బిలియన్‌ వ్యాక్సిన్లు భరోసా ఇచ్చేనా?

28 Oct, 2021 00:39 IST|Sakshi

వందకోట్ల వ్యాక్సిన్‌ డోసులు పూర్తయినట్లు కేంద్రప్రభుత్వం గర్వంగా ప్రకటించి ఉండవచ్చు కానీ వాస్తవాలు ఇప్పటికీ భయపెడుతున్నాయి. రోజువారీగా వేస్తున్న డోసుల సంఖ్య రానురానూ తగ్గిపోతూండగా, ప్రజలందరికీ వ్యాక్సిన్‌ త్వరితంగా వేసే స్థాయి, ప్రేరణ కూడా తగ్గుముఖం పడుతోంది. అమెరికాలో తాజాగా మరోసారి కరోనా వేవ్‌ విజృంభణకు ఇదే కారణం. రెండో డోస్‌ వేసుకోవడానికి అమెరికన్లు ఆసక్తి ప్రదర్శించలేదు.

భారత్‌లోనూ పది కోట్లమంది ఇంతవరకు రెండో డోస్‌ని వేసుకోలేదు. కాబట్టి, మన జనాభాలోని అతిపెద్ద భాగం ఇప్పటికీ ఇన్‌ఫెక్షన్‌కి గురయ్యే ప్రమాదకర స్థితిలోనే ఉంటోంది. వైరస్‌ కొత్త రూపాలు వ్యాపిస్తున్న నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించడం ఒక్కటే శ్రీరామరక్ష అవుతుంది. జనాభా మొత్తానికి టీకాలు వేయడం ఒక్కటే బిలియన్‌ వ్యాక్సిన్ల ఘనతకు భరోసానిస్తుంది.

కోవిడ్‌ 19 మహమ్మారి నిరోధంలో భాగంగా నూరు కోట్ల వ్యాక్సిన్‌ డోసుల మైలురాయిని భారతదేశం అక్టోబర్‌ 21న సాధించింది. దేశంలో కరోనా టీకాలు వేయడం మొదలెట్టిన తొమ్మిది నెలలలోపే ఇంత గొప్ప విజయాన్ని సాధించడం అద్భుతమనే చెప్పాలి. అది కూడా దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లతో ఈ గొప్ప కార్యాన్ని సఫలం చేయడం గమనార్హం. దాదాపుగా దేశంలోని 75 శాతం వయోజనులు కనీసం ఒక డోస్‌ వేసుకోగా 31 శాతంమంది రెండు డోసులనూ తీసుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ సెప్టెంబర్‌ నెలలో కనీవినీ ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా 23.6 కోట్ల డోసులు వేశారు. మనదేశంలో రెండు డోసులు వేసుకున్న వారి సంఖ్య అమెరికా మొత్తం జనాభాకు సమానంగా చేరువవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 65 శాతం వ్యాక్సిన్లను ఉపయోగించడం గొప్ప విషయం.

మరి ఈ అరుదైన మైలురాయినుంచి మనం ఏవైపు వెళ్లబోతున్నాం? దేశంలోని వయోజనులందరికీ పూర్తిగా వ్యాక్సిన్‌ వేయాలన్న లక్ష్యాన్ని సాధించాక, బూస్టర్‌ షాట్లు వేయడం సమస్య కానుంది. అలాగే, కొత్త వైరస్‌ రూపాలు పెరుగుతున్నందున పిల్లలకు టీకాలు వేయడంపై కూడా భయాలు పెరుగుతున్నాయి. 2022 మార్చి నాటికల్లా అర్హులైన జనాభా మొత్తానికి మనం వ్యాక్సిన్‌ వేయగలగాలి. 

మరికొన్ని ఆందోళన కలిగించే ధోరణులు కూడా ఉన్నాయి. అర్హులైన తమ జనాభాలో దాదాపు సగం మందికి హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్, కేరళ రాష్ట్రాలు టీకాలు పూర్తి చేయగా, ఉత్తరప్రదేశ్, మహా రాష్ట్రలు తమ జనాభాలో 19 శాతం నుంచి 22 శాతంమందికి మాత్రమే ఇంతవరకు టీకాలు వేయగలిగాయి. రోజువారీగా వేస్తున్న డోసుల సంఖ్య రానురానూ తగ్గిపోతూండగా, ప్రజలందరికీ వ్యాక్సిన్‌ త్వరితంగా వేసే స్థాయి, ప్రేరణ కూడా తగ్గుముఖం పడుతోందని భయపడుతున్నారు. అమెరికాలో తాజాగా మరోసారి కరోనా వేవ్‌ విజృంభించడానికి సరిగ్గా ఇదే కారణం. ఎందుకంటే రెండో డోస్‌ వేసుకోవడానికి అమెరికన్లు ఆసక్తి ప్రదర్శించలేదు. భారత్‌లోనూ పది కోట్లమంది ఇంతవరకు రెండో డోస్‌ని వేసుకోలేదు. కాబట్టి, మన జనాభాలోని అతిపెద్ద భాగం ఇప్పటికీ ఇన్‌ఫెక్షన్‌కి గురయ్యే ప్రమాదకర స్థితి లోనే ఉంటోంది.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పెరుగుతున్నప్పటికీ, వ్యాక్సిన్‌ ద్వారా కలగాల్సిన రోగనిరోధక శక్తి పడిపోతుండటంపై ఆందోళన కలుగుతోంది. ఇజ్రాయెల్‌లో రెండు కరోనా వ్యాక్సిన్లను అయిదు నెలల క్రితమే తీసుకున్న 60 సంవత్సరాల పైబడిన వారిలో మూడోవంతు మందికి ఇటీవల వ్యాక్సిన్‌ వేసుకున్నవారితో పోలిస్తే మళ్లీ వైరస్‌ సోకింది. బ్రిటన్‌లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న 20 వారాల తర్వాత దాని వైరస్‌ నిరోధక శక్తి 67 శాతం నుంచి 47 శాతానికి పడిపోయిందని వెల్ల డయింది. తాజా అధ్యయనం ప్రకారం ఫైజర్‌–బయోన్‌టెక్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ షాట్‌ కరోనా ఇన్ఫెక్షన్‌పై 95.6 శాతం వరకు సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. డెల్టా వైరస్‌ రకం ప్రబలంగా ఉన్న సమయంలో  సాగించిన ఈ అధ్యయనానికి ప్రత్యేకించి ప్రాధాన్యత ఉంది.

అమెరికా ఆహార, మందుల నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఇటీవలే రెండు వ్యాక్సిన్లను బూస్టర్‌ షాట్లుగా అత్యవసరంగా ఇవ్వడానికి అనుమతినిచ్చింది. మోడెర్నా లేక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ సింగిల్‌ బూస్టర్‌ డోస్‌కి ఎఫ్‌డీఏ అనుమతించింది. 65 ఏళ్ల వయస్సువారు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న ఆరు నెలల తర్వాత ఈ బూస్టర్‌ డోస్‌ తీసుకోవడానికి అనుమతించారు. అలాగే 18 నుంచి 64 సంవత్సరాల వయస్సు మధ్య ఉండి తీవ్రస్థాయిలో కరోనా వైరస్‌ ఇన్పెక్షన్‌ బారినపడిన వారికి, తరచుగా వైరస్‌ల బారిన పడుతున్నవారికి కూడా ఈ బూస్టర్‌ డోస్‌ ఇవ్వవచ్చునని అనుమతించారు. అలాగే మొదట్లో ఒకే రకం వ్యాక్సిన్లను రెండు సార్లు తీసుకున్నవారు ఇప్పుడు రెండు రకాల వ్యాక్సిన్లను కలిపిన బూస్టర్‌ డోస్‌ని తీసుకుంటే అది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుందని చెప్పి, ‘మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌’ రకం బూస్టర్‌కి ఎఫ్‌డీఎ ఆమోదం తెలిపింది.

భారతదేశం కూడా రెండు వ్యాక్సిన్లను వేసుకున్న వ్యక్తులకు బూస్టర్‌ షాట్లు వేసుకోవడానికి అనుమతించాల్సిన అవసరం ఉన్నట్లు కనబడుతోంది. వ్యాక్సిన్లను వేసుకున్న వ్యక్తుల్లో దాదాపు 10 శాతంమందికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో మళ్లీ వైరస్‌ సంక్రమించినట్లు డేటా తెలుపుతోంది. ఇప్పుడు కూడా రాష్ట్రాల్లో 10 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నందున, వైరస్‌ సులభంగా సోకే వృద్ధులకు, ఆరోగ్య సిబ్బందికి బూస్టర్‌ షాట్లు వేయడం గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఇక పిల్లలకు కూడా వ్యాక్సిన్లు వేయవలసి ఉంది. జైదుస్‌ కాడిలా కంపెనీకి చెందిన జైకోవ్‌–డి, భారత్‌ బయోటెక్‌ కంపెనీకి చెందిన కోవాక్సిన్‌ టీకాలను రెండేళ్ల నుంచి 17 సంవత్సరాల వయసు పిల్ల లకు వేయడానికి అత్యవసర అనుమతిని అధికారులు ఇప్పటికే మంజూరు చేశారు. పాఠశాలలు, కాలేజీలను ఇప్పటికే తెరిచినందున వ్యాక్సిన్లకు దూరమైన పిల్లలు వైరస్‌ బారిన పడే ప్రమాదముంది. ఇప్పటికే బ్రిటన్, అమెరికాతో సహా పలు దేశాలు 18 సంవత్సరాల లోపు పిల్లలకు దశలవారీగా వ్యాక్సినేషన్‌ని ప్రారంభించేశాయి.

మరోవైపున ప్రపంచవ్యాప్తంగా సామాజిక శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలోని అసమానత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, చైనా, యూరప్‌ దేశాల్లో సగం కంటే ఎక్కువ జనాభాకు వ్యాక్సినేషన్‌ పూర్తవగా, ఆఫ్రికాలో ఇంతవరకు 7 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తయింది. పైగా విదేశీ పర్యటనలకు, వాణిజ్య కార్యకలాపాలకు తలుపులు తెరిచినందున, ప్రపంచమంతటా ఏకకాలంలో వైరస్‌ని నియంత్రించకపోతే, కోవిడ్‌–19ని భూమండలం నుంచి పారదోలడం కష్టసాధ్యమని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గత సంవత్సరమే వ్యాక్సిన్‌ సమాన పంపిణీకి కోవాక్స్‌ పేరిట కన్సార్టియమ్‌ని ఏర్పర్చినప్పటికీ, సంపన్న దేశాలు, పేద దేశాలకు తగినంత స్థాయిలో వ్యాక్సిన్‌ డోస్‌లను పంపడం లేదు. అంతకుమించి కొత్త వైరస్‌ రకాలు పెరుగుతుండటం భీతి కలిగిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రాణాంతకమైన డెల్టా వైరస్‌ రకం భారతదేశంలో విధ్వంసం సృష్టించింది. ఈ సెప్టెంబర్‌లో బ్రిటన్‌లో ఏర్పడిన కొత్త డెల్టా వైరస్‌ రకం ఏవీ.4.2 ఇతర వైరస్‌ రూపాలకంటే శరవేగంగా వ్యాపిస్తోందని సమాచారం.

వైరస్‌ ఇలా కొత్తవారికి సోకడం కొనసాగుతున్నందున అది ఉత్పరివర్తనం చెంది మరింత ప్రమాదకర పరిస్థితులను సృష్టించక తప్పదని భావిస్తున్నారు. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ కనిపెట్టిన ఘనత సాధిం చిన రష్యాలో కూడా అధిక శాతం ప్రజలు టీకా వేసుకోవడానికి వెనుకాడుతుండటంతో ఇప్పుడు అక్కడ వైరస్‌ విజృంభిస్తుండటం చూస్తున్నాం.

ఇప్పటికైనా మన గతానుభవం నుంచి ఇతర దేశాల అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించనందున రాబోయే నెలల్లో వైరస్‌ వ్యాప్తి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ సమయాల్లో, సామూహిక కార్యక్రమాల్లో, బహిరంగంగా మాస్కులు వేసుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం ప్రమాదకరం. పండగలు, ఎన్నికలు కూడా కరోనా కేసులను పెంచుతున్నాయి. వ్యాక్సిన్‌ ద్వారా పెరిగిన రోగనిరోధకత కొంత కాలం తర్వాత తగ్గుముఖం పడుతుండటం దీనికి కూడా తోడవుతోంది. 

ఈ నేపథ్యంలో వందకోట్ల వ్యాక్సిన్లు కలిగించిన ప్రయోజనాన్ని సుస్థిరపర్చుకోవడానికి, కోవిడ్‌ నిబంధనలను మనం కచ్చితంగా పాటించాలి. మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. అనవసరంగా గుంపుకూడకుండా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన జనాభాకి కూడా వ్యాక్సిన్‌ ప్రక్రియను పూర్తి చేసి, తదుపరి దశలో అందించనున్న బూస్టర్‌ షాట్లను కూడా తీసుకోవడానికి దేశ జనాభా ఆమోదం తెలపాలి.

-జగత్‌ రామ్, డైరెక్టర్, పీజీఐఎమ్‌ఈఆర్, చండీగర్‌
రాకేష్‌ కొచ్చార్, ప్రొఫెసర్, గ్యాస్ట్రోఎంటెరాలజీ

మరిన్ని వార్తలు