ధనికులు, పేదల మధ్య ఇంత అగాధమా?

27 May, 2021 00:53 IST|Sakshi

విశ్లేషణ

మహమ్మారి కాలంలో భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం మేరకు పెరిగింది. భారత్‌లోని కేవలం 11 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల పెరిగిన సంపదతో జాతీయ ఉపాధి పథకాన్ని పదేళ్ల పాటు కొనసాగించవచ్చు అని ఆక్స్‌ఫామ్‌ నివేదిక సూచించింది. దేశంలోని ఒక్క శాతం అగ్రశ్రేణి సంపన్నుల సంపద పది కోట్లమంది నిరుపేదల సంపదకు నాలుగురెట్లు ఎక్కువగా ఉందని అంచనా. ఆర్థిక వృద్ధి నమూనాలు బలిసిన వారిని మరింత బలిసేలా అమలవుతున్నాయి. అదే సమయంలో నిరుపేదలు నిత్యం తమను తాము కాచుకునే దుస్థితిలోకి దిగజారిపోతున్నారు. అంతిమంగా చెప్పాలంటే, అభివృద్ధి అనే భావన ప్రధానంగా పేదలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆదాయపరమైన అసమానతల తొలగింపునకు అదే అసలైన పరిష్కారం.

కరోనా మహమ్మారి తొలి వేవ్‌ దేశదేశాలను లాక్‌డౌన్‌ బారిన పడవేసినప్పటి నుంచి ప్రధానంగా సంపన్నదేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు 9 లక్షల కోట్ల డాలర్ల మేరకు అదనపు డబ్బును ముద్రించాయి. దీంతో ఆయా ఆర్థిక వ్యవస్థలు కాస్తా ఊపిరి పీల్చుకున్నాయనే చెప్పాలి. ఆర్థికవేత్త, మోర్గాన్‌ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ గ్లోబల్‌ స్ట్రాటజిస్ట్‌ రుచిర్‌ శర్మ ప్రకారం, ఈ మహమ్మారి సంపన్నుల సంపదను మరింత పెంచే ఉద్దీపన శక్తిగా మారిపోయింది. ఆయా ప్రభుత్వాలు ప్రకటిం చిన ఉద్దీపన ప్యాకేజీల్లో అధిక భాగం ఆర్థిక మార్కెట్లలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి నయా సంపన్నుల నికర సంపదగా మారిపోయాయని రుచిర్‌ మే 16న ఫైనాన్షియల్‌ టైమ్స్‌లో రాశారు. మహమ్మారి తొలి వేవ్‌ కాలంలోనే అతి సంపన్నుల మొత్తం సంపద 5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 13 లక్షల కోట్ల డాలర్లకు అమాంతంగా పెరిగిపోయింది. అంటే దేశాలు ఆర్థికవ్యవస్థను సంక్షోభం నుంచి బయటపడేయడానికి మల్లగుల్లాలు పడుతున్న సమయంలోనే మార్కెట్లు ధనరాసులను తరిలించుకుపోయాయంటే ఆశ్చర్యపడాల్సింది లేదు.

విచారకరమైన విషయం ఏమిటంటే ప్రజల చేతుల్లోని సంపద పరోక్షంగా నయా సంపన్నుల జేబుల్లోకి సునాయాసంగా తరలిపోవడమే. బ్రూక్సింగ్స్‌ సంస్థ చేసిన మదింపు ప్రకారం 2020 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల 40 లక్షల మంది దారిద్య్ర రేఖ దిగువకు నెట్టబడ్డారని తెలిసినప్పుడే ఈ పరిణామం చోటుచేసుకుంది.  ఈ గణాంకాల ప్రకారం చూస్తే అత్యంత దారిద్య్రంలో కూరుకుపోయిన అత్యధిక జనాభా విషయంలో భారత్‌ ఇప్పుడు నైజీరియానే అధిగమించింది. భారత్‌లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న భారీ జనసంఖ్యకు ఇప్పుడు మరో 8 కోట్ల 50 లక్షల మంది జతకావడం విశేషం. కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ సృష్టిస్తున్న విధ్వంసం ఫలితంగా మరింత జనాభా దారిద్య్ర రేఖ కిందికి దిగజారిపోవడం ఖాయమనిపిస్తుంది. 

అయితే మనం గుర్తించకపోయిన విషయం ఏమిటంటే.. ప్రపంచం నుంచి కటిక దారిద్య్రాన్ని నిర్మూలించడానికి కేవలం 100 బిలియన్ల అమెరికన్‌ డాలర్లు వెచ్చిస్తే సరిపోతుంది. మహమ్మారి కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో ఇది అత్యంత చిన్న భాగం మాత్రమే. సంపన్నుల చేతిలో మరింత సంపద పోగుపడేలా చేయడానికి ఆర్థిక వ్యవస్థలు చేసిన ప్రయత్నంలో దారిద్య్ర నిర్మూలన అనే అంశం గాలికెగిరిపోయింది. దారిద్య్రం నిర్మూలనకు తగినంత డబ్బు కేటాయించడంలో ప్రపంచం వెనుకబడి ఉంటున్న సమయంలోనే ప్రపంచ బిలియనీర్ల వద్ద సంపద మరింతగా ఎలా పోగుపడుతోందన్నది అర్థం కావడం లేదు. ఉద్దీపన ప్యాకేజీల్లో అతి చిన్న భాగాన్ని దారిద్య్ర నిర్మూలన కోసం వెచ్చించి ఉంటే, ఈ ప్రపంచం మరింత నివాస యోగ్యంగా ఉండేది. 

ఈలోగా, కరోనా మహమ్మారి ఆదాయ అసమానత్వాన్ని కనీవినీ ఎరుగని పరాకాష్ట స్థితికి తీసుకుపోయింది. అమెరికాలోని బిలియనీర్ల సంపద కరోనా కాలంలో 44.6 శాతానికి పెరిగిపోయిందని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాలసీ స్టడీ పేర్కొంది. ఇదే కాలంలో అమెరికాలో 8 కోట్లమంది ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికాలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 16 కోట్ల మంది సంపదతో పోలిస్తే 50 మంది అగ్రశ్రేణి సంపన్నుల సంపద అధికంగా ఉందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఇక భారత్‌ విషయానికి వస్తే ఆదాయాల మధ్య అసమానత ఏమంత తక్కువగా లేదు. 2013 నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆఫీసు (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నివేదిక ప్రకారం సగటు వ్యవసాయ కుటుంబం ఆదాయాన్ని పరిశీలిస్తే, సగటున నెలకు రూ. 6,426లు మాత్రమే ఉంటోందని తెలుస్తుంది. అందుకనే సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు తమ పంటలకు గ్యారంటీ ఆదాయాన్ని కల్పించాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు.

ఆక్స్‌ఫామ్‌ ఇనీక్వాలిటీ వైరస్‌ రిపోర్ట్‌తో దీన్ని పోల్చి చూడండి. మహమ్మారి కాలంలో భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం మేరకు పెరిగింది. భారత్‌లోని కేవలం 11 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల పెరిగిన సంపదతో జాతీయ ఉపాధి పథకాన్ని పదేళ్ల పాటు కొనసాగించవచ్చు అని ఆక్స్‌ఫామ్‌ నివేదిక సూచించింది. దేశంలోని ఒక్క శాతం అగ్రశ్రేణి సంపన్నుల సంపద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పది కోట్లమంది సంపదకు నాలుగురెట్లు ఎక్కువగా ఉందని అంచనా.పెరిగిన ఈ సంపద పేదల జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో అర్థం చేసుకోవడానికి, సార్వత్రిక ప్రాథమిక ఆదాయంపై ప్రయోగ ఫలితం కేసి చూడాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి విరుచుకుపడటానికి రెండేళ్లకుముందు అంటే 2018 ప్రారంభంలో కెనడాలో ఫౌండేషన్‌ ఫర్‌ సోషల్‌ చేంజ్‌ చారిటబుల్‌ సంస్థ, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియాతో కలిసి వాంకోవర్‌ ప్రాంతంలోని నివాసాలు లేని 50 కుటుంబాలకు 7,500 కెనడియన్‌ డాలర్లను (6,206 అమెరిన్‌ డాలర్లు) ఇచ్చాయి. ఏడాది తర్వాత ఈ డబ్బు ఎలా ఉపయోగపడింది అనే అంశంపై చారిటీ సంస్థ జరిపిన పరిశీలనలో అద్భుత ఫలితాలు కనిపించాయి. పైగా ఇలా నగదు సరఫరా అనేది ఎంతో ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇచ్చింది.

నిరుపేదలకు డబ్బుతో ఎలా వ్యవహరించాలో తెలీదంటూ సమాజంలో ఉండే సాధారణ అభిప్రాయానికి భిన్నంగా, తమకు అందిన పరిమితమైన ఆర్థిక సహాయాన్ని కూడా వారు ఎంతో తెలివిగా ఉపయోగించుకున్నారని ఈ అధ్యయన ఫలితాలు స్పష్టంగా వెల్లడిం చాయి. ప్రధానంగా ఆ కాస్త మొత్తాన్ని వారు ఆహారం, దుస్తులు, ఇంటి నిర్వహణ వంటి అవసరాలకు మాత్రమే తెలివిగా ఖర్చుపెట్టారు. వార్తా నివేదికల ప్రకారం ప్రాథమిక ఆహారంపై వినియోగం 37 శాతం పెరిగిందని తెలుస్తోంది. అదే సమయంలో నిరుపేదలు డ్రగ్స్, ఆల్కహాల్‌పై పెట్టే ఖర్చును గణనీయంగా తగ్గించుకున్నారు. అంతవరకు నివాస స్థలం లేకుండా గడిపిన వీరు తాము ఉండటానికి ఒక గూడుకోసం ప్రయత్నించి పక్కా ఇళ్లను సంపాదించుకోవడంపై పని చేశారు. ఈ అధ్యయనం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా నిరుపేదలకు రోటీ, కపడా, మకాన్‌ ఎంతో ప్రాధాన్యత కల అంశాలుగా ఉంటున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఇలాంటి చిన్న మొత్తాలతో నగదును బదలాయించడం అనేది దారిద్య్రం కోరలనుంచి పేదలను గణనీయంగా బయట పడేస్తుంది. 

నిరుపేదల జీవితాల్లో వెలుగును తీసుకొచ్చే ఈ విశిష్ట ప్రక్రియను అమలు చేయడానికి బదులుగా... ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను రాయితీలు, బ్యాంక్‌ బకాయిల రద్దు, బెయిలవుట్లు, కార్పొరేట్‌  ప్రోత్సాహకాల పేరిట భారీ స్థాయిలో సంస్థలకు సబ్సిడీలను అందించడం రూపంలో మరింత డబ్బును సంపన్నుల జేబుల్లోకి చేరే తరహా విధానాల కొనసాగింపును మనం చూస్తూ వస్తున్నాం. పేదలకు వారి వాటా వారికిచ్చే విషయం చర్చకు వచ్చినప్పుడల్లా, ఒక విచిత్రమైన వాదనను మన ఆర్థిక పండితులు తీసుకొస్తుంటారు. అదనపు డబ్బును నేరుగా పేదలకు బదలాయిస్తే సమాజంలోని ప్రతిఒక్కరూ ఖర్చుపెట్టడం అలవాటు చేసుకుని మరింత ద్రవ్యోల్బణం పెరగడానికి కారకులవుతారని మేధావుల ఉవాచ.

ఈ వాదనకు అనుగుణంగానే ఆర్థిక వృద్ధి నమూనాలు చాలా తెలివిగా సమాజంలో ఆదాయాల మధ్య అసమానతకు మరింత తోడ్పడేలా పథకాలను రూపొందిస్తూ వస్తున్నాయి. అంటే బలిసిన వారిని మరింత బలిసేలా ఈ విధానాలు అమలవుతున్నాయి. అదే సమయంలో నిరుపేదలు నిత్యం తమను తాము కాచుకునే దుస్థితి లోకి దిగజారిపోతున్నారు. అంతిమంగా చెప్పాలంటే, అభివృద్ధి అనే భావన ప్రధానంగా పేదలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆదాయపరమైన అసమానతల తొలగింపునకు అదే అసలైన పరిష్కారం.

వ్యాసకర్త: దేవీందర్‌ శర్మ 
ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు