విదేశాంగ విధానంపైనే గురి

29 Nov, 2020 01:11 IST|Sakshi

అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్‌ నియామకంపై వివాదాలు సడలిపోతున్న నేపథ్యంలో బైడెన్‌ నిర్వహించే విదేశాంగ విధానం చర్చనీయాంశం అవుతోంది. మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న చైనాతో తలపడాలంటే అమెరికా తన మిత్ర దేశాలన్నింటితో కలిసి ఐక్య సంఘటన కట్టాల్సి ఉంటుందన్న బైడెన్‌ అంతర్జాతీయ సమాజానికి బలమైన హామీని ఇచ్చారు. కమ్యూనిస్టు చైనాతో సహకార దృష్టిని కలిగి ఉంటూనే, చైనాపై అమెరికా కఠిన వైఖరి కొనసాగుతుందని బైడెన్‌ తేల్చి చెప్పారు. ట్రంప్‌ దౌత్య వ్యూహాల్లో కొన్నింట్లో సమూల మార్పులు చోటు చేసుకోవచ్చని అంచనా. అమెరికా కొత్త విదేశాంగ మంత్రిగా నియమితులైన ఆంటోనీ బ్లింకెన్‌ తాజా వ్యాఖ్యలతో అమెరికా–భారత్‌ సంబంధాలు సానుకూలంగా పరిగణించగలవనే ఆశలు రేకెత్తుతున్నాయి.

గత కొన్ని వారాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య ఘటన అయిన అధ్యక్ష ఎన్నికను యావత్‌ ప్రపంచం పరిశీలిస్తూ వచ్చింది. ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సవాళ్లు విసురుతున్నప్పటికీ, ఎన్నికల ఫలితం మాత్రం స్పష్టంగా తేలిపోయింది. జో బైడెన్‌ అమెరికా 46వ అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జో బైడెన్‌ తదుపరి నాలుగేళ్లకు నిర్దేశించుకునే విదేశీ విధాన దిశపై రాజకీయ చర్చలు మొదలయ్యాయి. బైడెన్‌ హయాంలో అమెరికా దౌత్యవిధానాన్ని పునర్నిర్మించవచ్చని ట్రంప్‌ పాలనాయంత్రాంగం నిర్దేశించిన దౌత్య వ్యూహాల్లో సమూల మార్పులు చోటు చేసుకోవచ్చని అంచనా. అయితే చైనాపై అమెరికన్‌ దృక్పథం మాత్రం మునుపటిలాగే కొనసాగే అవకాశాలే  కనిపిస్తున్నాయి. 

‘చైనాపై కానీ, మరే దేశంపై కానీ భవిష్యత్తులో చోటుచేసుకునే పోటీలో నెగ్గాలంటే అమెరికా తన సాంకేతిక విన్నాణాన్ని మరింత పదును చేసుకోవలసి ఉంటుంది, పైగా వనరులను దుర్వినియోగపరుస్తున్న చైనాను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యవస్థలను సమైక్యపర్చాల్సిన అవసరం చాలానే ఉంది’ అంటూ ఎన్నికలకు ముందే అమెరికాలోని కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ ప్రచురిస్తున్న ఫారిన్‌ ఎఫైర్స్‌ పత్రికలో బైడెన్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

బైడెన్‌ ప్రకటన అంతర్జాతీయ సమాజానికి బలమైన హామీని ఇచ్చింది. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి కొన్ని అంశాల్లో కమ్యూనిస్టు చైనాతో సహకార దృష్టిని కలిగి ఉంటామని చెప్పినప్పటికీ, చైనాపై అమెరికా కఠిన వైఖరి కొనసాగుతుందని బైడెన్‌ తేల్చి చెప్పారు. అయితే ట్రంప్‌లాగా ప్రత్యక్షంగా చైనాపై మాటలయుద్ధం మొదలుపెట్టి పరిస్థితిని మరింత క్షీణింపచేసేలాగా కాకుండా బైడెన్‌ కాస్త భిన్నంగా వ్యవహరించవచ్చని అంచనా. 

