రాజ్యాంగ పీఠిక.. వాద వివాదాలు

31 Mar, 2022 01:51 IST|Sakshi

అభిప్రాయం

రాజ్యాంగం తొలి ప్రతిని 1948 నవంబర్‌ 4వ తేదీన రాజ్యాంగ సభలో ప్రవేశ పెట్టారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఎన్నికైన సభ్యుడు నజీరుద్దీన్‌ అహ్మద్‌ మొదటినుంచీ రాజ్యాంగం చిత్తుప్రతిలో లోపాలను ఎత్తిచూపుతూ ఉండేవారు. ఆయన మాత్రమే కాదు, కె. సంతానం (మద్రాస్‌), ఆర్‌ ఆర్‌ దివాకర్‌ (బాంబే), మౌలానా హస్రత్‌ మోహానీ (యునైటెడ్‌ ప్రావిన్సెస్‌) కూడా రాజ్యాంగ రచనను పదే పదే విమర్శించేవారు.

రాజ్యాంగ డ్రాఫ్టింగ్‌ కమిటీ... చట్ట వ్యతిరేకంగా తనను తాను రాజ్యాంగ సంఘం (కానిస్టి ట్యూషన్‌ కమిటీ)గా మార్చుకున్నదని వ్యాఖ్యానించారు. డ్రాఫ్టింగ్‌ కమిటీ చైర్మన్‌ రాజ్యాంగ సభ నిర్ణయాలను రచనలో పొందుపర్చడమే కాకుండా... ఆ నిర్ణయాలను సమీక్షించారనీ, కొన్ని చోట్ల వాటికి కొత్తరూపం ఇచ్చారనీ దివాకర్‌ విమర్శిం చారు. తర్వాతి రోజుల్లో రాజ్యంగ ‘పీఠిక’గా మారిన ‘రాజ్యాంగ లక్ష్య తీర్మానం’ (ఆబ్జెక్టివ్‌ రిజల్యూషన్‌) పైనా మోహానీ విమర్శలు కురిపించారు.

ఇదంతా ఎందుకంటే ఈ పీఠిక (ప్రియాంబుల్‌) రాసిం దెవరు అనే ప్రశ్న కోసం. నిజంగా వెంటనే సమాధానం ఇవ్వడానికి వీలుకాని ప్రశ్న ఇది. రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు, మార్పులు, చేర్పులు, ప్రసంగాల వివరాలు ఉన్నాయి కానీ... రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుల మధ్య జరిగిన చర్చలు, సవరణ ప్రతిపాదనలు; చేసిన మార్పులు, చేర్పులు; తుది రూపం ఇచ్చేముందు జరిపిన సంప్రదింపులకు సంబం ధించిన సమాచారం లేదు. ఆ వివరాలు ఎక్కడా రాసిలేవు. రాజ్యాంగ సభలో ఈ పీఠికకు తుది రూపంపై చర్చకు ముందు జరిగిన వివరాలూ లేవు. 

యూపీఎస్సీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చేవారంతా పీఠిక ఎవరు రాశారు అనగానే జవ హర్‌లాల్‌ నెహ్రూ అని జవాబు ఇస్తారు. దానికి కారణ మేమంటే.... నెహ్రూ ప్రతిపాదించిన ‘లక్ష్య తీర్మాన’మే భావి భారత రాజ్యాంగానికి లక్ష్య, ఉద్దేశ్య ప్రకటనగా రూపొందింది. రాజ్యాంగ రచనాసభలో చర్చించిన వివరాలు లేకపోవడం మోహానీ వంటివారు కొందరు విమర్శించడానికి కారణమైంది.

ఇక్కడే అసలు రాజ్యాంగం మొదటి చిత్తు ప్రతి సేకరించి, అన్ని నియమాలు ఒకచోట గుమిగూర్చి, చర్చకు ప్రాతిపదికగా రూపొందించిన ఘనత రాజ్యాంగ సభ సలహాదారుడైన బిఎన్‌ రావ్‌కు దక్కుతుందనేవారు ఉన్నారు. తొలి చిత్తు ప్రతి రూప కల్పనలో రావ్‌ పాత్ర నిర్వివాదాంశం. అయితే పీఠిక కూడా ఆయనే రాశారనడానికి వీలు లేదు. ప్రతి సభ్యుడి ప్రతిస్పంద నను ఆధారంగా చేసుకుని, చాలా జాగ్రత్తగా రాజ్యాంగ వాక్యా లను రచనా సంఘం... ముఖ్యంగా అంబేడ్కర్‌ నిర్మించారనేది నిర్వివాదాంశం. అయినా వివాదం చేయదలచుకున్న వారికి వివాదం కావచ్చు కూడా! 

రాజ్యాంగ రచన ఉపసంఘం సమావేశాల కాలంలో చాలా సందర్భాలలో అందరు సభ్యులూ హాజరు కాలేదు. పీఠికా నిర్మాణ సమయంలో రాజ్యాంగ రచనా ఉపసంఘానికి చెందిన నలుగురు మాత్రమే తొలి సమావేశాల్లో పాల్గొన్నారు. ఏ రోజూ వదలకుండా మొత్తం రచనా ఉపసంఘం సమావేశా లన్నింటికీ వచ్చిన ఏకైక వ్యక్తి అంబేడ్కర్‌ మాత్రమే. కనుక రాజ్యాంగం నిర్మించిన రచనా ఉపసంఘం అధ్యక్షుడు అంబే డ్కర్‌కే పీఠిక నిర్మాణం ఘనత కూడా చెందుతుంది. అయితే రాజ్యాంగ రచన, పీఠిక రచన రెంటికీ మధ్య సారూప్యత ఉన్నా.. కొన్ని తేడాలు కూడా ఉన్నాయి.

‘ముఖ్య నిర్మాత’ అన్నంత మాత్రాన అన్ని భాగాల రచయిత వారే అవుతారని అనడానికి వీలుండదు. అంబేడ్కర్‌ రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత చేసిన ప్రసంగం, నెహ్రూ లోక్‌సభలో 6 డిసెంబర్, 1956 (అంబేడ్కర్‌ నిర్యాణ దినం) నాడు ఇచ్చిన ఉపన్యాసం... రాజ్యాంగ ముఖ్య నిర్మాత అంబేడ్కర్‌ అనే విషయాన్ని ధృవీ కరిస్తాయి. ‘‘సాధారణంగా రాజ్యాంగ నిర్మాతలలో అంబేడ్కర్‌ ఒకరు అంటారు. కానీ రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్‌ కన్న ఎక్కువ శ్రద్ధచూపిన వారుగానీ, కష్టపడ్డవారు గానీ మరొకరు లేరు’’ అని నెహ్రూ చాలా స్పష్టంగా ప్రకటించారు. 

అయితే అంబేడ్కర్‌ తన చివరి ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాణ ఘనత తనకొక్కడికే ఇవ్వడం సరికాదని ప్రకటించారు. డ్రాఫ్టింగ్‌ కమిటీలో, రాజ్యాంగ సభలో కూడా అనేక మంది రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించారని ఆయన వివ రంగా చెప్పారు. ఈ రకరకాల చర్చల మధ్య రాజ్యాంగ పీఠికకు కర్త ఎవరు అనే విషయం మరుగున పడిపోయింది. ఆకాశ్‌ సింగ్‌ రాథోర్‌ మాత్రం తన పుస్తకానికి ‘‘అంబేడ్కర్స్‌ ప్రియాం బుల్‌’’ అని పేరు పెట్టారు. ‘రాజ్యాంగ రహస్య చరిత్ర’ అని కూడా ఉపశీర్షిక తగిలించారు. 
-మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త స్కూల్‌ ఆఫ్‌ లా డీన్, మహీంద్రా వర్సిటీ  

మరిన్ని వార్తలు