‘దళిత బంధు’వులు ఎవరు?

21 Oct, 2021 00:53 IST|Sakshi

కొత్త కోణం

‘‘ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైన పార్లమెంటు, అసెం బ్లీల ఎన్నికల ప్రక్రియను నిర్వ హించే ఎన్నికల సంఘం ప్రభుత్వ అధికార యంత్రాంగానికి లోబడ కుండా స్వేచ్ఛగా ఉండాలి. అప్పుడే ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరుగుతాయి’’ అని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ రాజ్యాంగ సభలో ఈ విషయంపై 1949 జూన్‌ 15న జరిగిన చర్చలో వ్యాఖ్యానించారు. ఆ చర్చలో పాల్గొన్న రాజ్యాంగ సభ సభ్యులు కూడా అదే విధమైన  అభిప్రా యాన్ని వ్యక్తం చేశారు. అందువల్లనే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్‌ – 324లో ఎన్నికల సంఘపు విధులు, అధికారాలను వివరించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ మీద రాజకీయ, అధికార జోక్యం ఉండకూడ దని, ఆయనను తొలగించే ప్రక్రియను కఠినతరం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉన్న విధంగానే నిబం ధనలను కల్పించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొల గించాలంటే పార్లమెంటు నిర్ణయం తీసు కోవాలి. ఆ అధి కారాన్ని రాష్ట్రపతికి గానీ, కేంద్ర మంత్రి వర్గానికిగానీ కల్పించలేదు. ఎంతో దూరదృష్టితో రాజ్యాంగ రచనా సంఘం, అంతిమంగా రాజ్యాంగ సభ మహత్తరమైన నిబంధనలు కల్పించాయి.

అయితే, గత డెబ్భై ఏళ్ళలో కొద్దిమంది ప్రధాన ఎన్నికల కమిషనర్లు మాత్రమే కొంత మేరకైనా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేశారు. చాలా మంది అధికారంలో ఉన్న పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేశారు. గత మూడు రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఒక నిర్ణయం యావత్‌ దళిత జాతిని విస్మయానికి గురి చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్‌లో నిలిపివేయాలని ఆదేశించింది. భార తీయ జనతాపార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. వాస్తవాలను పరిశీలించకుండా ఎన్నికల సంఘం తీసు కున్న ఈ నిర్ణయం రాజకీయ జోక్యం ప్రకారమే జరిగిందనే వాదనకు బలం చేకూరుతున్నది. ఎందుకంటే, ఈ పథకం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ప్రకటించింది కాదు.

తెలంగాణ దళిత బంధు పథకానికి అన్ని రకాల అనుకూలాంశాలే ఉన్నాయి. మొదటగా దీనికి బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయి. మార్చి18, 2021న ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన 2021–22 బడ్జెట్‌లో దీని ప్రస్తావన ఉంది. ఆ బడ్జెట్‌ను రాష్ట్ర శాసనసభ ఆమో దించింది. దాని తర్వాత ఒక నిర్దిష్టమైన రూపం ఇవ్వ డానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. పది గంటల పాటు సాగిన ఈ సమావేశంలో దళితుల ఆర్థికాభివృద్ధికి చిన్న చిన్న సాయం సరిపోవడం లేదనీ, వారు అనుభవిస్తున్న పేదరికం నుంచి బయటపడటానికి తగిన విధంగా ఆర్థిక సాయం చేయాలనీ నిర్ణయం జరిగింది.

ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. అన్ని రకాల అధికార లాంఛ నాలను పూర్తిచేసుకొని ఆగస్టు 5న యాదాద్రి–భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ గ్రామంలో 76 దళిత కుటుంబాలకు పథకాన్ని వర్తింప జేశారు. వెనువెంటనే వారి వారి ఖాతాల్లోకి పది లక్షలు జమ చేశారు. కొందరు ఇప్పటికే తమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తర్వాతనే ఆగస్టు 16వ తేదీన హుజూరాబాద్‌ నియోజకవర్గానికి దీనిని విస్తరింప జేశారు. ఆ రోజున 15 మందికి లాంఛనంగా చెక్కులు అంద జేశారు. ఇప్పటికి దాదాపు 17,500 మందికి తమ బ్యాంకు ఖాతాల్లో పది లక్షలు జమయ్యాయి. ఇందులో కొంత మంది వ్యాపార, ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువ డింది సెప్టెంబర్‌ 29న మాత్రమే. అంటే ఎన్నికల నోటిఫి కేషన్‌ రావడానికి 50 రోజుల ముందు ఈ పథకం అమలు లోకి వచ్చింది. అంతేకాకుండా, రాష్ట్రంలో మరో నాలుగు నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు కోసం మూడు రోజుల క్రితం 18వ తేదీన 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం అమలుకు, హుజూరాబాద్‌ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని దీనిని బట్టి అర్థమవుతున్నది. మరో విషయాన్ని మరచి పోకూడదు. హుజూరాబాద్‌ ఎన్నికలు హోరాహోరీగా జరు గుతున్నాయి.

పోటీచేసిన రాజకీయ పార్టీలు తాము మాత్రమే గెలవాలని ప్రయత్నిస్తాయి. ఏ రాజకీయ పార్టీ అయినా తమ వి«ధానాల ద్వారా, తాము చేసిన మంచి పనుల ద్వారా, చేయబోయే పనుల ద్వారా ఓట్లను పొంద వచ్చును. కానీ హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అనుసరించిన విధానంలో పూర్తి చెడు ఉద్దేశ్య కనిపి స్తున్నది. బీజేపీకి దళితుల పట్ల ఉన్న నిర్లక్ష్య భావన, చిన్న చూపు దీన్ని బట్టి మరోమారు రుజువవుతోంది. 2018 ఎన్నికల ప్రణాళికలో కేంద్రంలో బీజేపీ... ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన కూడా చేయకపోవడం యాదృచ్ఛికం కానేకాదు. దానికనుగుణంగానే ఇప్పటి వరకు వాళ్ళ కోసం ఎటు వంటి నూతన పథకాలను ప్రవేశపెట్టలేదు. 

ఒక్క ఉదాహరణ చెప్తాను. కోవిడ్‌ సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులతో పాటు, పారిశుద్ధ్య కార్మి కులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. లక్షల కోట్లు కోవిడ్‌ ఉద్దీపన నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, అత్యల్ప జీతాలు తీసుకునే పారిశుద్ధ్య కార్మికులకు కనీసం ఇన్సెంటివ్‌గానైనా ఒక్క పైసా ఇచ్చింది లేదు. అంతే కాకుండా గత అయిదేళ్ళుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ ఇవ్వలేదు. దక్షి ణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సబ్‌ప్లాన్‌ నిధులు ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంతంగానే పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ ఇచ్చాయి. 

హుజూరాబాద్‌ విషయంలో భారతీయ జనతా పార్టీ అనుసరించిన దళిత బంధు వ్యతిరేక వైఖరి వివక్షా పూరి తమైనది. బీజేపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకు నా మనవి. మీరు ఒకసారి వెనక్కు తిరిగిచూసుకోండి. ఈ ఏడేళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఏ పథకాలు అమలు చేశారో ఆలోచించండి. ఎన్ని నిధులు ఈ అణగారిన వర్గా లకు కేటాయించారో, వాటి ఫలితాలేమిటో సమీక్షించు కోవాల్సిన సందర్భమిది.

-మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077

మరిన్ని వార్తలు