కోవిడ్‌ ఎప్పటికైనా ముగిసేనా?

15 Feb, 2022 00:43 IST|Sakshi

రెండో మాట

త్వరలోనే జనం మాస్కులు మరిచిపోవచ్చునని ఒక మాట. అయినా తగిన జాగ్రత్తలు తప్పవని మరో మాట. తీవ్రమైన మూడో దండయాత్ర తర్వాత కొన్ని రోజుల్లోనే నెమ్మదిస్తుందని ఒక సంస్థ ప్రకటన. ‘ఒమిక్రాన్‌’ అదుపుతప్పి, జనావాసాలను చుట్టబెట్టడంవల్ల దాని వ్యాప్తిని అరికట్టడం అసాధ్యమయ్యేలా ఉందని కొందరు నిపుణుల ఆందోళన.

వీటన్నింటికి తోడు రానున్న ‘కోవిడ్‌’ వేరియంట్లు వ్యాక్సిన్‌ రక్షణకు కూడా లొంగక పోవచ్చునన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమానం. ఇలాంటి వ్యాఖ్యానాలు ప్రజల్లో కొత్త భయాల్ని రేకెత్తించే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు కూడా భావిస్తున్నారు. అయితే ఒకమాట: లాభాల వేటలో ప్రజల ఆరోగ్యాల్ని శాసిస్తున్న అరాచక వ్యవస్థ ఉన్నంతకాలమూ కరోనా లాంటి వైరస్‌లూ పోవు, ఆ పేరిట రోజుకొక తీరున తలెత్తే వాటి ‘మహమ్మారులూ’ పోవు.

అమెరికా పాలకవర్గాలనూ, వారి అను మతితో ప్రజల అవసరాలనూ అక్కడి 84 ఫార్మా కంపెనీలు ఆడింది ఆటగా, పాడింది పాటగా శాసిస్తున్నాయి. లాభాల వేటలో ప్రజల ఆరోగ్యాల్ని శాసిస్తున్న అరాచక వ్యవస్థ ఉన్నంతకాలమూ కరోనా లాంటి వైరస్‌లూ పోవు, ఆ పేరిట రోజుకొక తీరున తలెత్తే వాటి ‘మహమ్మారులూ’ పోవు. ఈ సత్యం తెలిసి కూడా ఫార్మా కంపెనీల లాభాల వేటలో భాగస్వాములయ్యో, లేదా మోసపోతూనో ‘ఆకుకు అందని పోకకు పొందని’ పరిష్కారాలను కొందరు డాక్టర్లు రక రకాలుగా సూచిస్తున్నారు. 

సరిపడా ఉండాల్సిందేనా?
ఈ అవకాశవాద హెచ్చరికలకు తాజా ఉదాహరణ– కొలది రోజుల నాడు (12 ఫిబ్రవరి 2022) అమెరికాలో సర్జన్‌ జనరల్‌గా ప్రాక్టీసులో ఉన్న గౌరవ వివేక మూర్తి వ్యాఖ్యలు. ‘మాస్క్‌’లు ఇక త్వరలోనే పోతాయని ఆయన అన్నారు. అయితే చిలవలు–పలవలుగా పుట్టు కొస్తున్న కొత్త మహమ్మారులనూ, వాటి కొత్త అవతారాలనూ అణచి వేయగల వ్యాక్సిన్‌లు, బూస్టర్‌ డోసులు మాత్రం సరిపడా సంఖ్యలో ఉండాల్సి వస్తుందని చెప్పారు. అప్పుడే ప్రజల మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. 
కానీ, ప్రపంచ ఫార్మా కంపెనీలనూ, ప్రభుత్వాలనూ లాభాల వేట కోసం శాసిస్తున్న ఆ 84 ఫార్మా కంపెనీలను అదుపు చేయగల మొనగాడి కోసమే ప్రపంచం ఇంకా ఎదురుచూస్తోంది. కానీ ఆ కంపెనీల అవసరం పాలక వర్గాలకు ఎంత ఉందో, ఆ కంపెనీలకు పాలక వర్గాల అవసరమూ అంతే ఉంది. అందుకే ఈ ముసుగులో గుద్దులాట సమసిపోవడం లేదు. కనుకనే, సర్జన్‌ జనరల్‌ వివేక మూర్తి ఆశిస్తున్నట్లు మాస్కులు త్వరలోనే పోయినా ‘కరోనా’ జాగ్రత్తలు అనివార్యమని అటో ఇటో తెగని ‘భట్టిప్రోలు పంచాయతీ’తో తృప్తి పడవలసి వస్తోంది! 

అందరూ కోవిడ్‌ బాధితులేనా?
నిజానికి, ‘కరోనా’ వైరస్‌కు పరిష్కారం పేరిట అమెరికన్‌ 84 ఫార్మా కంపెనీలు, వాటికి ఆసరాగా వివిధ దేశాల్లో అదే పేరిట లాభాల వేట కోసం ‘అర్రులు చాచి’ కూర్చున్న పెక్కు వందిమాగధ ప్రైవేట్‌ కంపెనీలు సహా అక్కడి కోర్టులో పెక్కు కేసులు ఎదుర్కొంటున్న సంగతి మనం మరవరాదు. చివరికి భారత పాలకులు కూడా తప్పుకోలేని కేసులలో ఇరుక్కుపోవలసి వచ్చింది. చివరికి సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలాగే ఇతర ‘కోవిడ్‌–19’ లాంటి లక్షణాలు కనిపించిన వారికల్లా నిర్ధారణలతో నిమిత్తం లేకుండానే ‘కోవిడ్‌’ బాధితుల కింద జమకట్టే మనస్తత్వమూ పెరిగి పోయింది. అందుకే హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ సోమరాజు హార్ట్‌ పేషెంట్స్‌కు ఇటీవలి కాలంలో రెండు నాణ్యమైన ఔషధాలను సూచించారు. 1. ఏడాదికొకసారి ఇన్‌ ఫ్లూయెంజా ఇంజెక్షన్, 2. ఐదేళ్లకొకసారి వేసుకోవాల్సిన న్యూమో నియా వ్యాక్సినేషన్‌. 

‘కోవిడ్‌–19’కు తొలి కేంద్రంగా భావించిన చైనా ఆ వ్యాధిని అరికట్టడంలో అంత వేగంగానూ స్పందించి, అదుపు చేసుకుంది. ఆ పిమ్మట అందుకు సంబంధించిన కొత్త వేరియంట్స్‌ ఏవి తలెత్తినా వెంటనే స్పందించి అదుపు చేసుకోవడానికి అలవాటుపడింది. ఒక విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకే వ్యాధి పరిష్కారాల విషయంలో చైనా అనుభవం, దాని ప్రతిపాదనలే నేడు దిక్సూచిగా ఉపయోగ పడుతున్నాయి. అలాగే నిన్నగాక మొన్ననే (28 జనవరి 2022) దక్షిణాఫ్రికాలో సరికొత్త ‘కోవిడ్‌’ ప్రబలినట్టూ, అందువల్ల ప్రజలు ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నట్టూ, దాని వ్యాప్తి అదుపు తప్పు తున్నట్టూ మొదటిగా సోవియట్‌తోపాటు, చైనా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థను ఏకకాలంలో హెచ్చరించాయి. 

ప్రభావం తక్కువని చెప్పలేం?
కోవిడ్‌ మూడో దండయాత్ర 14 రోజుల్లో తీవ్ర స్థాయికి చేరి తర్వాత నెమ్మదిస్తుందని ఒక సంస్థ ప్రకటించగా, కొత్తగా తలెత్తిన ‘ఒమిక్రాన్‌’ అదుపుతప్పి, జనావాసాలను చుట్టబెట్టడంవల్ల దాని వ్యాప్తిని అరి కట్టడం అసాధ్యమయ్యేలా ఉందని కొందరు నిపుణులు తీవ్ర ఆందో ళనను వ్యక్తం చేశారు. ప్రపంచాల్ని లాభాల వేట కోసం కేంద్రంగా మార్చుకున్న ప్రపంచ ఫార్మా కంపెనీలు ఉనికిలో ఉంటూ శాసిస్తు న్నంత కాలం రాబోయే మరిన్ని ‘కోవిడ్‌’ రూపారూపాల ప్రభావం తక్కువ స్థాయిలో ఉంటుందన్న ‘గ్యారంటీ’ ఇవ్వలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

పైగా ‘ఒమిక్రాన్‌’ కన్నా రాబోతున్న ‘కోవిడ్‌–19’ కొత్త వేరియంట్‌ మరింత ‘మహమ్మారి’గా మారే అవకాశం ఉందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిస్తూ హెచ్చరిస్తున్నందున ఏదీ ఇంకా ఆరోగ్య సంస్థల, వైద్య ఆరోగ్య నిపుణుల అదుపులోకి పూర్తిగా వచ్చినట్టు భావించకుండా అజాగ్రత్తగా ఉండరాదు. ఒక్క ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ వల్లనే వారం రోజుల్లోగా రెండున్నర కోట్ల కోవిడ్‌ కేసులు కొత్తగా నమోద య్యాయన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన మరింత ఆందోళన కరంగా తయారైంది. అందువల్ల కొత్తగా తలెత్తగల వేరియంట్ల తీవ్రత తక్కువగా ఉండొచ్చునన్న ‘ఊహాగానాలు’ నమ్మదగినవి కావని ప్రపంచ ఆరోగ్య సంస్థ సందిగ్ధంగా ప్రకటించడం మరింత ఆందో ళనకు దారితీస్తోంది. 

నిర్దిష్ట అస్థిమితం
అయితే అదే సమయంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పే మాటలు కూడా మరిన్ని అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఎందుకంటే, రేపు రాబోయే వేరియంట్ల రూపాలు తీవ్రంగా ఉంటాయా, తక్కువ స్థాయిలో ఉంటాయా అన్న మీమాంస కన్నా ఒక మానసిక స్థితికి ‘ప్రజలు సిద్ధమైతే మెరుగేమో’ అని అనుమానం ప్రకటిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తేలిక ధోరణిని ప్రదర్శిస్తోందిలా: ‘‘మీరు శాశ్వతంగా మాస్క్‌ ఎల్లప్పుడూ ధరించనక్కర్లేదు. భౌతికంగానూ మరీ దూరంగానూ ఉండనక్కర్లేక పోవచ్చు.

కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ నియమాల్ని పాటించాల్సిందే.’’ ఇలా కర్ర విరక్కుండా పాము చావకుండా ఉండేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్పు ఉందంటే, ప్రజల మానసిక స్థితి ఎక్కడ స్థిరపడుతుందో చెప్పలేని విచిత్ర పరిస్థితి నేడు! అంతేగాదు, రానున్న ‘కోవిడ్‌’ రకరకాల వేరియంట్లు వ్యాక్సిన్‌ రక్షణకు కూడా లొంగక పోవచ్చునన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమానం ప్రజల్లో కొత్త భయాల్ని, ఆందోళనలను రేకెత్తించే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు కూడా భావిస్తున్నారు. అంతేగాదు, కోవిడ్‌ వేరియంట్‌ అంతిమంగా ఒక రూపం తొడిగి స్థిరపడే ముందు అస్థిమితంగా ఉంటుందని కూడా నిపుణులు హెచ్చరిస్తుండటం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దిష్టమైన అభిప్రాయం కూడా ‘అస్థిమితం’గా మారడం ప్రజల మనస్సుల్ని కలవరపెట్టే అంశమని చెప్పక తప్పదేమో!

అందుకే అన్నాడేమో మహాకవి... ఇంత మాలోకం మధ్య స్వార్థ రాజకీయ పాలకుల మధ్య, వారి ఆశీస్సులతో ఎదుగుతున్న ఫార్మా కంపెనీల లాభాల వేటను రక్షించడానికే ‘న్యాయస్థానాలూ, రక్షక భట వర్గాలూ, చెరసాలలూ, ఉరికొయ్యలూ ఏర్పడ్డాయి. ఆ స్వార్థపూరిత రేఖను ఇవి కాపాడక తప్పదు’. ఇప్పుడు మనం పచ్చినిజం నీడలోనే ఉన్నామని గ్రహించి, మేల్కొనక తప్పని ముహూర్తాలు ముంచు కొచ్చాయి.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు