SP Balasubrahmanyam: జీవితాన్ని ప్రేమించిన బాలుడు

4 Jun, 2021 08:55 IST|Sakshi
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో వ్యాసకర్త

ఆబాలగోపాలం ‘బాలు’ అని ముద్దుగా పిల్చుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం వజ్రోత్సవ (75 సంవత్సరాల) జయంతి నేడు. ఆ మహామనీషి మన మధ్యలేని ప్రథమ జయంతి. బాలు ఒక సంగీత విశ్వవిద్యాలయమనీ, ఆయన సంగీత సాహిత్యాలను సమంగా ప్రేమించారనీ సర్వులకూ తెలుసు. ఆయన సంస్కారానికి నిలువెత్తు నిదర్శనమనీ, ఎదిగినకొద్దీ ఒదిగే వినయం ఆయన ఆభరణమనీ ‘పాడుతా తీయగా’ వీక్ష కులకు తెలుసు. ఆయన భాషాభిమానం విస్తృత సంగీత సాహిత్య పరిజ్ఞానం ఆ కార్యక్రమం ద్వారా వెల్లడయ్యాయి. వెరసి ఆదర్శ ప్రాయమైన వ్యక్తిత్వం గల ప్రతిభామూర్తిగా ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం పండిత పామర భేదం లేకుండా అందరికీ అభిమాన పాత్రులయ్యారు.

‘పుట్టినరోజు పండుగే అందరికీ, పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?’ అన్నారు ఒక పాటలో డాక్టర్‌ సి.నారాయణరెడ్డి. అలా తన పుట్టుక పరమార్థం తెలిసిన కారణజన్ముడు బాలు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలోను, రెండు మూడు ఇంటర్వ్యూలలోను బాలు జీవితంపట్ల తన ప్రేమను, సంతృప్తిని వ్యక్తం చేశారు. ‘నాకు కావలసినవన్నీ ఉన్నాయి. లగ్జరీస్‌ పట్ల కోరికలు లేవు. ఉండటానికి మంచి ఇల్లుంది. మంచి సంసారం ఉంది. బయటకు వెళ్తే నిల్చుని గౌరవించే మనుషులున్నారు. దేవుడు నాకిచ్చిన వాటితో చాలా సంతృప్తిగా ఉన్నాను. నాకిలాంటి జీవితం చివరి వరకు సాగాలనీ, నూరేళ్లూ నేను బతకాలనీ కోరుకుంటున్నాను. నాకు జన్మరాహిత్యం వద్దు. మళ్లీ జన్మ కావాలి. నేను మరుజన్మలో కూడా బాలసుబ్రహ్మణ్యంగానే పుట్టి ఇలాగే గాయకుడినవ్వాలి. ఈ జన్మలో నేను చనిపోతే నిద్రలో చనిపోవాలి కానీ హాస్పిటల్‌కి వెళ్లకూడదు’ అంటూ జీవితంతో తన అనుబంధాన్ని, ఆశలను పునరుక్తం చేసేవారు.

ఇప్పట్లో తన జోలికి చావురాదని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారు. ‘శీతవేళ రానీయకు శిశిరానికి చోటీ యకు’ అని కృష్ణశాస్త్రి చెప్పినట్టు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉల్లా సంగా నిత్యవసంతుడిలా ఉండేవారు. దురదృష్టవశాత్తు 2020 సెప్టెంబర్‌లో మృత్యువు కరోనా రూపంలో వచ్చి, దొంగదెబ్బ తీసి బాలును మనకు భౌతికంగా దూరం చేసినా– ఆయన నమ్మ కాన్ని మాత్రం వమ్ము చేయలేకపోయింది. కోట్లాది అభిమానుల గుండెల్లో కొలువైన ఆయన మధుర స్మృతులను ఏ మహమ్మారీ చెరపలేకపోతోంది.

‘నా మాతృభాష సంగీతం’ అనే నినాదంతో 16 భాషల్లో సుమారు 40 వేల పాటల్ని ఆలపించి సంగీత ప్రపంచంలో శిఖ రాగ్రాన్ని అధిష్టించిన త్రివిక్రముడు బాలుడు. ‘స్నేహం చేసే ముందు అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవాలి. స్నేహం చేశాక మిత్రునిలో లోపాలు ఉన్నా వాటిని సరిదిద్దాలి తప్ప, స్నేహాన్ని తెంచుకోకూడదు. అది దాంపత్య బంధం లాంటిది. కష్టమైనా నిష్టురమైనా భరించక తప్పదు’ అంటూ స్నేహాన్ని నిర్వచించి, నిజ జీవితంలో ఆచరించి చూపిన కర్మయోగి బాలు.

తనకు సినీ గాయకునిగా జన్మనిచ్చిన సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి పేర రికార్డింగ్‌ థియేటర్‌ను నెలకొల్పి, హైదరాబాద్‌ రవీంద్ర భారతి ఆవరణలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్టించి, జేసుదాసుకు పాదాభిషేకం చేసి పెద్దలపట్ల గౌర వాన్ని, కృతజ్ఞతను చాటిన సంస్కారి బాలు. సీనియర్‌ గాయనీ గాయకులకు, సంగీత దర్శకులకు బాలు ఇచ్చిన గౌరవం ఆయన వినమ్రతకు తార్కాణం.

సంగీత దర్శకుడు సత్యం, హీరో కృష్ణ, ఇళయరాజా వంటి ప్రముఖులతో వచ్చిన వివాదాలను బాలు పరిష్కరించుకున్న తీరు, అతని సంస్కారానికి మచ్చుతునకలు. కుడిచేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియనీయని వితరణశీలి బాలు. తండ్రి పేరుతో ఒక ట్రస్ట్‌ను స్థాపించి క్రీడా వైద్య రంగాలకు చెందిన వారితో సహా ఎందరో విద్యార్థులకు ఆయన గుప్తదానాలు చేశారు. చివరిలో పిత్రార్జితమైన ఇంటిని కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామికి ఉదారంగా ధారపోశారు. తన చరమదశలో ‘ఎస్పీబీ ఫ్యాన్స్‌ చారి టబుల్‌ ఫౌండేషన్‌’ ద్వారా కరోనా బాధితులను ఆదుకొన్న బాలు సేవా నిరతిని చూసి కరోనాకు కడుపు మండిందేమో అజాత శత్రువయిన ఆయననే కాటేసింది.

ఎస్పీ బాలు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించిన ఆదర్శపుత్రుడు. హరికథా భాగవతార్‌ అయిన తండ్రి సాంబ మూర్తి కాంస్య విగ్రహాన్ని నెల్లూరులో ప్రతిష్టించడమే కాకుండా ఆయన జీవిత చరిత్రను గ్రంథస్తం చేయించి ప్రచురించారు. తన సోదరి ఎస్పీ శైలజ, తనయుడు చరణ్‌ సినీ రంగంలో గాయనీ గాయకులుగా వారికి తగిన స్థాయిలో ఎదగకపోవడానికి తన క్రీనీడయే కారణమని మథనపడేవారు. ‘పాడుతా తీయగా’, ‘పాటశాల’ ద్వారా ప్రతిభావంతులైన యువ గాయనీ గాయకు లను ప్రోత్సహించి కొందరిని వెండితెరకు కూడా పరిచయం చేసిన పెద్ద మనసుగల ఆచార్యుడు బాలు.

ఆయన మరణాన్ని జయించిన యశఃకాయుడు. తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’లో రాసినట్టు–
‘జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు
అమృతంపు సోనను దోసిళ్లతో తాగి వచ్చినవాడు
దుఃఖాన్నీ, చావునూ వెళ్లిపొమ్మన్న అమరుడు’

డాక్టర్‌ పైడిపాల
సినీ గేయ సాహిత్య విమర్శకులు
మొబైల్‌ : 99891 06162

చదవండి: SP Balasubrahmanyam: నిలువెత్తు మంచితనం

మరిన్ని వార్తలు