ప్రజలు తిరస్కరించిన ఫార్మాసిటీ

2 Sep, 2020 00:51 IST|Sakshi

వందల ఎకరాలలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను నియంత్రించలేని ప్రభుత్వం మరియు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఒకే చోట 1000 కంటే ఎక్కువ కాలుష్యం చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయడం ఆత్మహత్యా సదృశం.

రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకంగా పటాన్‌ చెరు, జీడిమెట్ల, చౌటుప్పల్, కొత్తూర్‌ వంటి ప్రాంతాలలో, ఫార్మా కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్న విషయం మనకు అనుభవమే. అనేక గ్రామాల ప్రజలు మందుల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ నీరు, గాలి మరియు అత్యంత ప్రమాదకర ఘన పదార్థాల కాలుష్యంతో సతమతమవుతున్నారు. ఆయా ప్రాంతాలలో స్థానికులు ప్రమాదకర రసాయన చర్యల బారిన పడి అనారోగ్యం పాలు అవుతూనే ఉన్నారు. పరిశ్రమ వేసే పవర్‌ బోర్ల తోటి స్థానిక భూగర్భ జలాలు అడుగంటిపోతు న్నాయి. బర్రెలు, ఎడ్లు, గొర్రెలు, మేకలు వంటివి కూడా కాలుష్యం బారిన పడి చనిపోవడంతో, వాటి మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడిన ఉదంతాలు అనేకం. నష్ట పరిహారం ఇచ్చే ఆలోచన అటు పరిశ్రమలు కాని, ఇటు ప్రభుత్వం కాని చేయలేదు. ఉపరితల నీటి వనరుల కాలుష్యం ఒక బాధ కాగా, కొన్ని పరిశ్రమలు ఇంజక్షన్‌ బోర్లు వేసి ప్రమాదకర వ్యర్థ జలాలను భూగర్భంలోకి వదులుతున్నాయి.

జీరో డిశ్చార్జి అంటూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న పరిశ్రమలను నియంత్రించకుండా, వాటిని మూసివేయకుండా, ప్రజల నిరసనలు తెలియ జేస్తే వారి మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టిన వైనాలు కూడా ఉన్నాయి. పోలేపల్లిలో కాలుష్యం గురించి ప్రజలు ఆందోళన చేస్తే, 22 జూలై 2017 నాడు జరిగిన సమీక్ష సమావేశంలో, పరిశ్రమల మంత్రితో సహా అధికారులు కాలుష్య నియంత్రణ మీద ఆలోచనలు పెట్టకుండా, కేవలం కంటితుడుపు మాటలతో తమ నిస్సహాయతను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఉన్నా, రాజ్యాంగం ప్రజల ప్రాథమిక హక్కుల గురించి స్పష్టం చేసినా కూడా, ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఇంకా ఇతర ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కాలుష్యం చేసే పరిశ్రమల మీద ఈగ వాలనీయకుండా కాపాడుతున్నారు. పరిశ్రమల నేరపూరిత వ్యవహారాన్ని ఎండగట్టకుండా కాలుష్య నియంత్రణ అధికా రులు గ్రామీణులను మోసం చేస్తున్నారు. కాలుష్యం తగ్గించి, వనరులను పునర్వినియోగించి, పర్యావరణాన్ని కాపాడవలసిన తరుణంలో, పరిశ్ర మలు కేవలం తమకు వచ్చే లాభాల మీదనే దృష్టి పెడుతున్నాయి. ఔషధ పరిశ్రమలు ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా సబ్సిడీలు పొందుతూ, ప్రజల మీద పడుతున్న దుష్ప్రభావం గురించి పట్టించుకోవడం లేదు. 

అక్కడ ఒక్కటి, ఇక్కడ ఒకటి పరిశ్రమలు ఉన్నప్పుడే ఇంత దారుణ పరిస్థితి ఉండగా, హైదరాబాద్‌ ఫార్మా సిటీ పేరుతో ఒకే చోట కొన్ని వందల ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే రాబోయే దుర్భర పరిస్థితులు ఊహకు కూడా అందవు. వందల ఎకరాలలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను నియం త్రించలేని ప్రభుత్వం మరియు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఒకే చోట 1000 కంటే ఎక్కువ కాలుష్యం చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయడం ఆత్మహత్యా సదృశం. ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. ఫార్మా సిటీ బారిన పడే అన్ని గ్రామాల ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. 20,000 ఎకరాలలో ఫార్మా సిటీ ఏర్పాటు వలన కనీసం 100 కి.మీ. పరిధిలో పర్యావరణం, చెట్లు, చెరువులు, కుంటలు, చెలమలు,  మట్టి, నేల, గాలి వంటి అన్ని రకాల సహజ వనరులు కలుషితం అయ్యి, స్థానిక ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ కాలుష్య ప్రభావం కొన్ని దశాబ్దాల వరకు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్‌ తరాల ఉనికికే ఇది ప్రమా దం. తెలంగాణ రాష్ట్రం మీద ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది.

ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 14న జారీ చేసిన జీవో 63 గమనించాలి. గ్రామ జ్యోతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం తమ వనరులను అంచనా వేసుకుని, తమ స్థాయికి అనుగుణంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఈ ఉత్తర్వులు చెబుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం కూడా ప్రతి గ్రామం కూడా తమ అభివృద్ధిని నిర్దేశించుకునే అవకాశం ఉంది. యాచారం, కందుకూరు, కడ్తాల్‌ మండలాలలో ఉన్న అనేక గ్రామాలు, ముచ్చెర్ల, మేడిపల్లి, కురుమిద్ద తదితర గ్రామాలతో సహా, ఎవరూ ఫార్మా సిటీ కోరుకోలేదు. స్థానిక యువతకు వారి చదువుకు, నైపుణ్యానికి తగ్గ ఉపాధి అవకాశాలు ఈ గ్రామాలు కోరుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న వ్యవసాయం, వృత్తులు ఇంకా అనేక ఇతర జీవనోపాధుల పునాదుల మీద అభివృద్ధి జరగాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. ఫార్మా పరిశ్రమల ఏర్పాటు వల్ల స్థానికులకు ఉపాధి దొరకకపోగా, స్థానిక గ్రామాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారుతుంది. 

తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలే పరమావధిగా అసమగ్ర సమాచారం, అబద్ధాలతో కూడిన నివేదికలు ఇచ్చి, హైదరాబాద్‌ ఫార్మా సిటీకి అనుమతులు తీసుకుంది. ఫార్మా సిటీ లోపల ఉండే గ్రామాలు, నివాస ప్రాంతాల గురించి ప్రభుత్వం చేసిన ప్రణాళిక శూన్యం.  అసైన్డ్‌ భూములకు, ఇతర భూములకు మధ్య నష్ట పరిహార పరిమాణంలో సరి సమానత లేదు. పేద, దళిత, బలహీన వర్గాల భూమి తన సొంత భూమిగా ప్రభుత్వం భావిస్తున్నది. భూమి లేని కుటుంబాలు, ఇతర వృత్తిదారుల పట్ల పునరావాస ప్రణాళికలు అసలే లేవు. వారికి భారత రాజ్యాంగం హక్కులు కల్పిస్తున్నది అనే వాస్తవం విస్మరించారు. ఇప్పటికే కొంత అవకతవకల నడుమ, చిన్న రైతులను బెదిరించి తీసుకున్న భూముల వ్యవహారంలో స్పష్టమైన అవినీతి మీద విచారణ చేపట్టలేదు. సింగపూర్‌ కంపెనీకి ఫార్మా సిటీ మాస్టర్‌ ప్రణాళిక తయారు చేయమని కాంట్రాక్ట్‌ ఇచ్చినా, వారి నివేదిక ప్రజలకు అందుబాటులో లేదు. మాస్టర్‌ ప్లాన్‌ తయారు కాకముందే, అసైన్డ్‌ భూములు, అటవీ, పట్టా భూముల సేకరణ చేపట్టడం సుపరిపాలన పద్ధతులకు వ్యతిరేకం. హైదరాబాద్‌ ఫార్మా సిటీ పేరిట రంగారెడ్డి జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్ట్‌ ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలి. 
డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి 
వ్యాసకర్త, పర్యావరణ విధాన విశ్లేషకులు
 

మరిన్ని వార్తలు