు
మొబైల్‌: 99514 50009

- డా‘‘ ఎ. శంకర్‌

>
మరిన్ని వార్తలు