Article on Ukraine Russia War: అదుపు తప్పితే అణుముప్పే!

13 Mar, 2022 00:49 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచానికి కొత్త అస్థిరతల్ని తెచ్చిపెట్టింది. యుద్ధం ఏ విధంగా ముగింపునకు వచ్చినా ఒకటి మాత్రం స్పష్టం. అణ్వాయుధ నియంత్రణ అవకాశాలు, అణు నిరాయుధీకరణ అన్నవి ఇకపై మరింతగా వెనక్కు మళ్లుతాయి. 1991లో సోవియెట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమై 15 స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాక సోవియెట్‌ యూనియన్‌కు తనే వారసత్వ రాజ్యం అని రష్యా భావిస్తుండటం, స్వతంత్ర రాజ్యాలుగా అవతరించిన బెలారస్, కజఖ్‌స్థాన్, ఉక్రెయిన్‌లు రష్యాతో పాటుగా తమ భూభాగాలలో అణ్వాయుధాలను కలిగి ఉండటం ఇప్పుడు మానవాళి ఎదుర్కోక తప్పని ఒక కీలకమైన సవాలుగా మారింది. ఉక్రెయిన్‌ పెద్ద సంఖ్యలో అణ్వస్త్ర కేంద్రాలను, క్షిపణి కార్మాగాలను, అణ్వాయుధ నౌకాశ్రయాలను, 5000 యుద్ధ విధ్వంస శతఘ్నులను కలిగి ఉంది.

కజఖ్‌స్థాన్‌లోని సెమిపలంటిన్సక్‌ అణ్వా యుధ పరీక్షా కేంద్రం ఉన్నప్పటికీ వాటిని ఎక్కుపెట్టి సంధించే ‘లాంచ్‌ కోడ్‌’లు మాత్రం రష్యాలో ఉన్నాయి. అణ్యాయుధ ప్రయోగాల నైపుణ్యం రష్యాలో ఉండటమే అందుకు కారణం. అమెరికా అధ్యక్షుడిగా బిల్‌ క్లింటన్, రష్యా అధ్యక్షుడిగా బోరిల్‌ ఎల్త్సిన్‌ ఉన్నప్పటి నుంచే అణ్వస్త్రాలను కుప్పలుగా పేర్చుకుని కూర్చున్న ఈ మూడు దేశాలూ ప్రపంచానికి పీడకలలు తెప్పిస్తున్నాయి. 1970లో అగ్రరాజ్యాలు 25 ఏళ్ల వ్యవధికి కుదుర్చుకున్న ఎన్పీటీ (అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం) గడువు 1995లో ముగిసిన తర్వాత, తిరిగి ఒప్పందాన్ని నిరవధికంగా కొనసాగించాలన్న నిర్ణయమైతే జరిగింది. ఎన్పీటీతో సమస్య ఏమిటంటే 1967 జనవరి 1కి ముందు అణుపరీక్షలను నిర్వహించిన 5 దేశాలు మాత్రమే ఈ ఒప్పందం పరిధిలో ఉండటం.

ఎన్పీటీలో ఉన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలకు  ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ‘వీటో’ హక్కు కలిగిఉండటం ఒక సౌలభ్యాంశం అయింది. ఈ ఐదుదేశాలూ ఆరో దేశాన్ని వీటో పవర్‌లోకి రానివ్వవు. రష్యా, చైనా అణు ఇరుగు పొరుగులను సహించవు. బెలారస్, కజఖ్‌స్థాన్, ఉక్రెయన్‌ల చేత అణ్వా యుధాలను త్యజింపజేసి, ఎన్పీటీ పరిధిలోకి వాటిని తీసుకు వచ్చేందుకు అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు రాజకీయ, దౌత్య పరమైన ప్రయత్నాలెన్నో చేశాయి. బెలారస్, కజఖ్‌స్థాన్‌ దారికి వచ్చాయి కానీ, ఉక్రెయిన్‌ మాత్రం తన దారి తనదే అన్నట్లుగా ఉండిపోయింది. అంతేకాదు, 10,000 కి.మీ. దూరం ప్రయోగించగల ఎస్‌.ఎస్‌.–24 అనే పది తలల క్షిపణిని వృద్ధి చేసింది. చివరికి సామ, దాన, భేద, దండోపాయాలతో ఉక్రెయిన్‌ ఎన్పీటీకి తలొగ్గింది.

హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో 1994 డిసెంబరులో జరిగిన సమావేశంలో ఇరుపక్షాలు..బెలారస్‌– కజఖ్‌స్థాన్‌–ఉక్రెయిన్‌; అమెరికా, బ్రిటన్, రష్యా.. కూర్చొని అణ్వాయుధాల ప్రయోగం విషయమై భద్రత హామీలను ఇచ్చి పుచ్చుకున్నాయి. ఫ్రాన్స్, చైనా కూడా ఇదే రకమైన పూచీకత్తును ఇచ్చాయి. సార్వ భౌమత్వాన్ని గౌరవించడం, జోక్యం చేసుకోకపోవడం, బలప్రయోగం చేస్తామని బెదరించకపోవడం వంటివి ఆ హామీలలో భాగంగా ఉన్నాయి. అలాగే దాడికి గురైన దేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించవచ్చన్నది మరొక అంశం. ఆ నేపథ్యంలో 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించడంతో బుడాపెస్ట్‌ మెమోరాండమ్‌ను రష్యా ఉల్లంఘించినట్లయింది. ఇప్పుడు మళ్లీ ఉక్రెయిన్‌పై దాడితో మరోసారి రష్యా మాట తప్పినట్లయింది. 

2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర కొరియాను బెదిరిస్తూ, ప్రపంచం మునుపెన్నడూ చూడని ఆగ్రహజ్వాలల్ని చూడబోతోందని అన్నారు. అందుకు ఉత్తర కొరియా ట్రంప్‌ని ‘మతిస్థిమితం తప్పిన ముదుసలి’గా అభివర్ణిస్తూ, అమెరికా కనుక దాడికి తెగిస్తే, పశ్చిమ పసిఫిక్‌ సముద్రలోని యు.ఎస్‌. ద్వీపం గ్వామ్‌ను భస్మం చేస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత కిమ్‌ను ట్రంప్‌ ‘తన దేశాన్ని తనే పేల్చేసుకునే’ ఆత్మాహుతి దళ సభ్యుడిగా అభివర్ణించారు. 

గత ఫిబ్రవరి 27న జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే.. యూఎస్‌ అణ్వస్త్రాలకు జపాన్‌లో స్థావరాలను ఏర్పరచడం అనే ఒక అనూహ్యమైన ఆలోచనను పైకి తెచ్చారు. తైవాన్‌పై చైనా దురాక్రమణకు ఉన్న అవకాశాల నేపథ్యంలో.. జపాన్‌ భూభా గంపై అణ్వాయుధాలను.. ‘వృద్ధి చేయరాదు, కలిగి ఉండరాదు, చోటు కల్పించరాదు’ అని జపాన్‌ విధించుకున్న స్వీయ నియంత్రణకు విరుద్ధమైన ఆలోచన అది.  ఏమైనా అణ్వాయుధ ప్రయోగాలను సమర్థించుకునే కొత్తకొత్త సిద్ధాంతాలు అణు భయాలను పెంచుతున్నాయి. 
– రాకేశ్‌ సూద్, భారత మాజీ దౌత్యవేత్త
 (హిందుస్థాన్‌ టైమ్స్‌ సౌజన్యంతో

మరిన్ని వార్తలు