ప్రజల గుండె చప్పుడు

15 Feb, 2022 00:58 IST|Sakshi

సందర్భం

పరిచయం అక్కర్లేని పేరు కామ్రేడ్‌ బొమ్మగాని ధర్మ భిక్షం. కమ్యూనిస్టు పార్టీకే కాకుండా, అన్ని పార్టీలు వర్గాలు, ప్రాంతాలకు అతీ తంగా మూడు నాలుగు తరాలకు నాయకత్వం వహించి, నాయకులను అందించిన మహోన్నతుడు. ఆయన జీవి తంలో అనేక కోణాలు ప్రస్ఫుటమవుతాయి. విద్యార్థి నాయకునిగా, స్పోర్ట్స్‌మన్‌గా, జర్నలిస్టుగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, సంఘసంస్కర్తగా, శాసనసభ్యునిగా, లోక్‌సభ సభ్యునిగా, కార్మికోద్యమ నాయకునిగా  అమోఘమైన పాత్రను నిర్వర్తరించారు. 

బొమ్మగాని ధర్మభిక్షం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేటలో సరిగ్గా నేటికి వందేళ్ల క్రితం జన్మించారు. పిన్నవయస్సులోనే జాతీయ భావాలను పునికిపుచ్చుకున్న గొప్ప యోధుడు ఆయన. విద్యా ర్థిగా ఉంటూనే సూర్యాపేట పాఠశాలలో నిజాం నవాబు జన్మదిన వేడుకలలో పరేడ్‌ నిర్వహించకుండా విద్యార్థుల చేత బహిష్కరింపజేసిన సంఘటన ఆ రోజుల్లో నైజాం సంస్థానంలో సంచలనం సృష్టిం చింది. చదువే గగనమైన ఆ రోజుల్లో విద్యార్థులకు విద్యనందించాలని గొప్ప సంకల్పంతో హైదరాబాద్‌ లోని రెడ్డి హాస్టల్‌ నిర్వహణ గురించి తెలుసుకొని... ఆయన విద్యార్థిగా ఉంటూనే ప్రజా విరాళాలు సేక రించి సూర్యాపేటలో రెడ్డి హాస్టల్‌ ఏర్పాటు చేసి విద్యార్థులకు వసతితోపాటు విద్యను అందించారు.

సూర్యాపేటలో నడుస్తున్న రెడ్డి హాస్టల్‌ వార్షికోత్సవ సభకు వచ్చిన డాక్టర్‌ రాజబహదూర్‌ వెంకటరామి రెడ్డి... ఒంటి చేత్తో ధర్మభిక్షం విరాళాలు సేకరించి హాస్టల్‌ నిర్వహిస్తున్న తీరును తెలుసుకొని అబ్బుర పడ్డారు. ‘‘ఒక చేతితో విరాళాల సేకరణ చేసి, మరొక చేతితో విద్యార్థులకు విద్యను అందించడానికి ధర్మం చేసిన వ్యక్తి పేరు కేవలం భిక్షం కాదు, నేటి నుండి ఆయన ధర్మభిక్షం’’ అని కొనియాడారు. ధర్మభిక్షం నిర్వహించిన హాస్టల్‌ అనేక మంది యోధులను తెలం గాణ సాయుధ పోరాటానికి అందించిన కార్ఖానాగా నిలిచింది. అందులో ఒకరైన పసునూరు వెంకట్‌రెడ్డి వీరమరణం కూడా పొందారు. మాజీ మంత్రి ఉప్పు నూతల పురుషోత్తంరెడ్డి, అలనాటి సినీనటుడు ప్రభా కర్‌రెడ్డి కూడా ఆయన హాస్టల్‌ విద్యార్థులే. వీరు ఆయనను గురుతుల్యులుగా భావించేవారు. 

ధర్మభిక్షం ఆంధ్రమహాసభ పట్ల ఆకర్షితుడై ఆ తరువాత పరిణామ క్రమంలో కమ్యూనిస్టుగా రూపాంతరం చెందారు. యువకునిగా ఉన్న సమ యంలోనే ధర్మభిక్షంను ప్రమాదకరమైన వ్యక్తిగా నాటి నిజాం ప్రభుత్వం ప్రకటించడంతో, ఆయన 40వ దశకంలోనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలో ఉంటూనే నిజాం వ్యతిరేక పోరాటానికి యువకులను, కార్యకర్తలను సమీకరించి సాయుధ పోరాటానికి భూమికను సిద్ధం చేశారు.

ధర్మభిక్షం బైట ఉంటే ప్రమాదమనే ఉద్దేశ్యంతో అనేక  కుట్రలతో ఆయనను అరెస్టు చేసి సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్,  ఔరంగాబాద్, జాల్నా జైళ్లలో ఐదేళ్ళపాటు జైల్లో ఉంచారు. జైలు నుండి విడుదలై హైదరాబాద్‌ రాష్ట్ర శాసనసభకు 1952లో జరిగిన మొట్టమొదటి ఎన్ని కల్లో సూర్యాపేట నుండి పోటీ చేసి అత్యధిక మెజా రిటీతో గెలుపొందారు. ఆ తరువాత 1957లో ఏర్పడిన నకిరేకల్‌ నియోజకవర్గం నుండి, 1962లో నల్ల గొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. 1991, 1996లో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 

ప్రజలు సంఘటితమై ఉద్యమాలు చేయడం ద్వారానే సమస్యల పరిష్కా రంతో పాటు, హక్కులు సాధిం చుకోవచ్చని ధర్మభిక్షం బలంగా విశ్వసించే వారు. ఆయన పెట్టిన సంఘాలు కోకొల్లలు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కార్మికుల సంఘం, హోటల్‌ వర్కర్స్‌ సంఘం, లారీ డ్రైవర్స్‌ యూని యన్, గీతకార్మికుల సంఘం... ఇలా ఆయన అనేక సంఘాలు స్థాపించారు. 

ఐదుసార్లు చట్టసభ లకు ఎన్నికైనా ఎలాంటి భేషజాలు లేని నిగర్వి. ఆయన మరణించి 15 ఏళ్లవుతున్నది. ఈ తరానికి ధర్మభిక్షం సేవలు, పోరాట పటిమను అందించాల్సిన బాధ్యత మనందరిపైనా, ప్రత్యేకించి ప్రభుత్వం మీదా ఉన్నది. హైదరాబాద్‌ నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన చేసిన త్యాగాలను నేటి తరానికి తెలియజేయడానికి ఇంకా ఎన్నో కార్యక్ర మాలు  చేపట్టాలి.

-చాడ వెంకటరెడ్డి
వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

మరిన్ని వార్తలు