ఒక దేశం – ఒకే పువ్వు

25 Jan, 2023 13:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎవరో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు
వీచే ముందు గాలులు అనుమతి తీసుకోవాలని
వీచే ముందు గాలులు తమ దిశ దశ ఏమిటో ఎటో
వివరాలు తెలియ జేయాలని
ఎవరో కొత్త చట్టం తెచ్చారు

గాలులు ఎంత దూరం పోవాలనుకున్నాయో
అవి ఎంత వేగంగా వీచాలనుకున్నాయో
వివరాలు సమర్పించనిదే అనుమతి దొరకదని
ఎవరో కొత్త చట్టం తెచ్చారు
ఇప్పుడిక్కడ సుడిగాలులకు అనుమతి లేదు

మేం కడుతున్న ఆ పేకమేడల్ని
సంరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది
అందువల్ల ఈ చట్టాలు
సత్వరమే అమల్లోకొస్తున్నాయి!
తమ చుట్టాలకు అనుగుణంగా
ఎవరో ఇక్కడ కొత్త చట్టాలు తెచ్చారు

ఒడ్డును తాకే కెరటాలక్కూడా ఒక హెచ్చరిక!
ఎగిసెగిసి పడటం మళ్లీ తిరిగి వెళ్ళడం
బలం పుంజుకుని మళ్లీ నీటి పిడికిళ్ళతో
తిరిగి రావడం ఇవన్నీ ఇప్పుడిక కుదరదు
తిరుగుబాట్లు, ఉద్యమాలు,
హోరెత్తిపోవడాలు నిషిద్ధం
ఎంతటి ఉధృతి ఉన్నా బుద్ధిగా ఒడ్డులోపల మాత్రమే
నిశ్శబ్దంగా ప్రవహించాల్సి ఉంటుంది!
తోటలోని మొక్కలన్నీ ఒకే విధంగా పూయాలని
పూచే పూల రంగు కూడా ఒకటిగానే ఉండాలని
కొత్త చట్టం అమలులో కొచ్చింది
ఒకే రంగు మాత్రమే కాదు
ఏ పువ్వు రంగు ఎంత గాఢంగా ఉండాలో కూడా
వారు నియమించిన వారి అధికారులే నిర్ణయిస్తారట!

ఒక దేశం – ఒకే పువ్వు!!
ఈ చట్టాలు చేసిన గౌరవనీయులకు ఎవడు చెప్పాలి?
తోటలో అన్ని మొక్కల పూలు ఒకే రకంగా ఉండవని – 
ఉండటానికి వీలే లేదని – 
ఒక రంగులో అనేక రంగులుంటాయని కూడా
వారికి ఎవడు చెప్పాలి?

గాలులు, కెరటాలు ఎవరి చట్టాలకూ లొంగవనీ
గాలి ఎవరి పిడికిలిలోనో ఖైదీగా ఉండదని
కెరటం ఎవరి జీవోలతోనో వెనక్కి మళ్ళదని
ఎంతటి వారైనా సరే, వాటిని గమనిస్తూ
వాటికి అనుగుణంగా బతకాల్సిందే తప్ప
మరో మార్గం లేదని!
లేకపోతే, అవి సృష్టించే సునామీలో
అడ్రసు లేకుండా గల్లంతు కావల్సిందేనని
నామరూపాలు లేకుండా నశించాల్సిందేనని
వారికి ఎవరైనా చెప్పండి!
కనీస గౌరవమైనా... కాపాడుకొమ్మని!!

– డాక్టర్‌ దేవరాజు మహారాజు
(దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమ నేపథ్యంలో) 

మరిన్ని వార్తలు