పోరాటమే ఆయన జీవనరథం

7 Nov, 2021 00:39 IST|Sakshi

ఎల్‌.కె. అడ్వాణీ... భారతీయ జనతా పార్టీ కురు వృద్ధులు. పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ఆయన దేశానికి స్వాతంత్య్రం రాకముందు పాకిస్తాన్‌లోని కరాచీలో 1927లో జన్మించారు. దేశ ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా ఆయన సేవలు కొనియాడదగినవి.

ఆయన్ని ప్రధానిగా చూడాలని కలలు గన్నవారు కొంతమందైతే, దేశ ప్రథమ పౌరునిగా సేవలు అందిం చాలని ఆశపడిన వారు మరికొందరు. ఏమైనప్పటికీ ఇటు దేశ రాజకీయాలలో గానీ, అటు పార్టీలో గానీ ఆయన స్థానం వేరు, ఆయన స్థాయి వేరు అని అభిమానుల అభిప్రాయం. కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నప్పుడే బీజేపీని తారాస్థాయికి తీసుకువెళ్లింది అడ్వాణీ అని చెప్పక తప్పదు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి, అడ్వాణీల స్నేహం ప్రపంచానికి ఆదర్శం. వారు ఇరువురు పార్టీ అనే విత్తనం నాటిన నుండి అది మహావృక్షంలా ఎదిగేవరకూ చేసిన ప్రయాణం స్ఫూర్తిదాయకం.

14 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో అడ్వాణీ కార్యకర్తగా చేరారు. న్యాయ విద్యాభ్యాసంతో భారత రాజ్యాంగంపై పట్టు పెంచు కున్నారు. రాజకీయాలలో రాజనీతిజ్ఞుడు అనిపించు కున్నారు. భారతీయ జన సంఘ్‌ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడే ఎమర్జెన్సీ ఉద్యమం మొదలైంది. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ పిలుపు మేరకు ఆ ఉద్యమంలో పాల్గొని, జనసంఘ్‌ను జేపీ స్థాపించిన జనతా పార్టీలో విలీనం చేసి, 1978లో జనతా ప్రభుత్వానికి శ్రీకారం చుట్టారు. 

బలమైన నాయకత్వం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పునా దులను పెకిలించిన జయప్రకాష్‌ నాయకత్వం విజయ వంతమవ్వడమే కాకుండా అన్ని పార్టీల నాయకులలో ఆత్మవిశ్వాసం మొదలైంది. నాటి జనతా ప్రభుత్వం విఫలమైనప్పటికీ జేపీ స్ఫూర్తితో ఎంతో మంది జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ వంటి వారి భావాలతో ప్రభా వితులైనప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొన్న జేపీ ధైర్య సాహసాల స్ఫూర్తితో 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 

బ్రిటిష్‌ వారు స్వాతంత్య్ర సమరయోధులను, విద్యా వేత్తలను, నాయకులను సంవత్సరాలపాటు నిర్బంధించి నప్పుడు జైలులో కూడా వారు దేశ పరిస్థితుల గురించి ఆలోచించడమే కాకుండా, వాటికి అక్షరరూపం ఇచ్చారు. మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్, సుభాష్‌ చంద్ర బోస్, భగత్‌సింగ్, ఎం.ఎన్‌.రాయ్, జవహర్‌లాల్‌ నెహ్రూ, అరబింద్‌ ఘోష్‌ వంటివారు జైలులో రాశారు.

దేశంలో రెండవ స్వాతంత్య్ర పోరాటంగా పిలిచే పొలి టికల్‌ ఎమర్జెన్సీలో కూడా జయప్రకాశ్‌ నారాయణ్, మొరార్జీ దేశాయ్, వాజ్‌పేయ్, కులదీప్‌ నయ్యర్‌ వంటి వారు డైరీలు రాశారు. ఎమర్జెన్సీ ఉద్యమం సమయంలో దేశంలో చాలామంది నాయకులతో పాటు అడ్వాణీ కూడా అరెస్టయ్యారు. జూన్‌ 23, 1975 నుండి 19 నెలల పాటు నిర్బంధంలో ఉన్నారు. జైలులో కాలాన్ని వృథా చేయ కుండా కార్యక్రమాలకు వ్యూహాలు రచించారు. దానితో పాటు నిరంతరం డైరీ రాశారు. 

ఇతర రచయితల జైలు రచనలను చదవడమే కాకుండా, వారి రచనలలో సారాంశాన్ని వీరి రచనలలో ప్రస్తావించారు. అది 1978లో ‘ఎ ప్రిజనర్స్‌ స్క్రాప్‌ బుక్‌’గా ప్రచురితమైంది. ‘ప్రిజన్‌ రైటింగ్‌ డ్యూరింగ్‌ ఎమర్జెన్సీ ఇన్‌ ఇండియా: ఎ స్టడీ’ అనే అంశంపై పరిశోధన నిమిత్తం ఢిల్లీలో అడ్వాణీ గారి ఆఫీసులో ఆయన్ని కలవడం, సంభా షించడం నా జీవితంలో మరపురాని ఘట్టం. ఆయన టవ రింగ్‌ పర్సనాలిటీ, గంభీరమైన స్వరం, సున్నితమైన మనస్సు నుండి జారిన మాటలు నన్ను ఎంతగానో ప్రభా వితం చేశాయి. 

ఆయనలో జాతీయతాభావం, ప్రజాస్వామిక విలు వల పట్ల నిబద్ధత, నిస్వార్థ రాజకీయ లక్ష్యాలు పుష్క లంగా కనిపించాయి. మరో ఉక్కు మనిషిగా, అభినవ పటేల్‌గా కనిపించారు. ఆయన ఆత్మకథ ‘మై కంట్రీ మై లైఫ్‌’ భారతదేశ ఔన్నత్యం గురించీ, దేశంతో, దేశ రాజకీ యాలతో ముడిపడిన ఆయన జీవిత ప్రయాణం గురించీ వివరంగా చెబుతుంది.

– డాక్టర్‌ నెమలిపురి సత్యనారాయణ
అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అనిల్‌ నీరుకొండ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్సెస్‌
 మొబైల్‌ : 62810 64934
(నవంబర్‌ 8న ఎల్‌.కె. అడ్వాణీ 94వ జన్మదినం)

మరిన్ని వార్తలు