బహుజనుల దార్శనికుడు బాపూజీ

27 Sep, 2020 01:37 IST|Sakshi

సందర్భం 

కొండా లక్ష్మణ్‌ బాపూజీ అణగారిన వర్గాలకు భీష్మ పితామహుడు. బలహీన వర్గాలకు ఆయన ఇల్లే ఆశ్రయం.. ఖచ్చితత్వం, నిర్మొహమాటం ఆయన తత్వం. నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించి హైదరాబాద్‌ సంస్థానపు పోరాట ఉధృత స్వభావాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన ఉద్యమ కెరటం కొండా లక్ష్మణ్‌ బాపూజీ.. 1915 సెప్టెంబర్‌ 27వ తేదీన నేటి ఆసిఫాబాద్‌ కొమురంభీం జిల్లాలోని వాంకిడి  గ్రామంలో జన్మిం చారు. తల్లి అమ్మక్క, తండ్రి పోశెట్టి బాపూజీ. తన మూడవ ఏటనే 1918లో తల్లిని కోల్పోయి బాల్యం లోనే తీవ్ర కష్టాలను ఎదురీదాడు. 1931లో మహారాష్ట్రలోని నాగపూర్‌కి దగ్గరలోని చాందా ప్రాంతంలో అప్పటికే నిజాం ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి రహస్యంగా గాంధీజీ సమావేశానికి హాజ రయ్యారు. తద్వారా భారత స్వతంత్ర పోరాటంపట్ల ఆకర్షితులయ్యారు. భారత జాతీయోద్యమంలో భాగంగా ప్రప్రథమంగా 1938లో అరెస్టయ్యారు. అటుపిమ్మట 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1947 డిసెంబర్‌ 4న నిజాంపై జరిగిన బాంబు దాడిలో ప్రధాన సూత్రధారిగా నాయకత్వం వహిం చారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. చాకలి ఐలమ్మ భర్త నరసింహ, ఆరుట్ల కమలాదేవి, నల్లా నరసింహులు లాంటి వారి కేసును వాదించి వారిని నిజాం చెర నుండి విడిపించాడు. 
చిట్యాల (చాకలి)ఐలమ్మ తాను పండించిన పంటకు శిస్తు ఎందుకు చెల్లించాలని కడవెండి (ఇప్పటి జనగామ జిల్లా ప్రాంతం) జమీందార్‌ విసునూరు రామచంద్రారెడ్డితో విభేదించి ఆంద్ర మహాసభ, కమ్యూనిస్ట్‌ నాయకులతో కలసి ఎదురుతిరగగా సూటిగా ఏమీ చేయలేక దొర తన మూకలతో కలిసి ఐలమ్మ భర్త నరసింహపై మోసపూరిత కుట్ర అనే అభియోగాన్ని నెరపి జైలుపాలు చేశాడు. దీనితో సైకిల్‌పై ప్రయాణిస్తూ బాపూజీ భువనగిరి కోర్టులో ఉచితంగా వాదించి ఐలమ్మ భర్తను విడిపించాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి, షేక్‌ బందగి లాంటి తెలంగాణ సాయుధ పోరాటవీరులను కాపాడి కమ్యూనిస్టుల మన్ననలు పొందారు. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సాగిన రహస్య కార్యకలాపాలు మొదలుకొని ఆంధ్రమహాసభ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలు, 1969లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమం వెనుకబడిన తరగతుల చేనేత సహకారోద్యమం, మలిదశ తెలం గాణ ఉద్యమం ఇలా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి బాపూజీ చరిత్ర పుటలకెక్కారు.
కొండా లక్ష్మణ్‌ బాపూజీ వివాహం జూన్‌ 27, 1948లో డాక్టర్‌ శకుంతలాదేవితో జరిగింది. వారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. సురేష్, ఉమేష్, పవిత్ర వాణి. 1962 చైనా యుద్ధ సమయంలో ప్రధాని నెహ్రూ దేశ ప్రజల సహకారం కోరగా డాక్టర్‌ శకుంతలాదేవి తన బంగారు గాజు లను జాతీయ రక్షణ నిధికి ఇవ్వడంతో పాటు చైనా సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యానికి వైద్య సేవలందించారు. హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమయిన తరువాత  తెలం గాణ ప్రాంతంలో1952 లో జరిగిన మొదటి శాసనసభ ఎన్నికలలో బాపూజీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1956లో బాషా ప్రాతిపదికన ఏర్పాటు అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికలలో గెలుపొంది 1957లో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1960లో మూడవ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి డిప్యూటీ స్పీకర్‌గా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 
గాంధీజీ మొదలుపెట్టిన హరిజనోద్ధరణ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాలు పంచుకొన్న కొండా బాపూజీ నాటి ఆంధ్ర మహాసభ నాయకులు రావి నారాయణరెడ్డి అధ్యక్షులుగా ఉన్న హరి జన సేవాసంఘం హైదరాబాద్‌ కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. కేవలం పద్మశాలీలకే కాకుండా గౌడ, కురుమ, క్షత్రియ, గంగపుత్ర, విశ్వకర్మ హాస్టళ్ల స్థాపనకు అండగా నిలిచారు. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాపూజీ లఘు, మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పరిశ్రమలు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో ఏర్పాటుచేయాలనీ పట్టుపట్టి సాధించారు. హైదరాబాద్‌ లోని బాలానగర్‌లో పారిశ్రామిక వాడల అభివృద్ధికి 750 ఎకరాల భూమిని సేకరించారు. దీంతో హైదరాబాదులో బాలానగర్, జీడిమెట్ల, మియాపూర్‌ లాంటి పారిశ్రామిక ప్రాంతాలు ఆవిర్భవించాయి. నేడు దేశంలోనే అత్యున్నత పారిశ్రామిక ప్రాంతాలుగా విలసిల్లుతున్న హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్లు బాపూజీ దూరదృష్టికి, దార్శనికతకు నిలువెత్తు నిదర్శనాలు.. నాటి కాంగ్రెస్‌ జాతీయ నాయకులను కూడా ఒప్పించి అనేక కేంద్ర పరిశ్రమలు తెలంగాణలో నెలకొనడానికి కూడా అనితర కృషి సల్పారు.
(నేడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ 105వ జయంతి) 
వ్యాసకర్త: దాసు సురేష్‌. తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం
మొబైల్‌ : 91773 58286

మరిన్ని వార్తలు