Land Distribution: భూ పంపిణీయే పరిష్కార మార్గం!

23 May, 2022 12:51 IST|Sakshi

స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు గడిచినా దేశంలో అసమానతల్లో పెద్దగా మార్పేమీ కనిపించడంలేదు. పేదల కోసం పోరాడే వారంతా ఒక గొడుగు కిందకు వచ్చి ఆర్థిక పోరాటాలు చేస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు ఉండదు. ఇప్పుడు పీడిత వర్గాలకు దళితులు నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చింది. వేలాది జిగ్నేష్‌ మేవానీలు, కన్హయ్య కుమార్‌లు, ఉమర్‌ ఖాలీద్‌లు పుట్టుకు రావాలి. అప్పుడే ఈ బహుజనుల మౌలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిజానికి ఈ ప్రజల మౌలిక సమస్య – భూమి సమస్య. 

అంబేడ్కర్‌ మేధావి, మానవతావాది, ఆర్థికవేత్త, తత్త్వవేత్త. ఆయన ఆర్థిక సంబంధాల ప్రాముఖ్యాన్ని గుర్తించారు. ఈ వర్గాల ప్రజల ఉన్నతికి రాజ్యాంగ రక్షణ కల్పించటం కోసం ఆయన ఎంతో తపన పడ్డారు. ప్రజలకు అన్నంపెట్టే కీలక రంగమైన వ్యవ సాయాన్ని పూర్తిగా ప్రభుత్వానికి చెందిన పరిశ్రమగా ప్రకటించాలని సూచించారు. భూమిని ఒక స్థిర ప్రమాణంలో విభజించి వ్యావసాయిక పరిశ్రమలను వ్యవస్థీకరించాలని అన్నారు. ఆ వ్యావసాయిక క్షేత్రాలను సమష్టి సహకార క్షేత్రాలుగా చేసి కుల, మత భేదాలు లేకుండా ఏర్పడిన గ్రామ సమూహాలు సాగు చేయాలనీ, ఉత్పత్తిని సమష్టిగా పంచుకోవాలనీ అన్నారు.

భూస్వాములు, కౌలుదారులు, భూమిలేని కూలీలు ఉండరాదనీ, సమష్టి వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించి పెట్టుబడి, ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే సమకూర్చాలనీ; తద్వారా ఉత్పాదకతను పెంచాలనీ పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వ సోషలిజం తప్పనిసరి అని సూచించారు. లేకుంటే ఆర్థిక అసమానతలు పుడతాయని చెప్పారు. ఈయన సూచనలు సహజంగానే ఆనాటి జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన బడా భూస్వామ్య వర్గాలు పక్కనపెట్టాయి. ఎప్పటికో, రాజ్యాంగం అమలులోకి వచ్చిన 26 ఏళ్ల తరువాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సోషలిస్టు’ అనే పదం రాజ్యాంగ ప్రవేశికలో చేర్చి చేతులు దులుపుకొన్నారు. 

దారిద్య్ర నిర్మూలనకు అవసరమైన మౌలికమైన వ్యవసాయ సంస్కరణలు అమలు కాలేదు. గ్రామ సీమల్లో అణచివేతకు, వివక్షకు గురవుతున్న నిమ్న జాతుల ప్రజలకు దక్కాల్సిన భూమి వారికి దక్కలేదు. భూ సంస్కరణలు అమలు కాలేదు. ‘నేను ఏర్పరచిన రిజర్వేషన్లతో ఆర్థిక, సామాజిక సమానత్వం వస్తుందనుకున్నా, అయితే వాటివల్ల గుప్పెడుమంది గుమస్తాలు మాత్రమే తయారయ్యారు. కానీ మెజారిటీ ప్రజానీకం నేటికీ గ్రామాల్లో భూమి లేకుండా భూస్వాములకు దాస్యం చేస్తు న్నారు. వారి కోసం నేను ఏమీ చేయలేక పోయాను’ అంటూ ఆవేదన చెందారు అంబేడ్కర్‌. (క్లిక్‌: ఇవాళ మనకు కావాల్సింది ఇదీ!

అంటే భూ పంపిణీ జరగకుండా ఈ దేశంలో ఆర్థిక సామాజిక సమానత్వం జరగదు. వ్యవసాయా ధారిత  దేశంలో భూమికీ, సామాజిక న్యాయానికీ ఉన్న సంబంధం ఇదే. ప్రజలకు దక్కాల్సిన భూములు గుంజుకొని దేశ, విదేశీ బహుళజాతి కంపెనీలకు, బడా బాబులకు కట్టబెడుతున్నాయి కార్పొరేట్‌ అనుకూల ప్రభుత్వాలు. వీరు భూమి సంబంధాలన్నింటినీ మార్కెట్‌ సంబంధాలుగా మార్చారు. మార్కెట్‌ ఎప్పుడూ లాభం కోసమే వెంపర్లాడుతుంది కానీ ప్రజా సంక్షేమం దానికి పట్టదు. అందుకే వ్యవసాయాన్ని దండగమారి వృత్తిగా చిత్రించి, రైతు వ్యతిరేక విధానాలతో దాన్ని కుప్ప కూల్చారు. దీంతో కార్పొరేట్లకు భూములను అమ్ము కొని రైతులు పట్టణాల్లో కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా మారిపోయారు. వ్యవసాయం మీదే ఆధారపడి కూలీలుగా బతికే బహుజనులదీ అదే దారయింది! (క్లిక్‌: ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు)


- షేక్‌ కరిముల్లా 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు

మరిన్ని వార్తలు