Florence Nightingale: మానవత్వానికి ప్రతిరూపం నర్స్‌

12 May, 2021 12:06 IST|Sakshi

కరోనా మహమ్మారి విలయతాండవంతో ప్రాణాలు  కాపాడటానికి నిద్రలేని రాత్రులు గడిపి కంటికి కనపడని వైరస్‌తో నిత్యం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఫ్రంట్‌ వారియర్స్‌ ఎవరైనా ఉన్నారంటే నర్సులు మాత్రమే. వారు చేస్తున్న సేవలు అమోఘం. ఇటలీలో 1812 సంవత్సరంలో ఫానీ నైటింగేల్, విలియం ఎడ్వర్డ్‌ దంపతులకు , ధనిక కుటుం బంలో మే 12న ఫ్లారెన్స్‌ నైటింగేల్‌  జన్మించింది.

ఆ రోజుల్లో  ఇటలీలో ఆస్పత్రులు అధ్వాన్న స్ధితిలో ఉండేవి. శుచి, శుభ్రత, ఏమాత్రం ఉండేవికావు. నర్సు కావాలని కలలు కన్న నైటింగేల్‌ 1852లో ఐర్లాండ్‌ వెళ్ళింది. ఆసుపత్రులకు వెళ్లి రోగులకు, పగలు, రాత్రి అనక సేవలందించింది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి రోగులకు మంచి ఆహారం అందించింది. 1854 నుండి 1856 లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది.

ఫ్లారెన్స్‌ వచ్చి తోటి నర్సులను కూడగట్టుకొని యుద్ధంలో గాయాలైన సైనికులకు నిరుపమానమైన సేవలందించింది. ఎలాంటి సౌకర్యాలూ లేని రోజుల్లో, చేతిలో దీపంతో క్షతగాత్రులకు ప్రేమతో పరిచర్యలు చేసిన మాతృదేవత ఆమె. ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ పుట్టిన రోజైన మే 12న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ఒక పండుగలా  జరుపుకుంటారు. 

గత 15 నెలలుగా కుటుంబాలకు దూరం అయి, కరోనా బారిన పడి మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేస్తూ ఫ్రంట్‌ వారియర్‌గా ఊపిరి పోస్తున్న మాతృ దేవతకు ప్రతిరూపం అయిన నర్సులకు చేతులెత్తి ప్రపంచమంత మొక్కక తప్పదు. మానవుల నుంచి మానవులకి సంక్రమించే ఈ వైరస్‌ వ్యాప్తిని లెక్క చేయకుండా, వృత్తి ధర్మానికి కట్టుబడి, సేవా దృక్పథంతో, యుద్ధంలో సైనికునిలా.. కంటికి కనపడని కరోనా వైరస్‌పై  పోరాటం సాగిస్తున్నారు. అందుకే శిరసు వంచి ప్రపంచం ప్రణమిల్లుతోంది. నైటింగేల్‌ వారసులు, నర్సులు చేస్తున్న సేవలు అనిర్వచనీయం.

(నేడు  ‘ఫ్లారెన్స్‌ నైటింగేల్‌’201 జయంతి,)   
డా. సంగని మల్లేశ్వర్, జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం మొబైల్‌ 98662 55355

మరిన్ని వార్తలు