వ్యాక్సిన్‌ వికేంద్రీకరణతోనే లక్ష్యసాధన

27 Feb, 2021 00:26 IST|Sakshi

విశ్లేషణ 

కోవిడ్‌–19 పరీక్షలు, చికిత్సా సమయంలోనే రోగులను దోచుకున్న ప్రైవేట్‌ రంగ అరాచకం వ్యాక్సినేషన్‌ ప్రక్రియలోనూ కొనసాగదని చెప్పలేం. ప్రైవేట్‌ మార్కెట్లో రెండు డోసులకు కలిపి 2 వేల రూపాయల ధర పెడితే ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలు వ్యాక్సిన్‌ అసలు వేయించుకోలేరు. టీకాతో మహమ్మారి భరతం పట్టాలనే లక్ష్యాన్ని సాధించడమే కష్టసాధ్యమవుతుంది. దీనిబదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెట్టుబడులతో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలోపేతం చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. పైగా ప్రజారోగ్య వ్యవస్థలో ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాత కోవిడ్‌– 19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రాధాన్యతా బృందాలను దాటి అర్హులైన ప్రజలకు చేరువవుతూ కొత్త దశలోకి ప్రవేశించబోతోంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించే దిశగా ప్రారంభంలోని టీకాలు వేయించుకున్న వారు రెండో డోస్‌ కూడా పొందుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన కోటిమందికిపైగా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలిదశలో టీకాలు వేశారు.

అయితే టీకా కవరేజీ దేశవ్యాప్తంగా ఒకే రీతిన సాగలేదు. చాలా రాష్ట్రాల్లో కోవిడ్‌–19పై యుద్ధం చేసిన ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుకూడా టీకా వేసుకోవడానికి ఇష్టపడలేదని వార్తలు. టీకాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నా, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఊహించిన దానికంటే తక్కువగా సాగడంతో కొన్ని ప్రాంతాల్లో టీకా డోసులు వృథా అవుతున్నాయేమోనని ప్రశ్నలు తలెత్తాయి కూడా. పైగా ఇది ప్రైవేట్‌ మార్కెట్‌లో కూడా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌లను అందుబాటులో ఉంచాలనే డిమాండుకు దారి తీసింది.

ప్రస్తుత దశలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే జరుగుతోంది. తదుపరి దశలో 60 సంవత్సరాల పైబడిన, ఇతర వ్యాధులున్న 45 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు వేసేనాటికి వాటికయ్యే నిధులు ఎవరు అందిస్తారనేది స్పష్టం కావడం లేదు. ప్రభుత్వ రంగంలో వ్యాక్సినేషన్‌ నత్తనడకతో సాగుతోంది కాబట్టి ప్రైవేట్‌ రంగాన్ని అనుమతించాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. నిజానికి తదుపరి దశలో టీకాలు వేయించుకునే వారిలో చాలామందికి డబ్బులు చెల్లించగల సామర్థ్యం ఉందని వీరు వాదిస్తున్నారు. పైగా భారీస్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించగల సామర్థ్యం ప్రభుత్వ రంగానికి లేదనే అభిప్రాయం ఆధారంగా వీరు ఇలా చెబుతున్నారు.

అయితే ఇదెంత తప్పుధోరణి అంటే, మశూచి, పోలియో తదితర వ్యాధులకు గతంలో వ్యాక్సినేషన్‌ నిర్వహించి వ్యాధులను పూర్తిగా అరికట్టిన చరిత్ర ప్రభుత్వ రంగ ఆరోగ్య వ్యవస్థకు మాత్రమే ఉండేదని వీరు మర్చిపోతున్నారు. ప్రభుత్వ రంగ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వల్లే దేశం నలుమూలలకూ వ్యాక్సిన్‌లను వేగంగా, సమర్థంగా అందించగలిగామన్నది వాస్తవం. చిన్నపిల్లలకు అత్యవసరమైన రోగనిరోధక వ్యవస్థ పెంపుదల కార్యక్రమం చాలావరకు ప్రభుత్వం అధ్వర్యంలోనే సాగుతోంది. నూటికి నూరు శాతం ప్రాణాధార వ్యాక్సిన్‌లను భారత్‌ అందించలేకపోతున్నప్పటికీ దేశ ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వరంగమే కీలకపాత్ర పోషిస్తోంది. అలాగని చెప్పి రోగనిరోధక వ్యవస్థ పెంపుదల వంటి కార్యక్రమాల్లో ప్రైవేట్‌ రంగానికి ఎలాంటి పాత్రా లేదని కాదు.

అత్యవసర వ్యాక్సిన్‌ల సరఫరాదారుగా ప్రైవేట్‌ రంగం ఇప్పటికే తన వంతు పాత్ర పోషిస్తోంది. పైగా పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ సరఫరాలో ప్రైవేట్‌ రంగం కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే అనేక కేంద్రాల్లో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రైవేట్‌ రంగం పాత్ర పోషిస్తోంది కూడా. మొట్టమొదటగా వ్యాక్సిన్‌ ఎవరికి అవసరం అనేది నిర్ధారిం చడం, ప్రారంభ వారాలు లేక నెలల కాలంలో టీకా సరఫరా తక్కువగా ఉండటం వంటి కారణాలతో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ వచ్చారు. ఈ సూత్రాన్ని అమలు చేస్తున్న సమయంలో వ్యాక్సిన్‌కి అయ్యే ఖర్చును భరించడం అనేది ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. భారత్‌లో మాదిరి కాకుండా టీకాను డబ్బు చెల్లించి వేసుకోవడం పెద్ద సమస్యగా కనిపించని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా తొలి దశ వ్యాక్సినేషన్‌ని ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని నిర్ణయించారు.

పేదదేశాలకు టీకాలు అందుబాటులో ఉంచడం అనే సమస్యను అభివృద్ధి చెందిన దేశాలు పట్టించుకోలేదన్నది వాస్తవం. ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న కరోనా టీకాలను అభివృద్ధి చెందిన దేశాలే ప్రత్యక్షంగా లేక అడ్వాన్స్‌ చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నాయి. అదే సమయంలో ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని పలు దేశాలకు టీకా సరఫరాలే లేవు. బహిరంగ మార్కెట్లలో కోవిడ్‌– 19 టీకాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్న వారు దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ప్రభుత్వరంగం ఆధ్వర్యంలో రోగనిరోధక శక్తిని పెంచే కార్యక్రమానికి సంబంధించి ప్రారంభదశలో తలెత్తిన సాంకేతిక సమస్యలను తర్వాత్తర్వాత గణనీయ స్థాయిలో పరిష్కరించారు. రెండు వ్యాక్సిన్‌ల డోసులు అందుబాటులోకి వచ్చి ఉపయోగిస్తున్న సమయంలో ఇతర లోపాలను గుర్తించి పరిష్కరించవచ్చు. అందుకే టీకాల కార్యక్రమాన్ని వికేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.

అయితే పూర్తిగా కేంద్రస్థాయిలో వ్యాక్సినేషన్‌ని అమలు చేయడానికి బదులుగా, ఒక్కో రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఎలాంటి ప్రభావం చూపిందనే అంశం ప్రాతిపదికగా రాష్ట్ర స్థాయి రోగనిరోధక శక్తి పెంపుదల కార్యక్రమాలను చేపట్టివలసిన అవసరం ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి భిన్నంగా ఉన్నట్లయితే కేంద్రం నిర్ణయించిన ప్రాధాన్యతా బృందాల కిందికి రాకపోయిన్పటికీ, ఈ రెండు రాష్ట్రాల్లో కరోనాకు గురయ్యే వారికి వ్యాక్సిన్‌ వేసేలా ప్రాధాన్యతలను నిర్ణయించుకోవాలి.

అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో వ్యాక్సినేషన్‌ అమలు చేయడానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఒక రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ ఒకే పరిమాణంలో టీకాలు అవసరం ఉండకపోవచ్చు. అలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని తదనుగుణంగా పనిచేస్తే, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతుంది. రాజకీయ స్థాయిలో ఆయా రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకున్నట్లయితే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం లేవనెత్తిన సమస్యల వంటివాటిని పరిష్కరించడానికి వీలవుతుంది. రాష్ట్రాల ప్రభుత్వాలతో వ్యాక్సిన్‌ సంబంధిత సమాచారం విషయంలో పారదర్శకతను, క్రియాశీలతను ప్రదర్శిస్తే వ్యాక్సినేషన్‌ అమలు రాజకీయాల పాలబడటం నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధిగమించవచ్చు.

వ్యాక్సిన్‌లను విస్తృతంగా అందుబాటులోకి తేవడంలో ఎదురయ్యే మరొక సమస్య వాటి ధర ఎంత అనేదే. ప్రభుత్వ రంగానికి అయితే సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ సంస్థలు ప్రత్యేక ధరకు అంగీకరించాయి. అయితే ప్రైవేట్‌ మార్కెట్లలో విడుదల చేసే వ్యాక్సిన్‌ల ధర కాస్త ఎక్కువగానే ఉంటుందని సీరమ్‌ సంస్థ పేర్కొంది. నిర్వహణ ఖర్చులు, డాక్టర్ల ఫీజులు, శీతలీకరణ ఖర్చులు వంటి అంశాలు ప్రైవేట్‌ మార్కెట్‌లో వ్యాక్సిన్‌ ధరను బాగా పెంచుతాయి. తగినన్ని డోసులు అందుబాటులో ఉండటానికి ముందే, ప్రాధాన్యతా బృందాలకు వ్యాక్సిన్‌ వేయకముందే ఇలాంటి ద్వంద్వ ధరల విధానాన్ని అనుమతిస్తే ప్రభుత్వ సరఫరాలను దొంగిలించడం, బ్లాక్‌ మార్కెటింగ్‌ వంటి వాటికి దారితీసే ప్రమాదముంది.

కోవిడ్‌–19 పరీక్షలు, చికిత్సా సమయంలోనే కరోనా రోగులను దోచుకున్న ప్రైవేట్‌ రంగంలోని దోపిడీ శక్తుల అరాచకం వ్యాక్సినేషన్‌ లోనూ కొనసాగదని చెప్పలేం. ప్రైవేట్‌ మార్కెట్లో రెండు డోసులకు కలిపి 2 వేల రూపాయల ధర పెడితే ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలు వ్యాక్సిన్‌ అసలు వేయించుకోలేరు. ఇలాంటివారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది కనుక వ్యాక్సినేషన్‌ ద్వారా మహమ్మారి భరతం పట్టాలనే లక్ష్యాన్ని  సాధించడమే కష్టసాధ్యమవుతుంది. సమాజంలో సంపన్నులు, పేదలు మధ్య, ప్రపంచవ్యాప్తంగా కలిగిన వారు, పేదల మధ్య విభజన రేఖ కారణంగానే కరోనా మహమ్మారి తీవ్ర స్థాయికి చేరుకుంది.

కరోనా వ్యాక్సిన్‌ సరఫరాలను లాభాపేక్ష దృష్టి కలిగిన ప్రైవేట్‌ రంగానికి బదలాయిస్తే అది అసమానతలను మరింతగా పెంచి పోషిస్తుంది.దీనిబదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెట్టుబడులతో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలోపేతం చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు దోహదపడటమే కాకుండా టీబీ, పిల్లల వ్యాధులు వంటి వాటి నిర్మూలన వంటి ఇతర లక్ష్యాల సాధనకు తోడ్పడుతుంది. పైగా ప్రజారోగ్య వ్యవస్థలో ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.


వ్యాసకర్త: దినేష్‌ సి. శర్మ
జర్నలిస్టు, కాలమిస్టు

మరిన్ని వార్తలు