Demonetisation: పెద్ద నోట్ల రద్దు ఫలితమేంటి?

5 Jan, 2023 12:11 IST|Sakshi

2016 నవంబర్‌ 8న ప్రధాని ప్రకటించిన నోట్ల రద్దుపై వ్యాజ్యాలను విన్న అత్యున్నత న్యాయస్థానం ఆ ప్రక్రియలో ప్రభుత్వం పరిధి మీరడం లాంటిదేమీ లేదనీ, అంతా పద్ధతి ప్రకారమే జరిగిందనీ తీర్పు వెలువరించింది. నలుగురు న్యాయమూర్తులు ఇదే అభిప్రాయం వెలిబుచ్చగా, ఒక్కరు మాత్రం సరికాదంటూ విభేదించారు. న్యాయస్థానం మద్దతు ప్రభుత్వానికి కొంచెం ఊరట. ఒకవేళ ఆ ప్రక్రియని న్యాయస్థానం తప్పుపట్టి ఉన్నా వాస్తవంలో పెద్ద ప్రభావం ఏమీ ఉండేది కాదు గానీ ప్రభుత్వం వైపు నుండి తప్పు జరిగినట్లు భావన స్థిరపడి పోయేది. ఎప్పుడో జరిగిపోయిన నిర్ణయం.. పర్యవసానాలు కూడా అనుభవమై పోయాక అది, తప్పో ఒప్పో అన్నది కేవలం మేధోమధనం కోసమే. 

అయినా విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం ఎటూ జోక్యం చేసు కోదు. అది దాని పరిధిలోని అంశం కాదు. పెద్ద నోట్ల రద్దు విషయంలో రిజర్వ్‌ బ్యాంకును సంప్రదించకుండా ఏకపక్షంగా, హఠాత్తుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నది పిటిషనర్ల వాదన. అయితే ఆరు మాసాల ముందు నుండే సంప్ర దింపుల ప్రక్రియ జరిగినట్లు, ప్రకటన వరకూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి నట్లు ప్రభుత్వం చెప్పడంతో న్యాయస్థానం ఆ ప్రక్రియ చట్టబద్ధతను సమర్థించింది. ప్రభుత్వానికి ఆ హక్కు ఉందని తెలియజేసింది. ఒక న్యాయమూర్తి మాత్రం నోట్ల రద్దు ప్రతిపాదన రిజర్వు బ్యాంకు నుండి కాకుండా  కేంద్రం నుండి రావడాన్నీ, ప్రకటించే ముందు పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోకపోవడాన్నీ తప్పు పట్టారు. వారి అభిప్రాయం కూడా గమనంలోకి తీసుకుని ప్రభుత్వం భవిష్యత్‌లో ఈ తరహా పెద్ద నిర్ణయాల్లో ఇలాంటి వైఖరి తీసుకోకుండా ఉంటే సబబుగా ఉంటుంది. 

భిన్న వాదనల్ని పక్కకు పెట్టి నిష్పక్షపాతంగా చూస్తే పెద్ద నోట్ల రద్దు ప్రకటించక ముందు ప్రభుత్వం ఇంకొంత జాగ్రత్త వహించి అన్నికోణాల్లో ఆలోచించి ఉంటే బాగుండేది. తీవ్రంగా నష్టపోయిన అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తక్కువ తగిలేది. జనజీవనం, సామాన్యుల నగదు లావాదేవీలు కుదుపు నుండి తొందరగా కోలుకొనేవి. వెరసి ఆర్థిక వ్యవస్థకు లాభం జరిగేది. (క్లిక్‌ చేయండి: 2023లో మన విదేశాంగం ఎటు?)

పెద్దనోట్ల రద్దు వల్ల ఒనగూడే ప్రయోజనాలు ఇవి అంటూ ప్రధాని ఏవైతే చెప్పారో (నల్లధనం తగ్గుదల, నకిలీ నోట్ల నివారణ, తీవ్రవాదులకు ఫండింగ్‌) వాటిలో ఎన్ని సాధ్యమయ్యాయో ఇప్పటికీ లెక్కలు లేవు. అధ్యయనం చేసి ఆ గణాంకాల్ని వెలికితీస్తే గానీ అసలు వాస్తవం బోధపడదు. నిర్ణయం చట్టబద్ధమే కావొచ్చు కానీ ఫలితం ఏమిటి అన్నది ప్రధానం. ఔషధం సరియైనదా, కాదా... సరియైనదే అయినా వికటించిందా, లేక అనుకున్న ప్రభావం చూపిందా అన్నదే గీటురాయి. 

– డాక్టర్‌ డి.వి.జి. శంకర రావు; మాజీ ఎంపీ, పార్వతీపురం

మరిన్ని వార్తలు