అణచేస్తే అణగని జనగళం

19 Feb, 2021 00:26 IST|Sakshi

సమకాలీనం

దేశద్రోహం అభియోగంతో ‘టూల్‌కిట్‌ కేసు’లో దిశను, మరికొందరిని అరెస్టు చేయడం ద్వారా మరెవరూ.. ఉద్యమాలవైపు వెళ్లకుండా గట్టి సంకేతమివ్వా లన్న సర్కారు ఆలోచన వికటించింది. ఓ అంతర్జాతీయ హక్కుల కార్యకర్త, ఇక్కడి రైతు ఉద్యమం పట్ల సానుభూతిగా ఉండటం, వారి సమస్యకు పరి ష్కారం కోరడం తప్పెలా అవుతుంది? దేశీయంగా తలెత్తుతున్న వ్యతిరేకతను అణచే మోదీ ప్రభుత్వపు ప్రతి చర్యా, అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్టను ఒక్కో మెట్టు దిగజారుస్తోంది. రైతులకు ఏది మంచో, వారేం కోరుకుంటున్నారో... ఆ దిశలో నిజాయితీగా కృషి చేయడమే ప్రజాస్వామ్యానికి బలం.

ప్రజాందోళనలు సునాయాసమైన ఆహ్లాద క్రీడలు కావు. ఎంతో శ్రమ, త్యాగాలతో కూడుకున్నవి. శక్తివంతమైనవి కూడా! తాము చేసేది, ‘సమాజ ఉమ్మడి ప్రయోజనాల కోసం’ అనే తలంపులోనే ప్రగాఢ శక్తి ఇమిడి ఉంది. ఎన్నో ప్రతీఘాత చర్యలకు ఎదురొడ్డి నిలుస్తాయి. వెంటనే ఫలితం కనపించకపోయినా... ఎప్పుడో ఒక ప్పుడు, ఏదో రూపంలో ఫలిస్తాయి. వాటిని కించపరిస్తే... అగ్నికి ఆజ్యం పోసినట్టు మరింత రగులుతాయి. అణచివేస్తే నేలకు కొట్టిన బంతిలా రెట్టించిన ఒత్తిడితో పైకి లేస్తాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కేంద్రంలోని పాలకపక్ష వ్యూహకర్తలు ఈ చారిత్రక సత్యాన్ని ఎందుకు విస్మరించారు? వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం, దన్నుగా ఎక్కడికక్కడ జరుగుతున్న మద్దతు పోరా టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి విమర్శలనెదుర్కొంటోంది. కొన్ని నెలలుగా ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి పాలకపక్షీయులు చేయని ఆలోచన లేదు, పన్నని వ్యూహరచన లేదు! అయినా, సాధిం చిందేమీ లేదు. గణతంత్ర దినోత్సవం నాటి దుర్ఘటనల ఆధారంగా... వేర్పాటు వాదులు, విధ్వం సక శక్తుల చేతుల్లోకి ఉద్యమం వెళిపోయిం దని చేస్తున్న ప్రచారానికీ స్పందన రాలేదు.

ఆ ఒక్క ప్రతికూల పరి ణామంతో ఉద్యమ నాయకులూ ఢీలా పడ్డారు. ప్రభుత్వం దీన్ని ప్రచా రాస్త్రం చేయడంతో అంతా ‘ఇక అయిపోయింది’ అనుకున్నారు. కానీ, తిరిగి పుంజుకున్న రైతాంగ ఉద్యమం భౌగోళికంగా, భావజాలపరంగా ఇంకా విస్తరిస్తోంది. సరి కొత్త సవాళ్లు విసురుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా విరుగుడు ఆలోచిస్తూ కొత్త కార్యాచరణ చేపట్టింది. తాజాగా, పర్యావరణ కార్యకర్త దిశరవి అరెస్టు, అంతకు ముందు ఆమెపై దేశద్రోహం, కుట్ర, విద్వేషం రగిలించడం వంటి అభియో గాలతో ఢిల్లీ సైబర్‌ పోలీసులు కేసు పెట్టడం దేశం లోపల, బయట పెద్ద చర్చనే లేవనెత్తింది. మరో ఇద్దరు హక్కుల కార్యకర్తలపై దేశ ద్రోహం కేసు పెట్టి ‘బెయిల్‌లేని అరెస్టు వారెంట్‌’ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేయడంతో వారిద్దరూ బెయిల్‌ తీసుకుంటున్నారు. ‘శాంతియుత అస మ్మతి, విమర్శ, నిరసన... దేశ పౌరుల ప్రాథమిక హక్కు’ రైతు ఉద్య మంలో అరెస్టయిన ఇద్దరికి బెయిల్‌ ఇస్తూ ఢిల్లీ అదనపు సెషన్స్‌ జడ్జి ఇటీవల చేసిన ఈ వ్యాఖ్య రాజ్యాంగపరమైన మౌలికాంశాన్ని తెరపైకి తెచ్చింది. ‘నిరసనల్ని తొక్కిపెట్టడానికో, విమర్శకుల నోరుమూయిం చడానికో దేశద్రోహం చట్టాన్ని దుర్వినియోగపరచనీయం’ అన్నారీ సందర్భంగా!

