ఒక అపరిపక్వత @ 245

17 Jan, 2021 02:13 IST|Sakshi

అమెరికా: బాహ్యరూపం

ఔరా... ట్రంపు ఎంతటి చతురుడో కదా! అనుకునేవాళ్లు మన దేశంలో కూడా చాలామందే వున్నారు. ఇండియా గురించి ఎన్ని సంగతులు తెలుసునో రమారమి అన్ని సంగతులూ అమెరికా గురించి కూడా తెలుసునని మనవాళ్లకు ఒక గట్టి నమ్మకం. మన నవయువతరానికి అమెరికాతో ‘సంబంధం’ కుదిరిన తర్వాత, మనం సారెగా పంపించిన పచ్చళ్లు, పలావులు అమెరికా వాళ్లు చప్పరించిన తర్వాత రెండు దేశాల మధ్య బంధం బాగానే బలపడింది. పైగా అగ్రరాజ్యం కూడా కావడంతో అక్కడి పరిణా మాలపై వాళ్లకు ఉండేటంత ఆసక్తి మనవాళ్లక్కూడా ఏర్పడింది. అందుకే ఇక్కడా రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ట్రంపు అను కూలం, ట్రంపు వ్యతిరేకం. భారతీయులకు ఏటా యిచ్చే హెచ్‌1బీ వీసాలను ట్రంపు కత్తిరించడం మనవాళ్లకు నచ్చలేదు. చదువు పూర్తయిన వారు ఖాళీగా అక్కడ ఉండటానికి వీల్లేదు వెళ్లిపోవాలనడం కూడా నచ్చలేదు. అమెరికా ఫస్ట్‌ అనడం అస్సలు నచ్చలేదు. అమెరికన్లదే అమెరికా అంటాడేమిటి? అమెరికా మన పిల్లలది కూడా కదా అనే ధర్మసందేహం మన పేరెంట్స్‌ అసోసియేషన్‌ బుర్రల్ని బాగానే తొలిచింది. ఇన్ని నెగెటివ్‌ పాయింట్లు ఉన్నప్పటికీ, నెగెటివిజం ఈ యుగధర్మంగా భావించేవాళ్లు ఉన్నారు కనుక ట్రంపులోని తెంపరితనం మనవాళ్లలో కొందరికి బాగానే నచ్చింది. కాల మహిమ కారణంగా ‘రామా ఈజ్‌ గుడ్‌బాయ్‌’ కంటే ‘రావణా

ది డిక్టేటర్‌’కు ఎక్కువ లైకులు వచ్చే రోజులివి. అందువలన ట్రంపు ఏం చేసినా మెచ్చే సెక్షన్‌ ఒకటి ఏర్పడిపోయింది. పైగా, మన సారథి–మన సచివుడు–మన వియ్యము–మన సూపర్‌ స్టార్‌– మన రాంబో అయినటువంటి నరేంద్ర మోదీకి ప్రియ మిత్రుడు కావడం వలన కూడా మనలో కొందరికి ట్రంపంటే వల్లమాలిన అభిమానం. కనులతో చూసి, చెవులతో విని, నాసికతో ఆఘ్రాణించి మనం అమెరికా పట్ల కొన్ని అభిప్రా యాలను  ఏర్పాటు చేసుకున్నాము. పత్రికలు, టెలివిజన్లు, సోషల్‌ మీడియా–మనవాళ్ల చాట్స్‌ అండ్‌ కాల్స్‌ వగైరాలే మన కళ్లూ, చెవులూ, నాసికలు. ఈ రకమైన ఇంద్రియ జ్ఞానంతో సముపార్జించిన సమాచారం స్థూలంగా ఇలా ఉంటుంది :

డొనాల్డ్‌ ట్రంప్‌ అనే సంపన్న వ్యాపారవేత్త 2016లో రిప బ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి అనూహ్యంగా గెలుపొందాడు. ఈయన గెలుపుకోసం రష్యావాళ్లు ఒక భారీ సోషల్‌ మీడియా కర్మాగారాన్ని స్థాపించి అమెరికా ఓటర్లను ప్రభావితం చేశారన్న అపవాదు కూడా ఉన్నది. దీనిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు సజావుగా సాగకుండా ట్రంప్‌ మోకాలడ్డుతున్నారు. అమెరికా ఫస్ట్‌ నినాదా నికి అనుగుణంగా మెక్సికన్ల వలసలను నిరోధించడానికి అక్కడో మహాకుడ్యం నిర్మాణాన్ని ప్రారంభించాడు. అమెరికా వాళ్లకే ఎక్కువ ఉద్యోగాలు లభించడం కోసం విదేశీయులకు ఇచ్చే వీసా లను తగ్గించాడు. ఇలా చేస్తే తమకు చౌకగా పనిచేసే సిబ్బంది లభించదని ఐటీ కంపెనీలు గగ్గోలు పెట్టినా వినలేదు. ఇరాన్‌పై ఆంక్షలు విధించి పశ్చిమాసియాలో కుంపట్లు రాజేశాడు. అఫ్గాని స్తాన్‌లో తాలిబన్లకు పాలుపోసి ఉపఖండంలో భారత్‌కు సరి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాడు. ఒక్క చైనా దూకుడు వ్యవహా రంలో మాత్రం భారత్‌కు బాసటగా నిలబడ్డాడు. ఇందులో భారత్‌పై ప్రేమకన్నా తన ఆధిపత్యానికి ముంచుకొస్తున్న ముప్పుపై బెంగే ఎక్కువ.

తన అగ్రరాజ్య హోదాను చైనా సవాల్‌ చేస్తున్నదని అమెరికా భావిస్తున్నది. అంతర్జాతీయ సంబంధాల్లో ప్రస్తావించే థుసిడైడ్‌ థియరీ ప్రకారం ఇటువంటి సందర్భాల్లో సదరు రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యం. ఆ పరిస్థితి ఏర్పడినట్లయితే ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చెలరేగకుండా చైనాను నిరోధించడం కోసం భారత్‌–ఆస్ట్రేలియా–జపాన్‌ల మధ్య అప్పటికే ఉన్న అవగాహనను మరింత పటిష్టం చేశాడు. దేశంలో ఆరోగ్య బీమా సౌకర్యానికి నోచుకోని వారికోసం ప్రెసి డెంట్‌ ఒబామా తీసుకొచ్చిన ఒబామా కేర్‌ చట్టాన్ని అటకెక్కించే ప్రయత్నం చేశాడు. తన ప్రత్యర్థి కాబోతున్న జోబైడెన్‌పై అక్రమ కేసులు పెట్టాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చాడు. తన నాలుగేళ్ల కాలంలో దేశంలో శ్వేత దురహంకారాన్ని రెచ్చగొట్టాడు.  ఆఫ్రో –అమెరికన్లపై దాడులు పెరిగాయి. చివరికి ఎన్నికల్లో ఓడిపో యినా, తానే గెలిచినట్టు దబాయించాడు. రీకౌంటింగ్‌లో తనకే ఎక్కువ ఓట్లు వచ్చినట్టు ప్రకటించాలని జార్జియా ఎన్నికల అధికారులను బెదిరించాడు.

ఫలితాలు ప్రకటించినా ఓటమిని అంగీకరించలేదు. జోబైడెన్‌ ఎన్నికను లాంఛనంగా నిర్ధారించ డంకోసం కాంగ్రెస్‌ సభ్యులు సమావేశమైన క్యాపిటల్‌ బిల్డింగ్‌పై దాడికి తన అనుయాయులను పురికొల్పాడు. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్‌లో అభిశంసనను ఎదుర్కొంటున్నాడు. తన పదవీ కాలంలో రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్న ఏకైక అధ్యక్షు నిగా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. గడిచిన మూడు దశా బ్దాల కాలంలో జార్జి బుష్‌ సీనియర్‌ తర్వాత రెండోసారి ఎన్నిక కాలేక చేతులెత్తేసిన వాడిగా చరిత్రకెక్కాడు. అభిశంసనను ఇప్పటికే హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ ఆమోదించింది. పదిమంది రిపబ్లికన్లు కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. మంగళ వారంనాడు సెనేట్‌లో ఓటింగ్‌ జరుగుతుంది. అక్కడా ఆమోదం పొందితే తన పదవీకాలం ముగియడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు గెంటివేయించుకున్న వాడిగా రికార్డుల కెక్కుతాడు. ఇదీ జరిగిన కథ.

అమెరికా : అంతస్సారం
ప్రజాస్వామ్య వ్యవస్థలకు పుట్టినిల్లు అమెరికా. అమెరికా స్వాతంత్య్ర ప్రకటన వెలువడి ఇప్పటికి 245 సంవత్సరాలు. మరో ఐదేళ్లకు రెండున్నర శతాబ్దాల ఉత్సవాలు జరుగను న్నాయి. ‘‘సృష్టిలో మనుషులందరూ సమానమే, ప్రతి మనిషికీ స్వేచ్ఛగా, సుఖసంతోషాలతో జీవించే హక్కు ఉంద’ని స్వాతంత్య్ర ప్రకటన వక్కాణించింది. ఈ ప్రకటన ప్రపంచాన్ని ఉత్తేజపరిచింది. స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలు ప్రతిధ్వనించిన ఫ్రెంచి విప్లవానికి స్ఫూర్తినిచ్చింది. కృతజ్ఞతగా వందేళ్ల తర్వాత అమెరికాకు స్వేచ్ఛా ప్రతిమను ఫ్రాన్స్‌ బహూకరించింది. కానీ, ఆచరణలో అమెరికా స్వాతంత్య్ర ప్రకటన ‘తెల్లవారందరూ’ సమానమే అనే సంకుచి తార్ధంగా క్రమేణా పరిణమించింది. బానిస వ్యవస్థ అంతం కావడానికి ఎన్ని వేల బలిదానాలు అవసరమయ్యాయో లెక్కించే పనిని చరిత్ర సక్రమంగా చేయలేదు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా మరెన్నో వేల ప్రాణాలను బలిపెట్టవలసి వచ్చింది.

చివరికి ఈ శతాబ్ది ఆరంభంలో బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో అమెరికా ప్రజాస్వామ్యం పరిణతి చెందిం దన్న అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది. ట్రంప్‌ జమానా ప్రారంభమైన తర్వాత అటువంటి భ్రమ పటాపంచలైంది. జాతి దురహంకారంతో బుసలుకొడుతున్నవారు శ్వేతజాతీయుల్లో ఇంకా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారన్న సత్యం బోధప డింది. వారు కేవలం జాతి దురహంకారులే కాదు, పురుషా హంకారులు కూడా. శ్వేతజాతి స్త్రీల హక్కులను కూడా ఈ బృందం సహించదు. ‘ప్రౌడ్‌ బాయ్స్‌’ వంటి పేర్లతో వెలసిన శ్వేతనాగుల సంఘాలే ఇందుకు నిదర్శనం. ట్రంప్‌ అధికారం లోకి రావడంతో ఈ దురహంకార గుంపులు చెలరేగిపోయాయి. ఒక ఖండిత రాజ్యంగా, విభజిత సమాజంగా అమెరికా సాక్షాత్క రించింది. జాతి వివక్షను మించి ‘కులవివక్ష’ అమెరికాలో అమలవుతున్నదని ఇసాబెల్‌ విల్కిన్సన్‌ తన caste’ పుస్తకంలో నిరూపించింది. తెల్లవాళ్లకే ప్రాధాన్యం అనేది ‘అమెరికా ఫస్ట్‌’ అనే ట్రంప్‌ నినాదం వెనుక అసలు రహస్యమని అచిరకాలం లోనే ప్రజలకు అర్థమైంది. యూరప్‌ నుంచి బతుకుదెరువుకోసం వచ్చిన తమ తాతముత్తాతలు స్థానికులైన రెడ్‌ ఇండియన్లను ఊచకోత కోసి వారి స్థావరాలను ఆక్రమించారన్న సత్యాన్ని ఈ దురహంకారులు విస్మరించారు. ఆఫ్రికా ఖండం నుంచి వేల సంఖ్యలో పడవల మీద తరలించుకొని వచ్చిన నల్లజాతి ప్రజ లను బానిసలుగా మార్చి వారి శ్రమశక్తిని ఇంధనంగా వాడి సంపన్నులమైపోయామన్న యదార్ధాన్ని కూడా వీరు మరుగు పరుస్తున్నారు.

