ప్రణాళికతోనే దిగుమతులు తగ్గుతాయి

30 Oct, 2021 03:16 IST|Sakshi

సందర్భం

43 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం కలిగిన భారతదేశంలో 1985 తరువాత నుండి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత ప్రాప్తకాలజ్ఞ్ఞతగా పెరుగుతున్నది. 1985–95 వరకు ఉత్పత్తిలో నిలకడ ఏర్పడింది. 1995 నుండి 2005 వరకు సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ఉత్పత్తికి, ఉత్పాదకతకు నష్టం వాటిల్లింది. రాజ్యాంగ రీత్యా రాష్ట్ర జాబితాలో ఉన్న వ్యవ సాయంలో హరిత విప్లవ కాలంలో (1965–85) కేంద్రం చొరవ తీసుకొని అధికోత్పత్తి సాధించింది.

5 కోట్ల టన్నుల నుండి 20 కోట్ల టన్నులకు ఉత్పత్తిని పెంచి, దిగుమతులను అధిగమించి ఎగుమతులు ప్రారంభించింది. ఆ తరువాత కాలంలో నేటి వరకు (2020–21) ఉత్పత్తిగానీ, ఉత్పాదకత గానీ ప్రత్యేక ప్రణాళిక దృష్టితో పెంపుదల చేయలేదు. జనాభా ఏటా 1.9 శాతం పెరుగుతుండగా, వ్యవసాయో త్పత్తుల పెరుగుదల 4 శాతం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఏనాడూ లక్ష్యం నెరవేరలేదు. ప్రస్తుతం 1.5 శాతం వృద్ధి రేటు కొనసాగుతోంది. ప్రస్తుత ఆహార ధాన్యాల ఉత్పత్తి 30.15 కోట్ల టన్నులుగా ఉంది. 

2005 నుండి క్రమంగా భారతదేశం ఆహార ఉత్పత్తు లకు దిగుమతి కేంద్రంగా మారింది. 1.30 లక్షల టన్నుల వంటనూనెలు, 45 లక్షల టన్నుల పంచదార, 58 లక్షల టన్నుల పప్పుధాన్యాలు, 30 లక్షల బేళ్ళ పత్తితోపాటు కోడికాళ్ళు, పాలు, పాల ఉత్పత్తులు దిగుమతులు చేసు కుంటున్నాం. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో 18.50 కోట్ల టన్నులతో ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ దిగుమతులు వస్తున్నాయి. రూ.58,600 కోట్ల విలువగల హార్టికల్చర్‌ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం.

సాగు విస్తీర్ణం 34 కోట్ల ఎకరాలలో 9 కోట్ల ఎకరాలు బీళ్ళుగా మారింది. రియల్‌ ఎస్టేట్, వ్యవసాయేతర అవసరాల కింద మరో 5 కోట్ల ఎకరాల భూమి బీళ్ళుగా మారబోతున్నది. ఉత్పాదకత హెక్టారుకు 2,292 కిలోలు మాత్రమే ఉంది. చైనా హెక్టారుకు 8 వేల కిలోలు, అమెరికా 6 వేల కిలోలు ఉత్పత్తి చేస్తూ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. భారత విస్తీర్ణం కన్నా తక్కువ సాగు చేస్తున్న చైనా 80 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయగా, అమెరికా 60 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచంలో 2వ ఆర్థిక దేశంగా పెరుగు తున్నామని చెప్తున్న భారతదేశం వ్యవసాయోత్పత్తిలో ఎక్కడికి పోతున్నామో గమనించాలి. 

ప్రణాళికబద్ధంగా వ్యవసాయం సాగినప్పుడు మన ఉత్పాదకత పెరిగింది. పరిశోధన కేంద్రాలు, వ్యవసాయ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండటం, రైతులకు మౌలిక వసతులు అనగా విత్తనాలు, రుణాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు నాణ్యమైనవి అందుబాటులో ఉన్నాయి. 2000 సంవత్సరం నుండి ఈ మౌలిక వసతులన్నీ విదేశీ ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. విత్తనాలు 4 బడా కంపెనీల చేతుల్లోకి 80 శాతం వెళ్ళాయి. వ్యాపార పోటీ తత్వం కలిగిన జి–7 దేశాలు మన దేశాన్ని అభి వృద్ధిలోకి రాకుండా అడ్డుపడుతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ నిరంతరం భారత వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టి, అభివృద్ధి జరగకుండా అడ్డుపడటం అనేక సందర్భాల్లో బట్ట బయలైంది. 

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మన ఉత్పత్తు లను పెంచుకోటానికి వ్యవసాయ పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ మన పరిశోధనలు గత దశాబ్ద కాలంగా నిలిచిపోయాయి. ఏ దేశ వాతావరణ పరిస్థితులకు అను గుణంగా ఆ దేశంలో వ్యవసాయ పరిశోధనలు జరగాలి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరి కొత్త విత్తనాలను ఉత్పత్తి చేయకపోతే పంటల దిగుబడి తగ్గుతుంది. హరిత విప్లవ కాలంలో 36 డిగ్రీల వేడి కలిగిన పరిస్థితుల నుండి నేడు 42 డిగ్రీల వేడిలో జీవిస్తున్నాం. అందువల్ల సొంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలను నిర్వహించాలి. 

