ఆత్మవిశ్వాసం కోసమే ఆంగ్లమాధ్యమ చదువులు

10 Sep, 2021 01:50 IST|Sakshi

సందర్భం

కన్యాశుల్కం నాటకంలో గురువు గిరీశం, శిష్యుడు వెంకటేశం పాత్రలు మన కింకా జ్ఞాపకం వుండే ఉంటాయి. శిష్యుడు వెంకటేశం తన తల్లిదండ్రులు అగ్నిహోత్రావధానులు, వెంకమ్మల ముందర ఇంగ్లిష్‌ పరిజ్ఞానం ప్రదర్శిం చటం కోసం గురుశిష్యులు ఇద్దరూ ‘ట్వింకిల్‌ టింక్విల్‌ లిటిల్‌ స్టార్‌‘ అని ఏదో ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నట్లుగా నాటకం ఆడటం... దాన్ని తల్లీ తండ్రీ అబ్బురంగా చూడటం ఇప్పటికీ ఈనాటి పెద్దల్లో చాలామందికి గుర్తుండే  ఉంటుంది. వందేళ్ల క్రితమే ఇంగ్లిష్‌ (దొరల) భాషకు ఎంత క్రేజ్‌ ఉందో చెప్పటానికే ఈ ప్రస్తావన తప్ప, తెలుగు భాషను తక్కువ చేసి చూడటానికి మాత్రం కాదు. 

మాతృ భాషల ఎదుగుదలకు ఇంగ్లిషు అవరోధంగా మారిందన్నా, మాతృ భాషలు సంకరంగా మారుతున్నాయన్నా, శతాబ్ది పైగా ఎన్ని భాషా ఉద్యమాలు జరిగినా కూడా... ఇంగ్లిష్‌ భాషా ప్రాబల్యం దినదిన ప్రవర్ధమానంగా తన  ప్రభావం పెంచుకుం టూనే ఉంది. గ్లోబలైజేషన్‌ ప్రభావం ఆంగ్ల భాషా ప్రభావాన్ని పెంచిందే తప్ప తగ్గించలేదు సరిగదా... విదేశాల్లో ఉద్యోగాల అవకాశాల కోసం మన యువత లక్షలాదిగా ఎగబాకటం మన కళ్ళ ముందున్న సజీవ చిత్రాలే! కానీ సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బడుగు బలహీన వర్గాల వారికి ఈ కాన్వెంట్‌ చదువులు నేటికీ అందని ద్రాక్ష పండ్లే. 

తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చిన్న చిన్న కాన్వెంట్స్‌ సైతం ఇంగ్లిష్‌ విద్యా బోధనకే అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. గత ప్రభుత్వం హేతుబద్ధంగా క్షేత్ర స్థాయిలో  విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా  దిశగా విద్యా విధానాలు అమలుచేయకపోవడం వాస్తవం. కానీ ప్రస్తుతం ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంగ్లిష్‌ మీడియంతోపాటు తప్పని సరిగా ఒక తెలుగు సబ్జెక్టు అమలుపై  కొందరు అనవసర రాద్దాంతం చేయటం విడ్డూరమే! ఇది బడుగు బలహీన వర్గాలను ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్ల చదువులకు దూరంచేయటం కాదా?

‘చదువుకోలేము! చదువు కొనలేమని’ దిగులుపడే తల్లిదండ్రులకు, విద్యార్థులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లిష్‌ మీడియం బడుల నిర్వహణా నిర్ణయం నిజంగా ఒక గొప్ప సంస్కరణే అని  అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. దీంట్లో మాతృభాషకు అన్యాయం అనే మాటే లేదు, ఉన్నత చదువులు చదవాలనే విద్యార్థుల ఆలోచనలకు విఘాతమే లేదు, పైగా, చదవలేము, చదువు కొనలేమనే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనస్సులను ఆత్మన్యూనత నుండి ఆత్మవిశ్వాసంతో ఇది బలపరుస్తుంది. అందుకే నేటి ఏపీలో మాతృభాషకు విఘాతం కలుగనివ్వని ఇంగ్లిష్‌ మీడియం చదువుల బడులు ‘అందని మామిడి పండు’ కాదు ఈ నాటి ఈ చదువుల తల్లి, అందరికీ అందే మామిడి పండే’ అనేది ప్రతి ఒక్కరూ ఆహ్వానించే పరిణామమే! ఇది కచ్చితంగా ఆర్థికంగా వెనుకబడిన వారి పాలిట కల్పతరువే!

విద్యా, వైద్యం, న్యాయం ప్రభుత్వాల అధీనంలో ఉంటేనే కదా ప్రజా క్షేమం పది కాలాల పాటు పరిఢవిల్లుతుందని పెద్దల మాట! అందులో మొదటిదైన చదువుకు సంబంధించి, ఏపీలో దాదాపు 45,000 పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 15,000కు పైగా పాఠశాలలు వేలాది కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త సొబగులు దిద్దుకొని విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపటానికి స్వర్ణ వాద్యాలు సంరావిస్తూ సిద్ధమయ్యాయి. అలాగే రెండవ విడతలో మరో 15,000 ప్రభుత్వ పాఠశాలలు సిద్ధం కానున్నాయి. ఎటువంటి రాజకీయ సంకుచిత విమర్శలూ, హేళనలూ, ఎత్తిపొడుపు మాటలూ.

అపసవ్య వార్తలు తమ పిల్లల అభివృద్ధిని కాంక్షించే తల్లిదండ్రుల మీద కనీసం ప్రభావం చూపలేదు సరి కదా.. ప్రభుత్వం చేతల్లో చేసి చూపిస్తున్న అభివృద్ధి బాటవైపే తమ పిల్లలను మళ్లిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది! ఒక నూతన శకానికి ద్వారాలు తెరిచి, లక్షలాది విద్యార్థుల భవితవ్యానికి  అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలలలో ఈ విద్యాసంవత్సరంలో సీట్లు అయిపోయాయనే బోర్డులు కూడా కనిపిస్తున్నాయనే వార్తలు ఈ సందర్భంగా కొసమెరుపు!

-అమరనాధ్‌ జాగర్లపూడి
వ్యాసకర్త కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్, ఫ్రీలాన్స్‌ రైటర్‌ మొబైల్‌ : 98495 45257

మరిన్ని వార్తలు