2 Years Of YS Jagan Rule In AP: ఇరవై ఏళ్ల భరోసా

30 May, 2021 08:36 IST|Sakshi

సందర్భం

ఇది ప్రజాస్వామ్య యుగం. ప్రజలే పాలకులను ఎన్నుకొనే కాలం. రాజులు పోయి, మంత్రులొచ్చిన సమయం. ఎంతోమంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు. కానీ ఎంతమంది ప్రజల నాల్క లపై ఉంటున్నారు? ప్రజల హృదయాలను జయిస్తున్నారు? ప్రజోపయోగకర పనులు చేస్తూ, తన పాలనలో మౌలికమైన మార్పులు తీసుకొచ్చిన పాలకుడే ఉత్తమ నాయకుడు. రాజకీయాలు మరింత ఘోరంగా మారుతూ, మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా మారుతూ విలువలు మృగ్యమవుతున్న సమయంలో మానవీయ పనులకు, మనిషికి ప్రాధాన్యతనిచ్చి పాలన అందిస్తున్న యువనాయకుడు జగన్‌. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు మాత్రమే అయినా ఆంధ్రప్రదేశ్‌ నేలిన ఏ పాలకుడూ తేని మౌలిక మార్పులను తీసుకు రాగలిగారు. ఎన్నికల వాగ్దానాలను 90 శాతానికి పైగా నెరవేర్చగలిగారు.

ప్రతిపక్షాలు అదేపనిగా ఎన్ని అడ్డంకులు కల్పిస్తున్నా, కువిమర్శలు చేస్తున్నా, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రజలకు మౌలికావసరాలైన విద్య, వైద్యం, సేద్యంలలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చి అతి స్వల్ప కాలంలోనే ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఏ పాలకుడి విజయమైనా పెట్టుబడిదారులను, బిలియనీర్లను సంతృప్తిపరచి వారిని మరింత ధనవంతులుగా మార్చడంలో ఉండదు. కోట్లాది సామాన్య ప్రజల కంచాల్లోకి పట్టెడన్నం, ఇళ్లల్లోకి జ్ఞానాన్నిచ్చే చదువు, రోగాలొస్తే ఉచిత వైద్యం అందించగలిగేవాడే ఉత్తమ పాలకుడవుతాడు.

విద్యారంగం విషయంలో జగన్‌ చేసిన పనులు ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేవిగా, పేదల పాలిటి శాపంలాంటి కార్పొరేట్‌ విద్యను నిరుత్సాహ పరిచేవిగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇంగ్లిష్‌ మాధ్యమ విద్యను అందుకోడానికి లక్షలాది రూపాయల ఖర్చును భరించలేని బహుజనులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఓ వరం. ఇది బహుజనుల చిరకాల స్వప్నం కూడా. దీనివల్ల అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్య అందరికీ లభిస్తుంది. ఈ విధానం విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలనిస్తుంది.

అమ్మఒడి, వసతి దీవెన, విద్యాదీవెన, నాడు నేడు లాంటి అనేక పథకాలు, ప్రభుత్వ పాఠశాలలను అన్ని వసతులు గలవిగా తీర్చిదిద్దుతాయి. ఈ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతుంది. విద్య విషయంలో ఇలావుంటే రాజ కీయపదవుల విషయంలోనూ బహుజన కులాలవారికి సముచిత స్థానం లభిస్తుంది. ఇటీవల జరిగిన మునిసిపాలిటీ ఎన్నికల్లో ఎనభైశాతం పదవులు, నామినేటెడ్‌ పదవులు బహుజనుల కివ్వడం బహుజనుల విషయంలో మౌలిక మార్పునకు చక్కని ఉదాహరణ. ఇక సామాన్య మానవుల జీవి తాల్లో అతిముఖ్యమైన అవసరాల్లో వైద్యసౌకర్యం ఒకటి.  శవాలపై పైసలేరుకునే దుర్మార్గపు వ్యవస్థలో మనిషి ప్రాణాలతో చెలగాటాలాడటం వైద్యరంగంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలను అన్ని రోగాలకు వర్తింపజేయడం మానవీయ చర్య. కరోనాను ఎదుర్కోవడానికి ఇంటిం టికి వాలంటీర్లను పంపడం, పరీక్ష చేయడం, ఉచి తంగా కిట్లు ఇవ్వడం, ఇసోలేషన్‌ సెంటర్లను విరి విగా ఏర్పాటు చేయడంలాంటి అనేక చర్యలు జగన్‌ చేపట్టారు. ప్రభుత్వం చేస్తున్న పనులు మనిషితనాన్ని చాటే చర్యలనడంలో సందేహం లేదు.

వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రైతుకు భరోసానిస్తున్నారు జగన్‌. రైతు భరోసా, ఉచిత బోర్లు, ఉచిత విద్యుత్, పంటనష్టం చెల్లింపు, డ్వాక్రా రుణాల వడ్డీ చెల్లింపు, ఇంటింటికి ఒక్కో వ్యక్తికి రేషన్‌ కార్డు బియ్యం పదికిలోల చొప్పున ఇవ్వడంలాంటి అనేక చర్యలతో సామాన్య ప్రజ లకు ఆహార కొరత లేకుండా చేస్తున్నారు. ప్రతి ఆటోవాలాకు పదివేల రూపాయలు చొప్పున ఇవ్వడం, నాయీబ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేయడం, మత్స్యకారులకు చేపలవేటలో భరోసా ఇవ్వడం, వృద్ధులకు, వికలాంగులకు ఇంటికే పెన్షన్‌ పంపడం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్ణాలనాదుకుంటున్నారు. ఏ ఒక్క మత విశ్వాసం కలవారికో కాకుండా గుడి పూజారులకు, మజీద్‌ మౌల్విలకు, చర్చ్‌ ఫాదర్‌లకు గౌరవ వేతనం ఇస్తూ లౌకిక భావనను, సర్వమత సమాన భావనను పెంపొందిస్తున్నారు.

ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు, రాష్ట్ర అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి మూడు రాజధానుల ఏర్పాటుపై స్పష్టతతో ఉండటం, ఆర్టీసీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం, పదహారు వైద్యకళాశాలల నిర్మాణానికి పూనుకోవడం ఆంధ్ర ప్రజలకు పాలనాపరమైన భరోసానివ్వడమే. సచివాలయం, పోలవరం ప్రాజెక్టు లాంటివన్నీ సకాలంలో పూర్తి చేసే చిత్తశుద్ధి, సేవాభావం జగన్‌కున్నాయి. విమానాశ్రయాల నిర్మాణం, పారిశ్రామిక ప్రగతి కోసం కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అందుకే అన్ని ఎన్నికల్లోనూ విజయాల పరంపర. రెండేళ్ల క్రితం రాష్ట్రపాలనా పగ్గాలు చేపట్టి విరామమెరుగక శ్రమిస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలనే కాకుండా అదనంగా అనేక పనులు చేస్తూ సామాన్యుడు కేంద్రబిందువుగా పాలన సాగిస్తున్న వైఎస్‌ జగన్‌ రెండేళ్ల పాలన ఆంధ్ర ప్రజలకు 20 ఏళ్ల భరోసానిస్తోంది.

-డా. కాలువ మల్లయ్య 
వ్యాసకర్త ప్రముఖ రచయిత
మొబైల్‌ : 91829 18567

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు