స్పెయిన్‌ చెబుతున్న ‘రైతు’ పాఠం

20 Mar, 2021 06:37 IST|Sakshi

స్పానిష్‌ రైతులు ఇటీవలికాలంలో నెలలతరబడి కొనసాగించిన నిరసనల ఫలితంగా, రైతులకు అనుకూలంగా స్పెయిన్‌ ఒక గొప్ప చట్టాన్ని తీసుకువచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అదేమిటంటే ఉత్పత్తికి అయిన ఖర్చు కంటే ఆహారాన్ని తక్కువ ధరకు అమ్మడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకురావడమే. రైతులకు నష్టం తెప్పించేలా ఆహార ధాన్యాలను తక్కువ ధరకు అమ్మే చిల్లర వ్యాపారులకు, హోల్‌సేల్‌ విక్రేతలకు జరిమానా విధించడం అనే ఒక చారిత్రక కార్యక్రమానికి స్పెయిన్‌ నాంది పలికింది. కేంద్రప్రభుత్వ సాగు చట్టాలను రద్దు చేసి కనీస మద్దతు ధరకు చట్టరూపం కల్పించాలని భారత రైతులు పోరాడుతున్న తరుణంలో కనీస మధ్దతు ధరకంటే తక్కువకు అమ్మకుండా స్పెయిన్‌ తరహా చట్టం నిరోధిస్తుంది.

వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కొనసాగింపు కోసం, సాగు చట్టాల రద్దుకోసం భారతీయ రైతులు గత కొన్ని నెలలుగా చేస్తున్న నిరసనల నేపథ్యంలో రెండు పాత ఘటనలు నాకు గుర్తుకు వస్తున్నాయి. 2018 డిసెంబర్‌లో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఒక రైతు తాను పండించిన 2,657 కేజీల ఉల్లిపాయలను కిలోకి ఒక్క రూపాయి ధరతో మాత్రమే అమ్మగలిగాడు. ఇలా అమ్మిన మొత్తంలో రవాణా ఖర్చు, కూలీ ఖర్చులు, మార్కెట్‌ ఫీజులను చెల్లించగా శ్రేయస్‌ అభాలే అనే ఆ రైతు ఇంటికి ఎంత తీసుకుపోయాడో తెలుసా. రూ. 6లు. కేవలం ఆరు రూపాయలు.

రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ల క్రూరత్వానికి అతడు నిరసన తెలుపుతూ, ముఖ్యమంత్రికి ఆరు రూపాయల మనీ ఆర్డర్‌ పంపాడు. కానీ ఈరోజు వరకు పరిస్థితిలో మార్పు రాలేదు. మరొక ఉదంతం ఐర్లండ్‌ రైతుకు సంబంధించింది. షాన్‌ డైవర్‌ అనే అతను, ఐర్లండ్‌లో ఒక గొర్రెల పెంపకం కేంద్రం మేనేజర్‌. అతడి వ్యవసాయ క్షేత్రంలో 240 గొర్రెలు ఉంటున్నాయి. గత నెలలో అతడు 455 కేజీల గొర్రెల ఊలును 67 యూరోల ధరతో అమ్మేశాడు. అమ్మిన ధర చీటీని ట్యాగ్‌ చేస్తూ షాన్‌ ఆగ్రహంతో ట్వీట్‌ చేశాడు.. ‘240 గొర్రెలనుంచి తీసిన ఊలు ధర  560 యూరోలు మాత్రమేనా.. ఇది తప్పు. చాలా తీవ్రమైన తప్పిదం’ అని దాని సారాంశం.

ప్రపంచవ్యాప్తంగా రైతులు వాస్తవానికి తమ రోజువారీ జీవితాలకు హామీ ఇవ్వలేని నామమాత్రపు రాబడులతో తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. అన్యాయపు ధరలు, మార్కెట్లో తారుమారు చేయడం వంటి పరిణామాలకు బాధితులైన రైతులు ఆహార సరఫరా సంస్థల చేతుల్లో దోపిడీకి గురవుతూ తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. చివరకు అమెరికా జాతీయ రైతుల యూనియన్‌ సైతం ఈ వాస్తవాన్ని గుర్తిం చింది ‘గత కొన్ని దశాబ్దాలుగా విధాన నిర్ణేతలు అమెరికన్‌ రైతులకు ధరల మద్దతు వ్యవస్థను బలహీనపరుస్తూ వచ్చారు. అధికోత్పత్తి, తక్కువ ధరలు అనే విషవలయంలో కూరుకుపోయిన లక్షలాది చిన్న, మధ్య తరహా సంస్థలు వ్యాపారం నుంచి వైదొలగాల్సి వచ్చింది’.

