రాజకీయ గోదాలో... ఓటర్లే ఈటెలు

13 Jul, 2021 00:42 IST|Sakshi

తెలంగాణ ఏర్పడగానే ఇక ధర్నాచౌక్‌ల అవసరమే రాదని కేసీఆర్‌ అంటే, ధర్మగంట మోగగానే సెక్రటేరియట్‌ తలుపులు తెరుచుకొని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని ఉద్యమ సంఘాలు ఆశించినాయి. కానీ ఎన్‌కౌంటర్లు, లాకప్‌డెత్‌లు, సకల రంగాల్లో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే ధర్నాచౌక్‌లో ధర్నాలకు అనుమతి నిరాకరించింది తెలంగాణ ప్రభుత్వం. కొంత షాక్‌కు గురయినా అందరం కోర్టు మెట్లెక్కి ప్రభుత్వానికి మొట్టికాయలు కొట్టిస్తే చాలా నెలల తరువాత అనుమతిని సాధించాం. అయినా ఒక్క నిరసన నినాదం మీడియా కంట కనబడకుండా ఆంక్షలు సాగుతూనే ఉన్నాయి. 

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్, విప్లవ రచయితల సంఘం, తెలంగాణ విద్యార్థి సంఘం, పౌరహక్కుల సంఘం, తదితర 16 సంఘాలు మార్చి 30న జీవో 73 జారీతో నిషేధానికి గురైనాయి. తెలంగాణ ప్రజా భద్రతా చట్టం 1992 ఉమ్మడి రాష్ట్రంలోని చట్టం. నిర్బంధాలు పోయి ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని తెచ్చుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ సాధన సంఘాలే నిషేధానికి గురైనాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనెదుర్కొంటున్న స్టాన్‌ స్వామి మరణానికి దారి తీసిన పరిస్థితుల్లో ప్రధానమైనది కుట్రపూరితంగా భీమ్‌ కోరేగామ్‌ కేసులో ఆయనను ఇరికించడం. స్టాన్‌ స్వామితో పాటు వరవరరావు, ప్రొఫెసర్‌ సాయి బాబా, రోనా విల్సన్‌ తదితరులను విడుదల చేయాలని ఈ 16 ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయనీ, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆంక్షలు విధిస్తున్నామనీ ప్రభుత్వం చెప్పింది.

ఈ జీవో 73ను సవాలు చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పౌర హక్కుల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం పిటిషన్‌ వేయడం, కోర్టులు నోటీసు జారీ చేయడం జరిగింది. ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ ఇంటి పార్టీ 25 ఏప్రిల్‌ 2021 నాడు బహిరంగ లేఖ రాసింది. తెలంగాణలో మేధావులు, రచయితలు ఎంతో మంది ఇలా లేఖలు రాసినా కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు. కానీ హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు, కోర్టు మెట్లు నిషేధాన్ని ఎత్తివేయించగలిగాయి.

ప్రజా సంఘాలపై నిషేధం ఇప్పట్లో ఎత్తివేయాలని కేసీఆర్‌ అనుకోలేదు. కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్నే టీఆర్‌ఎస్‌లో కలపడం, ఏ ప్రతిపక్షాన్నీ ప్రగతి భవన్‌ రానివ్వకపోవడం గమనించిందే. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ప్రజా క్షేత్రంలో వ్యతిరేకతను వేగులు సరిగానే సమాచారం చేరవేసిండ్రు. దాని ఫలితమే ప్రగతి భవన్‌ నుండి భట్టి విక్రమార్క తదితరులకు ఫోన్, ఆహ్వానం, మరియమ్మ ఘటనపై విచారణ, ఆర్థిక సహాయం, మరునాడు దళిత సాధికారతపై చర్చ, అనేక తాయిలాల ప్రకటన. ఎవరేమి అను కున్నా ఇవన్నీ తరుముకొస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, ఓటర్లు విసిరే ఈటెల ముప్పుగానే భావిం చాలి. ఎన్నో రాస్తారోకోలు, బంద్‌లు చేసినా  మరింత నిర్బంధం తప్ప ముందుకుపోని స్థితి నుండి, ఒక ఉప ఎన్నికతో ఎన్నో సానుకూల ఫలితాలు వచ్చాయి.

నిషేధించిన 16 సంస్థల్లో ఒకటైన పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల్లో కేసీఆర్‌ తనను సంఘం అధ్యక్షుడిని చేస్తే పౌర హక్కుల కోసం పోరాడుతాన న్నారు. ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు భావ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛపై ఉపన్యాసాలు ఇచ్చినవాళ్లు, అధికారంలోకి రాగానే నియంతలుగా అవతారమెత్తితే ఓటరు విసిరే ఈటెలకు గాయాల పాలుకాక తప్పదు.

ఓపికగా ఉద్యమాలను కొనసాగించడమంటే అది మితవాద వైఖరిగా, జావగారిపోయిన తీరుగా, జబ్బలు జారవేసిన తీరుగా భావించడం, ముద్ర వేయడం ప్రజలకు ఎంతో నష్టం కలిగించింది.  ప్రపం చంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల్లో ఒకటైన మన దేశం పత్రికా స్వేచ్ఛలో 142వ స్థానంలో ఉండడం యాదృచ్ఛికం ఏమీ కాదు. స్టాన్‌ స్వామిలాంటి ఆక్టోజె నేరియన్‌ను మన వ్యవస్థల నిష్క్రియాపరత్వంతో ఆక్టో పస్‌లా చుట్టుముట్టి అంతం చేస్తే మూల్యం భవిష్యత్తు తరాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూల్యం ఎన్ని కల్లో ఓటర్లు విసిరే ఈటెల కంటే పెద్దది.

వ్యాసకర్త
డా. చెరుకు సుధాకర్‌ 
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు
మొబైల్‌ : 98484 72329

>
మరిన్ని వార్తలు