రాష్ట్రాలలోని భూసార పరీక్షలను నిర్వహించి, దేశ అవసరాలకు కావాల్సిన పంటల విధానాన్ని రూపొం దించాలి. ప్రస్తుతం సాగు అవుతున్న హర్టికల్చర్‌ విస్తీర్ణం 6.39 కోట్లను మరో 3 కోట్లకు పెంచడం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న 30 కోట్ల టన్నుల ఉత్పత్తిని రెట్టింపు పెంచు కునే అవకాశం ఉంది. హార్టికల్చర్‌ పంటలకు అనుకూలమైన ప్రాంతాలు భారత దేశంలో 10 కోట్ల ఎకరాలకు పైగా ఉన్నాయి. దీని ద్వారా రైతులకు లాభాలే కాకుండ ప్రభుత్వా నికి కూడ ఎగుమతుల ద్వారా ఆదాయం వస్తుంది. ప్రాసె సింగ్‌ యూనిట్లు పెట్టడం ద్వారా అనేక లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఆహార ధాన్యాల విష యంలో వంటనూనెలు, గోధుమ, మొక్కజొన్న, సోయా, ఆయిల్‌ పామ్‌ తోటలను పెద్ద ఎత్తున పెంచాలి.

ఇవి బహుళ రూపాలలో వినియోగంలోకి వస్తాయి. ఆయిల్‌ పామ్, చెరుకు పంటల విస్తీర్ణం పెంచడం వల్ల ఇథనాల్‌ ఉత్పత్తి చేసి ప్రస్తుతం వినియోగంలో 80 శాతం దిగుమతులు చేసు కుంటున్న పెట్రోలియం ఉత్పత్తులను 40 శాతానికి తగ్గించు కోవచ్చు. బ్రెజిల్, అమెరికా దేశాలను ఉదాహరణగా చూడాలి. నేడు పత్తి వినియోగం దాదాపుగా తగ్గిపోతున్నది. పత్తేతర రూపాల్లో దారం తీసి బట్టలు తయారు చేస్తున్నారు. ఇంతకు ముందు రేయాన్స్‌ పల్పు ద్వారా ఉత్పత్తి జరిగే బట్టలు నేడు ఇతర పంటల నుండి వచ్చే ఉత్పత్తులతో దారం తీస్తున్నారు. అందుకు అనుగుణమైన పరిశోధన జరపాలి. నీటి సౌకర్యం కలిగినచోట మాత్రమే ఆహార ధాన్యాల ఉత్పత్తిని కొనసాగించాలి. 

దేశంలో ముడి ఉత్పత్తులను నేరుగా మార్కెట్లలో అమ్ముతున్నాం. వాటిని ప్రాసెస్‌ చేసి అదనపు విలువను జత చేసి అమ్మలేకపోతున్నాం. దేశంలో 2,477 ప్రధాన మార్కెట్లు ఉండగా వాటికి అనుబంధంగా 4,843 సబ్‌ మార్కెట్లు పని చేస్తున్నాయి. వీటిల్లో వేలం పాటల హాల్స్, తూకం బ్రిడ్జిలు, గోదాంలు, చిల్లర దుకాణాలు, క్యాంటిన్లు, రహదారాలు, దీపాలు, త్రాగునీరు, పోలీసు స్టేషన్లు, పోస్టాఫీసులు, బోర్‌వెల్స్, కోల్డ్‌ స్టోరేజీలు, రైతుల విశ్రాంతి భవనాలు, నీటిశుద్ధి ప్లాంటు, భూసార పరీక్షల ల్యాబ రేటరీలు, టాయ్‌లెట్స్‌ లాంటి సౌకర్యాలు లేని మార్కెట్లు ఉన్నాయి.

మార్కెట్‌ విధానాన్ని మార్చి ఇనాం విధానం తెచ్చి ఆది విఫలమైందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ప్రతి రాష్ట్రంలో మార్కెట్‌ యార్డుల వద్ద, లేదా రైతులకు అందుబాటులో ఉన్నచోట ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆత్మహత్యలను నివారించవచ్చు. రైతులకు లాభం కలిగే విధంగా, దిగుమతులు నివారించి దేశ ప్రయోజనం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం ‘శాస్త్రీయ వ్యవసాయ ప్రణాళిక లను’ రూపొందించాలి.   

-సారంపల్లి మల్లారెడ్డి
వ్యాసకర్త ఏఐకెఎస్‌ ఉపాధ్యక్షులు
మొబైల్‌: 94900 98666

మరిన్ని వార్తలు