అందుకే ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ప్రకారం 20 బడా వ్యవసాయ వాణిజ్య సంస్థలు 2015 నుంచి 2017 మధ్యకాలంలో ప్రతి సంవత్సరం 475 బిలియన్‌ డాలర్ల మేరకు ప్రత్యక్ష ఆదాయ మద్దతును రైతులకు అందించాయని మీడియా పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను కాస్త తగ్గించడానికి ఇలా ప్రత్యక్ష నగదు మద్దతును అందించారు. అంటే రైతులు పండించిన పంటలకు సరైన ధరను నిర్ణయించడంలో సప్లై డిమాండ్‌ వర్గీకరణ క్రమం నిజానికి రైతుల మూలాలను పీల్చేసిందని, వారు వట్టిపోయేలా చేసిందని చెప్పడానికి ఇది సూచిక. 

దశాబ్దాలుగా అనేక దేశాల్లో కొనసాగుతూ వస్తున్న రైతు నిరసనలు వారు పండించిన పంటలకు హామీపూర్వకమైన ధరను అందించాల్సిన అవసరంపైనే దృష్టిపెడుతూ వచ్చాయి. అయితే ఇటీవలే స్పానిష్‌ రైతులు నెలలతరబడి కొనసాగించిన నిరసనల ఫలితంగా, స్పెయిన్‌ రైతులకు అనుకూలంగా ఒక గొప్ప చట్టాన్ని తీసుకువచ్చి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అదేమిటంటే ఉత్పత్తికి అయిన ఖర్చు కంటే ఆహారాన్ని తక్కువ ధరకు అమ్మడాన్ని నిషేధిస్తూ స్పెయిన్‌ ఒక చట్టం తీసుకొచ్చింది. రైతులు ఎక్కడ ఉన్నా సరిగ్గా దీన్నే కోరుకుంటున్నారు. రైతులకు నష్టం తెప్పించేలా ఆహార ధాన్యాలను తక్కువ ధరకు అమ్మే చిల్లర వ్యాపారులకు, హోల్‌సేల్‌ విక్రేతలకు జరిమానా విధించడం అనేది ఒక చారిత్రక కార్యక్రమానికి స్పెయిన్‌ నాంది పలికింది.

ఇది ఫుడ్‌ సప్లయ్‌ చెయిన్‌ పద్ధతిని పూర్తిగా మార్చివేయడమే కాదు.. చిన్న తరహా వ్యవసాయాన్ని బలపరుస్తుంది కూడా. స్పెయిన్‌ తీసుకొచ్చిన రైతు అనుకూల చట్టం తీసుకొచ్చే ప్రతిస్పందనలు ఖండాంతరాల్లో ప్రతిధ్వనిస్తాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఫుడ్‌ సప్లయ్‌ చెయిన్‌ పని తీరులో జరుగుతున్న లోపాలను అరికట్టేలా చట్టాలను ప్రవేశపెట్టాయి కానీ ఇవి ఏమంత శక్తిమంతమైనవి కాదు. ఉదాహరణకు ఫ్రాన్స్‌లో వాస్తవ ధరకంటే తక్కువ ధరకే వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడాన్ని నిషేధిస్తూ 2018లోనే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. దీని ప్రకారం రిటైల్‌ ఆహారధాన్యాల ధరను పది శాతానికి పెంచారు కానీ రైతుల ఆదాయం మాత్రం పెరగలేదు.

ఫుడ్‌ సప్లయ్‌ చెయిన్‌ విలువను విధ్వంసం చేయడాన్ని నిరోధించడానికి స్పెయిన్‌ మరికాస్త ముందుకెళ్లింది. తమ ఉత్పత్తి ఖర్చును తమకు అందించేటటువంటి గ్యారంటీ ధరకోసం రైతులు ఎల్లప్పుడూ పోరాడుతూ వచ్చిన డిమాండుకు చట్ట రూపం కల్పించడం ద్వారా స్పెయిన్‌ ఒక మెట్టు ముందే నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకత్వం సిగ్గుపడి తలదించుకునే గొప్ప నిర్ణయాన్ని స్పెయిన్‌ తీసుకుంది. ఇంతవరకు రైతులను పణంగా పెట్టి వినియోగదారులను, పరిశ్రమను రక్షించే విధంగా ప్రభుత్వాల చర్యలు ఉండేవి.

వినియోగదారులకు, కార్పొరేట్‌ సంస్థలకు ఇన్నేళ్లుగా రైతులే తమ పంటలను సబ్సిడీ ధరకింద ఇస్తూవచ్చారని అర్థం. అంతవరకు అమలులో ఉన్న 2013 ఆహార సప్లయ్‌ చెయిన్‌ చట్టం పనితీరును మెరుగుపర్చేందుకు స్పెయిన్‌  సవరణలు చేసింది. 2020 ఫిబ్రవరి 27నుంచి ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. వ్యవసాయదారుడికి, ప్రాథమిక కొనుగోలుదారుకు మధ్య కుదిరిన ధర.. ఉత్పత్తి వ్యయాలకు అనుగుణంగా ఉండేలా చూడటమే ఈ సవరణ చట్టం లక్ష్యం. ఉత్పత్తి ధరను నిర్ణయించేటప్పుడు, స్పానిష్‌ చట్టసభ సభ్యులు బహుశా భారతీయ అనుభవం నుంచి నేర్చుకోవచ్చు.

కాకపోతే ఉత్పత్తి ధర కంటే తక్కువ ధరకు అమ్ముతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారికి 3 వేల యూరోల నుంచి లక్ష యూరోల వరకు జరిమానా విధిస్తారు. కొన్ని కేసుల్లో అయితే ఇది పదిలక్షల యూరోలకు పెరగవచ్చు. ఫ్రాన్స్‌ గతంలోనే దీనికి సంబంధించి 75 వేల యూరోల జరిమానా విధిస్తామని ప్రకటించింది. రైతులకు ఉత్పత్తి ధరను తప్పనిసరిగా అందించాలంటే ఆహార సప్లయ్‌ చెయిన్‌ సంస్థలు తమపై పడే అదనపు ఖర్చును వినియోగదారులపై మోపవలసి వస్తుందని జర్మనీ ఆక్స్‌ఫామ్‌ సంస్థ సీనియర్‌ పాలసీ సలహాదారు మారిటా విగ్గెర్తేల్‌ చెప్పారు. ఈ కొత్త చట్టం అమలు ఇప్పుడే మొదలైనందున వినియోగదారు ధరలపై దీని ప్రభావం గురించిన విశ్లేషణలు అందుబాటులో లేవు. సూపర్‌ మార్కెట్లు ఆహార ఉత్పత్తులపై 30 నుంచి 40 శాతం లాభాన్ని తీసుకోవడం ఆపాలని ఫ్రాన్స్, జర్మనీ దేశాలు గతంలోనే కోరినప్పటికీ అది ఆచరణలోకి రాలేదు.

ఈ పరిస్థితుల్లో స్పెయిన్‌ తీసుకొచ్చిన కొత్త చట్టం భారత్‌కు బ్రహ్మాండంగా వర్తిస్తుంది. కేంద్రప్రభుత్వ సాగు చట్టాలను రద్దు చేసి కనీస మద్దతు ధరకు చట్టరూపం కల్పించాలని భారత రైతులు పోరాడుతున్న తరుణంలో కనీస మద్దతు ధరకంటే తక్కువకు అమ్మకుండా స్పెయిన్‌ తరహా చట్టం నిరోధిస్తుంది. అంటే ప్రభుత్వమే ఆహార ధాన్యాలను కొనుగోలు చేయాలని అర్థం కాదు. ఇది రైతులకు చెల్లిం చాల్సిన ధరను కాస్త పెంచుతుంది. రైతులనుంచి కొనేటప్పుడు ప్రైవేట్‌ వర్తకులు న్యాయమైన ధరను వారికి చెల్లించేలా చూడటమే ఈ తరహా చట్టం లక్ష్యం.

వాస్తవ ఆహార ధాన్యాల ధరతో రైతుల ఆదాయాలను ముడిపెట్టనంతవరకు వ్యవసాయం లాభదాయక వృత్తిగా మారాలని భావించడం నిష్ఫలమే అవుతుంది. వ్యవసాయంలో ప్రైవేట్‌ పెట్టుబడులు తీసుకొస్తే రైతుల ఆదాయాలు పెరుగుతాయని ఎవరు గ్యారంటీ ఇస్తారు? అలాగే నియంత్రణ లేని మార్కెట్లు రైతుల ఉత్పత్తులకు మంచి ధరను కల్పిస్తాయనడానికి కూడా వీల్లేదు. ఈ పరిస్థితుల్లో స్పెయిన్‌ తరహాలోనే కనీస మద్దతుధర కంటే తక్కువ ధర ప్రతిపాదించే వర్తకులపై జరిమానా విధించటం పటిష్టంగా అమలైతే, వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించి ఆర్థికంగా లాభదాయికత వైపు వ్యవసాయాన్ని దీర్ఘకాలంలోనైనా మళ్లించవచ్చు. ఈ దిశగా స్పెయిన్‌ తీసుకొచ్చిన కొత్త చట్టం కొత్త హామీని ఇస్తోంది.

వ్యాసకర్త
దేవీందర్‌ శర్మ , వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ :hunger55@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు