వ్యవసాయాన్ని వెనక్కినెట్టిన బడ్జెట్

4 Feb, 2021 00:49 IST|Sakshi

విశ్లేషణ

నూతన చట్టాల రద్దును డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ ఏడు బడ్జెట్‌ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్‌ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకంపై ఈ బడ్జెట్‌లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత ఏడాదితో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని డిమాండ్‌ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్‌ అధికార్‌ మంచ్‌ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు.

ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు కనీస మద్దతు ధర ద్వారా కనీస రాబడి కోసం ప్రశ్నిస్తున్న తరుణంలో వారి మనోభావాలను గౌరవిస్తూ వ్యవసాయ రాబడులను పెంచడానికి కొన్ని ఏర్పాట్లను 2021–22 బడ్జెట్లో చేరుస్తారని అందరూ భావించారు. పైగా గ్రామీణ కొనుగోలు డిమాండ్‌ను పెంపొందించడానికి తగుచర్యలు తీసుకోవాలని పలువురు ఆర్థికవేత్తలు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ప్రత్యక్ష నగదు మద్దతు ద్వారా, ఆందోళన చేస్తున్న రైతులు చేతిలో మరింత నగదును అందించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కాస్త ఉదారంగా వ్యవహరిస్తారని భావించారు. 

దీనికి బదులుగా ఈ సంవత్సరం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద కేటాయింపులను రూ. 75 వేల కోట్లనుంచి 65 వేల కోట్లకు తగ్గించేశారు. ఈ పథకం కింద భూ యజమానులకు సంవత్సరానికి మూడు వాయిదాల్లో రూ.6 వేల నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. ఈ పథకంలో ఈ సారి భూమిలేని కౌలు రైతులను కూడా చేరుస్తారని నేను ఆశించాను. గత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో వ్యవసాయం మాత్రమే దేశానికి వెలుగు చూపినందున ఒక్కొక్క రైతుకు నగదు బదిలీ కింద చెల్లించే మొత్తాన్ని ఈ యేడు రూ.18 వేలకు పెంచుతారని అందరూ భావించారు. దీనికోసం అదనంగా రూ. 1.5 లక్షల కోట్లను బడ్జెట్‌లో కేటాయించవలసి ఉంటుంది. అయితే వ్యవసాయ రంగానికి ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్‌ దాదాపు గత యేడు బడ్జెట్‌కు సరిసమానంగానే ఉండటం గమనార్హం. గత సంవత్సరం వ్యవసాయరంగానికి సవరించిన అంచనా ప్రకారం రూ. 1.45 లక్షల కోట్లను కేటాయించగా ఈ ఏడు రూ. 1.48 లక్షల కోట్లను కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పరపతి పరిమితిని రూ. 15 లక్షల కోట్లనుంచి రూ. 16.5 లక్షల కోట్లకు పెంచి నప్పటికీ రైతులను రుణ ఊబి నుంచి బయటపడేసేందుకు మరికొన్ని చర్యలు చేపట్టాలని దేశంలో కొనసాగుతున్న వ్యవసాయ దుస్థితి సూచించింది. దీనికి గాను వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులను పెంచాల్సి ఉంది. 

ఆర్బీఐ లెక్కల ప్రకారం 2011–12 నుంచి 2017–18 మధ్య కాలంలో వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులు మొత్తం బడ్జెట్‌లో కేవలం 0.4 శాతం మాత్రమే కావడం గమనార్హం. కాబట్టి పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ విధింపు ద్వారా వ్యవసాయ మదుపు నిధిని సృష్టించాలనే ఆర్థిక మంత్రి ప్రతిపాదనను స్వాగతించాల్సిందే కానీ రైలు, రోడ్డు, మూలధన మదుపు వంటివాటిపై చేసే ప్రకటనలకు మల్లే వ్యవసాయ మదుపుపై కూడా నిర్దిష్టమైన ఏర్పాట్లు చేయడం ఉత్తమమార్గంగా ఉంటుంది. వ్యవసాయరంగానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమైన విషయం ఏమిటంటే తగిన మార్కెటింగ్‌ మౌలిక వసతులను ఏర్పర్చడమే. భారత్‌లో వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీలు (ఏపీఎంసీ) క్రమబద్ధీకరించే 7 వేల మండీలు ఉంటున్నాయి. దేశంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మండీ చొప్పున ఏర్పర్చాలంటే ఇప్పటికిప్పుడు 42 వేల మండీలు అవసరం అవుతాయి.

అయితే 22 వేల గ్రామ సంతలను మెరుగుపర్చి వాటిని ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ–నామ్‌)తో అనుసంధానం చేయాలనే ప్రభుత్వ వాగ్దానానికి ఇప్పటివరకు ప్రోత్సాహం లభించలేదని తెలుసుకున్నప్పుడు, గ్రామీణ మార్కెటింగ్‌ మౌలిక వసతులను ఏర్పాటు ఇక ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడని అంశంగా మనముందుకొస్తోంది.
సాగుచట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు నిరసన ప్రదర్శనలను నెలల తరబడి కొనసాగిస్తున్న సమయంలో 2021–22 బడ్జెట్‌ రంగంలోకి వచ్చింది కాబట్టి ఇటీవలి సంవత్సరాల్లో గోధుమ, వరి, కాయధాన్యాలు, పత్తి వంటి పంటలకు కనీస మద్దతు ధర ఎలా అందించాము అనే విషయాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రస్తావిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కూడా వెల్లడించారు. అయితే సంపూర్ణంగా సాగు చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్న రైతులు ప్రభుత్వం చెబుతున్న కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసి తమ హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం 23 పంట లకు గాను ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరకంటే తక్కువ ధరను పెట్టి వ్యాపారం చేయడానికి వీలు ఉండదని దీనర్థం. 

వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులపై కనీసం 50 శాతం లాభాన్ని కనీస మద్దతు ధర అందిస్తోందని ప్రభుత్వం చెబుతున్న వివరాలను ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న రైతులు సవాలు చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ ప్రతిపాదనల ప్రకారం రైతులు పెట్టే విస్తృత ఖర్చులపై 50 శాతం లాభాన్ని కనీసమద్దతు ధర ఇవ్వాల్సి ఉంటుంది. స్వామినాథన్‌ కమిషన్‌ ప్రతిపాదించినట్లుగా రైతులకు కనీస మద్దతు ధర అంది ఉంటే 2020–21 బడ్జెట్‌లో అదనంగా రూ. 14,296 కోట్ల మేరకు పంజాబ్‌ రైతులు లబ్ధి పొందేవారు. మొత్తంమీద చూస్తే రైతుల చేతికి మరింత నగదు అందేలా చేస్తేనే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్‌ అనేది సాధ్యపడుతుంది. ఇది దానికదేగా మరింత గ్రామీణ డిమాండును సృష్టిస్తుంది. ప్రాణాంతక కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్న సమయంలో, గ్రామీణ డిమాండును సృష్టించి ఉంటే అది మొత్తం ఆర్థిక వ్యవస్థకు వరంలాగా పనిచేయడమే కాకుండా, ఆర్థికాభివృద్ధిని రాకెట్‌లాగా ముందుకు తీసుకెళ్లేది. ఉజ్వలంగా ప్రకాశించే వ్యవసాయ రంగం భారీ స్థాయిలో వ్యవసాయ అవకాశాలను సృష్టించడమే కాకుండా అనేక మంది జీవితాలను నిలబెట్టి ఉండేది. కాబట్టి ఒక్క వ్యవసాయ రంగమే ఆర్థిక వృద్ధికి సజీవ కేంద్రంగా మారగలిగి ఉండేది.

నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్‌ చేస్తూ రెండున్నర నెలలకుపైగా ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ యేడు బడ్జెట్‌ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్‌ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకంపై ఈ బడ్జెట్‌లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత సంవత్సరంతో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు.

మరోవైపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన బడ్జెట్‌ ప్రసంగంలో రైతులకు కనీస మద్దతు ధరను చెల్లించడంలో తమ ప్రభుత్వం ఘనమైన రికార్డును కలిగి ఉందని నొక్కి చెప్పారు. అలాగే లక్ష కోట్ల మేరకు వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ప్రభుత్వ నిర్వహణలోని వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీలకు అందిస్తామని మంత్రి తెలిపారు. అయితే ప్రభుత్వ నూతన సాగు చట్టాలు ఇంతవరకు కొనసాగుతున్న మండీల వ్యవస్థను, కనీస మద్దతు రేట్లను కుప్పగూల్చి సన్నకారు రైతులను కార్పొరేట్‌ సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తాయని రైతులు భయాందోళనలకు గురైనందువల్లనే సాగు చట్టాల రద్దుకోసం పోరాడుతున్నారనే విషయం మర్చిపోరాదు.

అయితే ఇటీవలి సంవత్సరాల్లో బడ్జెట్‌ ప్రసంగాల మాదిరి కాకుండా తాజా బడ్జెట్‌ ప్రసంగంలో వ్యవసాయానికి సంబంధించిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడం గమనార్హం. సోమవారం బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించిన గంట తర్వాతే వ్యవసాయరంగానికి కేటాయింపుల గురించి ఆర్థిక మంత్రి తడిమారు. పైగా వ్యవసాయ రంగ విశ్లేషకులను తాజా బడ్జెట్‌ పెద్దగా ప్రభావితం చేయలేదు. పీఎమ్‌ ఆషా, ధరల మద్దతు పథకం వంటి పథకాలకు ఈ ఏడు బడ్జెట్‌లో 20 నుంచి 25 శాతం దాకా కోత విధించారు. రైతులకు ఏటా తలసరి 6 వేల రూపాయలను అందిస్తున్న పీఎమ్‌ కిసాన్‌ పథకాన్ని ఈసారి 9 కోట్లమంది రైతులకే పరిమితం చేస్తూ సవరించారు.  

ప్రభుత్వం వాస్తవానికి 14.5 కోట్ల రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించుకుంది ఇది కూడా కోత పడటం రైతులు జీర్ణింప చేసుకోలేకున్నారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని మేం డిమాండ్‌ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్‌ అధికార్‌ మంచ్‌ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు. మౌలిక వసతుల నిధి పేరుతో ప్రకటించిన భారీ మొత్తాలు వాస్తవానికి బడ్జెట్‌ కేటాయింపుల్లో భాగం కాదని వీటిని రుణాల రూపంలో తీసుకోవలసిన ఫైనాన్స్‌ ప్రాజెక్టులని రైతులకు వీటితో ఒరిగేదేమీ లేదని రైతునేతలు చెబుతున్నారు. ఈ కోణంలో చూస్తే ఈ ఏటి బడ్జెట్‌ కూడా రైతాంగాన్ని సంతృప్తిపర్చే బడ్జెట్‌గా కనిపించడం లేదనే చెప్పాలి.

దేవీందర్‌ శర్మ 
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

మరిన్ని వార్తలు