పుస్తకాలు దానం చేయండి!

4 May, 2022 16:20 IST|Sakshi

మే 5న ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. ప్రతి ఏటా ఏప్రిల్‌ 23న విద్యాలయాలకి సెలవులు ఇస్తారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ మే 5 వరకు పాఠశాలలు జరగనున్నాయి.   సాధారణంగా సెలవులు వచ్చాయంటే విద్యార్థులకు ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే పాఠశాల చివరి పనిరోజు వారు ఆనందంలో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు చించివేసి రహదార్లపై పడవేస్తుంటారు. 

ముఖ్యంగా ప్రయివేటు విద్యాలయాల్లో ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని వల్ల చెత్తాచెదారం పెరుగుతుంది. అసలే ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు డ్రైనేజీలలో నీరు నిల్వ ఉండి, దోమల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఒకే రోజు కాగితాలు చించివేయడం వల్ల, పారిశుద్ధ్య కార్మికులకి మరింత పనిభారం పెరుగుతుంది. నేల కాలుష్యం కూడా పెరుగుతుంది. సాధారణ ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. (క్లిక్: అనుసంధాన భాషగా హిందీ అవసరం లేదా?)
     
ఈ రోజు ఏ పోటీ పరీక్షల్లోనైనా ప్రాథమిక అంశాలను ఎక్కువగా అడుగుతున్నారు. చాలా మంది విద్యార్థులకు వీటిపై అవగాహన ఉండటం లేదు. ప్రాథమిక అంశాలు ఎక్కువగా కింది తరగతుల పుస్తకాలలోనే ఉంటాయి. పుస్తకాలను పారవేయకుండా వాటిని భద్రపరుచుకునేటట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. వీలుంటే వేసవిలో వారి చేత పుస్తక పఠనం చేయించవచ్చు. అలాగే పాఠ్య పుస్తకాలు కొనుక్కోలేని పేద విద్యార్థులకు పుస్తకాలను వితరణ చేయవచ్చు. ఈ చిన్ని సాయమే వారికి పెద్ద చేయూత అవుతుంది. ఫలితంగా చిన్న వయసులోనే విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెరుగుతుంది.  
– ఎం. రాంప్రదీప్, తిరువూరు

మరిన్ని వార్తలు