గుండెలో విజ్ఞానం–మనసులో సాహిత్యం

28 Nov, 2020 01:03 IST|Sakshi

సందర్భం

‘‘సాహిత్యమునకు, శాస్త్రమునకు గల అగాథాఖాతమును పూడ్వవలెను. సాహిత్య, శాస్త్రములను ద్వీపములకు వారధి కట్టవలెను. కవులకు, శాస్త్ర విధులకు మధ్యగల నిరవగాహన భిత్తిని పడగొట్టవలెను..’’ అని సర్దేశాయి తిరుమలరావు తన అమూల్య గ్రంథం ‘సాహిత్య తత్వము–శివభారతదర్శనము’లో ఢంకా భజాయించి చెబుతారు. 1928 నవంబర్‌ 28న కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా జోరాపురంలో జన్మించిన సర్దేశాయి తిరుమలరావు అనంతపురంలో బి.ఎస్సి. చదివి తెలుగు మీద అభిమానంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఏ (ఆనర్సు) చేయాలని–రెండో ఏడు ప్రవేశం కోరారు. అది సాధ్యపడలేదు, దాంతో రాజస్తాన్‌లోని పిలానీలో బిట్స్‌–పిలాని ద్వారా ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివారు. 

1954లో అనంతపురంలోని ఆయిల్‌ టెక్నలాజికల్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చి కెమిస్టుగా చేరి 1989లో ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. తిరుమల రావు వల్ల ఒకవైపు తెలుగు సాహిత్యం, మరోవైపు ఆయిల్‌ టెక్నాలజి గణనీయంగా లాభపడ్డాయి. సైన్సూ, సాహిత్యమే జీవితపు తోడుగా సాగిన ఆజన్మ బ్రహ్మచారి ఆయన. సంగీతం వినడం హాబీ. సరస చమత్కారం అలవాటు. లౌక్యం, మొహమాటం ఎరుగని జీవనతత్వం. 1994 మే 10న కనుమూసే దాకా అనంతపురం కమలానగర్‌లో చిన్న పెంకుటింటిలో అన్నతో కలసి ఉండేవారు. అన్నగారూ బ్రహ్మచారే! ఇంటినిండా పుస్తకాలు మాత్రమే! ఎలాంటి ఫర్నిచర్, టెలిఫోన్‌ లేకుండా నేల మీదనే అధ్యయనం సాగేది. ఆ ఇంటికి ఎవరు వెళ్ళినా నేల మీదనే, చాపమీదనే కూర్చోవాలి.

నూనెగింజలు విరివిగా రాయలసీమ ప్రాంతంలో పండుతుండటంతో 1949లో తైల సాంకేతిక పరిశోధనా సంస్థ దేశంలోనే తొలిసారి అనంతపురంలో ఏర్పడింది. ఆ సంస్థ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి సర్దేశాయి తిరుమలరావు. పూర్వీకులు మరాఠీవారు. ఆయనకు మాతృభాష కన్నడం. తెలుగు, ఇంగ్లి్లష్, కన్నడం, సంస్కృతం బాగా వచ్చు. అటు ఆయిల్‌ టెక్నాలజీలో సుమారు 500 పరిశోధనా పత్రాలు వెలువరించడమే కాక ‘కన్యాశుల్కము–నాటక కళ’, ‘శివభారతదర్శనము–సాహిత్య తత్వము’ వంటి అత్యంత విలువైన గ్రంథాలు సృజియించారు. బియ్యపు పొట్టు, కొబ్బరి, పట్టుపురుగు గుడ్డు, వాడిన కాఫీ పొడి, పత్తి విత్తనాలు, ఆముదాలు, వేరుశనగ గింజలు, పొగాకు విత్తనాలు, వేపగింజలు, మిరపగింజలు, సీతాఫలం గింజలు, అరటి తొక్క, టమోటా విత్తనాలు, దవనం, మరువం, పుదీనా, నువ్వులు, కుసుమలు – ఇలా స్థానికంగా విరివిగా లభించే వాటిపై పరిశోధనలు చేసి, చేయించి పేటెంట్లు పొంది దేశానికి విదేశీ మారకం సాధించారు. 

ఆంధ్రపత్రిక, భారతి, ది హిందూ, బ్లిట్జ్, ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ, సైన్స్‌ టు డే వంటి పత్రికలలో ఆయన వర్తమాన విషయాలు–గతుకుల రోడ్లు, అణుశక్తి, బిచ్చగాళ్ళు, అంతర్జాతీయ రాజకీయాలు, సాహిత్య విషయాలు, మేధో వివాదాలు – ఇలా ఎన్నో ఉత్తరాలలో చర్చించేవారు. ‘దేవాలయంపై బూతు బొమ్మలాంటివాడు గిరీశం’ అని తిరుమలరావు వ్యాఖ్యానించారు. 1952 సమయంలో తిరుమలరావు పిలానిలో చదువుకుంటుండగా ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహారదీక్షకు దిగిన పొట్టి శ్రీరాములును ఆ పనికి  తగడని కొందరు విమర్శించేవారు. 

గాంధీ నిరాహారదీక్షకు సరిపోయినపుడు పొట్టి శ్రీరాములు ఎందుకు సరిపోడంటూ విద్యార్థిగా ‘హిందూస్తాన్‌ టైమ్స్‌’ పత్రికకు ఉత్తరం రాశారు తిరుమలరావు. గాంధీజీ నాలుగో కుమారుడు హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ఎడిటర్‌గా ఆ ఉత్తరం ప్రచురించడం విశేషం. మతానికి మంగళం పాడిన పిదపనే సైన్స్‌ మొదలవుతుందని నమ్మినవాడు సర్దేశాయి తిరుమలరావు. ‘‘బ్రహ్మసూత్రాలను చెప్పిన బాదరాయణునే కాదు అతని శిష్యులను కూడా దేవుళ్ళుగా పూజిస్తారు. కానీ బాదరాయణునితో సాటి అయిన కణాదుని గురించి చాలామందికి తెలియదు. న్యూటన్‌ రూథర్‌ ఫర్డ్‌ పరిశోధనలు వచ్చేదాకా కణాదుని భావనలు చెల్లుబడి అయ్యాయి’’ అనేవారు తిరుమలరావు. 
(నేడు సర్దేశాయి తిరుమలరావు జయంతి)
వ్యాసకర్త: డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌, సైన్స్‌ రచయిత, వర్తమాన అంశాల వ్యాఖ్యాత

మొబైల్‌ : 94407 32392

మరిన్ని వార్తలు