యూఎస్‌–చైనా సంబంధాలు.. ఆసియన్‌
చైనా అసాధారణ వృద్ధి పట్ల అమెరికా స్పందన ఇకపై ఒక ద్వైపాక్షిక సమస్యగా మాత్రం ఉండబోదు. ఇరుదేశాల మధ్య నడుస్తున్న ఘర్షణల్లో చాలా దేశాలు ఇప్పటికే పాలుపంచుకుంటున్నాయి. ప్రధానంగా 5జీ విషయంలో చైనా సాంకేతిక పురోగతిని యూరప్, తదితర దేశాలకు బూచిగా చూపిస్తూ వాటికి కూడా చైనా ప్రమాదకారేనని అమెరికా నచ్చచెప్పింది. దీంతో యూరప్‌ ఖండంలో చైనా టెలికమ్యూనికేషన్స్‌ దిగ్గజ సంస్థ హువై నేతృత్వంలో మొదలైన అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి లేక పూర్తిగా రద్దయిపోయాయి.

అమెరికా చైనా మధ్య సాగుతున్న భౌగోళిక రాజకీయసమరంలో ఆగ్నేయాసియా మరో యుద్ధరంగంగా మారిపోయింది. స్వేచ్ఛాయుత సముద్రయానంపై అమెరికా విధానానికి, దక్షిణ చైనా సముద్రంపై తనకున్న చారిత్రక హక్కులను బలంగా ప్రకటిస్తున్న చైనా విధానానికి మధ్య వివాదం అత్యంత స్పష్టమైన రూపానికి వచ్చి చేరింది. ఆసియన్‌ కూటమిలోని అనేక దేశాలు కూడా దక్షిణ చైనా సముద్రంపై తమ వారసత్వ హక్కును ప్రకటిస్తున్నందున ఈ ప్రత్యేక సమస్యపై పరిష్కారం కోసం ఆసియన్‌ కూటమి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తమ సార్వభౌమాధికార హక్కులను పరిరక్షించుకునే విషయంలో ఆగ్నేయాసియా కూటమిలోని మిత్రదేశాలకు తన మద్దతు ఉంటుందని అమెరికా స్పష్టంగా ప్రకటించింది. పైగా, తన సార్వభౌమాధికారం అమలవుతున్న జలాల్లో చైనా చట్టవ్యతిరేక చర్యలపై ఇండోనేషియా చేపట్టిన చర్యలను అమెరికా స్వాగతించింది. అక్టోబర్‌ చివరలో జకార్తాను సందర్శించిన అమెరికా విదేశీమంత్రి మైక్‌ పాంపియో తమ వైఖరిని స్పష్టపరిచారు. 

అయితే అమెరికా చైనాల మధ్య పోటీలో పాలు పంచుకోబోమని ఇండోనేషియా విదేశీ మంత్రి రెట్నో మర్సుది మరింత స్పష్టంగా పేర్కొన్నారు. ఆసియన్‌ కూటమిలోని 10 సభ్యదేశాలు కూడా ఆసియన్‌ తటస్థ విధానాన్ని ప్రతిబింబిస్తూ ఇండోనేషియా అనుసరించిన విధానాన్నే ప్రతిధ్వనించాయి. ఏర్పడిన నాటినుంచి తటస్థ వైఖరి అనేది ఆసియన్‌ కూటమి మౌలిక విలువల్లో ఒకటిగా ఉంటోంది. ప్రస్తుతం రెండు ప్రధాన ఆర్థిక శక్తుల మధ్య శత్రు వాతావరణంలోనూ ఈ కూటమికి తటస్థ విధానమే మార్గదర్శకం వహిస్తోంది.

అమెరికా–చైనా సంబంధాలపై ఇండోనేషియా వైఖరి ఇతర ఆసియన్‌ దేశాలకు కూడా నమూనాగా ఉపకరిస్తుంది. ప్రస్తుత ఘర్షణ వాతావరణంలో వాషింగ్టన్, బీజింగ్‌ ప్రభుత్వాలు రెండింటితోనూ ఐక్యతతో వ్యవహరిస్తూ మంచి సంబంధాలు నెలకొల్పుకోవడంపైనే ఆసియన్‌ కూటమి దృష్టి పెట్టాలి. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నికను స్వాగతి స్తూనే ఆసియన్‌ కూటమి తటస్థతా సూత్రాన్ని బలంగా నొక్కిచెప్పాల్సిన అవసరం ఉంది. బైడెన్‌ పాలనాకాలంలోనూ కొనసాగే చైనా– అమెరికన్‌ ఘర్షణ మధ్యలో ఇరుక్కునే పరిస్థితినుంచి ఆసియన్‌ దూరం జరగాలి. 

రెండు బలమైన శక్తుల మధ్య అధికార పోరాటం మధ్యలో తన ఉనికిని నిలబెట్టుకోవడం ఆసియన్‌ కూటమికి కొత్త విషయమేమీ కాదు. గతంలోకి వెళ్లి చూస్తే సోవియట్‌ యూనియన్‌–అమెరికా ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కూడా తటస్థంగా ఉండటం ద్వారా అంతర్జాతీయ సమాజంలో కీలక విభజనకు దారి తీసే పరిస్థితులను ఆసియన్‌ కూటమి నిలువరించింది కూడా. ఈ విషయంలో ఆసియన్‌ కూటమి సాధించిన ఘనవిజయం, తన మూలాలకు కట్టుబడి ఉండటం అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో అనూహ్యంగా వచ్చే పెనుతుపానులకు కూడా ఆసియన్‌ దేశాలు తట్టుకుని నిలబడేలా చేసింది.

బైడెన్‌ పాలన.. భారత్‌ ప్రయోజనాలు
అమెరికా విదేశీ మంత్రిగా బైడెన్‌ ఎంపిక చేసిన ఆంటోనీ బ్లింకెన్‌తో సంబంధబాంధవ్యాలను నెలకొల్పుకోవడంలో భారత్‌ అనుసరించే వైఖరి ఇరుదేశాల మధ్య ఒత్తిళ్లను తగ్గించి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చేవిధంగా ఉండాలి. ఐసిస్‌తో పోరాటం, ఆసియాలో అధికార సమతుల్యతను పునర్నిర్మించడం, అంతర్జాతీయ శరణార్థుల సంక్షోభం వంటి అంశాల్లో బ్లింకెన్‌ గత మూడు దశాబ్దాలుగా కీలక స్థానాలను చేపట్టి అమెరికా దౌత్య కార్యాచరణకు స్థిరమైన మార్గం చూపారు. 

దాదాపు బైడెన్‌ ఆత్మగా వ్యవహరిస్తున్న బ్లింకెన్‌ వైఖరి, తాజాగా తాను చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు.. భారత్‌–అమెరికా సంబంధాలు సానుకూలంగా పరిణమించగలవనే ఆశల్ని రేకెత్తిస్తున్నాయి. ఆచరణాత్మకవాది అయిన బ్లింకెన్‌ భారత్‌ పట్ల సానుకూల దృష్టితో వ్యవహరిస్తారని సౌత్‌ బ్లాక్‌లోని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆశాభావం వ్యక్తపరుస్తున్నప్పటికీ, డెమోక్రాటిక్‌ పార్టీలోని వామపక్షం మానవ హక్కుల పరిరక్షణపై ప్రదర్శిస్తున్న నిబద్ధత భారత్‌ వ్యతిరేక వైఖరిని ప్రతిబింబించవచ్చనే విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకుని భారత పాలకులు పావులు కదపాలి.
-రిఫ్కీ డెర్మవాన్, అండలాస్‌ యూనివర్సిటీ అధ్యాపకుడు, ఇండోనేషియా

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా