‘రాజుగారు’ ఒక ఆశాకిరణం

27 Sep, 2022 00:32 IST|Sakshi

విశ్లేషణ

వాతావరణ మార్పు నుండి జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ వరకు, వాయు కాలుష్యం నుండి ప్లాస్టిక్‌ ముప్పు వరకు మానవాళి బాధ్యత వహించవలసిన అనేక చర్చనీయాంశాలను బ్రిటిష్‌ సింహాసనాన్ని కొత్తగా అధిష్ఠించిన ఛార్లెస్‌ ఏనాడో తన ప్రాధాన్యాలుగా చేసుకున్నారు. జీవావరణానికి హితంగా ఉండేలా తన అలవాట్లను మార్చుకున్నారు. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడడమే కాక, పునరుత్పాదక వ్యవసాయం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పారు. పర్యావరణ పరిరక్షణపై ఆయనకున్న దృఢమైన నిబద్ధత ఆయనను కేవలం ఉత్సవ చక్రవర్తిగా ఉంచకపోవచ్చు. ప్రపంచంలో నిస్పృహలు పెరుగుతున్న సమయంలో ఈ కొత్త రాజు కొత్త రాచరిక పాత్రను సులభంగా పోషించగలరు.

మనోహరమైన చిద్విలాసాలు, ప్రజాసమూ హాలకు అభివాదాలు, కార్యక్రమాల ప్రారం భోత్సవాలు.. ఇటువంటి సాధారణ కర్తవ్యాల వరకే రాచరికాలు పరిమితమై ఉన్న తరుణంలో బ్రిటిష్‌ సింహాసనాన్ని అధిష్ఠించిన మూడవ ఛార్లెస్‌ రాజు తన సొంతవైన ఆలోచనలతో, సున్నితమైన వ్యక్తిత్వంతో, భూగ్రహాన్ని రక్షించాలన్న ప్రబలమైన కాంక్షతో ‘హరిత చక్రవర్తి’గా అవతరించగలరన్న ఆశలు రేకెత్తిస్తున్నారు. ‘‘ఆయన తన ఇరవైల ప్రారంభంలో భవిష్యత్‌ కాలుష్య దుష్ప్రభావాలపై ప్రభావ వంతమైన ప్రసంగాలు చేశారు. తన మధ్యవయస్సులో ఆర్థిక, పర్యా వరణ, సామాజిక అంశాల మధ్య సమతూకం సాధించే అత్యున్నత స్థాయి సుస్థిరతలకు చొరవ చూపారు.

ఈ ఏడాది జనవరిలో తన 73 ఏళ్ల వయసులో వాతావరణ మార్పును నియంత్రించేందుకు అత్యవ సర చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి, వ్యాపార దిగ్గజాలకు స్పష్టమైన పిలుపు నిచ్చారు’’ అని ‘టైమ్‌’ పత్రిక రాసింది. రానున్న కాలంలో కానున్న రాజుగా మొన్నటి వరకు ఆయన సాగించిన ప్రయాణాన్ని ఈ నాలుగు మాటల్లో ఆ పత్రిక సముచిత పరిచింది. బ్రిటన్‌ రాజైన వెంటనే, బ్రిటిష్‌ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ‘చరిత్ర నాపై మోపిన బాధ్యత ఎంత బరువైనదో తెలుస్తోంది’ అని ఛార్లెస్‌ అన్నారు. తనెంతో శ్రద్ధ వహిస్తూ వచ్చిన స్వచ్ఛంద కార్య కలాపాలకు, ఇతర విధులకు ఇకపై తన సమయాన్ని, శక్తిని కేటా యించడం మునుపటి స్థాయిలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. 

అయితే ఆయన యోగ్యతలను, పర్యావరణ పరిరక్షణపై ఆయన కున్న దృఢమైన నిబద్ధతను గుర్తెరిగిన చరిత్ర ఆయన్ని కేవలం ఉత్సవ చక్రవర్తిగా ఉంచగలదని నేను భావించడం లేదు. ఎలిజబెత్‌ రాణి అంత్యక్రియలకు ఐరోపా దేశాల రాచరిక కుటుంబాల నుంచి హాజ రైన వారిలో జపాన్‌ చక్రవర్తి దంపతులు సహా అందరూ అనామకంగా ఉన్న రాజులు, రాణులే. వారందరిలోనూ ఉన్న సారూప్యం ఒక్కటే. వారిలో ఎవరి జీవితాలూ సునిశితమైన గమనింపులతో గడుస్తున్నవి కావు. వారు తమ మనోభావాలను బయటి వ్యక్తం చేసేవారు కాదు కనుక ప్రజా జీవనంలో వారి గురించి మాట్లాడటానికి ఉన్నది చాలా తక్కువ. పైగా అది వారు ఎంపిక చేసుకుని, అనుసరిస్తున్న జీవనశైలి కూడా. కానీ ఛార్లెస్‌ అలా కాదు. తన మనోభావాలను వెల్లడించడానికి ఆయన ఏనాడూ సంకోచించలేదు.

అది వ్యతిరేకమైన ఫలితాన్నే ఇచ్చినా ధైర్యంగా నిలబడి ఉన్నారు. ఉదాహరణకు ఆయన నిశ్చితాభి ప్రాయాలు ఇలా వ్యక్తం అయ్యేవి : ‘రసాయనాల వాడకం వ్యవసా యానికి వినాశకరంగా పరిణమిస్తుంది. అనేక విధాలుగా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కాలుష్య కారకాలైన ఉద్గారాలు విపరీతంగా వెలువడతాయి’ అనేవారు. లేదా, ‘చిన్న పొలాలు కనుమరుగైతే అది బ్రిటిష్‌ గ్రామీణ ప్రాంతాల హృదయాన్నే చీల్చివేస్తుంది’ అని చెప్పే వారు. విధ్వంసక వ్యవసాయం, మత్స్య పరిశ్రమలకు రాయితీలు అనే అంశాలు తరచు ఆయన మాటల్లో వెల్లడయేవి. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడడమే కాకుండా, పునరుత్పాదక వ్యవసాయం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పారు.

జీవావరణానికి హితంగా ఉండేలా తన అలవాట్లను మార్చు కున్నారు. మాంసాహారాన్ని దాదాపుగా త్యజించారు. పశుగణాభివృద్ధి అవసరాన్ని తగ్గిస్తే ఉద్గారాలను నియంత్రించవచ్చు అన్న ఆలోచనే ఆయన్ని శాకాహారం వైపు మళ్లించింది. పాల ఉత్పత్తులను తీసు కోవడాన్ని కూడా ఛార్లెస్‌ తగ్గించారు. ‘కాప్‌–26’ సదస్సుకు ముందు ఆయన తన ఆస్టన్‌ మార్టిన్‌ కారును బయో–ఇథనాల్‌తో నడుపు తున్నట్లు వెల్లడించడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని ‘ది గార్డియన్‌’ ఒక వార్తాకథనం రాసింది. ఇంగ్లిష్‌ వైట్‌ వైన్‌ అవశేషాలు, జున్ను తయారీలోని పాల విరుగుడుల మిశ్రమమే ఆ బయో– ఇథనాల్‌. దాని ద్వారా ఛార్లెస్‌ తన ప్రజలకు ఒక స్పష్టమైన ఆచరణా త్మక సందేశాన్ని అందిస్తున్నారు. ‘మీ వంతుగా ఉద్గారాలను తగ్గిం చండి, తద్వారా పర్యావరణాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర పోషించండి’ అన్నదే ఆ సందేశం.

వాతావరణ మార్పు నుండి జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ వరకు, వాయు కాలుష్యం నుండి ప్లాస్టిక్‌ ముప్పు వరకు, సేంద్రియ వ్యవసాయం నుండి ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధన వరకు... బాధ్యత వహించవలసిన అనేక చర్చనీయాంశాలను ఛార్లెస్‌ ఏనాడో తన ప్రాధాన్యాలుగా చేసు కున్నారు. దీనిని ఎలాగైనా పిలవండి. విపరీతం అనండి, అతిమోహం అనండి. ఒకటి మాత్రం వాస్తవం. ఆయన బాగా చదివినవారు. విషయంపై అవగాహన లేకుంటే, ఆధిపత్య కథనాలను సవాలు చేయడం అంత సులభమేమీ కాదు. అది కూడా డబ్బు మూటలతో పెద్ద పెద్ద కంపెనీలు ఆ కథనాలకు మద్దతు ఇస్తున్నప్పుడు! దీనిని బట్టి ఆయన తన పాలనను ఎలా నిర్వహిస్తారు, తన కొత్త పాత్రను ఎలా మలుచుకుంటారు అనేవి ఆధారపడి ఉంటాయని భావిస్తు న్నాను. అంతకంటే కూడా ఆయన తను ఎలా గుర్తుండి పోవాలని అనుకుంటున్నారో అది కూడా కీలక పాత్ర వహిస్తుంది. 

నేను బాగా ఇష్టపడే మరొక చక్రవర్తి కూడా ఈ సందర్భంలో గుర్తుకు వస్తున్నారు. థాయ్‌లాండ్‌ రాజు భూమిబోల్‌ అదుల్యాతేజ్‌ 1946లో సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత 70 సంవత్సరాలు పరిపాలించారు. ప్రజల అభివృద్ధి అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యక్షంగా వారితో సమయం గడపడం అనే ఆయన మానవీయ దృక్పథానికి విద్యార్థిగా ఉండగా నేను ఆకర్షితుడనయ్యాను. ఒక రాజుగా ఆయనకు అంత చేయవలసిన అవసరం లేదు. కానీ ఆర్థిక శ్రేయస్సు, ప్రజా సంక్షేమంపై ఆయన ఆసక్తి చివరికి ఆయన ఓ ‘సమృద్ధ ఆర్థిక వ్యవస్థ’ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడానికి దోహద పడింది. 1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం సమయంలో ఉన్నప్పుడు టెలివిజన్‌ ప్రసంగంలో ఆయన ఇలా అన్నారు: ‘‘దేశం పులిగా మారా లని దేశ ప్రజలు పిచ్చిగా కోరుకుంటున్నారు. పులిగా ఉండటం ముఖ్యం కాదు. దేశం సమృద్ధ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం ముఖ్యం. సమృద్ధిగా అంటే, మనల్ని మనం పోషించుకోవడానికి తగి నంతగా.’’ ఈ మాటలు ప్రస్తుతం భారత్‌కు కూడా వర్తిస్తాయి. 

ఏదేమైనా అభివృద్ధి చక్రానికి స్థిరత్వపు ఇరుసు లాంటి ఆ ‘సమృద్ధ ఆర్థిక వ్యవస్థ’ సిద్ధాంతం నేడు థాయ్‌లాండ్‌లోని 23 వేల గ్రామాల్లో ఆచరణలో ఉంది. ఎగుమతులపై దృష్టి పెట్టడానికి బదులు, స్వయం సమృద్ధిని నిర్మించడం అనే భావనపై ఆ సిద్ధాంతం ఆధారపడి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మట్టి పునరుత్పత్తి, సూక్ష్మక్రిమి కణాల సేకరణలతో పాటు అనేక అభివృద్ధి ప్రణాళికల కోసం కృషి చేసిన థాయ్‌ రాజును ఐక్యరాజ్య సమితి 2006లో తన మొదటి ‘మానవాభివృద్ధి అవార్డు’కు ఎంపిక చేసింది. ఆయనకు ప్రపంచంలోని మొట్టమొదటి, ఏకైక ‘అభివృద్ధి రాజు’గా గుర్తింపు ముద్ర వేస్తూ, ఆనాటి సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌... ‘‘థాయ్‌లాండ్‌లోని పేద, అత్యంత బలహీన వర్గాల ప్రజల చెంతకు.. వారి స్థితి, జాతి లేదా మతంతో సంబంధం లేకుండా థాయ్‌ రాజు వెళ్లారు. వారి జీవితాలను వారే తమ చేతుల్లోకి తీసుకునే సాధికారతను వారికి ఇచ్చారు’’ అని కీర్తించారు. 

అనేక విధాలుగా ఛార్లెస్‌ కూడా తనను కేంద్ర స్థానంలో నిలబెట్టే ఒక వారసత్వాన్ని పంచుకున్నారు. ప్రపంచానికి ఇప్పుడు సుస్థిరతపై దృష్టిని మళ్లించగల కొన్ని తెలివైన స్వరాల అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణతో పాటు, అసమానతలు మరింత పెరిగేందుకు దారితీసిన ఆర్థిక మాంద్యంపై కచ్చితంగా ఆయన దృష్టి సారించాలి. ఎలాంటి రాజకీయ వివాదాలలోకీ వెళ్లకుండా, నిస్పృహలు పెరుగు తున్న ఈ సమయంలో ఆశలను పెంపొందించేందుకు ఈ కొత్త రాజు ఒక కొత్త రాచరిక పాత్రను సులభంగా పోషించగలరని నేను విశ్వసి స్తున్నాను. 


వ్యాసకర్త: దేవీందర్‌ శర్మ, ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
(‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

ఈ–మెయిల్‌: hunger55@gmail.com

 

మరిన్ని వార్తలు