మలి సమరం మొదలు!

26 Nov, 2021 01:31 IST|Sakshi

సమకాలీనం

ఏడాది పాటు ఆందోళనలతో అశాంతి రగిల్చిన ఉద్యమ కారణమైన చట్టాలు ఎలాగూ రద్దవుతున్నాయి. దేశ అధిక సంఖ్యాకులైన రైతాంగానికి, కేంద్రానికీ మధ్య పోరు ముగిసింది. ఇక, ఉభయత్రా అంగీకార సయోధ్య తక్షణావసరం. తీవ్రంగా నలుగుతున్న వ్యవసాయ రంగానికి తదుపరి చర్యలు ఊరట కలిగించాలి. రైతులు ఎదుర్కొంటున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి.

కార్పొరేట్‌ శక్తులకు దన్నుగా కేంద్రం మూడు చట్టాల్ని తెచ్చిందని విమర్శిస్తున్న రైతు సంఘాలు, దేశవ్యాప్తంగా ఇప్పుడా విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతామని చెబుతున్నాయి. తదుపరి చర్యలన్నీ రైతు హితంలోనే చేపట్టాలి. చట్టాల రద్దు... ప్రజాభిప్రాయాన్ని మన్నించే అయితే, వ్యవసాయ సంస్కరణలకు కూడా అదే రాచబాట! వ్యవసాయ రంగానికి ఊరట!!

మూడు చట్టాల రద్దు, దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న వ్యవసాయ సంస్కరణల్ని వెనక్కి నెట్టినట్టా? ఇదేం అవాంతరం కాదా? ఇప్పుడిదొక చర్చనీయాంశం. దేశ రైతుల్ని ఉద్ధరించే సంస్కరణల బాటలో పెద్ద ముందడుగు అని చెప్పిన చట్టాల్ని ఉపసంహరించే ప్రక్రియ కేంద్రం ప్రారంభించింది. ప్రధాని ప్రకటన బాటలోనే బిల్లు ప్రతిపాదనల్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రేపు పార్లమెంటు సమావేశాల్లో రద్దు బిల్లును ఆమోదిస్తారు.

తదుపరి ఏంటి? కోరినట్టే చట్టాల రద్దు సాధించిన రైతు సంఘాలు తమ అసలు డిమాండ్‌తో స్వరం పెంచుతున్నాయి. వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు చట్టబద్దత వచ్చే వరకు ఆందోళన విరమించమంటున్నారు. మార్కెట్‌ వ్యవస్థ బలోపేతం డిమాండ్‌ కూడా ఉంది. ఈ మేరకు 40 సంఘాలతో శనివారం ఢిల్లీలో సమావేశమై సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) తమ భవిష్యత్‌ కార్యాచరణ ఖరారు చేయనుంది. రైతాంగం కోరుతున్నట్టు చర్చల ప్రక్రియ చేపట్టాలా? కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకోవాలా? వేర్వేరు అవకాశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు లోతుగా ఆలోచిస్తున్నారు.

ఏడాది పాటు ఆందోళనలతో అశాంతి రగిల్చిన ఉద్యమ కారణమైన చట్టాలు ఎలాగూ రద్దవుతున్నాయి. దేశ అధిక సంఖ్యాకులైన రైతాంగానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య పోరు ముగిసింది. ఇక, ఉభయత్రా అంగీకార సయోధ్య తక్షణావసరం. తీవ్రంగా నలుగుతున్న వ్యవసాయ రంగానికి తదుపరి చర్యలు ఊరట కలగించాలి. రైతులు ఎదుర్కొంటున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి. లాబీయింగ్‌లో సిద్ధహస్తులైన కార్పొరేట్లకు కాకుండా వ్యవసాయ సంస్కరణలు రైతుకు మేలు చేయాలి. విశాల ఆర్థిక సంస్కరణల్లో భాగమైన వ్యవసాయ సంస్కరణలే కాకుండా సంస్కరణల ప్రక్రియలోనూ మార్పు రావాలి.

చట్టబద్ధతే కీలకం
వ్యవసాయ సంస్కరణల్ని స్థూల దృష్టితో చూడాలి. ప్రభుత్వంతో పాటు రైతు నాయకులకు పట్టువిడుపులు అవసరం. ఉభయత్రా నిర్మాణాత్మక ప్రతిపాదనలు, ఆచరణాత్మక అంగీకారాలు కుదరాలి. తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, దానికో చట్టబద్ధత కావాలని ఇప్పుడు రైతాంగం కోరుతోంది. మద్దతు ధర, మార్కెట్‌ వ్యవస్థా కొనసాగుతాయని, దానికి ప్రయివేటు కొనుగోలు వ్యవస్థ తోడవుతుందని ప్రభుత్వం చెబుతోంది. చట్టబద్ధత కల్పిండానికి కొన్ని ఇబ్బందులున్నాయనేది ప్రభుత్వ వాదన. ప్రపంచ వాణిజ్య సంఘం (డబ్లుటీవో) ఒప్పందాల రీత్యా అంతర్జాతీయ న్యాయ సూత్రాల వల్ల ఈ విషయంలో భిన్నమైన ఒత్తిళ్లున్నాయి.

వారేమో, ఏ సబ్సిడీలైనా పది శాతాన్ని మించొద్దంటారు. అందుకు అంగీకరించకుండా, వాయిదాలు వేస్తూ వచ్చింది ఇదివరకటి యూపీఏ ప్రభుత్వం. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడులు, ఎగుమతి–దిగుమతుల వంటి అంశాల దృష్ట్యా ఈ అంకానికి తెర తీసే ఆలోచన ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం చేస్తోంది. కానీ, కనీస మద్దతు ధర ప్రకటనకు, ఖచ్చితమైన అమలుకు చట్టబద్ధత ఉంటేనే మేలని రైతాంగం కోరిక. దాంట్లోనూ లోపాలున్నాయి. కొన్ని (23) పంటలకే ఎమ్మెస్పీ ప్రకటన, రెండు పంటలకే ప్రభుత్వం ధాన్యం సేకరణ, దానికీ భరోసానిచ్చే స్థాయి మార్కెట్‌ వ్యవస్థ లేకపోవడం ప్రధాన సమస్యలు.

చిరుధాన్యాలకూ ఎమ్మెస్పీ ఉండాలి, గణింపు శాస్త్రీయంగా జరగాలి, సగటు పద్ధతిన కేంద్ర స్థాయిలో కాకుండా.. పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్రాల వారీ ఎమ్మెస్పీ ఉండాలని రైతులు కోరుతున్నారు. పంజాబ్‌లో ఉన్నట్టు ప్రతి 25 చ.కి.మీ పరిధికి ఒక మార్కెట్‌ యార్డ్‌ ఉండాలనేది వారి వాదన. ఎమ్మెస్పీ ఉల్లంఘనలకు శిక్షలుండాలి. చట్టబద్ధతకు కొత్తగా కమిటీ వేసి కాలాయాపన చేయడంకన్నా, లోగడ ముఖ్యమంత్రుల బృందం ఇచ్చిన ప్రతిపాదన ఆమోదించాలని రైతు నేతలంటారు. మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి (ప్రస్తుత ప్రధాని) నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఈ బృందం ఎమ్మెస్పీ చట్ట ముసాయిదా ప్రతిపాదించింది.

రెట్టింపు ఆదాయం ఎలా?
వచ్చే జనవరి నాటికి రైతుకు రెట్టింపు ఆదాయం వచ్చేలా చేయడం లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. ఆ దిశలో రైతు ఆదాయం పెరగపోగా పడిపోతోంది. మార్కెట్‌ మాయాజాలంలో పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టుంది రైతు పరిస్థితి. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు లేక, నువ్వా–నేనా అనే కేంద్ర–రాష్ట్ర వివాదాల్లో రైతు నిత్యం నలుగుతున్నాడు. వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలు కూడా వ్యవసాయంపై మొదలయ్యాయి. ఒక సర్వే (ఎస్యేఎస్‌) ప్రకారం కర్షక కుటుంబాల రోజువారీ సగటు సంపాదన రూ.277 (ఉపాధిహామీ దినకూలీ సమానం) గా తేలింది. దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో రైతుల సగటు నెలసరి రాబడి రూ. 4–10 వేల మధ్య ఉంది.

దేశంలో 80 శాతం సన్న చిన్నకారు రైతులే! ఆదాయం లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పిల్లల చదువులు, వైద్యం, పెళ్లిల్ల వ్యయాలు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రోజుకు సగటున 2000 మంది వ్యవసాయం నుంచి ఇతరేతర వృత్తులకు మళ్లుతున్నారు. ఎమ్మెస్పీనే కాక... భూమి, కూలీలు, పెట్టుబడి, విత్తనం, రుణం, వాతావరణం, ఉత్పత్తి, ధర, మార్కెట్‌... అన్నీ సమస్యలే! ఇంతటి దయనీయ స్థితిలో దేశానికి అన్నం పెట్టే రైతు కోలుకోలేకుండా ఉంటే, మన ఒప్పందాలు, సంస్కరణలు అతన్ని ఆదుకునేలా కాక మార్కెట్‌ శక్తులకు దన్నుగా ఉంటే ఎలా? అన్న ప్రశ్న రైతు ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు పెంచింది.

రైతుల ఆర్థిక స్వేచ్ఛ కోరిన దివంగత శరద్‌ జోషి (శెట్కారీ సంఘటన్‌) తన పుస్తకంలో రెండు విలువైన మాటలు చెప్పారు. మార్కెట్‌తో ఒప్పందపు షరతులు రైతు పక్షంలో ఉండాలి. పట్టణ, పల్లె ఉత్పత్తులు–సేవల ధరల్లో సామ్యం పుండాలంటారు. రైతు ఆదాయాన్ని పెంచేలా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. దాదాపు ఏడువేల కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదనలతో పదివేల రైతు ఉత్పత్తి సంఘాల (ఎఫ్పీఓ) ఏర్పాటును కేంద్రం ప్రకటించింది. కానీ, కార్యాచరణలో చిత్తశుద్ధి లేదు. స్థానిక సహకార సంఘాల్ని ప్రోత్సహించాలి. వ్యవసాయోత్పత్తులు పెరిగిన చోట, ప్రభుత్వం చొరవతో.. విలువపెంచే ప్రక్రియను, అనుబంధ పరిశ్రమల్ని ప్రోత్సహించాలి. రైతు రాబడి పెంచాలి.

నేలకిప్పుడు సాంత్వన కావాలి
రైతాంగం సాగు పద్ధ తులు మార్చుకోవాలి. సాగు వ్యయాన్ని రమారమి తగ్గించుకొని, కనీస మద్దతు ధరపై ఆధారపడాల్సిన దుస్థితి లేకుండా చూసుకోవాలి. విష రసాయనాల వాడకం తగ్గించి క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి. ఫలితంగా రైతుపై ఒత్తిడి, ఘర్షణ తగ్గుతుంది. లాభసాటి ప్రకృతి సాగుతో పుడమి తల్లికి సాంత్వన కూర్చాలి. రసాయన ఎరువుల బదులు సేంద్రియ ఎరువులకు ప్రభుత్వం సబ్సిడీలివ్వాలి. రైతాంగం అదే డిమాండ్‌ చేయాలి. సంబంధీకులతో సంప్రదించకుండా, కార్పొరేట్‌ శక్తులకు దన్నుగా కేంద్రం మూడు చట్టాల్ని తెచ్చిందని విమర్శిస్తున్న రైతు సంఘాలు, దేశవ్యాప్తంగా ఇప్పుడా విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతామని చెబుతున్నాయి.

తదుపరి సంస్కరణల్ని రైతు హితంలోనే చేపట్టాలని ఇకపై కేంద్రంపై నిరంతర ఒత్తిడి ఉంటుంది. 1992 నుంచి వ్యవసాయ సంస్కరణలపై గొంతెత్తుతున్న ఉదారవాదులు, రైతుకు లభించే సంస్థాగత మద్దతుకు ఎసరు పెడుతున్నారు. 1960–80ల నడుమ ఈ మద్దతే వ్యవసాయాన్ని అదుకుంది. రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయ మార్కెట్‌ అంశాల్లోనూ జోక్యంతో ఏకపక్షంగా చట్టాలు తెచ్చి, సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం భంగం కలిగించిందని విమర్శ ఉంది. ఆ మచ్చ తొలగించుకునేందుకైనా తదుపరి చర్యలన్నీ రైతు హితంలోనే చేపట్టాలి. చట్టాల రద్దు... ప్రజాభిప్రాయాన్ని మన్నించే అయితే, వ్యవసాయ సంస్కరణలకు కూడా అదే రాచబాట! వ్యవసాయ రంగానికి ఊరట!! 


దిలీప్‌ రెడ్డి

మరిన్ని వార్తలు