Coronavirus: ఆరోగ్యానికి అడ్డదారులు లేవు

7 Jun, 2021 11:50 IST|Sakshi

సందర్భం

అల్లోపతి మెడిసిన్‌ పట్ల రాందేవ్‌ బాబా చేసిన విమర్శలు ఇప్పుడు దేశంలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఆయన కాస్త వెనక్కి తగ్గి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవచ్చు. కానీ కరోనా కల్లోల కాలంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సమూహాలకు ఆ వ్యాఖ్యలు తీవ్ర మనస్తాపం కలిగించాయి. బాబా మీద వైద్య బృందం పరువునష్టం దావా కూడా వేసింది. టీవీల్లో చర్చలు, వాదోపవాదాలు, సవాళ్ళు, ప్రతిసవాళ్ళు రోజుల తరబడి కొనసాగుతున్నాయి. చివరికి ఇది అల్లోపతి వర్సెస్‌ ఇతర వైద్య విధనాల మధ్య భీకర సమరంగా పరిణమించింది.

దొరికిందే తడవుగా, ఆయుర్వేదం, హోమియోపతి, నేచరోపతి మొదలైన వైద్య విధానాలను అనుసరించేవారు మా దగ్గరున్న మందు చాలదా, మీకెందుకిన్ని తిప్పలు? అని ప్రజలకు ఉపశమనమిచ్చే బోధలు చేస్తున్నారు. ఆనందయ్య ఎంట్రీతో సీను మారింది. నాలుగు బొట్లు పసరు కళ్ళలో వేస్తే కరోనా భస్మమే అంటున్నాడు. జనం ఎగబడుతున్నారు. ఆనందయ్య మందుపై అపరాధ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆ మందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జగన్‌ సర్కారు కూడా అభ్యంతరాలను తొలగించింది. అయితే ఆ మందు ప్రామాణికమైనదని కోర్టు గానీ, ప్రభుత్వం గానీ చెప్పలేదు. ప్రజల ఇష్టాయిష్టాలదే తుది నిర్ణయం. ఆనందయ్య నాటుమందు భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది.  

ప్రజలు కరోనా భూతాన్ని తట్టుకోవడానికి ఎవరు ఏ మంత్రం బోధించినా పొలోమని ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నారు. కారణాలు చాలా ఉన్నాయి. నిజమే మనలో చాలా ఆక్రోశం ఉంది. కార్పొరేట్‌ ఆసుపత్రులు లక్షలు గుంజుతున్నాయని సామాన్యుడు గగ్గోలు పెడుతున్నాడు. అనవసరంగా స్టెరాయిడ్స్‌ వంటివి వాడి కరోనా బాధితులను గండాల పాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాధారమైన మందులు నల్లబజారులో విచ్చలవిడిగా అమ్ముకుంటూ అసహాయులను దుర్మార్గంగా దోచుకుంటున్నారని కథనాలు వినబడుతున్నాయి. ప్రజలు ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ప్రత్యామ్నాయ వైద్య విధానాల కోసం దారులు వెతుక్కుంటున్నారు. కానీ ఈ కారణాలు ఎంత కలవరపరచినా,  ప్రపంచాన్నంతటినీ సురక్షితంగా బయటపడడానికి ఆధునిక వైద్యశాస్త్రం వ్యాక్సిన్‌ రూపంలో ముందుకు వచ్చింది.

ప్రపంచంలో ఎన్నోఎన్నో దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తి చేసుకుని, ప్రజలను కరోనా కోరల నుండి కాపాడుకున్నాయి. అగ్రరాజ్యాలు  ఇప్పటికే ప్రజలకు అన్ని డోసులు ముగించి, మనిషికి రెండేసి డోసులు నిల్వ కూడా ఉంచుకున్నాయని వార్తలు వింటున్నాం. ఉత్తర కొరియా ప్రజలు ఇక మాస్కులు ధరించాల్సిన పనిలేదని ఆ దేశం చెప్తోంది.  మరి మన దేశంలో ఇలా ఎందుకు జరగలేదు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచాన్ని భారతదేశమే కాపాడుతుందని జబ్బ చరిచిన మన దుస్సాహసం, ఇప్పుడు ప్రపంచం ముందు చేతులు చాచి నిలబడేలా చేసింది.

విషయం ఏమంటే, లోపం ఆధునిక వైద్య విధానంలో లేదనీ, దాని అమలులో జరుగుతున్న అవకతవకల్లో ఉందనీ గమనించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ యువ నాయకత్వంలో ప్రయివేటు ఆస్పత్రుల ధన దాహం మీద దండయాత్ర మొదలైందని వార్తలు చూస్తే ఎంతో ఆనందం వేసింది. ముందు ముందు కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపరచే దిశగా అక్కడ అడుగులు సాగుతాయన్న ఆశను ఈ వార్తలు కలిగిస్తున్నాయి. ప్రభుత్వాల అండదండలతో వేల కోట్ల వ్యాపారాలు చేసుకునే బాబాల మాటలు ఖాతరు చేయాల్సిన పని లేదు గాని, సమయం వచ్చింది కాబట్టి, వైరస్సులు ఎన్నో ముందు ముందు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి, చిన్న చిట్కాలతో లొంగిపోయే తేలికపాటి జబ్బులకు కూడా ఆస్పత్రులకు పరుగులు తీసే అసహాయత మనలో చోటుచేసుకుంది కాబట్టి ఆరోగ్యం మీద ఇప్పటికైనా మనం ఒక అవగాహన ఏర్పరచుకోవడం మంచిది.

మనిషి నడకనేర్చింది మొదలు ఇప్పటి దాకా కొనసాగుతున్న అనేకానేక ప్రాచీన వైద్య విధానాల సమున్నత శాస్త్రీయ రూపమే ఆధునిక మెడికల్‌ సైన్స్‌. పోలియో మశూచి లాంటి మహమ్మారులను అరికట్టిన మెడికల్‌ సైన్స్‌ చరిత్ర మన ముందుంది. ఎయిడ్స్, క్యాన్సర్‌ లాంటి భయంకర వ్యాధులను లొంగదీసుకుంటున్న ఆధునిక వైద్య పద్ధతులు చూస్తున్నాం. ఈ వైరస్‌ మహమ్మారిని కూడా మనిషి జయిస్తాడు. కానీ ప్రాణాంతకమైన వ్యాధులను మేము నివారిస్తామని ఎవరైనా అంటే, వారు ఆధునిక వైద్య శాస్త్రం ముందు పరీక్షకు నిలబడవలసిందే. ప్రయోగాలకు నిలబడే ఏ మందు అయినా స్వీకరించవచ్చు. ఆధునిక వైద్య నిపుణులదే ఇందులో తుది తీర్పు.

ఇకపోతే బీపీ, షుగర్, గుండెజబ్బులు మొదలైన వాటిని మేం తగ్గిస్తామని పలువురు వాదిస్తున్నారు. మందులతో మీరు తగ్గించగలరా అని అల్లోపతి మీద సవాలు విసురుతున్నారు. నిజమే, ప్రకృతి వైద్యంతో వీటిని మనిషి తగ్గించుకోవచ్చు. మందుల అవసరం పడే స్థితికి  వీటిని తీసుకురాకూడదు. ఈ విషయంలో మెడికల్‌ సైన్స్‌కు మాత్రం ఏమి అభ్యంతరం ఉంది? కానీ ఎలాంటి ఆహారపు అలవాట్లు చెప్పకుండా, ఎలాంటి జీవన శైలినీ బోధించకుండా, ఏ వ్యాయామాలు యోగాలు ప్రాణాయామాలు నేర్పకుండా, మీరు బీపీ షుగర్‌లను కేవలం మందులతో పూర్తిగా నిర్మూలించగలరా అని ప్రశ్నిస్తే వారి దగ్గర జవాబులుండవు. అలా ఎవరూ చేయలేరు. బీపీ షుగర్‌ వంటి జబ్బులే కాదు, గుండె జబ్బులు, జీర్ణకోశ వ్యాధుల వంటివి, శరీరానికి రాకుండా మనం కాపాడుకోవచ్చు. మన ఆహారపు అలవాట్లను సమూలంగా మార్చుకోవాలి. ప్రకృతికి దగ్గరగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు ఆసుపత్రులకు వెళ్ళే అవసరాలే చాలా తగ్గిపోతాయి. వైరస్సులు అనేకం వస్తుంటాయి పోతుంటాయి. వాటిని జయించే నిరోధకతను మనలో వృద్ధి చేసుకునే విధానాలు పాటించడం ఒక్కటే చివరి మార్గం.

జబ్బులు పెంచి పోషించుకుని ఆస్పత్రులకు పరుగులు తీస్తే వైద్యులు వాటిని నయం చేయడానికి మందులేగా వాడాలి. జబ్బు వస్తే నయం చేయడానికే అస్పత్రులు తప్ప, జబ్బు ఎలా రాదో చెప్పడానికి శిక్షణా కేంద్రాలు మనకు కోకొల్లలు. వ్యవస్థలో ఉన్న లోపాలు వైద్య వ్యవస్థలో కూడా చోటు చేసుకున్నాయి. మెడికల్‌ సైన్సుని స్వార్థానికి వాడుకునే వారిది తప్పు గానీ, తప్పు మెడికల్‌ సైన్సుది కాదు.  నిరంతర శోధనలో కాలానుగుణ మార్పులతో మనిషికి రక్షాకవచంగా తనను తాను వృద్ధి చేసుకుంటూ ముందుకు నడుస్తుంది మెడికల్‌ సైన్స్‌. శాస్త్రీయత అంటేనే మారేదీ మార్పించేదీ. ఆరోగ్యానికి ఎలాంటి అడ్డదారులూ లేవని తెలుసుకుంటే క్షేమం. 
-డా. ప్రసాద మూర్తి 
వ్యాసకర్త ప్రముఖ కవి, సీనియర్‌ జర్నలిస్టు. 8499866699

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు