ఆర్థిక వివక్ష విసురుతున్న సవాలు

2 Nov, 2021 11:38 IST|Sakshi

సమాజం తాను ఏ రకంగా రూపుదిద్దుకోదలిచిందో నిర్ణయించుకొని, అందుకు తగిన లక్ష్యాలను విద్యా రంగానికి నిర్దేశిస్తుంది. విద్యా లక్ష్యాలను సమాజం నిర్దేశిస్తే, సమాజ నిర్మాణాన్ని విద్య ప్రభావితం చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన విద్య కాలక్రమేణా లింగ, కుల, మత, వర్ణ వివక్షత చవి చూసింది. కొన్ని వర్గాలకే పరిమితమైన వేద కాలం నాటి నుంచి నేటి అందరికీ విద్య వరకు సమాజాన్ని మాత్రమే కాకుండా తనను తానూ సంస్కరించుకుంటూ వచ్చింది. సామాజిక వివక్షలెన్నింటినో అధిగమించి సామాజిక వికాసానికి దోహదపడిన విద్య ఇప్పుడు ఆర్థిక వివక్ష (పెట్టుబడి) విసురుతున్న సవాలును స్వీకరించే మలుపు వద్ద నిలిచి, వేచి ఉంది. 

అనాదిగా సమాజం విద్యను, విద్య నేర్పే గురువును అత్యున్నత స్థానంలో నిలుపుతూ వచ్చింది. కానీ, నేడు సమాజానికి, ప్రభుత్వ విద్యకు మధ్య ఘర్షణను నెలకొల్పడం జరుగుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో ఎందుకు చదివించరని, ఆదాయం సమకూరే ఇతర పనులు ఎందుకు చేస్తున్నట్లనే ప్రశ్నలు అందులో భాగమే. సమాజం మొత్తం డబ్బు చుట్టూ, విలాసవంతమైన జీవితం కోసం పరిగెడుతూ తనను మాత్రం అందుకు అతీతంగా జీవిం చాలంటే ఎలా సాధ్యమని ఉపాధ్యాయుడి వాదన. సమాజానికి, ఉపాధ్యాయుడికి మధ్య జరుగుతున్న ఈ సంభాషణను రెండు వర్గాలకు చెందకుండా, మూడో పక్షంగా బయట నుంచి చూసినప్పుడు మాత్రమే నిజానిజాలను విశ్లేషించడం సాధ్యం. ప్రభుత్వవిద్య పరిరక్షణ సమాజానికి సంబంధం లేనిదిగా మారితే, ఉపాధ్యాయునికి అప్రధానమైనదిగా మారింది. విద్య పరాయీకరణ (ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ)ను ఈ రెండు విషయాలే సులభతరం చేస్తున్నాయి. వీట న్నింటినీ బట్టి పెట్టుబడి ఎంతటి బలమైన బంధాలు, అనుబంధాల మధ్యనైనా ఘర్షణ సృష్టించగలదని స్పష్టమవుతోంది. అది నేర్పుతున్న భావజాలం విద్యను, సమాజాన్ని కూడా మింగే శక్తిమంతమైనదని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్పష్టతను అర్థం చేసుకోగలిగే వివేచన, అవకాశం, అవసరం ఉపాధ్యాయులకే ఎక్కువగా ఉన్నాయి. 

మూడు దశాబ్దాల క్రితం అందరికీ విద్య అనే జనామోదిత నినాదంతో జిల్లా ప్రాథమిక విద్యా పథకం (డీపీఈఎఫ్‌) పేరుతో విద్యా రంగంలోకి ప్రపంచ బ్యాంకు ప్రవేశించింది. దాని ద్వారా అమెరికా, బ్రిటన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి  సంస్థ నుండి విదేశీ పెట్టుబడి ప్రవాహం మొదలైంది. సేవ, సాయం పేరుతో ఎల్లలు దాటిన ద్రవ్యం వామన పాదంలా మారి సంప్రదాయ, ప్రభుత్వ విద్యా వ్యవస్థలన్నిటినీ అణగదొక్కిన స్థితి కళ్ళ ముందు ఉంది. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతీ ఆవాస ప్రాంతంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ ఉపాధ్యాయ పోస్టులనే నేడు హేతుబద్ధీకరణ పేరుతో మిగులుగా ముద్ర వేస్తున్నారు.  

నాడు ఏర్పాటైన ఏక గదితో కూడిన ఏకోపాధ్యాయ పాఠశాలలే నేడు మూసివేతకు గురవుతున్నాయి. ఇవే ప్రభుత్వ విద్యా వ్యవస్థ అప్రతిష్ఠ మూటగట్టుకోవడానికి మూల కారణం. ఇవే పదిహేనేళ్ల తర్వాత అంటే సుమారు 2010 నుండి ఊపందుకున్న విద్యా వ్యాపారానికి, బోధనా దుకాణాలకు పెట్టుబడి వ్యూహకర్తలు వేసిన పునాదిరాళ్లు. ఒక్క ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాల కంటే పక్కనే 10 మంది ఉపాధ్యాయులున్న ప్రైవేట్‌ బడి వైపు తల్లిదండ్రుల దృష్టి మరల్చింది. దానికి తోడు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్న ఆంగ్ల మాధ్యమం ఆకర్షణ మంత్రంగా మారింది. మాతృభాషలో విద్యా బోధనను ప్రైవేట్‌ వ్యవస్థలో అమలు చేయకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం కొనసాగించింది. ఇవన్నీ ప్రభుత్వ బడి, ఉపాధ్యాయుల మీద కావల్సినంత దుష్ప్రచారం చేయడానికి భూమికను అందించాయి.

విద్య తనను తాను కాపాడుకోవడానికి సంఘటిత ఉపాధ్యాయ శక్తి కోసం ఎదురుచూస్తుందనేది కళ్ళ ముందున్న వాస్తవం. సంఘటితంగా ఉద్యమించి, విద్యా వినాశకర వ్యూహాలను చిత్తు చేయకపోతే భవిష్యత్‌ తరాలు క్షమించవని, చరిత్ర దోషులుగా నిలబెడుతుందనేది కూడా స్పష్టం. దోషులుగా కాకుండా పెట్టుబడి చెరలో చిక్కిన విద్యను విడుదల గావించిన మహోద్యమకారులుగా నిలిచిపోగల అరుదైన అవకాశం ఈ తరానికి ఉంది. బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ, పెట్టుబడి అనర్థాల పట్ల ప్రజలను చైతన్యం చేస్తూ, ఆ ప్రజలను పోరాటాలలో  భాగస్వామ్యం చేయాల్సి ఉంది. అంటే మండల, జిల్లా, రాజధాని కేంద్రాలతో పాటు ప్రతీ గ్రామాన్ని ఒక విద్యా ఉద్యమ క్షేత్రంగా మార్చాలి. అప్పుడు మాత్రమే అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. అది మాత్రమే చరిత్ర సృష్టించగలదు. ప్రభుత్వ విద్యను పరిరక్షించగలదు.


- చుంచు శ్రీశైలం 

ఉపాధ్యాయులు 

మరిన్ని వార్తలు