ముప్పు వచ్చేసింది... మనకు మరింత!

3 Sep, 2021 01:16 IST|Sakshi

సమకాలీనం

భూగోళమంతటికీ విస్తరించి మానవాళి మనుగడని భయాందోళనకు గురిచేస్తున్న ‘వాతావరణం మార్పు’ ప్రతికూల ప్రభావాలు.. కార్చిచ్చు, వరదలు వంటివి అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, టర్కీ వంటి దేశాలను తాజాగా గజగజలాడిస్తున్నాయి. ప్రపంచం మొత్తం అప్రమత్తమై వాతావరణ మార్పు ఉపద్రవాలపై కార్యాచరణను వేగవంతం చేయాల్సిన ప్రమాద స్థితికి చేరుకున్నాం. ముఖ్యంగా మన దేశం! ఈ ప్రమాదంలో భారత్‌ది మరింత దయనీయ పరిస్థితి అని ఇటీవలి ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది. వాతావరణ మార్పు అందరి సమస్య కనుక, ముఖ్య కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగానో, సాంకేతికంగానో అభివృద్ధి చెందుతున్న, చెందని సమాజాలకు సహకారం అందించాల్సి ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల రికార్డు వర్షం నిన్న 24 గంటల్లో కురిసింది. ఉత్తర అమెరికాను నూరేళ్లలో లేని ఎండలు ఇటీవల మండించాయి. కెనడా, బ్రిటిష్‌ కొలంబియాలో 49.6 (జోరెండకాలం, థార్‌ ఎడారిలో కన్నా ఎక్కువ) డిగ్రీలకు తాకిన ఎండవేడి వల్ల నెలలో 370 మంది మరణించారు. చైనాలో వర్షం–వరదలు వెయ్యేళ్ల కిందటి రికార్డును బద్దలు కొట్టాయి. కాలిఫోర్నియా, ఆస్త్రేలియా, ఆమెజాన్‌ (బ్రెజిల్‌), టర్కీ, చివరకు సైబీరియాలోనూ అడవులు అంటుకొని కార్చిచ్చు దీర్ఘకాలం రగులు తూనే ఉండింది. జర్మనీలో పట్టణాలు పట్టణాలనే ఊడ్చుకుపోయిన వరదలకు విస్తుపోయిన ఆ దేశ చాన్స్‌లర్‌ అంజెలీనా ‘ఈ వైపరీత్యాన్ని వర్ణించడానికి జర్మనీ భాషలో నాకు మాటలు దొరకటం లేద’ని కంటతడి పెట్టారు. ఏమిటిదంతా?  ‘వాతావరణం మార్పు’ ప్రతికూల ప్రభావాలివన్నీ! 
(చదవండి: పెట్రోల్‌ బంకుల్లోనే ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌)

వాతావరణ మార్పులపై ఏర్పడ్డ, యూఎన్‌ సభ్య దేశాల అంత ర్ప్రభుత్వ బృందం (ఐపీసీసీ) తన ఆరో నివేదికగా ‘మానవాళికి రుధిర సంకేతం’ పంపింది. దాన్ని ప్రపంచం ఎలా స్వీకరిస్తుంది? ఏ రీతిన– ఎంత వేగంగా స్పందిస్తుంది? అన్న దానిపైనే వచ్చే శతాబ్ది, ఆ మాట కొస్తే సహస్రాబ్ది మానవ మనుగడ ఆధారపడి ఉంటుంది. ప్రమాద తీవ్రతను గుర్తించి చేపట్టే ఏ కార్యాచరణకైనా ప్రస్తుత దశాబ్ది (2020 –30) ఎంతో కీలకమైందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రకృతిని వంచించిన మానవ తప్పిదాల వల్ల, కర్బన ఉద్గారాలు, ఇతర కాలుష్యాల కారణంగా భూతాపోన్నతి పెరుగుతోంది. 2100 నాటికి 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగనీ యకుండా కళ్లెం వేయాలన్న లక్ష్య సాధనకు, ఆచరణలో పట్టు సడలు తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే 1.09 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగింది. 2030 నాటికి ఇది 1.5 డిగ్రీలకు చేరే ప్రమాదాన్ని నిపుణులు శంకిస్తున్నారు. మొదట సహస్రాబ్ది లక్ష్యాలు (మిలీనియం గోల్స్‌), తర్వాత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీస్‌) ఏర్పాటు చేసు కొని పురోగమించాలని ప్రపంచ దేశాల ముందు యూఎన్‌ లక్ష్యాలు నిర్దేశించినా ఎవరికీ పట్టడం లేదు. ఆరేళ్ల కింద పారిస్‌లో సభ్య దేశాలన్నీ సమావేశమై ఒక చరిత్రాత్మక ఒప్పందం చేసుకున్నా... ఆశించిన స్థాయిలో ముందడుగు పడటం లేదు. వాతావరణ మార్పు లను దీటుగా ఎదుర్కొనే, తట్టుకొని నిలువగలిగే, నష్టనివారణతో సర్దుకు పోగలిగే చర్యలేవీ... స్వీయ ప్రతినల స్థాయిలో లేవు. 

మన కష్టాలు మనవి
భౌగోళిక, నైసర్గిక పరిస్థితుల దృష్ట్యా వాతావరణ మార్పు ప్రతి కూల ప్రభావాలు దక్షిణాసియాలో అధికం. అందులోనూ భారత్‌పై ఎక్కువ అని తాజా (ఐపీసీసీ) నివేదిక వెల్లడిస్తోంది. ఫలితంగా పౌరుల ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారోత్పత్తి వంటి అంశాల్లో తీవ్ర పరిణామాలుంటాయని అంచనా! ప్రపంచ సముద్రాల సగటుకన్నా హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కుతోంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం, అసాధారణ జనసాంద్రత, అతిగా భూమ్యావరణ వ్యవస్థ పాడవడం, నియంత్రణలో లేని కాలుష్యం, ఆహారోత్పత్తి– వినియోగానికి సంబంధించి సుస్థిరం కాని అననుకూల విధానాల్ని ఇంకా పాటించడం వంటివి ఈ దుస్థితికి కారణాలు.

అతి ఉష్ణోగ్రత వల్ల హిమాలయాల మంచు పొరలు కరగడం, కొండచరియలు విరిగి పడటం తరచూ జరుగుతోంది. ధ్రువాల మంచు కరుగుతున్నందున సముద్ర జల మట్టాలు పెరిగి, సుదీర్ఘ తీరమున్న భారత్‌ను ప్రమాదం లోకి నెడుతోంది. వాతావరణ మార్పు వల్ల మేఘ విచ్ఛిత్తితో అసాధారణ వర్షాలు, తుఫాన్లు, వరదలు వంటి వైపరీత్యాలు పెరుగు తాయి. ఇంకోపక్క కరువులు కూడా అధికమవడం మరో అరిష్టం!

వ్యవసాయాధారిత దేశమైన భారత్‌కి ఇదెంతో ప్రతికూలాంశం. వేగంగా నగర–పట్టణీకరణ జరుగుతున్న మన దేశంలో ఈ మార్పులు ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. ఇప్పటికే ముంబై, చెన్నై, హైదరాబాద్‌ సాధారణ వర్షాలకే అల్లాడే పరిస్థితిని యేటా కళ్ల జూస్తున్నాం. గత అయిదారేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ–వడగాలికి మరణిస్తున్న వారి సంఖ్య అసాధారణంగా ఉంటోంది. దేశంలో, 40 డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రత దినాలు యేడాదిలో బాగా పెరి గాయి. 2013–19 మధ్య ఇవి యేడాదికి సగటున 114 దినాలుగా నమోదయ్యాయంటేనే తీవ్రత అర్థమౌతోంది.

ఆ దేశాలు దిగిరావాలి
కాలుష్య కారకులే పరిష్కారాల వ్యయం భరించాలి. అవి దిద్దుబాటు చర్యలైనా, సుస్థిరాభివృద్ధి దిశలో అడుగులైనా, ముందు జాగ్రత్త చర్యలైనా... అని భారత సర్వోన్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో నొక్కి చెప్పింది. జెనీవా అంతర్జాతీయ న్యాయస్థానం కూడా చెప్పిందిదే! పారిశ్రామిక విప్లవ క్రమంలో, రెండో ప్రపంచ యుద్ధానంతరం పలు అభివృద్ధి చెందిన దేశాలు ప్రకృతి వనరుల్ని అడ్డదిడ్డంగా వాడుకున్నాయి.

ఏ జాగ్రత్తలూ తీసుకోనందున... కర్బన వ్యర్థాలు, వాయువులతో సహా పలు ఉద్గారాలకు కారణమయ్యాయి. సృష్టి పరిణామ క్రమంలో 8 లక్షల సంవత్సరాల్లో పెరిగిన భూతా పోన్నతి కంటే ఎక్కువగా గడచిన 200 సంవత్సరాల్లో పెరిగింది. ముఖ్యంగా గత వందేళ్లలో, మరీ ముఖ్యంగా ఇటీవలి 20 ఏళ్లలో ఈ పెరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. వాతావరణం, కాలుష్యం వంటి అంశాలపై స్పృహ పెరిగేనాటికే ఆయా దేశాలు ఒక స్థాయికి వెళ్లిపోయాయి. ఇప్పుడు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందే క్రమంలో చేపట్టే చర్యలపై కట్టడి గురించి అభివృద్ధి సమాజాలు మాట్లాడుతున్నాయి.

ఇది ఒక అసమతుల్య ప్రతిపాదన. పారిస్‌ సదస్సుకు ముందు ఇదొక పెద్ద చర్చ! మనిషి సౌఖ్యం అనుభవించే క్రమంలో... ఇప్పటికీ, ఆయా అభివృద్ధి సమాజాల సగటు ఉద్గారాలు అత్యధిక స్థాయిలోనే ఉన్నాయి. మనం ప్రపంచ సగటుకన్నా చాలా తక్కువ విడుదల చేస్తు న్నాము. ప్రపంచ సగటు తలసరి ఉద్గారాలు (ముఖ్యంగా కార్బన్‌ డయాక్సైడ్‌) 6.55 టన్నులైతే, భారత్‌ తలసరి సగటు 1.96 టన్నులు మాత్రమే! అదే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలలో రెండున్నర రెట్లు అధికంగా ఉంది. జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌ వంటి ఐరోపా సమాజ దేశాలు దాదాపు ప్రపంచ సగటుతో సమానంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న చైనా కూడా అంతే! వాతావరణ మార్పు అందరి సమస్య కనుక, ముఖ్య కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగానో, సాంకేతికంగానో అభివృద్ధి చెందుతున్న, చెందని సమాజాలకు సహకారం అందించాలన్నది అందరూ అంగీకరించిన సత్యం.
(చదవండి: అఫ్గాన్‌లో ఆహార కొరత తీవ్రం!)

మాట తప్పుతున్న జాడ...
ప్రపంచ దేశాలన్నీ వాతావరణ అత్యయిక స్థితిని ప్రకటించి, భూతాపోన్నతి నియంత్రించే సత్వర ఉపశమన చర్యలకు దిగాలి. మరోపక్క వాతావరణ బడ్జెట్‌ను రూపొందించుకొని ముందుకు కదలాలి. కోపన్‌హెగన్‌ (2009) సదస్సులో అంగీకరించినట్టు అభి వృద్ధి చెందిన దేశాలు ఏటా 100 బిలియన్‌ డాలర్లు ఆర్థిక సహాయం అందించాలి. కర్బన ఉద్గారాలను అదుపుచేసే అభివృద్ధి నమూనా సాంకేతికతను అభివృద్ధి చెందుతున్న, చెందని దేశాలకు బదలాయిం చాలి. ఇటీవల జరిగిన జీ–7 దేశాల సదస్సులోనూ ఇది చర్చకు వచ్చింది. జీ–20 దేశాలు, ఇంకా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమౌతున్నాయి. మాటలకు చేతలకు పొంతన లేకుండాపోతోంది. ఇది ఉమ్మడిగా నిర్వహించాల్సిన బాధ్యత. వచ్చే నవంబరులో గ్లాస్‌గో (స్కాట్లాండ్‌)లో జరిగే (కాప్‌– 26) సదస్సు నాటికి నిర్దిష్టమైన విధానాలతో ముందుకు రావాలి. అంతా కలిసి, చిత్తశుద్ధితో ముందుకు కదిలితేనే జఠిలమైన ఈ సమ స్యకు ఉపయోగకరమైన పరిష్కారం. మానవాళి మనుగడకు రక్ష!

దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com
(భారత్‌ తక్షణ కర్తవ్యం–వచ్చే వారం) 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు