-

నేరస్థుల గుర్తింపు బిల్లుపై చర్చ ఏది?

9 Apr, 2022 01:30 IST|Sakshi

విశ్లేషణ 

బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వం 1920లో తీసుకొచ్చిన నేరస్థుల గుర్తింపు చట్టం స్థానంలో అంతకంటే మించి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే బిల్లు తాజాగా పార్లమెంటులో ఆమోదం పొందింది. నేరస్థుల ఫొటోగ్రాఫ్‌లు, వేలిముద్రలు, పాదముద్రలు వంటివాటిని భద్రపర్చే అధికారాలను ఇది నేరదర్యాప్తు అధికారులకు దఖలు పర్చింది. ఈ బిల్లు శిక్షపడిన వ్యక్తుల వ్యక్తిగత డేటాను 75 సంవత్సరాల పాటు అట్టిపెట్టుకునేందుకు అనుమతిస్తోంది. వ్యక్తుల డేటాను శాశ్వతంగా సేకరించి ఉంచుకోవడం అనేది నేరాల నిరోధంలో లేదా నేర విచారణలో ఎలా సాయపడుతుందనే విషయంలో ఈ బిల్లు ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు. పైగా పార్లమెంటులో ఈ బిల్లును త్వరత్వరగా తీసుకొచ్చి ఆమోదం పొందిన పద్ధతి మరింత ఆందోళన కలిగిస్తోంది.

బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వం 1920లో నేరస్థుల గుర్తింపు చట్టాన్ని ఆమోదించింది. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన నెల రోజుల తర్వాత ఈ చట్టం అమలులోకి వచ్చింది. జాతీయవాదం పెల్లుబుకుతున్న వేళ, ప్రజలపై నిఘా పరిధిని విస్తరించడం ద్వారా వారిని మరింతగా నియంత్రించడానికిగానూ బ్రిటిష్‌ పాలకులు చేసిన ప్రయత్నంలో భాగంగా ఆనాడు నేరస్థుల గుర్తింపు చట్టాన్ని తీసు కొచ్చారు. ఈ చట్టం నేరస్థుల ఫొటోగ్రాఫ్‌లు, వేలిముద్రలు, పాద ముద్రలు వంటివాటిని (కొన్ని పరిమిత కేసుల్లో నేరస్థులు కానివారివి కూడా) భద్రపర్చే అధికారాలను చట్టాన్ని అమలు చేసే అధికారులకు దఖలు పర్చింది. ఇలాంటి వివరాలను భద్రపర్చడానికీ, తొలగించ డానికీ మరిన్ని నిబంధనలు తీసుకొచ్చారు.

వలస పాలనా బిల్లు కంటే ప్రమాదకరం
ఇప్పుడు 102 సంవత్సరాల తర్వాత, స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ తర్వాత సుదీర్ఘ కాలం దేశాన్ని పాలిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, వలస పాలనా కాలంనాటి చట్టం చేసిన దానికంటే మరింత అధికంగా వ్యక్తిగత డేటాను (అతితక్కువ భద్రతలతో) సేకరించడానికి ప్రయత్నిస్తూ తాజా ముసాయిదా బిల్లును తీసుకొచ్చి నేరస్థుల గుర్తింపు చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించింది. మార్చి నెల చివరలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన క్రిమినల్‌ ప్రొసీజర్‌ (గుర్తింపు) బిల్లు ప్రకటిత లక్ష్యం ఏమిటంటే, గత శతాబ్ది కాలం పైగా రూపొం దుతూ వచ్చిన నూతన కొలతలు, గుర్తింపు పద్ధతులను లెక్కలోకి తీసుకోవడం ద్వారా చట్టాన్ని మరింతగా మెరుగుపర్చడమే. 

ఈ క్రమానికి తుదిరూపం ఇవ్వడానికి, ఈ బిల్లులో వేలి ముద్రలు, పాద ముద్రలు, ఫొటోగ్రాఫ్‌లు, ఐరిస్, రెటీనా స్కాన్‌లు, శారీరక, జీవపరమైన నమూనాలు, వాటి విశ్లేషణలు, ప్రవర్తనాప రమైన లక్షణాలతోపాటు సంతకాలు, చేతి రాత లేదా ఇతర పరీక్షలను కూడా పొందుపరుస్తున్నారు. కొలతల జాబితాలో వీటన్నింటినీ చేరుస్తున్నారు. అయితే ఈ బిల్లు ఇంతటితో ఆగిపోలేదు. శరీరం నుంచి ఏ కొలతలు తీసుకోవచ్చు అనే శాస్త్రీయ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని చట్టాన్ని మెరుగుపర్చడంతో సంబంధం లేని మరో మూడు లక్షణాలు కూడా ఈ చట్టంలో మనకు కనిపిస్తాయి.

వ్యక్తుల గోప్యతను లెక్కచేయని బిల్లు
మొదటిది, ముందస్తు నిర్బంధ చట్టాల కింద నిర్బంధంలోకి తీసు కున్న ప్రజలతో సహా ఏ ఇతర నేరాల కింద అరెస్టు చేసిన ప్రజలకైనా సరే... వర్తించే విధంగా ఇది చట్టాల పరిధిని విస్తరిస్తోంది. ఇప్పటికైతే భారతదేశంలో అరెస్టు చేసే తమ అధికారాన్ని పోలీసులు దుర్విని యోగం చేయడం, ముందస్తు నిర్బంధ చట్టాలను మరింతంగా దుర్వి నియోగపర్చడం గురించి మనందరికీ బాగా తెలుసు. దురదృష్ట వశాత్తూ, ఈ బిల్లు ఏ తప్పూ చేయని, దోషులుగా నిర్ధారణ కాని వ్యక్తుల గోప్యతను ప్రభుత్వం చేతుల్లో పెడుతోంది.

రెండు, ఈ బిల్లు శిక్షపడిన వ్యక్తుల వ్యక్తిగత డేటాను 75 సంవత్స రాల పాటు అట్టిపెట్టుకునేందుకు అనుమతిస్తోంది. వాస్తవంగా చూస్తే ఆ వ్యక్తి చనిపోయేంతవరకు అతడి వివరాలు పోలీసుల వద్ద ఉంటా యన్నమాట. ఏదేమైనా ఒక నేరచర్యలో శిక్షకు గురైన వ్యక్తులందరి పట్ల వివక్షారహిత అన్వయం విషయంలో ఈ బిల్లు పరిధులు దాటు తోంది. పైగా వ్యక్తుల డేటాను శాశ్వతంగా సేకరించి ఉంచుకోవడం అనేది నేరాల నిరోధంలో లేదా నేర విచారణలో ఎలా సాయపడు తుందనే విషయంలో ఈ బిల్లు ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు.

మూడు, ఈ బిల్లు వ్యక్తిగత డేటాను ఎలాంటి లా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ ఏజెన్సీతోనైనా పంచుకునేందుకు, అందజేసేందుకు జాతీయ నేర రికార్డుల బ్యూరోకి అనుమతిస్తోంది. ‘ప్రయోజన పరిమితి’కి చెందిన సూత్రంతో సహా డేటా పరిరక్షణకు చెందిన ఉత్తమ విధానా లన్నింటికీ ఈ బిల్లు వ్యతిరేకంగా ఉంటోంది. ఉదాహరణకు, డేటా సేకరణ చట్టబద్ధంగా ఉన్నప్పటికీ, ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సేకరించిన డేటాను ఆ పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలి తప్ప మరే ఇతర ప్రయోజనం కోసం దాన్ని ఉపయోగించకూడదు. నేర దర్యాప్తు, నేర విచారణ అనేవి సాధారణంగా అనిశ్చితంగానే ఉంటాయి. అన్ని రకాల నేర విచారణకు వ్యక్తిగత డేటా అవసరం ఉండదు. కొన్ని కేసుల్లో మాత్రమే విభిన్న వ్యక్తిగత డేటాలను కలిపి చూడాల్సిన అవసరం ఉంటుంది.

పౌరులపై హద్దులు మీరిన నిఘా
కాబట్టి, మరోసారి ఈ బిల్లులోని ప్రధాన సమస్య ఏమిటంటే, ఎలాంటి ఆంతరం చూపని దాని స్వభావమే. ఒక నేరాన్ని దర్యాప్తు చేయడానికి వ్యక్తిగత డేటా సేకరణ అవసరమైన చోట నేర వర్గీకరణ లను జాగ్రత్తగా వేరుచేసి చూడవలసిన అవసరం తప్పనిసరి. అలా వేరుచేసి చూడకపోతే వ్యక్తిగత డేటా గోప్యతను వంచించినట్లే అవు తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నేరçస్థుల రూపాలను కొలిచే టెక్నిక్‌లు గత శతాబ్ద కాలంగా ఏర్పడుతూ వచ్చాయి కాబట్టి నేరస్థులకు సంబంధించిన ప్రకటన, హేతువులను సరిగ్గా నోట్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ బిల్లు విస్మరిస్తున్నది ఏమి టంటే, టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రభుత్వం తన పౌరులపై అత్యంత అధికంగా నిఘా పెట్టే అధికారాలను కలిగి ఉంది. కాబట్టే ఈ అధికారాలను చట్టపరంగా విస్తరించేటప్పుడు వాటిని అత్యంత కఠి నంగా క్రమబద్ధీకరించవలసి ఉంటుంది.

ఉదాహరణకు, ప్రభుత్వం ఫొటోగ్రాఫులతో, వేలిముద్రలతోనే చక్కగా నిఘా పెట్టగలుగుతున్నప్పుడు, వాటికి ఇప్పుడు రెటీనా స్కాన్లు, బయోలాజికల్‌ శాంపిల్స్‌ (డీఎన్‌ఏ కూడా దీంట్లో భాగమే), చివరకు ప్రవర్తనాపరమైన లక్షణాలను తీసుకోవడం కూడా చేస్తున్న ప్పుడు ప్రభుత్వానికి ఉండే అధికారం ఇంకా విస్తరిస్తుంది. పైగా అలాంటి డేటా పరిరక్షణ చర్యలు కూడా చాలా ఎక్కువగా అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో, మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. అదేమిటంటే, డేటా పరిరక్షణ గురించి భారత్‌ ప్రకటించి అయిదేళ్లు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ దేశం డేటా పరిరక్షణ చట్టాన్ని కలిగిలేదు. 

ఇది చట్టరూపం దాల్చి ఉంటే వ్యక్తిగత డేటా ఉపయోగంలోని పరిమితులను స్పష్టంగా నిర్దేశించి ఉండేది. అలాగే వ్యక్తిగత డేటాను దుర్వినియోగపర్చే విధానాలను నిరోధించడానికి తగిన పరిష్కార యంత్రాంగాలను కూడా  ఏర్పర్చి ఉండేది. డేటా పరిరక్షణ చట్టం లేక పోవడం అనేది క్రమబద్ధీకరణ లేని న్యాయ పరిధిని మాత్రమే అందు బాటులో ఉంచుతుంది. ఇలాంటి సందర్భంలో మాత్రమే, క్రిమినల్‌ ప్రొసీజర్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ వంటి చట్టాల ద్వారా ప్రభుత్వ నిఘా అధికారం ఎలాంటి తనిఖీలు లేకుండా విస్తరిస్తూనే ఉంటుంది.

ఇంత తొందర దేనికి?
చివరగా, పార్లమెంటులో బిల్లును త్వరత్వరగా తీసుకొచ్చిన పద్ధతి ఆందోళన కలిగిస్తోంది. ఇది మన ప్రజాస్వామ్యంలో చట్టాల రూప కల్పన విషయంలో పెరుగుతున్న సాధారణ అంశమనే చెప్పాలి. ఈ బిల్లును ముందస్తుగా ప్రజల్లో చర్చకు పెట్టలేదు. ప్రజలు తమ అభి ప్రాయం చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అందుకే ‘లక్ష్యాలు, కారణాల ప్రకటన’ విషయంలో బిల్లు సైలెంటుగా ఉండిపోయిందన్న వాస్తవంలోనే ఇది ప్రతిఫలించింది. వాస్తవానికి ప్రభుత్వ నిఘా అధి కార పరిధిని విస్తరించాల్సిన అవసరం గురించి ఇది పేర్కొనాల్సి ఉండింది.

ప్రజా చర్చలో భాగంగా ఈ అంశాన్ని లేవనెత్తేవారు. అందుకే ఈ బిల్లును అసలు ప్రజా సంప్రదింపుల్లో భాగం చేశారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ అన్ని కారణాల వల్ల, ఈ కొత్త బిల్లు గురించి తీవ్రమైన ఆందో ళన కలుగుతోంది. మరింత ప్రజాస్వామికమైన, సమ్మిశ్రితమైన ప్రక్రియ ఈ భయాలన్నింటికీ పరిష్కారంగా ఉంటుంది. కానీ ఈ ప్రక్రియకు ఎలాంటి ఆస్కారం లేకుండానే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడమే విచారకరం.

-గౌతమ్‌ భాటియా
వ్యాసకర్త ఢిల్లీకి చెందిన న్యాయవాది
(‘ద హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు