చేద్దామా? చద్దామా?

23 Jul, 2022 00:57 IST|Sakshi

విశ్లేషణ

సెకనుకు సుమారు 13.3 హిరోషిమా అణ్వాయుధాలు లేదా రోజుకు 11,50,000 అణ్వాయుధాలు పడితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం భూగోళం ఎదుర్కొంటున్న సమస్య ఇంత తీవ్రంగా ఉంది. ఈ మంటలు పుట్టించే వేడికి ఏ దేశమూ మినహాయింపు కాదు. చల్లటి ప్రాంతాలుగా పేరొందిన యూరోపియన్‌ దేశాలు సైతం ఎండలకు మాడిపోతున్నాయి. ఇంకోవైపు కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. వాతావరణం అదుపు తప్పిందన్నది నిజం. ఎప్పటికో అనుకున్నది ఇప్పటికే వచ్చేసింది. కొందరు నమ్ముతున్నట్టు ఏ కొత్త టెక్నాలజీనో వచ్చి అమాంతం సమస్యను పరిష్కరించలేదు. ప్రభుత్వాల స్థాయిలో, వ్యక్తిగత స్థాయిలో చర్యలు మొదలుకావాలి. లేదంటే, ‘వాతావరణ ఆత్మహత్యలే’ శరణ్యం.

విపరీత వాతావరణం పుణ్యమా అని గత వారంలో స్పెయిన్, పోర్చుగల్‌లలో వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్‌లోనైతే రికార్డులు బద్దలు కొడుతూ 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్‌ ఈ వడగాడ్పులను సామూహిక ఆత్మహత్యలకు ఏమాత్రం తీసిపోని పరిణామమని హెచ్చరించారు. వాతావరణ మార్పుల మీద జరిగిన రెండు రోజుల సమావేశంలో 40 దేశాలకు చెందిన మంత్రులతో మాట్లాడుతూ... ‘‘మానవాళిలో సగం ఇప్పటికే వరదలు, కరవులు, తుపాన్లు, కార్చిర్చుల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు. అయినా మనం శిలాజ ఇంధనాల వ్యసనాన్ని కొనసాగి స్తున్నాం. ఇప్పుడు మన ముందు ఒక అవకాశం ఉంది. కలిసికట్టుగా సమస్యను అధిగమించే ప్రయత్నం చేద్దామా? లేక అందరమూ కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకుందామా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. 

ప్రకృతి వైపరీత్యాల ప్రకోపం పతాక స్థాయికి చేరిన ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి హెచ్చరిక అనూహ్యమేమీ కాదు. ఎవరో అన్నట్లు... ఇవి వాతావరణ మార్పులు కాదు, ‘వాతావరణ ఆత్మహత్యలు’. యూరప్, ఉత్తర అమెరికాల్లో చాలా భాగాల్లో కార్చిచ్చులు కలవరపెడుతున్నాయి. ఇంకోవైపు భారత్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లో ఏటికేడాదీ కుంచించుకుపోతున్న మంచు! అదే సమ యంలో ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో కరవు పరిస్థితులు! ఇవన్నీ చూస్తే ప్రపంచ వాతావరణం అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. వాతా వరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో తెలిసినప్పటికీ... ఎప్పుడో వస్తున్నాయనుకున్నవి ఇప్పుడే వచ్చేస్తూండటం, జరుగు తున్న నష్టం తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. 

ఒహాయో యూనివర్సిటీ మాజీ గణిత శాస్త్రవేత్త ఇలియట్‌ జాకబ్‌సన్‌‘వాచింగ్‌ ద వరల్డ్‌ గో బై’ పేరుతో ఓ లెక్క చెప్పారు. ‘‘ఈ గ్రహంపై సెకనుకు 13.3 హిరోషిమా అణు బాంబులు పేలితే పుట్టేంత వేడి పుడుతోంది. అంటే రోజుకు 11,50,000 అణు బాంబులంత వేడన్నమాట’’ అని విస్పష్టంగా పేర్కొన్నారు. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు కూడా సెకనుకు 12 హిరోషిమా అణుబాంబుల స్థాయిలో పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. తలుచుకుంటేనే భయం పుట్టే స్థాయి. అయినా సరే, మనం కలిసికట్టుగా పనిచేసేం దుకు సిద్ధంగా లేము. అందుకేనేమో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా ప్రభుత్వాలు చెప్పేదొకటీ, చేసేది ఇంకోటీ అని నిష్టూరమాడారు. పచ్చిగా మాట్లాడాల్సి వస్తే దేశాలన్నీ అబద్ధాలు చెబుతున్నాయన్నారు. ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్‌లైమేట్‌ ఛేంజ్‌ తాజా నివేదిక విడుదలైన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ శతాబ్దాంతానికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ పెరగకూడదనుకుంటే... 2022 నాటికి కర్బన ఉద్గారాలు పతాకస్థాయికి చేరాలని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇంకోలా చెప్పాలంటే, 2023 నుంచి ఉద్గారాలు గణనీయంగా తగ్గాలే తప్ప మరి పెరగకూడదన్నమాట. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కానీ సమయమేమో మించిపోతోంది.

హెచ్చరికలు బేఖాతరు...
వాతావరణం మనకిప్పటికే అన్ని రకాల హెచ్చరికలు చేస్తున్నా అన్నీ బేఖాతరవుతున్నాయి. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఆర్థిక వేత్తలు, శాస్త్రవేత్తలు, మీడియా ప్రతినిధులు కూడా నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేయగల వీరు ఇస్తున్న సందేశమేమిటి? ఏం ఫర్వాలేదు; కొత్త కొత్త టెక్నాలజీ లొస్తున్నాయి; వాతావరణ సమస్యలకు ఇవి సమాధానం చెబుతాయి; అందోళన అనవసరం అని! ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత ప్రకృతి వైపరీ త్యాలకూ వాతావరణ మార్పుల ప్రభావానికీ సంబంధం లేదని కూడా కథనాలు వెలువడుతున్నాయి!

అంతేకాకుండా... ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రకృతి వనరుల విధ్వంసాన్ని కూడా కొందరు సమర్థించుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలకు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శిలాజ ఇంధనాలను త్యజించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది కూడా. ప్రధాన స్రవంతిలోని ఆర్థికవేత్తలకు భిన్నంగా ఆలోచిస్తున్న బ్రిటిష్‌ మంత్రి జాక్‌ గోల్డ్‌ స్మిత్‌ ఒక ట్వీట్‌ చేస్తూ... ‘‘యూరప్‌ మొత్తమ్మీద కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. ఉష్ణోగ్రతల రికార్డులు బద్ధలవు తున్నాయి. అడవులు, పర్యావరణ వ్యవస్థలు కూడా రికార్డు వేగంతో నశించిపోతున్నాయి. అయినా పర్యావరణ పరిరక్షణకు డబ్బులు ఖర్చు చేయడం ఏమంత లాభదాయకం కాదనే రాజకీయ నేతలు మళ్లీ పదవులకు ఎన్నికవుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. 

ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్‌ –కీ మూన్‌ గతంలో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, వాతావరణ విధ్వంసానికి కారణమవుతున్న ఆర్థిక విధానాలను చక్కదిద్దే నాయకత్వపు అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పడం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారం కూడా ఇదేననీ, రాజకీయ నేతలు ఈ గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారనీ నా నమ్మకం కూడా. అభివృద్ధికి సూచిక స్థూల జాతీయోత్పత్తి అన్న వ్యామోహం నుంచి బయటపడనంత వరకూ వాతావరణ సమస్య లకు పరిష్కారం లభించనట్లే. మనకిష్టమైనా, కాకపోయినా సరే... ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం సమాజంలో అంతరాలను పెంచిం దన్నది మాత్రం నిజం. అంతేకాకుండా... పర్యావరణ సమస్యలను తెచ్చిపెట్టిందీ, ప్రపంచం అంతరించిపోయే స్థితికి చేర్చింది కూడా ఇవే. కాబట్టి ఆర్థిక వ్యవస్థ సమూల ప్రక్షాళన తక్షణావసరం. 

ప్రస్తుత అస్తవ్యస్త వ్యవహారం ఇకపై ఎంతో కాలం కొనసాగే అవకాశాలు లేవు. బహుశా ప్రస్తుతం వీస్తున్న వడగాడ్పులు ఓ షాక్‌ థెరపీనేమో. మానవాళి మేల్కొనేందుకు అవసరమైనదే కావచ్చు. నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేసే సందర్భమూ ఇదే. ఎందుకంటే, ఇది పోతే ఇంకోటి ఉందిలే అని భూమి గురించి అనుకోలేము కదా! కర్బన ఉద్గారాలకు, వాతావరణ సమస్యలకు, సంపద సృష్టికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందన్నది నిర్వివాదాంశం. ఆర్థికాభివృద్ధి ఎంత ఎక్కువైతే, అంతేస్థాయిలో కర్బన ఉద్గారాలూ పెరుగుతాయి. స్థూలజాతీయోత్పత్తిని పెంచు కోవాలన్న తపనలో భూమి వేడి కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యం లోనే మేరీల్యాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీకి చెందిన డాక్టర్‌ హెర్మన్‌ డాలీ ‘స్టెడీ స్టేట్‌ ఎకానమీ’కి మద్దతిచ్చారు. ‘‘ప్రతి రాజకీయ నాయ కుడూ వృద్ధికి అనుకూలంగా ఉన్నాడు. అర్థం చేసుకోదగ్గ విషయమే. కానీ అసలు ప్రశ్నకు సమాధానం మాత్రం దాటవేస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, వృద్ధి మనల్ని నిజంగానే ధనవంతులను చేస్తోందా? లేక లాభాలకంటే ఖర్చుల్ని ఎక్కువ చేస్తోందా? అన్నది కూడా ఆలోచించాలి. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను సమర్థిస్తున్న వారు సమాధానమివ్వాల్సిన ప్రశ్న కూడా ఇదే. ఆర్థికవేత్తల ఆలోచనలు ఎలా ఉన్నా, సామాన్యుల వ్యవహారశైలిలోనూ కొన్ని మార్పులు అని వార్యం. వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల ప్రభా వాన్ని తగ్గించుకోవచ్చు. వాతావరణ సమస్య మనం సృష్టించింది కాకపోయినా, ఇప్పటివరకూ కొనసాగడంలో మాత్రం మనవంతు భాగస్వామ్యం తప్పకుండా ఉంది.


దేవీందర్‌ శర్మ 
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు