మార్కెట్‌ మాయలో రైతే పరాజితుడు

16 Oct, 2020 00:46 IST|Sakshi

విశ్లేషణ

ప్రపంచంలో వ్యవసాయాన్ని మార్కెట్ల పాలు చేసిన ప్రతి చోటా ఆహారధాన్యాలపై నియంత్రణ నుంచి మెజారిటీ రైతాంగాన్ని బడా పెట్టుబడి విజయవంతంగా పక్కకు నెట్టేసింది. అమెరికా, యూరప్‌ అనుభవాలు చూపుతున్నట్లుగా, అనియంత్రిత మార్కెట్లకు మనదేశంలోనూ ప్రాధాన్యత లభిస్తున్న తరుణంలో వ్యవసాయం నుంచి మొట్టమొదటగా సన్నకారు రైతులనే పక్కకు తోసేస్తారు. దేశంలోని 86 శాతం మంది రైతుల చేతుల్లో అయిదు ఎకరాల కంటే తక్కువ కమతాలు ఉంటున్నందున, ఇంకా పెద్దగా ఎదగండి లేదా బయటకు వెళ్లండి అనే సందేశం అమలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఎదగండి లేకపోతే పక్కకు తప్పకోండి అనే మార్కెట్‌ సూత్రం చిన్న రైతులను కనుమరుగు చేయనుందని అనిపిస్తోంది. అందుకే మార్కెట్లో తొలి పరాజితుడు రైతే అని చెప్పాలి.

రొనాల్డ్‌ రీగన్‌ హయాంలో అమెరికా వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎర్ల్‌ బట్జ్‌ ఒక సందర్భంలో ‘పెద్దగా ఎదగండి లేదా నిష్క్రమించండి’ అనే పిలుపునిచ్చారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవసాయ కార్యదర్శి కూడా ఇటీవల ఇలాంటి అభిప్రాయమే వ్యక్తపరుస్తూ, ‘అమెరికాలో సంపన్నులు మరింత సంపన్నులవుతారు, సామాన్యులు పక్కకు తప్పుకుంటారు. అమెరికాలో ఏ చిన్న పరిశ్రమకైనా గ్యారంటీ కల్పించిన ఆదాయం కానీ లాభం కానీ  ఉంటుందని నేను అనుకోవడం లేదు’ అని చెప్పారు. ప్రపంచంలో వ్యవసాయాన్ని మార్కెట్ల పాలు చేసిన ప్రతి చోటా ఆహారధాన్యాలపై నియంత్రణ విషయంలో రైతాంగ జనాభాలోని మెజారిటీని బడా పెట్టుబడి విజయవంతంగా పక్కకు నెట్టేసింది. తమదైన తర్కం, విలువలతో మార్కెట్లు అలాగే స్పందిస్తుంటాయి. ఈ క్రమంలోనే బడా వ్యవసాయ క్షేత్రాలు మరిం తగా విస్తరిస్తుండగా, చిన్న వ్యవసాయ క్షేత్రాలు మనుగడ కోసం కొట్టుమిట్టాడుతున్నాయి. అమెరికాలో వ్యవసాయరంగంలో దశాబ్దాల పాటు మార్కెట్‌ సంస్కరణలు అమలుచేసిన తర్వాత, జనాభాలోని 1.5 శాతం మాత్రమే వ్యవసాయంలో మనగలుగుతున్నాయి.

వచ్చే పదేళ్లకుగాను వ్యవసాయానికీ, పోషకాహారానికీ, జలపరిరక్షణ పథకాలకు  867 బిలియన్‌ డాలర్ల మద్దతును వ్యవసాయ బిల్లు 2018 ప్రతిపాదించింది. అయితే పెరుగుతున్న ఆత్మహత్యల రేటు, గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తున్న కుంగుబాటు ధోరణులు, పాలు, వ్యవసాయ సరుకుల ధరల పతనం, వ్యవసాయరంగంలో పెరుగుతున్న దివాలా (425 బిలియన్‌ డాలర్లు అని అంచనా) వంటివి ఈ పరివర్తనా దిశలో కుటుంబ క్షేత్రాల మనుగడను కష్టసాధ్యం చేస్తున్నాయి. అమెరికా నగరాలతో పోల్చి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యల రేటు 45 శాతం అధికంగా ఉంటున్నాయి. తక్కువ ధరలు, పెరుగుతున్న ఆత్మహత్యల రేటు వంటి వాటి కారణంగా గ్రామీణ జనాభాలో అధికభాగం తీవ్ర ఒత్తిడికి, కుంగుబాటుకు గురవుతున్నారు. అమెరికాలో జరిగింది అసాధారణమైనది కాదు. నిజానికి ఇది ఒక అంతర్జాతీయ వ్యవసాయ చట్రంగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా ఆహారధాన్యాల సరఫరా సంస్థలపై వ్యవసాయ వాణిజ్య సంస్థలు పైచేయి సాధిస్తున్నాయి కానీ నిజానికి వాటి బలం అవి అందుకుంటున్న భారీ సబ్సిడీలపై అధారపడుతున్నాయి.

యూరప్‌లో, వార్షిక సబ్సిడీ మద్దతు 100 బిలియన డాలర్ల వరకు ఉంటున్నప్పటికీ వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. పైగా ఈ మొత్తంలో 50 శాతం మేరకు ప్రత్యక్ష నగదు మద్దతు కింద ఇస్తున్నారు. తగ్గుతున్న ధరలు, పెరుగుతున్న అప్పులు క్రమేణా చిన్న రైతులను వ్యాపారం నుంచి తొలగిస్తూ వస్తున్నాయి. ఒక్క బ్రిటన్‌లోనే గత నాలుగేళ్లలో మూడు వేల డెయిరీ ఫాంలు మూసివేతకు గురయ్యాయి. ఫ్రాన్స్‌లో సంవత్సరానికి సగటున 500 మంది రైతులు అత్మహత్యలు చేసుకుంటున్నారని ఒక నివేదిక తెల్పింది. ఈ గణాంకాలను భారతదేశంతో పోల్చి చూడండి. జాతీయ నేర నమోదు బ్యూరో గణాంకాల (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) ప్రకారమే గత 25 ఏళ్లలో దేశంలో 3.64 లక్షలమంది రైతులు అధికారికంగానే ప్రాణాలు కోల్పోయారు. ఇక శాంత కుమార్‌ కమిటీ నివేదిక ప్రకారం ఈ అన్ని సంవత్సరాల్లో 94 శాతం మంది రైతులు మార్కెట్లపైనే ఆధారపడి ఉంటున్నప్పటికీ భారతీయ వ్యవసాయం ఇప్పటికీ భయంకరమైన వ్యవసాయ దుస్థితి కోరల్లోనే చిక్కుకుపోయిందని తెలుస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఖరీఫ్‌ మార్కెట్‌ సీజన్లో 54 నుంచి 84 శాతం మంది రైతులు తమ పంటలను మండీలకు అవతల ఉన్న ప్రైవేట్‌ వ్యాపారులకే అమ్మారని 2014–15 నాటి ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్చ కలిగి ఉన్నారన్నమాట. వారు మండీల కోరల్లో చిక్కుకోలేదన్నమాట. మరి మార్కెట్లు అంత సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లయితే రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఎందుకు వలస పోతున్నారన్న ప్రశ్న తప్పకుండా వేయాల్సి ఉంది. మార్కెట్లు అంత ప్రోత్సాహకరంగా ఉంటే, వ్యవసాయం దేశ ఆర్థిక చోదక శక్తిగా ఎందుకు ఉండటంలేదో ఏ తర్కానికీ అందదు. మార్కెట్లు ఇప్పుడు గుండెకు ఆపరేషన్‌ చేసుకుని కొత్త రూపం ఎత్తిన చందాన రైతులకు అధిక ధరలను వాగ్దానం చేస్తున్నాయంటే నాకయితే నమ్మశక్యం కావడం లేదు.
కానీ మార్కెట్లు ఎక్కడైనా ఇలాగే పనిచేస్తాయి. పరిశ్రమలకు చౌక శ్రమను అందించడానికి మార్కెట్లు నిత్యం రైతులను వ్యవసాయ రంగం నుంచి బయటకు నెట్టేస్తుంటాయి. ఈ క్రమంలో పెద్ద రైతులు మరింతగా బలుస్తుంటారు, సన్నకారు రైతులు వ్యవసాయానికి దూరమవుతుంటారు. వాషింగ్టన్‌ ఆధారిత అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ కనుగొన్న దాని ప్రకారం భారతదేశలోనూ పైకి ఎగబాకు లేదా వెళ్లిపో అనే సూత్రమే పనిచేస్తోందని తెలిసింది. అనేక దశాబ్దాలుగా భారత్‌లోని ప్రధానస్రవంతి ఆర్థికవేత్తలు ఇదే ప్రాతిపదికపై వాదనలు చేస్తూ వస్తున్నారని మర్చిపోకూడదు.

మార్కెట్‌ అనుకూల వ్యవసాయం వైపుగా తరలిపోవలసిన అవసరం గురించి అనేక కమిటీలూ, నివేదికలు చెబుతూ వస్తున్నాయి. వ్యవసాయానికి వాస్తవ ధర రాకపోవడానికి కారణం కనీస మద్దతు ధరేనంటూ ఆందరూ ఆడిపోసుకోవడం అలవాటుగా మారిపోయింది. పంజాబ్, హర్యానాలలో మండీలను క్రమబద్ధీకరిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీల యంత్రాంగాన్ని రద్దు చేయాలన్నదే వీరందరి ఏకాభిప్రాయం. ఈ వాదనను బలపర్చడానికి, వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ (సీఏసీపీ) సైతం మార్కెట్‌–అనుకూల విధానాలను కలిగిన రాష్ట్రాలకు ర్యాంకులిస్తూ ముందుకొచ్చింది. ఈ జాబితాలో బిహార్‌ మొదటి ర్యాంకులో ఉండగా పంజాబ్‌ చిట్టచివరి స్థానంలో నిల బడటం గమనార్హం. పంజాబ్‌ ఎందుకు అట్టడుగు స్థానంలో ఉందంటే ఆ రాష్ట్రంలో పండిస్తున్న గోధుమలు, వరిలో 87 శాతం వరకు భారత ఆహార సంస్థ లేక ప్రభుత్వ రంగ సంస్థలు కనీస మద్దతు ధర ప్రకటించి మరీ సేకరిస్తుండటమే. అదే బిహార్‌లో అయితే మొత్తం పంటలో ఒక్కటంటే ఒక్క శాతం గోధుమ పంటను మాత్రమే భారత ఆహార సంస్థ సేకరిస్తోంది. ఇదే మార్కెట్‌ అనుకూల వ్యవసాయం అయితే, దీంట్లో ఏం మంచి ఉందో ఆర్థిక వేత్తలే వివరించి చెప్పాలి. భారతదేశ ధాన్యాగారంగా పేరొందిన పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని రైతులు ప్రతి ఏటా మద్దతుధర పేరిట రూ. 80 వేల కోట్లను అందుకుంటున్నారు.

నాకు గుర్తున్నంతవరకు, కొన్ని సందర్భాల్లో మినహాయిస్తే బహిరంగ మార్కెట్లలో కనీస మద్దతు ధరకు మించి రైతులు అధిక ధరను పొందిన పాపాన పోలేదు. సేకరించిన ధాన్యంలో గోధుమ, వరికి ప్రకటించే కనీస మద్ధతు ధరకంటే మార్కెట్‌ ధరలు ఎప్పుడూ తక్కువగానే ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం మద్దతుధరను ప్రకటించే 23 రకాల పంటలకు సంబంధించి బహిరంగ మార్కెట్‌ ధరలు సాధారణంగా తక్కువగానే ఉంటాయి. ఈ కారణం వల్లే వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని కొనసాగిస్తోంది. రైతుకు కనీస మద్దతు ధర ద్వారానే  చాలావరకు వాస్తవ ధర లభిస్తుంది. కాబట్టే రైతులకు కనీస మద్దతు ధరను అందించడం వారి న్యాయబద్ధమైన హక్కుగా ఉండాలి. కనీస మద్దతు ధరకంటే తక్కువగా మార్కెట్‌ ధరలు కొనసాగే పరిస్థితి చోటు చేసుకోకూడదు.
 

గోధుమ, వరి మాత్రమే కాదు.. కనీస మద్దతు ధర ప్రకటించిన 23 పంటలకూ ఇది వర్తించాలి. కనీస మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీలకు చెందిన మార్కెట్ల జోలికి కొత్త మార్కెటింగ్‌ సస్కరణలు వెళ్లవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఏపీఎమ్‌సీ మండీలు క్రమంగా ప్రాధాన్యత కోల్పోతాయని రైతులు భయపడుతున్నారు. ఏపీఎమ్‌సీ మార్కెట్లు  పతన బాట పడుతుండటంతో, కొత్తగా తీసుకువస్తున్న వ్యవసాయ సంస్కరణలు వ్యవసాయంలో కార్పొరేటీకరణను ప్రోత్సహించేలా రూపొందాయి. దీంతో బడా వాణిజ్య సంస్థలు వ్యవసాయంలోకి అడుగుపెట్టి స్టోరేజ్, మార్కెట్లను కైవసం చేసుకుంటాయి. అమెరికా, యూరప్‌ దేశాల అనుభవవాలు చూపుతున్నట్లుగా, అనియంత్రిత మార్కెట్లకు ప్రాధాన్యత లభిస్తున్న తరుణంలో వ్యవసాయం నుంచి మొట్టమొదటగా సన్నకారు రైతులనే పక్కకు తోసేస్తారు. దేశంలోని 86 శాతం మంది రైతుల చేతుల్లో 5 ఎకరాల కంటే తక్కువ కమతాలు ఉంటున్నందున, ఇంకా పెద్దగా ఎదగండి లేదా బయటకు వెళ్లండి అనే సందేశం అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


దేవీందర్‌ శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

మరిన్ని వార్తలు