జాతీయవాదానికి ఊతమిచ్చింది ఇంగ్లిషే

4 Apr, 2022 00:39 IST|Sakshi

విశ్లేషణ

భారత రాజ్యాంగ ప్రవేశికలో భారత్‌ అని పేర్కొన్న పదంలో అధిక భాగం శూద్రులకే వర్తిస్తుంది. వీరు జాతి రక్తమాంసాలుగా నిలిచారు. విద్యాహక్కుకు దూరమైనప్పటికీ బ్రిటిష్‌ వారితో పోరాటంలో ఆనాడు కీలక పాత్రను పోషించారు. శతాబ్దాలుగా విద్యకు దూరమైపోయిన శూద్ర, దళితులకు తక్కువ స్థాయిలో అయినా సరే ఇంగ్లిష్‌ విద్య అందిన నేపథ్యంలోనే జాతీయవాద భావన దేశంలో మోసులెత్తింది. కానీ నెహ్రూవియన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్వంద్వ విద్య (ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్‌కు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలకు పట్టం కట్టడం) వల్లే శూద్రుల విముక్తి మార్గం అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ఇందువల్లే మన దేశంలోని ఉత్పాదక శక్తులు ఇప్పుడు జీవితంలోని అన్ని రంగాల్లోనూ అసమాన అస్తిత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి.

ప్రస్తుత భారత జాతి భావన ప్రత్యేకించి 19వ శతాబ్దం మధ్యనుంచి మాత్రమే చైతన్య పూరితంగా నిర్మితమవుతూ వచ్చింది. కచ్చితంగానే అంతకు ముందు మనకు జాతిభావన లేదు. మనం నివసిస్తూ వచ్చిన ప్రస్తుత భూభాగం కోసమే ఆధునిక భారత జాతి అనే స్పష్టమైన రేఖకు సంబంధించిన బెంచ్‌ మార్క్‌ వ్యవస్థాపితమైంది. బ్రిటిష్‌ వలస పాల కులకు వ్యతిరేకంగా భారతీయుల ప్రప్రథమ తిరుగుబాటు 1857లోనే జరిగింది. మరి ఆనాడు ఆ తిరుగుబాటును ప్రేరేపించి, అమలు పర్చడానికి తమ భౌతిక, మానసిక శక్తిని వెచ్చించిన శక్తులు ఏవి?

బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తి నియంత్రణ నుంచి భూభాగాన్ని కాపాడటానికి తమ భౌతిక శక్తి ద్వారా దోహదం చేసిన శక్తులు ప్రధా నంగా శూద్రులు, దళితులు, ఆదివాసీల్లోనే రూపుదిద్దుకున్నాయి. బ్రిటిష్‌ సైన్యంలోని వివిధ రెజిమెంట్లలో శూద్రులు, దళిత రైతాంగం, వారి పిల్లలు లేకుండా ఉంటే, 1857 తిరుగుబాటు సాధ్యమయ్యేదే కాదు. వేదాలు, రామాయణం, మహాభారతం వంటి బ్రాహ్మణ పుస్త కాలను పోలిన చరిత్ర రాసిన ఆర్‌ఎస్‌ఎస్, హిందుత్వ లేదా వామపక్ష ఉదార ద్విజ రచయితలు కానీ.. ఆవు, పంది కొవ్వు వంటి సెంటి మెంట్లు కానీ ఆనాటి తిరుగుబాటుకు బాధ్యులు కారు. బ్రిటిష్‌ పన్నుల వ్యవస్థ పీడన, బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వానికి జీతం రాళ్లకోసం పనిచేస్తూ వచ్చిన అనేక మంది ద్విజ అధికారులతోపాటు, బ్రిటిష్‌ అధికారులు కలిసి సాగించిన దోపిడీనే... రైతు కమ్యూనిటీలు గ్రామస్థాయి నుంచి తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాయి. 

బ్రిటిష్‌ ప్రభుత్వం కోసం ఆ రోజుల్లో ఏ శూద్ర, దళిత, ఆదివాసీ అధికారులూ పనిచేసిన చరిత్ర లేదు. బ్రిటిష్‌ వారు ఇక్కడికి రాక ముందే మొఘల్‌ పాలనలోకూడా ముస్లిం అధికారులతోపాటు, ద్విజులు (ప్రధానంగా బ్రాహ్మణులు, కాయస్థులు, ఖాత్రిలు) మాత్రమే అధికారులుగా పనిచేశారు. ముస్లిం రాజరిక పాలన పొడ వునా బనియాలు గ్రామ, పట్టణ స్థాయిలో వ్యాపార కార్యకలాపాల్లో కొనసాగుతూ వచ్చారు. బ్రిటిష్‌ పాలనలో కూడా వీరు తమ వృత్తికే పరిమితమయ్యారు. వర్ణధర్మ నియమాలను ధిక్కరించి శూద్రులను, దళితులను, ఆదివాసులను  విద్యావంతులుగా చేయలేకపోయారు కాబట్టే ఈ మూడు విభాగాలకు చెందినవారు ఆనాడు ప్రభుత్వ ఉద్యో గాల్లోకి అసలు ప్రవేశించలేకపోయారు.

భారతదేశంలో అతిపెద్ద మానవ జనాభా శూద్రులదే. భారత రాజ్యాంగ ప్రవేశికలో భారత్‌ అని పేర్కొన్న పదంలో అధిక భాగం శూద్రులకే వర్తిస్తుంది. వీరు జాతి రక్తమాంసాలుగా నిలిచారు. జాతి మొత్తం శారీరకంగా, మేధోపరంగా ఒక్కటై మానవతావాద తాత్విక పునాదిపై నిలిచి పోరాట రూపాలను, పద్ధతులను రూపొందిం  చుకున్నప్పుడే దురాక్రమణ శక్తి నుంచి మన భూభాగాన్ని చేజిక్కిం చుకోవడం సాధ్యపడుతుంది. అప్పుడు మాత్రమే విదేశీ బంధనాల నుంచి మన భూభాగం విముక్తి చెంది జాతిగా మనగలుగుతుంది. విద్యాహక్కుకు దూరమైనప్పటికీ శూద్ర, దళిత, ఆదివాసీలు అలాంటి కీలక పాత్రనే ఆనాడు పోషించారు.

కానీ, బ్రిటిష్‌ పాలనాయంత్రాంగం తన పాలన చివరి దశాబ్దాల్లో స్కూల్‌ విద్యను శూద్ర, దళిత, ఆదివాసీలకు తెరిచి ఉంచింది. దీనివల్లే మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బీఆర్‌ అంబేడ్కర్‌ మొట్టమొదటి శూద్ర, దళిత మేధావులుగా ఆవిర్భవించి, వెయ్యేళ్లకు పైబడిన పురాతన వర్ణధర్మ దోపిడీని, కుల అణచివేతను సవాలు చేయగలిగారు. ఈ కమ్యూనిటీల సజీవ చరిత్రలో తొలిసారిగా విద్యా వంతులైన మేధావులు ఇంగ్లిష్‌ని చదవడం, రాయడం, అర్థం చేసు కోవడం సాధించగలిగారు. ఇక్కడే వారి తొలి విముక్తి మార్గం ఆరంభ మైంది.

కానీ నెహ్రూవియన్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ద్వంద్వ విద్య (ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ విద్యకు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలకు పట్టం కట్టడం) వల్లే శూద్రుల, దళితుల విముక్తి మార్గం అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ఇందువల్లే మన దేశంలోని ఉత్పాదక శక్తులు ఇప్పుడు జీవితంలోని అన్ని రంగాల్లోనూ అసమాన అస్తిత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి. 

బ్రిటిష్‌ ఇండియన్‌ ఇంగ్లిష్‌ భారతదేశంలో బ్రిటిష్‌ పాలకుల పాలక భాషగా 1835లో రూపుదిద్దుకున్న సమయానికి, శూద్ర, దళిత, ఆదివాసీలు విద్యావ్యవస్థకు పూర్తిగా అవతలే ఉండిపోయారు.  1817లో కలకత్తాలో తొలి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ ప్రారంభించిన తర్వాత, ఆ వలస భాషకూడా అప్పటివరకు సంస్కృతంపై అదుపు సాధించిన ద్విజుల ఇళ్లలోకే ప్రవేశించింది. బెంగాలీ బ్రాహ్మణ జమీం దారీ కుటుంబానికి చెందిన రాజా రాంమోహన్‌ రాయ్‌ (1772– 1833) బ్రిటిష్‌ అధికారులతో తన కుటుంబ సంబంధాల ద్వారా ఇంగ్లిష్‌ని 18వ శతాబ్ది చివరలోనే నేర్చుకోగలిగాడు.

భారత్‌లో సంస్కృత బ్రాహ్మణులకు, గొడ్డు మాంసం ఆరగించే బ్రిటిష్‌ ఇంగ్లిష్‌ మాట్లాడే అధికారులకు మధ్య భాషా బాంధవ్యం అలా ఏర్పడింది. రామ్మోహన్‌ రాయ్‌ తండ్రి రమాకాంత్‌ రాయ్‌ వైష్ణవ బ్రాహ్మణుడు. అయినా రామ్మోహన్‌ రాయ్‌ని సంస్కృతంతోపాటు పర్షియన్, ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి అనుమతించాడు. రామ్మోహన్‌ రాయ్‌తో ప్రారం భమైన ఇంగ్లిష్‌ విద్య తర్వాత బెంగాల్‌లో మిషనరీగా జీవించిన విలియం కారే, రాయ్‌ అధ్వర్యంలో పాఠశాల విద్యా వ్యవస్థగా మారింది. 

ఆధునిక భారతదేశంలో రెండో అతి విశిష్ట వ్యక్తి దాదాబాయ్‌ నౌరోజీ (1825–1917). ఇతను పార్సీ జొరాస్ట్రియన్‌ గుజరాతీ కుటుం బంలో పుట్టాడు. ఎల్ఫిన్‌స్టోన్‌ ఇనిస్టిట్యూట్‌ స్కూల్‌లో చదువు కున్నాడు. ఇది బహుశా బాంబే ప్రావిన్స్‌లోనే మొట్టమొదటి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ అయివుంటుంది. బరోడా రాజు షాయాజీరావు గైక్వాడ్‌–3 సంరక్షణలో పెరిగిన నౌరోజీ తర్వాత బరోడా రాష్ట్రానికి దివాన్‌ అయ్యాడు. పార్సీ కమ్యూనిటీలో చాలాతక్కువ జనాభా ఉన్న ప్పటికీ విద్యలో చాలాముందుండేది. నౌరోజి తర్వాత బ్రిటిష్‌ పార్ల మెంటు సభ్యుడయ్యారు. తర్వాత 1885లో స్కాటిష్‌ ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారి ఏఓ హ్యూమ్‌తో కలిసి భారత జాతీయ కాంగ్రెస్‌ని స్థాపించారు. విద్యావంతులైన భారతీయులతో కలిసి భారత ప్రభుత్వ పాలనలో సంస్కరణలు తీసుకురావాలని హ్యూమ్‌ కోరుకున్నారు. నౌరోజీ కూడా మహాత్మా జ్యోతిరావు ఫూలేకి (1827–1890) దాదాపు సమకాలికుడే కావచ్చు. కానీ నౌరోజీ తన కమ్యూనిటీ విద్యా నేపథ్యం వల్ల బరోడా మహారాజు నుంచే కాకుండా బ్రిటిష్‌ అధికారులనుంచి కూడా సహాయం పొందగలిగారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బరోడా మహారాజుది శూద్ర కుటుంబం. కానీ ఆయన రాజరిక స్థానం బట్టి క్షత్రియ ప్రతి పత్తిని కట్టబెట్టారు. ఇలాంటి శూద్ర రాజరికాలన్నీ బ్రాహ్మణ మంత్రులు, పూజారుల ద్వారానే కొనసాగేవి. ఇలాంటి దయామయు డైన రాజు కూడా తన సొంత వర్గానికి చెందిన పిల్లలను ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలకు పంపేవారు కాదు. ఉన్నత విద్యకోసం వారిని ఇంగ్లండుకు పంపేవాడు కూడా కాదు. అయితే ఈ బరోడా రాజ కుటుంబమే తర్వాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు అమెరికాలోని కొలం బియా యూనివర్సిటీలో చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందిం చింది.

అయితే వారి ఆర్థిక ప్రతిపత్తి ఏదైనా సరే శూద్రులను విద్య మాటెత్తితేనే భయపెట్టేవారు. విద్య శూద్రేతరమైనదనీ, శూద్రులు చదివినా, రాసినా దేవతలే ఆగ్రహిస్తారనీ పుకార్లు రేపేవారు. ఈ విధమైన భ్రమలూ, మూఢనమ్మకాలూ హిందూ చారిత్రక వార సత్వంలో భాగమైపోయాయి. విద్య అంటేనే శూద్రులు వణికిపోయే పరిస్థితిని కుల నియంత్రణపై పట్టున్న బ్రాహ్మణ భావజాలం వెయ్యి సంవత్సరాలుగా చొప్పిస్తూ వచ్చింది. విద్యపట్ల భయాన్ని శూద్రులు, దళితులలో మానసికంగానే రూపొందించేశారు. అందుకే బ్రిటిష్‌ వలసపాలనా కాలంలో కూడా శూద్రులు, దళితులు చదవడానికి, రాయడానికి నోచుకోలేక తమ తమ స్థానిక భాషల్లో మాట్లాడటం వరకే పరిమతమైపోయారు.

ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

మరిన్ని వార్తలు