దేశమే ఓ ‘సంఘం’.. అది విద్వేష కేంద్రం కాదు!

22 Apr, 2022 12:23 IST|Sakshi

ద్వేషపు విషాలు విరజిమ్మే నేతలకు రాజ్యాంగ పాఠాలు చెప్పవలసిన అవసరం ఉంది. భారత్‌ ఒక సంఘం, విద్వేష కేంద్రం కాదు అనేది తొలి పాఠం. నిజానికి కేంద్రం అన్నమాటే రాజ్యాంగంలో లేదు. ఢిల్లీలో ఉన్న జాతీయ ప్రభుత్వాన్ని ‘సంఘం’ అని రాజ్యాంగం అంటోంది. దేశం అంటే సంఘం. సంఘం అంటే కలిసి ఉండడం. మనం విద్వేష విధ్వంస ఉద్వేగ ఉద్రేక వాక్యాలతో జాతిని విభజించి, భజనలను ప్రోత్సహిస్తున్న ప్రస్తుత సమయంలో... రాజ్యాంగం దేశాన్ని సంఘం అన్నదని తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. మనం జాతి అంటూ ఉంటాం. ‘నేషనల్‌’ అన్న పదానికి తెలుగులో మనం ‘జాతీయ’ అని అర్థం చెప్పుకుంటున్నాం. హిందీలో జాతి అంటే కులం. రాష్ట్రీయ ఏకతా అంటే జాతీయ సమైక్యత. ఈ విధంగా మన దేశభక్తి భావాలను రక రకాల పదాలతో వాడుతూ మన దేశాన్ని గందరగోళంలో పడేస్తున్నాం. మన నాయకుల సంగతి మరీ దారుణం. చంపండి, నరకండి అని తెలుగు సినిమా ఫ్యాక్షన్‌ కథల హత్యాకాండ పరిభాషను తలపించే విధ్వంసక భాషను వేదికల మీద వాడుతున్నారు. ఇది నేర భాష. ద్వేష విధానం. ఈ విధంగా మాట్లాడే వారు దేశద్రోహులు. 

వాడుకగా పత్రికల్లో, టీవీల్లో మనం ‘కేంద్రం’ అనేమాట వాడుతున్నాం. రాజ్యాంగంలో కేంద్రం అనే మాటే లేదు. ఆ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తొలి తెలుగుదేశం వ్యవస్థాపకుడు (చంద్రబాబు నాయుడికి ముందు తెలుగుదేశం) ఎన్‌టీ రామారావు ‘కేంద్రం’ అనే పదం ‘మిథ్య’ అనేవారు. రాష్ట్రాలు లేకపోతే దేశం ఎక్కడ అనేవారు. అన్ని రాష్ట్రాల హద్దులన్నీ కలిపితేనే ఈ దేశం అని కూడా వాదించేవారు. 

మనదేశ రాజ్యాంగం ప్రకారం కేంద్రం గొప్పదా? రాష్ట్రం గొప్పదా?  అందరూ తడుముకోకుండా చెప్పే సమాధానం కేంద్రం అని. గొప్పదంటే ఏమిటీ? ఎక్కువ అధికారాలున్నాయనా? పెద్దదనా? కాదు. ఎన్నికల ద్వారానే ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా సమానమే కదా? సమానమే కానీ కేంద్రం ‘ఎక్కువ సమానం’. ఎందుకంటే... దేశ రక్షణ, విదేశీ వ్యవహారాల నిర్వహణ, కమ్యూనికేషన్లు, ఇవన్నీ యూనియన్‌ ప్రభుత్వమే నిర్వహించాలి. ఇందులో రాష్ట్రాలకు ప్రమేయమే లేదు. యూనియన్‌ లిస్ట్‌ అని ఏడో షెడ్యూల్‌లో కొన్ని అంశాలపై పాలనాధికారాలనూ, శాసనా ధికారాలనూ ప్రత్యేకించి యూనియన్‌కే పరిమితం చేశారు. 

యూనియన్‌ అంటే సంఘం. సంఘ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది. హిందీలో రాష్ట్రం అంటే దేశం. రాష్ట్రపతి అంటే దేశాధ్యక్షుడని తెలుగులో కూడా ఒప్పుకుంటాం. కానీ వాడుకలో రాష్ట్రం అంటే ద్వితీయ స్థాయి పాలనా ప్రదేశం. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అంటాం. రాజనీతి పరంగా... రాజ్యాంగ వాడుకలో స్టేట్‌ అంటే వేరే అర్థం ఉంది. స్టేట్‌ అంటే రాజ్యం అనీ, దేశ పాలనా వ్యవస్థ అనీ అర్థం. మార్గ దర్శకంగా ఉండే ఆదేశిక సూత్రాలలో స్టేట్‌ సమానతను సాధించడానికీ, పేద ధనిక వ్యత్యాసాలు తగ్గించడానికీ కృషి చేయాలనే సూత్రం ఒకటి ఉంది. స్టేట్‌ను మనం తెలుగులో ఇతర భాషల్లో కూడా ఫలానా రాష్ట్రం అనే అర్థంలో వాడతాం. విచిత్రంగా ‘రాజ్యం’ రాష్ట్రమైంది. ‘రాష్ట్రం’ దేశమైంది. ‘దేశం’ కేంద్రమైంది. రాష్ట్రం కేంద్రం దగ్గర నిలబడి నిధులు అభ్యర్థించే ప్రజా ప్రభుత్వమైంది. రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు రాజనీతి శాస్త్రానికి అనుగుణంగా వాడిన కీలకపదాలను అర్థం చేసుకోకుండా మన వాడుక పదాలతో గందరగోళం సృష్టిస్తూ ఉంటాం. న్యాయ పరిభాషలో ఈ పద్ధతి సమస్యలు తెస్తుంది. 

‘ఇండియా దటీజ్‌ భారత్‌’ అని మన రాజ్యాంగం తొలి అధికరణం సంవిధాన రచన ఆరంభమవుతుంది. ఆర్టికల్‌ 1 సంఘం (యూనియన్‌) పేరు ప్రాదేశిక పరిధి: (1) ఇండియా అంటే భారత్‌ రాష్ట్రాల సంఘమై ఉంటుంది. (2) రాష్ట్రాలు వాటి ప్రాదేశిక పరిధుల వివరణ తొలి షెడ్యూలులో ఉంది. (3) ఈ ఇండియా పరిధిలో ఉండేవేవంటే... (ఏ) ఆయా రాష్ట్రాల పరిధి, (బీ) తొలి షెడ్యూల్‌లో పేర్కొన్న కేంద్ర పాలిత ప్రాంతాల పరిధి, (సీ) భవిష్యత్తులో స్వాధీనం చేసుకోబోయే ప్రాంతాలు ఏవైనా ఉంటే అవీ. (క్లిక్: రాజ్యాంగ పీఠిక.. వాద వివాదాలు)

తొలి షెడ్యూల్‌లో ఏ, బీ, సీ, డీ అనే నాలుగు వర్గాల రాష్ట్రాలను, వాటి పరిధులను పేర్కొన్నారు. (ఏ) భాగంలో బ్రిటిష్‌ ఇండియాలోని తొమ్మిది ప్రొవిన్స్‌లూ, (బీ)లో స్వతంత్ర రాజ్యాలు, (íసీ)లో  కేంద్ర పాలనలో ఉన్న అయిదు రాష్ట్రాలు; అండమాన్‌ నికోబార్‌ దీవులు (డీ)లో చేర్చారు. ఏడో రాజ్యాంగ సవరణ (1956) ద్వారా పార్ట్‌ (ఏ) (బీ)ల మధ్య తేడాను తొలగించారు. తరువాత రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్నిర్మించారు. ఒకే భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలన్న మాట వెనుక హేతుబద్ధత ఏదీ లేదనే విమర్శలకు గురైన విధానం ఇది. అయిదారు రాష్ట్రాలలో హిందీ మాట్లాడతారు. వాటన్నిటినీ కలపడం భావ్యమా? తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉంటే తప్పేమిటి అనే వాదం కూడా తెలంగాణ ఏర్పాటు కార ణాల్లో ఒకటి. 1950లో లేని అనేక కొత్త రాష్ట్రాలు ఆ తర్వాత వచ్చాయి. తెలంగాణ 2014లో ఏర్పడిన కొత్త రాష్ట్రం. కానీ జమ్ము–కశ్మీర్‌ అనే రాష్ట్రాన్ని 2019లో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. (క్లిక్: రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసివుంటే...)

‘భారత్‌’ అని ఇండియాను పిలవాలంటూ ఒక ప్రజాప్రయోజన వాజ్యం 2016లో దాఖలైంది. మన రాజ్యాంగంలో మన దేశానికి భారత్‌ అనీ, ఇండియా అనీ రెండు పేర్లున్నాయి. భారత స్వాతంత్య్ర పోరాటంలో మంత్ర వాక్యం ‘భారత్‌ మాతాకీ జై’. అందులోంచి భారత్‌ అన్న పేరును స్వీకరించారు. ప్రతి భారతీయుడికీ ఈ రెండు పేర్లలో ఒక పేరును ఎంచుకునే హక్కు ఉందని ఆనాటి ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ అంటూ ఈ పిటిషన్‌ను కొట్టి వేశారు. ఈ దేశాన్ని ఏమని పిలవాలో నిర్ణయించే నిరంకుశాధికారం సుప్రీంకోర్టుకు లేదన్నారు. (క్లిక్: ‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం)

- మాడభూషి శ్రీధర్‌
స్కూల్‌ ఆఫ్‌ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ

మరిన్ని వార్తలు