రైతాంగ సమస్యలే రాజకీయ ఎజెండా

7 Dec, 2021 14:46 IST|Sakshi

నిరంతర ప్రక్రియగా కొనసాగే ప్రజాచైతన్యం తోడైతే తప్ప కేవలం చట్టాలతో వ్యవస్థలను సమూలంగా మార్చడం సాధ్యం కాదన్న పరమసత్యం ఆలస్యంగానైనా ప్రధాని మోదీకి బోధపడినట్లుంది. పార్లమెంట్‌ ఆమోదిం చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ప్రధాని ఉపసంహరిం చుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఏడాదికి ముందు హడావుడిగా కేంద్రం తెచ్చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తాయని ఇప్పటికీ ప్రధాని భావించడం చూస్తే, కిందపడినా పైచేయి తమదేనని చెప్పుకోవడంగా కనిపిస్తుంది. 

వ్యవసాయ చట్టాల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒంటెత్తుపోకడ పోయింది. ‘వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం కనుక.. ఈ రంగంలో కీలక చట్టాలు చేసేముందు ముసాయిదా బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించి ఉండాలి. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆ చొరవ చూపలేదు. రైతులతో, రైతు ప్రతినిధులతో ముసాయిదా బిల్లుల్లోని అంశాలకు సంబంధించిన మంచి చెడులపై సమగ్రంగా మాట్లాడలేదు. పార్లమెంట్‌లో బిల్లులను ప్రవేశపెట్టినపుడు వాటిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు చేస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. పైగా ఈ అంశంపై ఓటింగ్‌ జరగాలని ప్రతిపక్షాలు రాజ్యసభలో డిమాండ్‌ చేస్తున్నప్పటికీ.. మూజువాణి ఓటుతో ప్రభుత్వం బిల్లుల్ని ఆమోదింపజేసుకొంది. (చదవండి: అధికార భాషకు పట్టంకట్టిన మూర్తులు)

ఈ చట్టాల లక్ష్యం కర్షకులకు మేలు చేయడానికి, వారి ఆదాయం పెంచడం కోసమేనని చెబుతూ వచ్చారు. మరి వాటిపై చర్చ జరగడానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటన్నది ప్రశ్న. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగితే.. బడా కార్పొరేట్ల నుంచి, దళారుల నుంచి రైతులకు రక్షణ ఎలా లభిస్తుందనే అంశంపై బీజేపీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ సమంజసమైన వివరణ ఇవ్వలేకపోయాయి. అందుకే ఈ చట్టాల ఉపసంహరణ కోసం ఉత్తరాది ప్రాంత రైతులు రోడ్డెక్కి చారిత్రాత్మక పోరాటం చేశారు. 700 మందికి పైగా రైతులు ఈ ఉద్యమంలో ఆశువులు బాసారు. ఉద్యమాన్ని అణచివేసేం దుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఉద్యమ సెగ చల్లారలేదు సరికదా.. మరింత ఉవ్వెత్తున సాగింది. (చదవండి: ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...)

వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో.. దేశ రైతాంగానికి కొత్త శక్తి వచ్చినట్లయింది. తాజాగా వారు 23 ప్రధాన పంటలకు చట్టబద్ధతతో కూడిన కనీస మద్దతు ధర కోసం పట్టుబడుతున్నారు. పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధర పొందడం అన్నది తమకు చట్టబద్ధ హక్కుగా సంక్రమించాలనేది రైతాంగం కోరిక. ఎప్పట్నుంచో రైతాంగం కోరుతున్నది, ఆశిస్తున్నదే. పస్తుతం కేంద్ర ప్రభుత్వం 14 పంట లకు కనీస మద్ధతు ధర ప్రకటిస్తోంది. ఈ పంటల ధరలు కనీస మద్దతు ధర కంటే తగ్గినపుడు ప్రభుత్వ ఏజన్సీలు జోక్యం చేసుకొని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. అయితే.. రైతులు 23 ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర కావాలని కోరుతున్నారు.

దేశ ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. సంప్రదాయకంగా విస్తృతంగా పండిస్తున్న వరి, గోధుమలకు డిమాండ్‌ తగ్గుతోది. సిరి ధాన్యాలుగా పిలుస్తున్న మిల్లెట్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని, పౌష్టికతను పెంచే పంటల పెంపకాన్ని ప్రోత్సహించవలసిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అలాగే, కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలను దిగుమతులు చేసుకోవడం తగ్గించి వాటి ఉత్పత్తిని దేశీయంగా పెంచాలి. అందుకు రైతులు సిద్ధం కావాలంటే వారు డిమాండ్‌ చేస్తున్నట్లు 23 ప్రధాన పంటలకు చట్టబద్ధంగా కనీస మద్ధతు ధరలను ప్రకటించాలి.

రానున్న కాలంలో రైతాంగ సమస్యల పరిష్కారమే రాజకీయ పార్టీలకు ప్రధాన ఎజెండా కానున్నది. ఇదొక శుభపరిణామం కూడా. ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి ఎదురుగాలి వీస్తుందనే భయంతోనే భారతీయ జనతాపార్టీ 3 వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకోవడం ఇందుకు ఓ ప్రధాన సంకేతం. 2004లోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి రైతాంగ సమస్యల్నే ప్రధాన ఎన్నికల ఎజెండాగా తీసుకొన్నారు. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణాల మాఫీ.. ఈ రెండు వాగ్దానాలు ఆనాడు కాంగ్రెస్‌ పార్టీని విజయపథంలో నడిపించాయి. అంతేకాదు.. వ్యవసాయం దండగమారి అని, ఉచిత విద్యుత్‌ ఇస్తే.. కరెంట్‌ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్న చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికలలో బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చినందునే చంద్రబాబు స్వల్ప వ్యత్యాసంతో అధికారంలోకి రాగలిగారు. ఆ హామీని నిలబెట్టుకోనందుకే 2019లో తగిన మూల్యం చెల్లించారు.

రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా నేడు రైతాం గంలో ఎనలేని చైతన్యం వెల్లివిరిస్తోంది. వ్యవసాయ రంగాన్ని విస్మరించే, దెబ్బతీసే రాజకీయ పార్టీలకు రైతాంగం శాశ్వతంగా దూరంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంస్కరణలపేరుతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తుల పరం చేసేవారిని, లాండ్‌ పూలింగ్‌ పేరుతో వ్యవసాయ భూముల్ని సేకరించి వాటితో రియల్‌ వ్యాపారం చేయాలనుకొన్న చంద్రబాబునాయుడు లాంటి రాజకీయ నాయకులకు ఇకపై చీకటి రోజులే. రైతాంగానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని వారు.. ఇకపై జరిగే ఎన్నికలలో రైతుల ఓట్లు పొందడం దుర్లభం. వ్యవసాయరంగ ప్రగతి మీదనే దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందని నమ్మి.. అందుకు అనుగుణంగా వ్యవసాయరంగం మెరుగుదలకు పటిష్టమైన కార్యాచరణ చేపడతారో.. వారినే రైతులు ఆదరిస్తారు. నేడు ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగానికి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. రైతు సంక్షేమమే ప్రాధాన్యాంశంగా చేసుకొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీకి రైతుల ఎజెండాయే ప్రధానాంశం అవుతుంది. రైతు వ్యతిరేకులకు రాజకీయ మనుగడ శూన్యం. ఉత్తరాది రైతులు సాగించిన ఉద్యమం తెలియబర్చిన వాస్తవం ఇదే. 


- సి. రామచంద్రయ్య 

ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు

మరిన్ని వార్తలు