ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు

21 May, 2022 00:43 IST|Sakshi

విశ్లేషణ

నిలకడైన ఆహార వ్యవస్థలను నిర్మించుకోవడం, ఆహార స్వావలంబనను ప్రోత్సహించడానికి బదులుగా, మన విధాన నిర్ణేతలు అంతర్జాతీయ మార్కెట్‌ నిబంధనలను పొడిగించుకుంటూ పోతున్నారు. అంటే దీనర్థం మార్కెట్‌ శక్తులు తమ ఇష్టానుసారం రాజ్యమేలడానికి అవకాశం ఇవ్వడమే! ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలు ఈ సంవత్సరం ఇప్పటికే రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించాయని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. బడా కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నాయంటే ప్రపంచం ముందు క్షుద్భాధ సమస్య పొంచి ఉన్నదని ఆర్థం. అదీ ఆహార ఉత్పత్తులు తగ్గకుండానే సంక్షోభం ఏర్పడే పరిస్థితి. ఆహార వ్యవస్థలను సంస్కరించడంలోని వైఫల్యం అంతర్జాతీయ ఆహార సంక్షోభానికి దారితీసింది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆకలి బాధలను, ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవ సాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ క్యు డోంగ్యు మే 4న పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన చెప్పదలుచుకున్న విషయం మరొకటి ఉంది. గ్రామీణ జీవనాన్ని తీవ్రంగా ధ్వంసం చేసినందువల్లే పేదరికం అంచుల్లో ఉన్న ప్రజానీకం మరింతగా క్షుద్బాధా రేఖ కంటే దిగువకు పడిపోయారని అంతర్జాతీయ సమాజానికి ఆయన చెప్ప దలిచారు. నిజానికి ప్రపంచం ఇప్పటికే మూడో అంతర్జాతీయ ఆహార సంక్షోభం ముంగిట్లో ఉందని చాలామంది భావిస్తున్నారు.

నిలకడైన ఆహార వ్యవస్థలపై అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ మరొక కచ్చితమైన శీర్షికతో రూపొందించిన ప్రత్యేక నివేదిక ఉక్రె యిన్‌పై రష్యా ఆక్రమణ నుంచి తలెత్తిన తీవ్రమైన ఆహార పరిస్థితిని వివరించడానికి పూనుకుంది. అలాగే ఆహార వ్యవస్థల సంస్కరణల్లో వైఫల్యం వల్ల గత 15 సంవత్సరాల్లో మూడో అంతర్జాతీయ ఆహార సంక్షోభం ఎలా ఏర్పడింది అనే ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నించింది. 2007–08లో మొట్టమొదటి ప్రపంచ ఆహార సంక్షోభం వచ్చినప్పుడు దాదాపు 37 దేశాలు ఆహార దాడులను ఎదు ర్కోవలసి వచ్చింది. అది కూడా ప్రపంచ ఆహార ఉత్పత్తిలో ఏమాత్రం తగ్గుదల కనిపించని సమయంలో ఈ ఉత్పాతం సంభవించింది. 

ఉక్రెయిన్‌ యుద్ధం కంటే ముందుగానే ఆహార ధరలు సరికొత్త శిఖరాలను చేరుకున్నాయి. 2007–08 నాటి ఆహార సంక్షోభ కాలాని  కంటే మించి ఆహార ధరలు పెరిగాయి. మొక్కజొన్నలు, పప్పులు, వెజిటబుల్‌ ఆయిల్, పత్తి, సోయాబీన్, చక్కెర వంటి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. యుద్ధం ప్రారంభం కాకముందే, ఆహార ధరలు రికార్డు స్థాయికి చేరడంతో, ప్రపంచం ఆహార సంక్షోభం దిశగా వేగంగా పయనించింది. దురదృష్టవశాత్తూ, ఈ కారణాలవల్లే మొదటి ప్రపంచ ఆహార సంక్షోభం చెలరేగిందని గ్రహించాలి. ఆహార రంగంలో సంస్థాగత సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం కారణంగానే ఇప్పుడు మరో దఫా ఆహార సంక్షోభం పొంచి ఉంది.

గత ఆహార సంక్షోభాల నుంచి ఎవరూ ఏ రకంగానూ పాఠాలు నేర్వనట్లు కనిపిస్తోందని ఐపీఈఎస్‌–ఫుడ్‌ కో–చైర్‌ అలివర్‌ డి షుట్టర్‌ పేర్కొన్నారు. కాగా ఈ విషయంపైనే ఈ సంస్థ వైస్‌–చైర్‌ జెన్నిఫర్‌ క్లాప్‌ పెరుగుతున్న ఆహార ధరలపై జూదమాడటం మొదలై పోయిం దని చెప్పారు. దీనివల్ల ప్రపంచంలో అత్యంత నిరుపేదలు తీవ్రమైన ఆకలి సమస్యలో కూరుకుపోతున్నారని ఆమె అన్నారు. ఫ్యూచర్స్‌ మార్కెట్లను పర్యవేక్షించడం, ‘సట్టా’ వ్యాపార తీరు తెన్నులకు వ్యతిరే కంగా పోరాడాల్సిన అవసరం గురించి జి–7 దేశాల వ్యవసాయ మంత్రులు అప్పట్లోనే మాట్లాడారు. అయినప్పటికీ ధరలలో ఊహా గానాలను నియంత్రించడంలో జి–7 దేశాల కూటమి విఫలమైంది. 

2007–08 కాలంలో ఆహార సంక్షోభం ఏర్పడిన సమయంలో మితిమీరిన సరుకుల వర్తకం, ఊహాగానాలు (స్పెక్యులేషన్‌) అంత ర్జాతీయ ధరలు చుక్కలంటడానికి చోదక శక్తగా పనిచేశాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌ పేర్కొంది. దానికి అనుగుణంగా ఫ్యూచర్స్‌ మార్కెట్లు ఆనాటి ఆహార సంక్షోభానికి 75 శాతం వరకు కారణమయ్యాయని ఆరోపించింది. స్పెక్యులేషన్‌ అనేది బడా వ్యవసాయ వాణిజ్య కంపెనీలకు భారీ లాభాలను ఆర్జించి పెట్టగా, లక్షలాదిమంది ఆకలితో పడి ఉండాల్సిన పరిస్థితికి అది ఎలా కారణమైందో వివరిస్తూ అమెరికాలోని పాపులర్‌ టీవీ అయిన ‘డెమాక్రసీ నౌ’ వివరణాత్మక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఆ సమయంలో అంతర్జాతీయ ఆహార ఉత్పత్తి క్షీణించిపోలేదు. అయినా సరే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు చుక్కలనంటాయి.

అంటే మొదటి ఆహార సంక్షోభం నుంచి ఎవరూ ఏ రకమైన గుణపాఠాలు నేర్చుకోలేదని ఇది సూచిస్తుంది. నిలకడైన ఆహార వ్యవస్థలను నిర్మించుకోవడం, ఆహార స్వావలంబనను ప్రోత్సహిం చడానికి బదులుగా, మన విధాన నిర్ణేతలు అంతర్జాతీయ మార్కెట్‌ నిబంధనలను పొడిగించుకుంటూ పోతున్నారు. అంటే మార్కెట్‌ శక్తులు తమ ఇష్టానుసారం రాజ్యమేలడానికి అవకాశం ఇవ్వడమే! దీనివల్ల అంతర్జాతీయ వ్యవసాయ సప్లయ్‌ చైన్లను నిర్మించడంపైనే దృష్టి పెడతారు. తద్వారా వేళ్లమీద లెక్కించదగిన కొన్ని కంపెనీలపైనే ఆధారపడటం పెరుగుతుంది. ఆ తర్వాత ఆ కంపెనీలు తమ ఇష్ట ప్రకారం ధరలు పెంచుకుంటూ పోతాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆహార కంపెనీల్లో ఒకటైన ‘కార్గిల్‌’ ఈ సంవత్సరం ఇప్పటికే రికార్డు స్థాయిలో లాభాలు సాధించిందని ‘గార్డియన్‌’ పత్రిక నివేదించింది.

అనేకానేక పరిశ్రమల్లో వేళ్లమీద లెక్కబెట్టగలిగన దిగ్గజ కంపె నీలు మార్కెట్‌ను శాసిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గతంలోనే చెప్పారు. చాలా తరచుగా ఇవి చిన్న చిన్న పోటీ దారులను నిర్మూలించడానికి తమ శక్తిని ఉపయోగిస్తున్నాయనీ, కొత్త వాణిజ్య సంస్థల ఆవిర్భవాన్ని అడ్డుకుంటున్నాయనీ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా పశుసంపద పరిశ్రమను ఆయన ఎత్తి చూపారు. ఇది మొత్తంగా నాలుగు బడా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయి అవి మార్కెట్‌ ధరలను శాసిస్తున్నాయి. కానీ అధిక ధరలకు కారణమవుతున్న కంపెనీలపై ప్రజాగ్రహం రగలకపోవడమే ఆశ్చర్యంగా ఉంది.

కమోడిటీ ట్రేడింగ్‌ కార్యకలాపాల్లో అనేక పెట్టుబడి మదుపులు పెరుగుతున్నాయి. కానీ గోధుమ కాంట్రాక్ట్‌లలో ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ లలోని పదిమంది కొనుగోలుదార్లలో కనీసం ఏడుగురు స్పెక్యులేటర్లే అని తెలిసింది. దీనివల్ల సరుకుల ధరలు పెరిగిపోయాయి. ప్రపంచ బ్యాంకు ప్రకారం వ్యవసాయ ధరల సూచి గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే 41 శాతం ఎక్కువగా పెరిగింది. గోధుమ ధరలు 60 శాతం పెరగగా, మొక్క జొన్న ధర 54 శాతం పెరిగింది. ఆహార ధరల పెరుగుదలకు, స్పెక్యులేషన్‌కి మధ్య ప్రత్యక్ష లింకు ఉందని ఇది సూచించదు కానీ, భారత్‌లో పెరుగుతున్న వ్యాపార ప్రయోజనాలను ఇది కచ్చితంగా ఎత్తి చూపుతుంది. ఉదాహరణకు... ఇప్పుడు భారత్‌ అవధులు లేని గోధుమ ఎగుమతులు చేయాలని వాణిజ్య వర్గాలు కోరుతున్నాయి. ఎందుకంటే ఈ ఎగుమతుల ద్వారా పెరుగుతున్న లాభాలను, ఇంకా పెరుగుతున్న ధరలను వీరు చూస్తున్నారు.

అంతర్జాతీయ ఆహార ధరల్లో పెరుగుదల పేద దేశాలను దారుణంగా దెబ్బతీస్తోంది. అదే సమయంలో దిగుమతులు కూడా ఖరీదైనవిగా మారుతున్నాయి. ఇప్పటికే సూడాన్‌ నుంచి అఫ్గానిస్తాన్‌ వరకు 53 పేద దేశాలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొం టున్నాయి. ఈ క్షుద్బాధా సమస్యే క్షామానికి దారితీసి విస్తృత సంఖ్యలో మరణాలకు కారణమవుతోందని ఎఫ్‌ఏఓ చెబుతోంది. కొన్ని దేశాలు ఇప్పటికీ సంఘర్షణను ఎదుర్కొంటున్నప్పటికీ ఆహార భద్రతను ప్రోత్సహించే దిశగా అంతర్జాతీయ ప్రయత్నాలు తగి నంతగా జరగలేదు. అదేవిధంగా, ప్రాంతీయ ఆహార రిజర్వులను ఏర్పర్చుకోవాలి. దీనివల్ల ఆహార సరఫరాలు ఏ కా>రణం వల్ల తగ్గిపోయినా పెద్ద ప్రభావం చూపకపోవచ్చు.
 
యుద్ధం, వాతావరణ మార్పు, దారిద్య్రం, ఆర్థిక ప్రకంపనలు వంటి పలు అంశాల వల్లే ఆహారధరలు పెరుగుతున్నాయని సాధారణంగా భావిస్తున్నప్పటికీ అసలు సమస్య ఏమిటంటే ఆహార దిగుమతులపై అతిగా ఆధారపడుతుండటమే. ఉదాహరణకు రష్యా, ఉక్రెయిన్‌ ప్రాంతం 30 దేశాలకు గోధుమలను సరఫరా చేస్తోంది. వాస్తవానికి ఇలా ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అధిక భాగం ఆహార స్వావలంబన దేశాలుగా మారవచ్చు. ఇక్కడే మనం పాఠాలు నేర్వాల్సి ఉంది.

వ్యాసకర్త: దేవీందర్‌ శర్మ 
 ఆహార, వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com
(‘ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు