ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి

24 Nov, 2022 12:56 IST|Sakshi

చండ్రుగొండ ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్‌ ఆదివాసీల చేతిలో మరణించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మరణం బాధాకరమే. నిజానికి ప్రభుత్వం పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించడంలో చూపిస్తున్న సాచివేత ధోరణే ప్రజలకూ – ప్రభుత్వ అధికారులకు మధ్య యుద్ధం జరగడానికి కారణం అని చెప్పక తప్పదు. అసలు ఈ సంఘటనకు కారణమేమిటో తేల్చడానికి జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని ఆదివాసీలు కోరుతున్నారు.


ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు అక్రమంగా తప్పుడు పద్ధతులలో భూ పట్టాలను మంజూరు చేస్తున్నారు అధికారులు. అలాగే గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తుంటే అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఇదంతా తెలిసినా ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన షెడ్యూల్డ్‌ ప్రాంతంలో కనిపించకుండానే శాంతియుతమైన వాతావరణం క్రమక్రమంగా కరిగి పోతోంది. అందుకు ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్‌పై దాడి ఒక మంచి ఉదాహరణ.


అటవీ అధికారులు రాష్ట్రంలో ఆదివాసీ మహిళల మీద, చిన్నారుల మీద దాడులు చేసినప్పడు; పంటలకూ, ఆహార ధాన్యాలకూ, ఇళ్ళకూ నిప్పుపెట్టినప్పుడూ, మనుషుల మీద మూత్రం పోసినప్పుడూ, ఇటువంటి మరికొన్ని అమానవీయ ఘటనలకు పాల్పడినప్పుడూ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించవు. 

పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీ సంఘాలు ఆందోళనలు నిర్వ హించినప్పుడు... పోడు సాగుదారులకు పట్టాలిస్తామనీ, పోడు సమస్యను పరిష్కరిస్తామనీ ఒకపక్క చెబుతూనే... మరోపక్క సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్‌ అధికారులను ఉసిగొలుపుతోంది ప్రభుత్వం. ఆ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈరోజు అటవీ అధికారి శ్రీనివాస్‌ హత్య జరిగింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. 

50 లక్షల ఎక్స్‌గ్రేషియా, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు ముఖ్యమ్రంతి. చనిపోయిన శ్రీనివాసరావును ముఖ్యమంత్రి తిరిగి తీసుకొస్తాడా? ఆయన పోడు భూముల సాగుపై స్పష్టమైన వైఖరినీ, చిత్తశుద్ధినీ వెల్లడించకుండా ప్రతిసారీ ఎన్నికలసమయంలో సబ్‌ కమిటీల (అటవీ హక్కుల కమిటీలు) నియామకం పేరుతో కాలం వెళ్ళదీస్తూ అసలు విషయాన్ని దాటవేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు.

ఏదేమైనా... ఆదివాసీ ప్రజలూ సహనం, ఓపికతో చట్టానికి లోబడే పోరాటం కొనసాగించాలే తప్ప... ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం తగదు. సంయమనం పాటించాలి. (క్లిక్ చేయండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!)

– వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు