లోకం చూపు టీకావైపు!

11 Jun, 2021 02:46 IST|Sakshi

సమకాలీనం

సరైన డాటా వెల్లడి, సముచిత నిర్ణయాలు, అమల్లో పారదర్శకతే కోవిడ్‌ విముక్తి పోరులో కీలకమని నిపుణులంటున్నారు. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులవడం–కోలుకోవడం వంటి విషయాల్లో నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలిస్తున్నారనే విమర్శలున్నాయి. మరో వంక, టీకామందు నిల్వల గురించి సమాచారం జనబాహుళ్యంలో పెట్టకూడదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్దిష్ట ఆదేశాలిచ్చింది. ఈ చర్యలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే యుద్ధంలో గెలుస్తాం. కోవిడ్‌ను ఓడించి నిలుస్తాం!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గి కోవిడ్‌ రెండో అల వెనక్కి జారుతున్న క్రమంలోనే... టీకా ప్రక్రియ (వ్యాక్సినేషన్‌) పైకి అందరి దృష్టీ మళ్లుతోంది. ఇప్పుడిదొక ముఖ్యాంశమైంది. కోవిడ మూడో అల రాకుండా, వచ్చినా తీవ్రత లేకుండా చూసుకోవాలంటే వేగంగా టీకా ప్రక్రియ జరిపించాలనేది దేశం ముందున్న లక్ష్యం. దీనిపై కేంద్ర– రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించాయి. తగు దిద్దుబాటు చర్యలతో, విధానమార్పు ప్రకటించిన ప్రధాని మోదీ, ఇకపై టీకామందును కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుందని చెప్పారు. ప్రక్రియను పరు గులు తీయిస్తామన్నారు. అదే సమయంలో ముళ్లపొదల్లా... పలు అంశాలు టీకా చుట్టే అల్లుంటున్నాయి. ఇందులో కొన్ని వ్యూహ వైక ల్యాలు, నిర్వహణా లోపాలు, విధానపరమైన వైఫల్యాలైతే మరికొన్ని అనుకోకుండా పుట్టుకు వచ్చిన సవాళ్లు! ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఈ చిక్కుముడులన్నిటినీ విప్పి ముందుకు సాగితేనే మనమీ ఉపద్రవం నుంచి తక్కువ నష్టంతో బయటపడగలుగుతాము. కోవిడ్‌ విషకోరల నుంచి విశాల భారతాన్ని కాపాడుకోగలుగుతాం. టీకామందుల తయారీలో ఘన చరిత్ర, పంపిణీలో మనకున్న సామర్థ్యాన్ని బట్టి ఈ పాటికి ప్రపంచంలోనే భారత్‌ ముందుండాల్సింది! మరెన్నో దేశాలకు ఆపన్న హస్తం అందించి ఉండాల్సింది. ఉంటామనే మొదట్లో మన ప్రధాని, దావోస్‌ ఆర్థిక సదస్సు వేదిక నుంచి ప్రపంచానికి తెలియ జెప్పారు. కానీ, ఆ పరిస్థితిపుడు లేదు. లక్ష్యం వైపు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నడుస్తున్నాం. అమెరికా, యూరప్, ఇతర అభివృద్ధి చెందిన సమాజాలు రెండు డోసుల టీకా ప్రక్రియ ముగించుకొని తలసరి రెండు, మూడు డోసుల టీకా భవిష్యత్తు కోసం రిజర్వు చేసుకున్నాయి. కెనడా ఒక్కో పౌరుడికి (తలసరి) 9 డోసుల చొప్పున రిజర్వు చేసు కుంది. క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తూ, పలు దేశాల్లో కట్టడి ఉపసంహ రిస్తున్నారు. జనజీవనాన్ని సాధారణ స్థాయికి తెస్తున్నారు. ఆర్థిక వ్యవ స్థల్ని పునరుత్తేజం చేస్తున్నారు. జనవరి మధ్యలో టీకా ప్రక్రియ ప్రారంభించిన మనం, ఇప్పటికి సుమారు 20 కోట్ల మందికి కనీసం ఒక డోసు, దాదాపు 5 కోట్ల మందికి సంపూర్ణ టీకా (రెండు డోసులు) ఇచ్చాం. 137 కోట్ల భారతావనిలో భారీ లక్ష్యాలే ముందున్నాయి.


శరవేగంతో వెళితేనే.....
ఆర్థిక వ్యవస్థను పూర్వపుబాట పట్టించాలంటే వాణిజ్యం, వ్యాపారం వంటి దైనందిన ప్రక్రియలు పూర్తిస్థాయిలో పనిచేయాలి. అందుకు, ‘సామూహిక రోగనిరోధకత’ (హెర్డ్‌ ఇమ్యూనిటీ) రావాలి. జనాభాలో 70 శాతం మందికి టీకామందు, కనీసం ఒక డోసైనా ఇస్తేనే ఇది సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నెలవారీ(మే) నివేదిక చెబుతోంది. సెప్టెంబరు మాసాంతానికి ఈ లక్ష్యం సాధించా లంటే సగటున రోజూ 93 లక్షల మందికి టీకా మందు వేయాలి. గడ చిన 5 మాసాల్లో అత్యధికమంటే, ఒక రోజు 42.65 లక్షల డోసులే ఇవ్వగలిగారు. ఈ వేగం సరిపోదు. ఇకపై స్వదేశీ ఉత్పత్తి పెరగడం, విదేశీ కంపెనీలతో కొనుగోలు ఒప్పందాలు, కేంద్రమే సమకూర్చుకొని పంపిణీ చేయడం, రాష్ట్రాలూ ఈపాటికే కోవిడ్‌ సెంటర్లను ఏర్పరచి నిర్వహిస్తున్నందున లక్ష్యం సాధ్యమే అంటున్నారు. నమోదు సైట్లు, టీకామందు సెంటర్లు, వైద్య–అనుబంధ సిబ్బంది, టీకామందు సరఫ రాలను సమన్వయ పరచి, రాత్రీపగలు (27/7) శ్రమిస్తే లక్ష్యం సాధ్య మేనని నివేదిక పేర్కొంది. టీకామందు ఉత్పత్తిపై సందేహాలు, అపో హలతో టీకాకు పౌరుల వెనుకంజ, ఇతర నిర్వహణా లోపాల్ని అధిగ మించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వివిధ కంపెనీల టీకామం దుల్లో ధర వ్యత్యాసాల సమస్య అలాగే ఉంది. సుప్రీంకోర్టూ దీన్ని తప్పుబట్టింది. ప్రయివేటు ఆస్పత్రులకు 25 శాతం టీకామందు కేటా యింపు, వారి దోపిడీకి లైసెన్సు ఇవ్వడమేననే విమర్శలున్నాయి. కోవిడ్‌ సమాచార వెల్లడిలో పారదర్శకత లోపిస్తోందనే ఆరోపణలు న్నాయి. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్లుహె చ్‌వో) అనుమతించిన జాబితాలోకి, స్వదేశీ టీకామందు కోవాక్సిన్‌ (భారత్‌ బయోటెక్‌ వారి ఉత్పత్తి) ఇంకా ఎక్కకపోవడం పెద్ద సమ స్యగా మారుతోంది. ఈ టీకా రెండు డోసులు తీసుకున్నా, దాన్ని ‘వాక్సినేషన్‌’గా పరిగణించక పలు దేశాలు అనుమతి నిరాకరిం చడంతో, భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాలకిది అవరోధంగా మారింది. కోరిన సమాచారం కంపెనీ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం మరింత చొరవతో సత్వరం డబ్లుహెచ్‌వో ఆమోదం తీసుకురావాలి.


ఉత్పత్తి ఊపందుకోవాలి
దేశీయ, విదేశీ కంపెనీలయినా టీకామందు ఉత్పత్తి ఎన్నో రెట్లు పెంచాలి. సెప్టెంబరు–డిసెంబరు మధ్య 216 కోట్ల డోసుల ఉత్పత్తి చేస్తామని కేంద్రం లోగడ ప్రకటించింది. కానీ, ఇదే కాలంలో సరఫ రాకై 44 కోట్ల డోసుల ఉత్పత్తికి ఆర్డర్లు, అడ్వాన్సులు ఇస్తున్నట్టు ఇటీ వలే వెల్లడించింది. ఎందుకీ వ్యత్యాసమో తెలియదు. దాదాపు 90 శాతం ఉత్పత్తికి బాధ్యత వహిస్తున్న భారత్‌ సీరమ్‌ సంస్థ (కోవీషీల్డ్‌) ఇకపై ఉత్పత్తిని పెంచనున్నట్టు పేర్కొంది. ముడి పదార్థాల దిగుమతి ఓ సమస్యగా ఉండింది. కేంద్ర ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత అమెరికా (యుఎస్‌), ఆయా పదార్థాల ఎగుమతు లపై ఉన్న నిషే«ధం తొలగించింది ‘అమెరికా రక్షణ ఉత్పత్తుల చట్ట’ నిబంధనల్ని సడలిం చామని యుఎస్‌ అధికారవర్గాలు వెల్లడించాయి. ముడిసరుకు దేశానికి వచ్చి, ఉత్పత్తి పెరిగేది ఆగస్టు నెలాఖరులోనే! భారత్‌ బయోటెక్‌ సంస్థ కూడా తమ ఉత్పత్తుల్ని జూన్‌ నుంచి పెంచుతున్నట్టు చెప్పింది. జూలైలో 7.4 కోట్ల డోసులు ఈ సంస్థ ఉత్పత్తి చేయనుందని కేంద్రం వెల్లడించింది. ఇదంతా గజిబిజిగా ఉంది. ఫైజర్‌ (యూఎస్‌) టీకా మందు ఉత్పత్తి చేసే కంపెనీ, తాము భారత్‌లో సరఫరాకు ఒప్పందం కుదుర్చుకోవాలంటే న్యాయపరమైన రక్షణ కల్పించాలని కేంద్ర సర్కా రును అడుగుతోంది. పాక్షికంగా కల్పించే అవకావాలున్నాయి. స్వదే శీతో సహా ఇప్పటి వరకు ఏ కంపెనీకి ఇటువంటి రక్షణ కల్పించలేదు.


ధరల్లో అసాధారణ తేడా!
లాభాపేక్షలేని పద్ధతిన భారత్‌లో పది డాలర్ల (రూ.730)కే ఒక్కో డోసు టీకామందు ఇస్తామని ఫైజర్‌ ఉత్పత్తిదారు చెబుతోంది. ఇదే కంపెనీ అమెరికాలో, ఐరోపాలో ఇస్తున్న ధర కంటే ఇది తక్కువ. అంటే, భారత్‌లో ఇది దేశీయ ఉత్పత్తి కోవిషీల్డ్‌ ధర (రూ.780) కన్నా తక్కువ! మరి, రష్యాకు చెందిన స్పుత్నిక్‌–వి (రూ.1145), మరో దేశీయ ఉత్పత్తి కోవాక్సిన్‌ (రూ.1410) ధరలు ఎందుకంత ఎక్కువ అనేది ప్రశ్న. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు 25 శాతం కోటా కేటా యించిన నేపథ్యంలో, ఈ ధర వ్యత్యాసం పలు సమస్యలకు దారి తీస్తుందని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అభిప్రాయ పడింది. టీకామందు ఉత్పత్తి ఫార్ములాలను బట్టి ఈ వ్యత్యాసమని, అధికధర నిర్ణయించిన కంపెనీలు చెబుతున్నాయి. అడెనోవైరస్‌ ఫార్ములాతో రూపొందించే మిగతా టీకామందు తయారీ చౌకలో అవుతుందని, తమలా ఇనాక్టివేటెడ్‌ వైరస్‌ వినియోగ ఫార్ములా వల్ల, పెద్దమొత్తంలో ఉత్పత్తి చేసినా వ్యయం తగ్గదని కోవాక్సిన్‌ ఉత్పత్తి దారు చెబుతున్నారు. ధర ఎక్కువున్నప్పటికీ, ఆయా టీకా మందుల సామర్థ్యం తక్కువని వస్తున్న అధ్యయనాలు పౌరుల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. సదరు నివేదికలు సత్య దూరం, అసమగ్రమని ఉత్ప త్తిదారు అంటున్నారు. ఏమైనా.. ప్రభుత్వం ఇంకా సమర్థంగా ఆయా కంపెనీలతో చర్చించి, సహేతుక ధరల్ని ఖరారు చేసుండాల్సింది.


సరైన డాటా వెల్లడి, సముచిత నిర్ణయాలు, అమల్లో పారదర్శకతే కోవిడ్‌ విముక్తి పోరులో కీలకమని నిపుణులంటున్నారు. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులవడం–కోలుకోవడం వంటి విష యాల్లో నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలిస్తున్నారనే విమర్శ లున్నాయి. మరో వంక, టీకామందు నిల్వల గురించి సమాచారం జనబాహుళ్యంలో పెట్టకూడదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్దిష్ట ఆదేశాలిచ్చింది. ఈ చర్యలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే యుద్ధంలో గెలుస్తాం. కోవిడ్‌ను ఓడించి నిలుస్తాం!


దిలీప్‌ రెడ్డి 
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

మరిన్ని వార్తలు