ఏమనుకుంటే ఏమౌతోంది?
ప్రభుత్వం, నిర్దిష్ట సంకేతమివ్వాలనే కొన్ని చర్యలు చేపడుతుంది. కానీ, కొన్నిమార్లు సదరు చర్య అందుకు భిన్నమైన సందేశాన్ని జనం లోకి తీసుకుపోతుంది. దిశ అరెస్టులోనూ అదే జరిగింది. దేశద్రోహం అభియోగంతో ‘టూల్‌కిట్‌ కేసు’లో దిశను, మరికొందరిని అరెస్టు చేయడం ద్వారా మరెవరూ.... ఉద్యమాలవైపు వెళ్లకుండా గట్టి సంకేత మివ్వాలన్న సర్కారు ఆలోచన వికటించింది. ‘56 ఇంచ్‌ల ఛాతీ, నిత్య కసరత్తులతో సడలని దృడఖాయం, వెరువని ధీరోదాత్తమైన వజ్ర సంకల్పం.. ఇరవయేళ్ల అమ్మాయికి ఇంతగా భయపడుతోందా?’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వ్యాఖ్యలు, సంప్రదాయ మీడియాలో వెలసిన కార్టూన్‌లు పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. న్యూయార్క్‌లో ఉండే భారత మేధావి, ప్రఖ్యాత కాలమిస్ట్‌ సలీల్‌ త్రిపాఠీ దాదాపు ఇలాగే స్పందించారు. ‘‘ఢిల్లీ పోలీసులు పేర్కొన్న దాన్ని బట్టి... భారత్‌ ఇపుడు అతి ప్రమాదస్థితిలో ఉంది. 2.6 ట్రిలి యన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, అణ్వాయుధంతో ప్రపంచంలోని అయి దింట ఒకటైన మహాదేశం, ఓ బలీయశక్తి ముందు అత్యంత దుర్భ లంగా కనిపిస్తోంది. అదేదో మరో అణ్వాయుధమున్న శత్రుదేశం కాదు, విడివిడిగా–ఎవరికి వారుగా ఉండే సెలబ్రిటీలు, విభిన్నరంగాల సామాజిక కార్యకర్తలు, పోరాటాలు–ఉద్యమాలతోనే జీవించే, ప్రధాని మోదీ పరిభాషలో ‘ఆందోళన జీవుల’ బృందమది’’ అంటారాయన.

డిజిటల్‌ సాంకేతికత వచ్చాక, ఐటీ తదితర రంగాల నెట్‌వర్కింగ్‌ వ్యూహకర్తలే కాకుండా ప్రజాపోరాటాలు జరిపేవారు కూడా ‘టూల్‌ కిట్‌’ ఉపకరణాన్ని వాడుతారు. ఇదేం మారణాయుధం కాదు. ఐటీ యుగంలో ఇదొక పరస్పర సమాచార మార్పిడి వేదిక. భాగమైనవారు, సమాచారాన్ని వేర్వేరు రూపాల్లో పంచుకుంటారు. ఇది చాలా సాధా రణ ప్రక్రియ. అయితే, దీన్ని ‘ఖలిస్తాన్‌’ వేర్పుటువాదంతో ముడిపెట్టి, వారితో రహస్యంగా సంబంధాలు నెరపడం కింద నిర్దిష్ట అభియోగా లతో దిశరవితో పాటు మరో హక్కుల కార్యకర్త, ముంబై అడ్వకేట్‌ నికితా జాకోబ్, పర్యావరణ కార్యకర్త–ఇంజనీర్‌ శంతను ములుకుల పైనా కేసులు నమోదు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఇదివరకే జారీ చేసిన మార్గదర్శకాల్ని బేఖాతరంటూ, అంతర్రాష్ట్ర అరెస్టుల్లో పాటిం చాల్సిన కనీస పద్దతుల్నీ ఢిల్లీ పోలీసులు విస్మరించారు. దిశను బెంగళూరు నివాసంలో అరెస్టు చేసేటప్పుడు పోలీసులు భయోత్పాతం సృష్టిం చారు. ఇదంతా పోలీసుల, తద్వారా ప్రభుత్వం వైఖరిని వెల్లడించేదే అనే విమర్శలున్నాయి.

మొరటు చర్యలు అణచగలవా?
సమస్యను, దాని మూలాలను అర్థం చేసుకోవడంలో వైఫల్యం వల్లే పలు విషయాల్లో కేంద్ర ప్రభుత్వం అతిగా స్పందిస్తోందన్నది విమర్శ. స్వీడన్‌ పర్యావరణ యువకార్యకర్త గ్రెటా తన్‌బర్గ్‌ ట్వీట్‌కు స్పందిం చడం ఓ ఉదాహరణ. వేర్వేరు రంగాల దేశీ ప్రముఖులతో ప్రతిస్పం దనలు ఇప్పించి, వ్యవహారాన్ని జటిలం చేయడమే కాక దేశ ప్రతిష్టను అంతర్జాతీయ సమాజంలో దిగజార్చారు. ఓ అంతర్జాతీయ హక్కుల కార్యకర్త, ఇక్కడి రైతు ఉద్యమం పట్ల సానుభూతిగా ఉండటం, వారి సమస్యకు పరిష్కారం కోరడం తప్పెలా అవుతుంది? దాన్ని దేశ సార్వ భౌమాధికారంలో చొరబాటుగా పరిగణించడం విమర్శలకు తావి చ్చింది. ఇదే నిజమైతే... నేటి చైనా నాయకత్వ సరళిపైన, నిన్నటి ట్రంప్‌ నిర్ణయాల పట్ల, మొన్నటి హిట్లర్‌ నియంతృత్వం మీద మనం, మన మేధావులు చేసిన వ్యాఖ్యలన్నీ ఆయా దేశాల సార్వభౌమాధికార ధిక్కరణలేనా? ఎవరిపైన అయినా దేశద్రోహం ఆరోపించడం తేలిక! నిరూపించడం దుర్లభం. లేనపుడు రుజువుచేయడం అసంభవం.

ఉద్యమాలను బలహీనపరచడానికి, సాధారణ జనంలో దురభిప్రాయం కలిగించడానికి దేశద్రోహం ఆపాదిస్తున్నారనే విమర్శ బలపడుతోంది. రైతాంగ పోరాటాన్ని అణచే ఎత్తుగడల్లో ఇదీ ఒకటనే భావన జనంలోకి చొచ్చుకు పోతోంది. ఉద్యమాలను సామరస్యంగానే తప్ప మొరటు, అణచివేత చర్యల ద్వారా అదుపుచేయలేమన్నది ప్రపంచవ్యాప్తంగా నిరూపిత మైంది. అమెరికా మేధావి, విశ్లేషకుడు జెనె షార్ప్‌ 200కు పైగా అహింసాయుత నిరసన పోరాటాలను, ‘నియంతృత్వం నుంచి ప్రజా స్వామ్యం వైపు’ అనే తన పుస్తకంలో నిర్వచించారు. అనేక దేశాల్లో కార్యకర్తలు, ఉద్యమనేతలు దీన్నొక మార్గదర్శిగా మలుచుకొని నియం తృత్వాల స్థానే ప్రజాస్వామ్యాలు ఏర్పరచుకున్నారు. బ్రిటిష్‌ విశాల సామ్రాజ్యాధీశుల్ని పిడికెడు ఉప్పుతో వణికించిన మహాత్ముడిని పలుమార్లు ఆ పుస్తకంలో ఆయన ఉటంకించారు.

దేశీయంగా తలెత్తుతున్న వ్యతిరేకతను అణచే మోది ప్రభుత్వ ప్రతి చర్యా, అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్టను ఒక్కో మెట్టు దిగ జారుస్తోంది. ఉదారప్రజాస్వామ్యమనే కీర్తి క్రమంగా పలుచబారు తోంది. మోదీ వీసాను అమెరికా పునరుద్దరించాక, సదరు సంబంధాల మెరుగుకు ఎన్ని యేళ్లు ఆయన శ్రమించాల్సి వచ్చింది? ఈ అయిదా రేళ్ల కృషిలో అంతర్జాతీయంగా భారత్‌కు లభిం చిన పేరు ప్రతిష్టల్ని, కీలక పాత్రనీ ఎందుకు కాలదన్నుకోవడం? రైతాంగం మదిలో చోటు కోల్పోవడం వల్లే, తమకు బాగా పట్టున్న ఉత్తరాదిలోనూ జనాదరణ కోల్పోవాల్సి వస్తోందని పంజాబ్‌ పట్టణ ఎన్నికల ఫలితాల్ని చూసి పాలకపక్షం గ్రహించాలి. పంతం వీడి, రైతులకు ఏది మంచో, వారు ఏం కోరుకుంటున్నారో... ఆ దిశలో నిజాయితీగా కృషి చేసి, జనాభీ ష్టాన్ని నిరవేర్చడమే ప్రజాస్వామ్యానికి బలం.

దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌: dileepreddy@sakshi.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు