పట్టపగ్గాల్లేని ‘బరి’తెగింపు

25 Sep, 2020 00:48 IST|Sakshi

సమకాలీనం

‘అవినీతికి మూల్యం చెల్లించేది పేదలే’ అంటారు పోప్‌ (ఫ్రాన్సిస్‌). నిజమే! మన వ్యవస్థలో వేర్లు విస్తరించి, ఊడలు బలిసిపో యిన అవినీతికి అంతిమ బాధితులు నిరుపే దలు, నిస్సహాయులు. ప్రత్యక్షంగా పనులు జరుగక, ఫలాలు అందక ఒకసారి, వ్యవస్థ లన్నీ నిర్వీర్యమై అవకాశాలేవీ దక్కక అట్ట డుక్కు నెట్టేయబడి మరోసారి... వంచితుల య్యేది వారే! సంపద ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్న వాళ్లు అడ్డదారుల్లో అవినీతిని పెంచి పోషించడానికి వెచ్చించే మొత్తాల్ని తమ వ్యయంలోనో, పెట్టుబడిలోనో భాగంగానే లెక్కేసుకుంటున్నారు. పెట్రేగుతున్న అవినీతితో పాలనా వ్యవస్థలతో పాటూ, అంతిమంగా ప్రజాస్వామ్యమే విశ్వసనీయత కోల్పోతోంది. రాజకీయ వ్యవస్థ కనుసన్నల్లోనో, అంటకాగుతూనో జరిగే అధికారిక అవినీతి తారస్థాయికి చేరింది. మన తెలుగునాట అధికారుల అవినీతి బాగోతాలు బట్టబయలవుతున్న తీరు, వారి వద్ద జమవుతున్న నికృష్ట సంపద గగుర్పాటు కలిగిస్తోంది.

మొన్నొక ఈఎస్సై అధికారిని, మరో ఎమ్మార్వో, నిన్న ఓ అడిషనల్‌ కలెక్టర్, నేడు ఏసీపీ! ఇలా ఎందరెం దరో... ఇది దొరికిన దొంగల సంగతి! అదేదో ఇంగ్లీషులో సామెత చెప్పినట్టు దొరకనిది కొండంత, దొరికేది పిసరంత. చట్టాల్లో లోపాలు, అపరిమిత నియంత్రణ, సంక్లిష్టమైన పన్నులు–లైసెన్సు విధానం, లోపించే పారదర్శకత, అధికారుల విచ్ఛలవిడి నిర్ణయాధికారం... అన్నీ వెరసి అవినీతికి ఆస్కారం పెంచుతున్నాయి. భూముల విలు వలు అసాధారణంగా పెరిగి, దాన్నొక వినిమయ వస్తువు చేసిన వైనం అవినీతిని అమాంతం పెంచేసింది. తేరగా గడించే నల్లధనం– భూమిపై పెట్టుబడి–భూలావాదేవీ లాభాల్ని నల్లధనంగా మార్చడం.. ఇదొక విషవలయం. ఇవన్నీ ఒక ఎల్తైతే మన ఆలోచనా ధోరణి అవి నీతికి ఆజ్యం పోస్తోంది. అవినీతిని సమకాలీన సమాజమే పెంచి పోషిస్తున్నట్టుంది. ఎలా సంపాదించినా సరే, సంపద కలిగినోడికున్న గౌరవం, మర్యాద నిజాయితీ పరులైన పేదలకు, సామాన్యులకు సమాజంలో దక్కడం లేదు. నిజాయితీ అధికారులకు అసలు గుర్తింపే లేకపోవడం వ్యవస్థలోని పెద్ద లోపం. కొత్త తరాన్ని సమాజం పెంచు తున్న తీరు కూడా లోపభూయిష్టమే. అవినీతికి పాల్పడి దొరికితే పరువుపోతుందనో, శిక్ష పడుతుందనో అధికారుల్లో భయమేలేని నిర్బీతి నేటి విచ్చలవిడి అవి నీతికి ప్రధాన కారణం. మన నేర దర్యాప్తు–న్యాయ విచారణ వ్యవస్థ అవినీతి పరుల్ని ఏ మాత్రం భయ పెట్టలేని స్థితికి రావడం ఆందోళనకరం.

ఇంత బరితెగింపా?
పట్టుబడినా ఏమీ కాదన్న ధీమాయే అధికారుల విచ్ఛలవిడి తనానికి కారణం. అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) నమోదు చేస్తున్న వేర్వేరు కేసుల్లో కొనదాకా నిలిచేవి చాలా తక్కువ. లంచం తీసుకుంటూ పట్టు బడ్డ (ట్రాప్‌) కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, ఇతర అవినీతి కేసుల్లో విచారణలు సజావుగా సాగి, అభియోగాలు నిర్ధారణ అయి, శిక్షలు పడ్డ కేసుల కన్నా నిందితులైన అధికారులు నిక్షేపంగా బయటపడ్డ కేసులే ఎక్కువ. కొలిక్కి వచ్చే కొన్ని సందర్భాలూ చిన్న మొత్తాల అవినీతి కేసులే తప్ప బడాబాబులవి కావు! పైరవీలకు ‘సచి వాలయం’తో సంపర్కం లేనివాళ్లు, దళారుల్ని పట్టుకునే ‘వ్యవహార దక్షత’ లేనివాళ్ల కేసులే కడదాకా నిలుస్తాయి. సాక్ష్యాలు దొరకకో– నిలువకో, సాక్షులు మాట మార్చో, తదుపరి దర్యాప్తుల్ని సాగనీయకో, చర్యల్ని నిలిపివేయించుకునో.. కారణాలేమైతేనేం వారు శిక్షలు తప్పిం చుకుంటున్నారు. చూస్తుండగానే తిరిగి పోస్టింగ్‌ తెప్పించుకుంటు న్నారు. సస్పెన్షన్‌ కాలపు జీతాల్ని కూడా తిరిగి పొందుతున్నారు. అవేవీ రాకపోయినా సరే! లేకపోతే, ఏ దైర్యంతో... ఒక అధికారి 40 లక్షల నగదు తీసుకొని, లంచం కింద భూమి రిజిష్టరు చేయించు కుంటాడు? న్యాయమూర్తి అయ్యుండీ కోట్ల రూపాయల లంచం డబ్బును ఏకంగా బ్యాంకులో ఎలా జమచేసుకుంటారు?  ప్రభుత్వ అధికారిగా, మరో ఆదాయవనరు లేకుండా రూ.7 కోట్లతో నగలెలా కొంటారు? రెండు కోట్ల లంచం, కోటి పదిలక్షల రూపాయల నగ దుతో పట్టుబడ్డ అధికారి నిర్వాకాన్ని, అవినీతిలో ప్రపంచ రికార్డుల కెక్కించమని గిన్నిస్‌ సంస్థకు వినతిపత్రం వెళ్లిందంటే, మన కీర్తి ఏ స్థాయిలో ఉందో ఊహించొచ్చు. ఏపీలో ఒక నకిలీ ‘ఏసీబీ అధికారి’ పోలీసులకు దొరికాడు. అతన్ని పట్టుకొని కూపీ లాగితే, 18 మంది పెద్ద అధికారుల వద్ద ‘కేసు చేస్తా’మని భయపెట్టిన ముఠా డబ్బు గుంజినట్టు తేలింది. అంటే, ఎంత విచ్ఛలవిడిగా అవినీతికి పాల్పడి అక్రమార్జన చేస్తే, దారిన పోయే దొంగ ఏసీబీ అధికారులకూ చేయి తడుపుతారు? ఆ 18 మందిపై తర్వాత అసలు ఏసీబీ కేసులు నమోదు చేసింది, అది వేరొక పరిణామం! చట్టమంటే భయం లేదు. నేర దర్యాప్తంటే లెక్కలేదు. అక్రమార్గంలో వచ్చిన సంపాదనలో కొంత వెచ్చిస్తే ఉపశమన మార్గాలవే దొరుకుతాయ్, ఇదీ వరస!

‘భూ’మాయ !
పట్టణాలు, నగరాల శివారుల్లో  భూముల విలువలు అమాంతం పెరిగిపోవడంతో అవినీతికి రెక్కలొచ్చాయి. భూలావాదేవీలతో ప్రత్య క్షంగా, పరోక్షంగా సంబంధమున్న అధికారుల్లో కొందరి నిర్వాకాలకు పట్టపగ్గాల్లేవు. డబ్బిస్తే ఏమైనా చేయగలరు. దీనికి ఆడా మగ తేడాయే లేదు. తన భూమిని ఇతరులకు పట్టా రాయించారనే కోపంతో ఒక కక్షిదారు ఏకంగా ఓ మహిళా ఎమ్మార్వోను ఆఫీసులోనే నిప్పంటించి కాల్చే శాడు, అదే మంటల్లో తానూ చచ్చాడు. ఇంకో ఎమ్మార్వో వద్ద ఏసీబీ అధికారులు రూ.30 లక్షలు స్వాధీనపరచుకోవడంతో భర్త అవ మాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే భూవివాదంలో ఆర్‌ఐ కూడా నగదుతో పట్టుబడ్డాడు. గతేడాది శివారు ఎమ్మార్వో వద్ద రూ. 93 లక్షల నగదు దొరికింది. ఇప్పుడు ఏసీబీకి దొరికిన పోలీస్‌ అధికారి (ఏసీపీ) పెద్దఎత్తున సివిల్‌ దందాల్లో తలదూర్చి, భూలావాదేవీలు జరిపి అక్రమార్జన చేశారని అభియోగం. రూ.కోటి నగదుతో పట్టుబడ్డ ఎమ్మార్వో, కోటిన్నర రూపాయల అవినీతి డీల్‌ చేసుకున్న జిల్లా అధి కారి... వీరందరివీ భూదందాలే! భూమి ధరలు అసాధారణంగా పెర గడంతో అక్రమార్జన పెట్టుబడి తరలివస్తోంది. నిర్ణయాధికారం ఉన్న అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. ‘ఆ సర్వే నంబర్లో అప్పనంగా మీకంత ప్రయోజనం కలుగుతున్నపుడు, అందులో మాకొక 5 లక్షల రూపాయలిస్తే మీకేంటి నష్టం?’ అని ఓ ఎమ్మార్వో బహిరంగంగా అన్నారంటే, పరిస్థితికి ఇది అద్దం పట్టేదే! ఎక్కడో సంపాదించిన పెద్ద మొత్తాలు, నల్లధనం భూముల కొనుగోళ్లకు పెట్టుబడు లవు తున్నాయి. స్వల్పకాలంలో అసాధారణంగా ధరలకు రెక్కలొచ్చిన భూక్రయవిక్రయ లాభాలు మరెక్కడో నల్లధనంగా పోగవుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత, రెండు లక్షల రూపాయలకు మించి నగదు వ్యవహారాలు జరుపొద్దన్న ప్రభుత్వ నిబంధనలు గాలికిపోయాయి. సందట్లో సడే మియ్యాల్లా ఈ వ్యవహారాల్లో తమ అవసరాల్ని, అవకా శాల్ని అవినీతి అధికారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే, అవినీతిలో రెవెన్యూ శాఖది అగ్రతాంబూలం. ఇదే వరుసలో ఎకై్జజ్, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్టీయే, వాణిజ్యపన్నులు వంటి శాఖలు న్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కస్టమ్స్, రైల్వే, వస్తు–సేవా పన్నులు తదితర శాఖల్లో అవినీతి పెద్ద మొత్తాల్లోనే!

విలువల పతనం అరిష్టాల మూలం
అధికారిక అవినీతికి మూలాలు రాజకీయాల్లో ఉంటాయన్నది కౌటి ల్యుని రాజనీతి శాస్త్రం నుంచి నేటి వరకు ఎడతెగని సత్యం. రాజకీయ నాయకుల బెదిరింపులో, లొంగదీసుకోవడాలో, కూడబలుక్కోవ డమో... నమూనా ఏదైతేనేం అత్యధిక సందర్బాల్లో అధికారుల అవి నీతికి రాజకీయాలే ప్రేరణ! అధికారుల అవినీతి విడిగా చూడదగ్గ, రాజకీయాలకు పూర్తిగా సంబంధంలేని వ్యవహారమైతే కాదు. కీలక స్థానాల్లోకి అధికారుల బదిలీలు జరిపించడం, నిలువరించడం కొందరు నాయకులకొక ఫక్తు వ్యాపకం. చట్టాల్ని ఉల్లంఘించే వక్ర మార్గాలకు వారిపై వత్తిడి పెంచి చేయించుకునే నాయకులు, ప్రజా ప్రతినిధులు అన్ని స్థాయిల్లోనూ ఉన్నారు. మరికొన్ని సార్లు సఖ్యత కుదిరి, దోపిడీ సొత్తు తగుపాళ్లలో పంచుకునే అధికార–రాజకీయ జోడిగుర్రాల అవినీతి పరుగుకూ పట్టపగ్గాల్లేవు. నాయకులు ఒత్తిడి తెచ్చి ఒకటి, అర తప్పుడు పనులు చేయించుకుంటే, అదే బాటలో చడీచప్పుడు లేకుండా తాము నాలుగయిదు చేసుకునే అధికారులకూ కొదువ లేదు. వినని వారిని వేధిస్తుంటారు. అక్రమార్జన వక్రమార్గంలో తమ దారికి రాకుంటే, సదరు అధికారుల్ని తప్పుడు కేసుల్లో నేతలు ఇరికించే సందర్భాలూ ఉన్నాయి. దీన్ని పరిహరించేందుకే, విజిలెన్స్‌ కేసుల్లో దర్యాప్తు అనుమతి అధికారం ప్రభుత్వం చేతిలో ఉండేట్టు ప్రతి పాదించినా, సుప్రీంకోర్టు అందుకు సమ్మతించలేదు. రాజ్యాంగపు సమానత్వ హక్కుకి భంగమని అనుమతి నిరాకరించింది. అలా ఏక పక్ష నిర్ణయాధికారం సర్కారు చేతిలో ఉండటం కూడా ప్రమాద కరమే!

ఏకకాలంలో అనేక చర్యలే మార్గం
అధికారిక అక్రమార్జన సంస్కృతిని రూపుమాపాలి. చట్టాలను పటిష్ట పరచడంతో పాటు పాలనలో పూర్తి పారదర్శకత తేవాలి. పలు పాలనా వ్యవహారాల్ని ‘ఆన్‌లైన్‌’ చేసిన తర్వాత అవినీతి తగ్గినట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధారాలున్నాయి. దీనిపై అధ్యయనం చేసిన ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ మీడియా సర్వీసెస్‌ (సీఎమ్మెస్‌), అవునని నిర్దారించింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిషన్‌ ఇదే ప్రతిపాదించింది. విప్లవాత్మక సమాచార హక్కు చట్టం దీన్ని ధృవపరిచింది. అధికారుల విచక్షణాధికారాలకు కత్తెర పడాలి. అవినీతి బాహాటంగా ఉండి, తమకు అన్యాయం జరిగినపుడు... పౌరులు గొంతెత్తి పోరాడ్డానికి పలు ప్రజాస్వామ్య వేదికలుండాలి. మానవహక్కుల సంఘం, విజిలెన్స్‌ కమిషన్, లోకాయుక్త, ఆర్టీఐ వంటి వ్యవస్థలు, సంస్థలన్నింటినీ పాలకులు నిర్వీర్యం చేయడమో, నీరుగార్చడమో చేస్తున్నారు. జన్‌లోక్‌పాల్‌కు మోక్షమివ్వరు. ఈ దుస్థితే పౌరుల పాలిట శాపమౌతోంది. మనుగడ కోసం మధ్యాహ్న భోజనమే ఆసరాగా బడికొచ్చే ఓ విద్యార్థికి, టీసీ ఇవ్వడానికి రెండు వేల రూపాయలు లంచమడిగితే ఇవ్వలేక బడి మానాల్సి వచ్చింది. ఆ అధికారిని ఏం చేయాలి? అవినీతి ఒక క్యాన్సర్‌. ఏం చేసైనా దాన్ని అంతం చేయాలి, లేకుంటే అది ప్రజాస్వామ్యాన్నే అంతం చేస్తుంది.

దిలీప్‌ రెడ్డి
–మెయిల్‌ : dileepreddy@sakshi.com

మరిన్ని వార్తలు