తమ దేశం తెల్లవాళ్ల సొంత జాగీరు అనే పూనకం ఈ ముఠాలను ఊపేస్తున్నది. వారు ట్రంప్‌లో తమ దైవాన్ని చూసుకుంటున్నారు. డెవిల్‌ డ్రాగన్‌తో పోరాడుతున్న సెయింట్‌ జార్జి వారికి ట్రంప్‌లో కనబడుతున్నాడు. క్యూఏనాన్‌ (QA non) పేరుతో ఒక కుట్ర సిద్ధాంతం విపరీతంగా ప్రచారంలో పెట్టారు. సైతాన్‌ శిష్యులు ప్రపంచంలో ఆధిపత్యం చేస్తున్నారని, వారిని ఓడించే వీరుడు ట్రంప్‌ మాత్రమేనని క్యూఏనాన్‌ సిద్ధాంత తాత్పర్యం. ఈ సిద్ధాంతపు విషప్రచారం ఫలితంగానే ఆఫ్రో అమెరికన్లపై దాడులు పెరిగాయి. ట్రంప్‌ ఒక్క పిలుపుతో వేలాది మంది ఉన్మాదులు తుపాకులూ, మారణాయుధాలతో కేపిటల్‌ భవనంపై దాడికి దిగారు. ఈ ఘటన జర్మన్‌ పార్లమెంట్‌ భవనం రైక్స్‌టాగ్‌ (Reichstag) అగ్నిప్రమాదం సన్నివేశాన్ని గుర్తు చేసింది. ఈ సంఘటనను ఉపయోగించుకునే నాజీ హిట్లర్‌ జర్మన్‌ నియంతగా బాటలు వేసుకున్నాడు. కేపిటల్‌పై దాడి వెనుక కూడా అటువంటి వ్యూహమేదో ఉండవచ్చునని పలు వురు భావించారు. అదృష్టవశాత్తు అది విఫలమైంది. బహుశా రేపు ట్రంప్‌ మీద పెట్టిన అభిశంసన తీర్మానం కూడా సెనేట్‌లో నెగ్గవచ్చునేమో. కానీ, అమెరికా సమాజంలో ఏర్పడిన విభజ నకూ, వీధుల్లో ఊరేగుతున్న ఉన్మాదానికీ ముగింపు ఎప్పుడు?

అమెరికా : ఒక సందేశం
రాజ్యం  (State) అనేది పుట్టిన తర్వాత అనేక రూపాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రాచరికాన్ని, మూకస్వామ్యాన్ని, నియంతృత్వాన్ని, కార్మికవర్గ లేదా పార్టీ నియంతృత్వాన్ని, మిలటరీ పాలననూ మానవజాతి చూసింది. ఈ అన్నిరకాల ప్రభుత్వాల్లోకల్లా శ్రేష్టమైనది ప్రజాస్వామ్యమేనని మేధావుల అభిప్రాయం. కానీ, రెండొందల యాభై ఏళ్లు గడిచినా అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిణతి రాలేదని, అనేక రకాలుగా ఇంకా వివక్ష కొనసాగుతున్నదని ఇటీవల పరిణామాలు చాటి చెబుతున్నాయి. వివక్షలు పోవాలంటే, వర్ణం, వర్గం ప్రాతిపది కన ఈసడింపు ధోరణి సమసిపోవాలంటే అణగారిన పీడితవర్గా లన్నీ అత్యున్నతస్థాయి అభివృద్ధిని అందుకోవడమే ఏకైక మార్గం. అప్పుడే ఈ వర్గాల ప్రజలు సమాన గౌరవాన్ని పొంద గలుగుతారు. పేదరికంతో వెనుకబడిపోయిన ఆఫ్రో అమెరిక న్లను వెలివాడల (ghettos)కు పరిమితం చేయకుండా అభివృ ద్ధిలో మిళితం చేసి ఉన్నట్లయితే శ్వేతనాగులు ఇప్పుడిలా బుసలు కొట్టగలిగి ఉండేవి కావు. ప్రజాస్వామ్య పరిణతికి పీడిత తాడిత వర్గాల అభ్యున్నతి ఒక ప్రధాన షరతు. ఈ షరతును నెరవేర్చకపోతే మన ప్రజాస్వామ్యాలు ఏనాటికైనా మూకస్వా మ్యాలుగానో, నియంతృత్వ రాజ్యాలుగానో పతనమయ్యే ప్రమాదం మన తలపై వేలాడుతూనే ఉంటుంది. అమెరికా పరిణామాలు నేర్పుతున్న పాఠం అదే.

vardhelli1959@gmail.com

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు